కూడలి సంగమేశ్వరాలయం, ఆలంపూర్
శ్రీ జోగుళాంబ ఆలయం, నవబ్రహ్మల ఆలయాలు చూసేశాం కదా. ఇప్పుడు వాటికి ఒక కి.మీ. దూరంలోవున్న కూడలి సంగమేశ్వరాలయం చూద్దామా? ఇది చూడకపోతే ఒక అద్భుతమైన ఆలయాన్ని చూడనట్లే.
చాలామంది జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరాలయాలు చూసి వచ్చేస్తారు. కానీ వాటికి అత్యంత సమీపంగా వున్న ఈ ఆలయాన్ని చూడరు. దానికి తగ్గట్లు ప్రచారం కూడా లేదు. జోగుళాంబ ఆలయానికి వెళ్ళేటప్పుడు, కొంచెం ఇవతల కుడివైపు ఒక బోర్డు కనబడుతుంది అంతే. మేమూ ఎన్నిసార్లు అలంపూర్ వెళ్ళినా ఈ ఆలయాన్ని దర్శించలేదు. తర్వాత ఎప్పుడో దృష్టి ఈ బోర్డు మీదపడి వెళ్ళి చూశాం. ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఇంతకాలం మిస్ అయ్యామా అని అప్పటినుంచి మేము వెళ్ళినప్పుడల్లా చూడటమేకాదు, అందరికీ చెబుతున్నాము కూడా.
అసలు ఈ ఆలయం తుంగభద్ర, కృష్ణానదుల సంగమ ప్రదేశమయిన కూడవల్లి (కూడలి)లో 6వ శతాబ్దంలో నిర్మింపబడి, 16వ శతాబ్దంలో పునరుధ్ధరింపబడ్డది. బాదామి చాళుక్య రాజయిన