Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అరవై నవలల విశిష్ట పరిచయం – ‘భారతీయ నవలాదర్శనం’-1

[శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచించిన ‘భారతీయ నవలాదర్శనం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. ఇది మొదటి భాగం.]

‘భారతీయ నవలాదర్శనం’ అనే ఈ పుస్తకంలో శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి 60 విశిష్ట నవలలని పరిచయం చేశారు.

కొన్ని మనందరం చదివిన నవలలు, కొన్ని ఎప్పుడో చదివి మరిచిపోయిన నవలలు, కొన్ని మనకు తెలియని నవలలు. 520 పేజీలలో అరవై నవలల్ని ఆవేశకావేశాలకు, ఇజాలకూ దూరంగా ఉండి పరిచయం చేశారు. ఇందులో విశ్వకవి రవీంద్రుడి నవలలు, శరత్, బిభూతిభూషణ్ వంటి సుప్రసిద్ధ బెంగాలీ నవలాకారుల పది రచనలు పరిచయం చేశారు. మనలో చాలామంది ఆ నవలలన్నీ అనువాద రూపంలో చదివే ఉంటారు.

ఇందులో సుప్రసిద్ధ కన్నడ రచయిత బైరప్ప ‘దాటు’, ‘పర్వ’ నవలల పరిచయం ఇష్టంగా చదివాను. కన్నడ సాహిత్యంలోనే ఈ నవలలు ఎన్నదగినవి.

కర్ణాటక సామాజిక వ్యవస్థ సేపథ్యంలో కులవ్యవస్థ, అంటరానితనం వంటి సమస్యలను ‘దాటు’ నవలలో చిత్రీకరించారు. బెట్టయ్య హరిజనుడు, జాతీయోద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొన్నవాడు. అతనేమైనా పల్లెలో గొడవలు వగైరా, భూస్వామ్య వర్గం, బ్రాహ్మణ్యంతో నెగ్గుకుని రాలేకపోయాడు. ఆ పల్లెలో పుట్టి విద్యావతి అయిన బ్రాహ్మణ యువతి సత్యభామ కులాంతర వివాహం చేసుకోవాలనుకుంటుందిగాని అది గట్టెక్కదు. ‘కింది వర్గాలు’ ‘అగ్రవర్ణాల’ ఆధిక్యం అంగీకరించినంత కాలం ‘సమత’ రాదని అమె భావిస్తుంది. ‘సత్య’ పాత్ర తనను ఆవహించినట్లనిపించిందంటారు వీరలక్ష్మీదేవిగారు నవలా పరిచయంలో. గొప్ప నవలను వీరలక్ష్మీదేవి గొప్పగా పరిచయం చేశారు.

భారత యుద్ధాన్ని కేంద్రంగా తీసుకొని దీని చుట్టూ ‘పర్వ’ నవల కథ అల్లి, కొన్ని ప్రధాన అప్రధాన పాత్రల నుంచి కధను విశ్లేషించారు. ఇందులో పర్వత సానువుల మీద నివాసముండే ఆటవిక జాతుల వారినీ గంధర్వులుగా చిత్రీకరించారు. నాకు ఈ ఊహ వాస్తవం అనిపించింది.

‘పర్వ’ సుదీర్ఘమైన నవలే అయినా తప్పక చదవవలసిన నవల.

కన్నడ సాహిత్యంతో ఆధునికతను ప్రవేశపెట్టిన రచయిత శాంతినాథ్ దేశాయ్. ముక్తి నవలలో గౌరి అనే గ్రామీణ యువకుడు ధారవాడ జీవితంతో అనేక భావ సంఘర్షణల మధ్య నలిగిపోయి బొంబాయి వెళ్తాడు, అక్కడ దాలీ అనే క్రైస్తవ యువతితో పరిచయం అవుతుంది. ఆమె దయ, క్షమ అతని ఆత్మను పరిశుద్ధం చేసినట్లనిపిస్తుంది. బొంబాయి లోనూ ఉండలేక దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళాలనుకున్న సమయంలో అతను తన జ్ఞాపకాలను మిత్రుడి సలహా ప్రకారం రచనారూపంలో పెడతాడు. నవల దినచర్య రూపంలో మొదలై చివరకు దాలీని కలుసుకోవడంతో ముగుస్తుంది. నవలా శిల్పం, వస్తువు వీరలక్ష్మీ దేవిని ఎంతగానో ఆకర్షించి, “ఇటువంటి నవల ఈ ఇరవై ఏళ్ళలోనూ తెలుగులో రాలేదే” అని ఆమె చింతిస్తుంది, నవలను అనువదించిన శ్రీ విరించి – మూలంలోని అందాన్నంతా అనువాదంలో నింపారని శ్రీవిరించిని మెచ్చుకొంటుంది.

శివరామ కారంత్ నవల ‘మరల మడిగె’ – ‘మరల సేద్యనికి’ పేరుతో తెలుగులోకి తిరుమల రామచంద్ర గొప్పగా అనువదించారు. రచయిత్రి ఈ మూడు తరాల నవలను గొప్పగా పరిచయం చేశారు. కన్నడ సాహిత్యంలోనే కళాఖండంగా, గొప్ప నవలగా పేరొందిన నవలను గురించి ఈ పరిచయం అయినా చదవడం అదృష్టం. నవల ఇతివృత్తం కన్నడ దేశం పశ్చిమ సముద్ర తీరంలో జరుగుతుంది. మంగుళూరుకు సమీపంలోని మడూరు గ్రామ నివాసి నారాయణయ్యరు కుమార్తెను కండి గ్రామంతోని రాము ఐతాళులు అనే పురోహితుడికిచ్చి పెళ్ళి జరపడంతో నవల మొదలవుతుంది. కథాకాలం పందొమ్మిదో శతాబ్ది ఆరంభం. కన్నడ దేశ గ్రామీణ జీవితాన్ని, ప్రత్యేకంగా స్త్రీల పరిస్థితులను నవల ఉదాత్తంగా చిత్రించింది.

ఐతాళు బహు పిసినారి. ఇంట్లో వితంతువు అయిన అతని చెల్లెలు సరస్వతి కన్యాశుల్కం కథను గుర్తుకు తెస్తుంది. అతనింటిలో స్త్రీలు మాత్రం ప్రేమాస్పదులు, ప్రేమకు, దయకు ప్రతిరూపాలు. అతను నిస్సంతు. మూడో మారు ముచ్చటగా పెళ్ళి చేసుకుంటాడు. కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సత్యభామను ఇంట్లో ఆడవాళ్లు చాలా ప్రేమగా చూస్తారు. సత్యకు మగబిడ్డ కలుగుతాడు. సవతి తల్లి ఆ బిడ్డను ప్రేమగా పెంచుతుంది, ముద్దు చేయడం వల్ల ఆ బిడ్డ హైస్కూలు చదివే రోజుల్లోనే దారి తప్పుతాడు. పెళ్ళి చేస్తే దారికొస్తాడని తల్లులు హైస్కూలు చదువులు చదివిన నాగవేణినిచ్చి చేస్తారు. కొంతకాలం ఆ కుర్రాడు, లచ్చన్న, కుదురుగా ఉన్నా, తర్వాత చెడు మార్గాలకు బానిస కావడంతో తండ్రి ఐతాళువు ఆస్తినంతా కోడలి పేర రాసేశాడు, నాగవేణి తన కుమారుణ్ణి పెట్టుకొని పుట్టింటిలోనే ఉండిపోయింది. భర్త ఆస్తినంతా నాశనం చేస్తాడు. ఇంట్లో ఆడవాళ్లు వృద్ధులై చనిపోయాక ఆమె కుమారుడితో అత్తింటికి వెళ్తుంది.

నాగవేణి కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి, సంగీతసాహిత్యాల్లో నేర్పు సంపాదించుకుంటాడు. ఆర్థికమాంద్యం రోజుల్లో అతను సోషలిజం ప్రభావంలో మిత్రులతో తిరిగి, చివరకు తల్లి కోసం ఇల్లు చేరుతాడు. సంపద, ఆస్తి అంతా తండ్రి నాశనం చేసినా, తాత ఐతాళువు రహస్యంగా దాచిన వేయి రూపాయలు బయటపడి కుటుంబ పరిస్థితి చక్కుడుతుంది. రామన్న – ఐతాళువు కుమారుడు తన జీవితదర్శాలకు అనుగుణంగా పల్లెలో స్థిరపడి సుఖంగా ఉంటాడు. కొడుకుకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నట్లు చిత్రించడంతో నవల ముగుస్తుంది. చాల పెద్ద కేన్వాస్ మీద మూడు తరాల జీవిత చిత్రం, కారంత్ అద్భుతంగా రాసిన నవలను రచయిత్రి చక్కగా పరిచయం చేశారు; ఈ నవలా పరిచయం చదువుతున్నప్పుడు మన విశ్వనాథ నవల వేయిపడగలు గుర్తొస్తుంది, రెండిటిలో రచయితలు ప్రతిపాదించిన జీవితాశయాలు పరస్పరం విరుద్ధమైనవే అయినా.

నేను భైరప్ప నవలలు చదవలేదు. బైరప్ప ‘దాటు’ నవల పరిచయం చదివినపుడు ‘అమ్మో! ఇంతకాలం ఎందుకు చదవలేకపోయాను?’ అని ఒక బాధ కలిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Institute of English and Foreign Languages పేరుతో కాబోలు డైరీ ఫామ్‍లో ఉండేది. దాని డైరెక్టర్ ప్రొఫెసర్ శివ రుద్రప్ప గారిని హాస్టల్లోని కన్నడ విద్యార్థులతో తరచు కలిసేవాణ్ణి. వారి సంభాషణల్లో అనేకమంది సుప్రసిద్ధ కన్నడ రచయితల ప్రస్తావన వచ్చేది.

500 వందల పేజీల ‘దాటు’ నవల తనను ఊపిరాడకుండా చేసి, చదివించిందంటారు రచయిత్రి వీరలక్ష్మీదేవి. 1972 నాటి నవల ‘దాటు’లో రచయిత కులవ్యవస్థలోని కుళ్ళును సాహసంతో, అత్యంత ఆసక్తికరంగా చిత్రించారంటారు. బైరప్ప కులవ్యవస్థ లోని కుళ్ళునంతా ఈ నవలలో బైటపెట్టారు. నవల జాతీయోద్యమం, రెండో దశ సబర్మతి ఆశ్రమస్థాపన నాటి విషయాలు, బెట్టయ్య అనే దళితుడు జాతీయోద్యమంలో, ఊళ్లో గౌడులతో నెగ్గుకు రాలేక, వారికి ఒదిగి ఉండే, అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వెంకటేశం, బ్రాహ్మణ హోటల్ వ్యాపారం పెట్టి లౌక్యం నేర్చుకున్నాడు. అతని చెల్లి బెంగుళూరులో చరిత్ర అధ్యాపకురాలుగా పని చేస్తూ కులవ్యవస్థను తిరస్కరించ గలిగింది. సొంత ఊళ్లో గౌడ యువకుడు తనను ప్రేమించానని చెప్పినపుడు కులాలు ఒకటి కాకపోయినా, ఆమెకు అభ్యంతరం ఉండదు. కుటుంబం నుంచి ఎంత ఒత్తిడి, హింస ఎదురైనా ఆమె మనసు మారదు. ఆమె ప్రియుడి తండ్రి తన యుక్తితో కుమారుడిని ధనవంతుడైన గౌడ కుమార్తెతో పెళ్ళి చేస్తాడు.

ఆమె జీవితం, ప్రేమ భగ్నమవుతాయి. ఉద్యోగం పోతుంది. బట్టల కొట్టులో పనిచేస్తూ, తన హృదయంలోని అలజడిని ఆదువులో పెట్టుకోగలుగుతుంది. స్థితప్రజ్ఞురాలవుతుంది. ప్రేమంచిన ప్రియుడు తాగుబోతై మళ్ళి ఆమె వద్దకు వచ్చి పెళ్ళి చేసుకుందామంటాడు, ఆమె నిరాకరిస్తుంది. కులాల మధ్య ఘర్షణ, ఎక్కువ తక్కువలను తిరస్కరించిన జ్ఞాని సత్య మాత్రమే. నవల చదువుతూంటే సత్య పాత్ర తనను ఆవహించినట్లనిపించిందని, నవల చదవడం వల్ల తన అనుభావం సుసంపన్నం ఆయిందని రచయిత్రి వ్యాఖ్యానించారు.

వీరలక్ష్మీదేవి గారు పరిచయం చేసిన నవలల్లో, కల్కి, జయకాంతన్ (శిలనేరంగలిళ్, శిలమనితర్గళ్), ము. వరదరాజన్ ‘మట్టి దీపం’, కందసామి ‘విచారణ కమీషన్’, పార్థసారధి ‘సమాజం కోరల్లో’, గాంధీభక్తులు రాజాం కృష్ణన్ నిరుపేదలు, అధోజగత్తు మనుషుల గురించి రాసిన ‘నారు నీరు’ (వెరుక్కన్నీర్) వంటి గొప్ప గొప్ప నవలల జాబితా పేర్కొన లేదు ఇక్కడ.

మలయాళీ నవలల్లో తక్కళి శివశంకర పిళ్లై ‘మెట్టుకు పై మెట్టు’ ఈ పుస్తకంలో పరిచయం చేశారు. శివశంకర పిళ్ళై చెమ్మీన్ నవలను సినిమాగా కూడా తీశారు. ఆయన అణగారిన ప్రజల పక్షాన నిలిచి రచనలు చేసిన మహనీయుడు. ఈయన మరొక నవల ‘కూలి గింజల’ను పరిచయం చేస్తూ, కేరళ వ్యవసాయ కూలీల కష్టాలను ప్రత్యక్షంగా చూసి రాసిన నవల యిది అంటారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారు. ‘కూలిగింజలు’ నవలను చారిత్రాత్మక నవలగా కూడా చెప్పుకోవచ్ఛంటారు ఆమె, మరొక సుప్రసిద్ధ రచయిత ఎం.టి. వాసుదేవ నాయర్ ‘నాలుకేట్టు’ నవలకు తెలుగు అనువాదం ‘సమిష్టి కుటుంబం’ ను కూడా రచయిత్రి ఈ పరిచయాలలో చేర్చారు. వాసుదేవ నాయర్ మలయాళ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన రచయిత.

మరో మలయాళీ రచయిత కేశవదాసు నవలను ‘కణ్ణాడి’ (తెలుగులో ‘అద్దం’) కూడా రచయిత్రి ఈ ప్రస్తకంలో పరిచయం చేశారు. ఆమె కేశవదాసును వీరేశలింగం పంతులు గారితో పోల్చారు. దాసు తన ఆచరణ, రచనల ద్వారా మలయాళ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించారు. మలయాళంలో ఈయన పేదల పక్షాన రాసిన తోలి రచయిత, 1930 నాటి అలెపిలో కార్మికోద్యమ స్థితిగతులను వాస్తవికంగా ఈ నవలలో రెండు తరాల కథగా చిత్రించారు. రెండోతరం వారిది వామపక్ష ఉద్యమ కథ! రెండో తరంలో ‘నిమ్నజాతి’ అమ్మాయి నీలి, ‘ఉచ్చజాతి’ అబ్బాయి రామన్ ప్రేమించుకుంటారు. కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో ఆ ప్రేమ జంట పారిపోయి అలెప్పీ చేరుతారు. అక్కడ ఒక ఇంగ్లీషాయన, కొబ్బరి తోటల యజమాని వారికి ఆశ్రయం ఇస్తాడు. ఆ ఆంగ్లేయుడి ప్రేమ, ఆదరం ఈ దంపతులను శాశ్వతంగా తన వద్ద కార్మికులుగా తీసులోనే కుట్ర తప్ప నిజం కాదు. ఇద్దరూ రామన్ వర్కి అని, ఆమె – నీలి ఎలీ అని పేర్లు కూడా మార్చుకుంటారు. ఇదంతా కేరళలో మతప్రచారంలో భాగమే అని రచయిత చెప్తాడు.

ఆ ఇంగ్లీషు యజమాని మోసపూరిత దుర్మార్గాలను నవలలో వివరంగా చిత్రించారు రచయిత. ఒకనాటి శ్రామిక యథార్థ పోరాటానికి ఇది నవలా రూపం. అనువాదం కూడా ఎంతో స్పష్టంగా, స్వచ్ఛంగా తెలుగులోకి వచ్చిందని రచయిత్రి ప్రశంసించారు.

మలయాళీ బాల సాహిత్య సృష్టికర్త శ్రీమతి లలితాంబికా అంతర్జనం రాసిన ‘అగ్నిసాక్షి’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భారతీయ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఆమె ఈ నవలలో చక్కగా చిత్రించారు, వీరలక్ష్మీదేవి ఈ నవలను ఈ ప్రస్తకంలో పరిచయం చేయకపోతే నావంటి పాఠకులకు ఆ నవల గొప్పతనం తెలిసేది కాదు. ఈ నవలలో తంగం అనే సాధారణ స్త్రీ జాతీయోధ్యమ స్ఫూర్తితో ఆ ఉద్యమంలోకి వచ్చి, స్త్రీ విముక్తి ఉద్యమకారిణిగా పరివర్తనం చెంది ‘మిసెస్ నాయర్’ గా పరిణతి చెందుతుంది. ఇదొక విశిష్టమైన అద్భుతమైన నవల అని, దీన్ని నాగుపట్ల భక్తవత్సలరెడ్డి గారు తెలుగులోకి చక్కగా అనువదించారని, వీరలక్ష్మీదేవి ప్రశంసించారు.

మలయాళ నవలా సాహిత్యంలో 19 నవలలు రాసి, తన ‘ఆలియా’ నవలతో మలయాళ సాహిత్యాన్ని నూతన మార్గం వైపు తిప్పారని సేతు గారిని ఈ పుస్తక రచయిత్రి ప్రశంసిస్తారు. సేతు గారి మలయాళీ నవల ‘పాండవపురం’లో కథ ‘పాండవపురం’ ఊరు చుట్టూ తిరుగుతుందని, నవల పేరే ఒక ప్రతీకగా పెట్టారని, దేవి అనే యువతి స్కూలు టీచరని, ఆమె గర్భవతిగా ఉండగా, భర్త, ఎటో ఆచూకీ లేకుండా వెళ్ళిపోతే, ఆమె ఒంటరిగా బిడ్డను సాకుతూ బ్రతుకు సాగిస్తుంది. ఆమె భర్త కుంచికుట్టన్‌కు ఆమె శీలం పైనే అనుమానం, ఆమె మీద ఎంత తీవ్రమైన మోహం వున్నా.. పిరికీ, అసమర్థుడూ అయిన భర్తను దేవి ప్రేమించడానికే ప్రయత్నిస్తుంది, ఒంటరిగా బ్రతుకుతున్న ఆమె, పురుషుల ఆకర్షణ నుంచి తనను కాపాడుకొంటూ జీవితం సాగిస్తుంది. ఆ ఒంటరి స్త్రీ అంతరంగంలోని సంక్షోభాన్ని, ఆందోళనలను ఈ నవల ‘పాండవపురం’ గొప్పగా విశ్లేషిస్తుంది, అనురాగం కోసం, స్త్రీ పడే ఆరాటాన్ని ఈ నవల వాస్తవికంగా చిత్రంచిందని రచయిత్రి వ్యాఖ్యానిస్తారు.

కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన నళినీ జమీలా నవల ‘ఆత్మకథ’ అనేక భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి అనువదించబడిన సుప్రసిద్ధ రచన. నవల ఒక సెక్సు వర్కర్ రాసుకున్న ఆత్మకథ రూపంలో సాగుతుంది. నవలా రచయిత్రి రాజకీయ ఉద్యమకారిణి కూడా.

‘భారతీయు నవలాదర్శనం’ గ్రంథంలో రచయిత్రి వీరలక్ష్మీదేవి గారు అయిదు మరాఠీ నవలలను పరిచయం చేశారు. వ్యంకటేశ మాద్గూళ్కర్ రచయితగా, పాత్రికేయుడుగా ప్రసిద్ధులు. ఎనిమిది నవలలు రాశారు. మహారాష్ట్రలో మాందేష్ ప్రాంతపు జీవితాన్ని తీసుకొని ‘బన్‌గర్ వాడి’ నవల రాశారు. 1971 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ దీన్ని తెలుగులోకి తెచ్చింది. బన్‌గర్ వాడి ఒక ఊరి పేరు. పాతిక ఇళ్ళున్న చిన్న ఊరు, అందులో ప్రజలంతా పశువుల కాపరులు. వాళ్ళలో ‘రామోజీ’లనే కొందరు చిల్లర దొంగతనాలు చేసి బతుకుతారు. ఒక యువకుడు ఆ ఊరికి టీచరుగా వచ్చి పిల్లలను పోగు చేసి బడి నడుపుతాడు. అతని ప్రవర్తన వల్ల, ఊరందరికీ తలలో నాలుక కావడంతో, అతను ఆ గ్రామ పెద్దగా మారుతాడు. ఆనాటి పల్లెల్లో సత్తెకాలపు ప్రజల జీవితం, నిజాయితీపరుడైన ఉపాధ్యాయుడు.. చదవడానికి చాలా నాటకీయంగా ఆసక్తికరంగా ఉంటుంది. కరువు రావడంతో పల్లె ప్రజలు వలసపోయి, పల్లెలో పంతులు మాత్రమే మిగులుతాడు. రచయిత అత్యంత సహజంగా ఆ పేద ప్రజల జీవితాన్ని ఈ నవలలో చిత్రించారని వీరలక్ష్మీదేవి అంటారు. నా వరకూ ఈ నవల ఎలాగైనా సంపాదించి చదవాలని నిశ్చయించుకున్నాను.

రచయిత్రి పరిచయం చేసిన మరాఠీ నవలల్లో స్త్రీల అభ్యుదయానికి పాటుపడిన హరినారాయణ ఆప్టే నవల ‘నేను’ కూడా ఉంది. వీరు మరాఠీ సాహిత్యానికి మార్గదర్శి. సమాజాన్ని, ప్రజల జీవితాన్ని పరిశీలించి రచింపబడిన తొలి నవల ‘నేను’. కళాత్మక రచనా రీతిలో ఆయన స్త్రీల సమస్యలను తన రచనల్లో చర్చించారు. విద్యావేత్త శివరామ కారంత్ కుమార్తె సుందరి, ఆమె తల్లి బాగా చదువుకున్నవారు కావడం వల్ల – ఆమె సంస్కర్త అనే భావంతో ఆమె వద్దకు మహిళలెవరూ వచ్చేవారు కాదు. కాని సుందరి మంచితనం వల్ల అక్కడి స్త్రీలు మనసు మార్చుకుని ఆమె చెంతకు చేరడం మొదలుపెడతారు.

స్త్రీలలో అవిద్య, భర్తల దాష్టీకం, పురుషాహంకారం ఈ నవలలో ప్రధానపాత్ర భావూ ప్రత్యక్షంగా చూసి గ్రహిస్తాడు. తన అక్క సంసారంలో పడ్డ యాతనను చూసి గ్రహిస్తాడు. నవల కథ అంతా వీరేశలింగం పంతులు గారి జీవితాన్ని గుర్తుకుతెస్తుంది. రచయిత భావానంద్ పాత్ర ద్వారా స్వార్థత్యాగం చేసిన మహనీయులే మహాకార్యాలు నెరవేర్చగలరనే సందేశం ఇస్తారు, నూరేళ్ళ నాటి ఈ నవల ద్వారా.

విష్ణు సఖరాం ఖాండేకర్ మరాఠీ నవలలను రెండు వ్యాసాలలో వివరంగా చర్చించారు వీరలక్ష్మీదేవి గారు. మరాఠీ భాషలో తొలిసారి జ్ఞానపీఠ అవార్డు పొందిన ఖాండేకర్‍ని హిందీ రచయిత ప్రేమ్‍చంద్‌తో పోల్చవచ్చు. వీరి పేరు ఎరగని మరాఠీ పాఠకులుండరు. వీరి ‘యయాతి’ నవల ఆంగ్లంలోకి, పలు ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయబడింది. మహాభారతంలో మాయాతి కథ లాంటి కథను నవలగా రూపొందిస్తే, మానవ జీవితాన్ని గాఢంగా వ్యాఖ్యానించను అవకాశం ఉంటుందని ఖాండేకర్ భావించి ఉంటారు.

నహుషుడి రెండో కుమారుడు యయాతి గొప్ప వీరుడుగా పెరిగాడు, అంగీరస మున్యాశ్రమంలో తన మనుమడు కచుడిని చూసి, కచుని గొప్పదనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కాని మయాతి హృదయంలోని భోగలాలస ఇంకా శమించలేదు.

నవలలో యయాతి, శర్మిష్ఠ, దేవయాని పాత్రల ద్వారా వారి స్వగతాల లోంచి రచయిత కథను నడుపుతారు.

శుక్రాచార్యుల కుమార్తె దేవయాని స్వాభిమానం ఉన్న యువతి. సంజీవని విద్య నేర్చుకోడానికి వచ్చిన బృహస్పతి కుమారుడు కచుడిని ప్రేమిస్తుంది. రాక్షసుల వల్ల అతని మరణం సంభవించినపుడల్లా తండ్రి ద్వారా అతడిని పునర్జీవితుణ్ణి చేస్తుంది. ఈ కచుడు కూడా ఆమెను ప్రేమించినా, మృత సంజీవని సాధించడం అతని ఆశయం. ఆమె మృతసంజీవని కోసం వచ్చిన కచుడిని ప్రేమిస్తుంది. పురాణంలో కథను ఖాండేకర్ పునర్ వ్యాఖ్యానం చేసి నవల రాశారు. త్యాగ మార్గం ద్వారానే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని ఖాండేకర్ ‘యయాతి’ నవలలో ప్రతిపాదించారు.

మహారాష్ట్ర లోని లాతూరు ప్రాంతంలో ఉచల్యా తెగలో జన్మించిన లక్ష్మణ్ గయక్వాడ్ – బ్రిటిష్ ప్రభుత్వం నేరస్థ జాతులని ముద్ర వేసిన మాజీ ‘క్రిమినల్ ట్రైబ్స్’ కు చెందిన ఉచల్యా తెగలో మొదటి గ్రాడ్యుయేట్. మాజీ నేరస్థజాతులకు చెందిన తాను అనుభవించిన అమానుష జీవితానుభవాలను గయక్వాడ్ ఈ ‘ఉచల్యా’ నవలలో వర్ణించారు. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవలసిన అనేక వాస్తవ సంఘటనలు ఇందులో రచయిత పేర్కొన్నారు.

మరాఠీ నవలల్లో వీరలక్ష్మీదేవి పరిచయం చేసిన చివరి నవల నసీమా హురోజక్ ఆత్మకథ ‘చక్రాల కుర్చీ’. ఆమె ‘డిఫరెన్షియల్లీ ఏబుల్డ్’. 16 ఏళ్ళ తొలి యవ్వనంలో చక్రాల కుర్చీకి అతుక్కుపోయింది, కానీ ఇప్పుడు భారతదేశంలో తనవంటి వారికోసం ఒక సంస్థ నిర్వహిస్తూ, ఎందరికో ఆశాజ్యోతి అయింది. ఈ మరాఠీ నవలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగు చేయించి, ప్రచురించారు.

(ఇంకా ఉంది)

***

భారతీయ నవలాదర్శనం
రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 520
వెల: ₹ 350
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/bharateeya-navala-darshanam

 

Exit mobile version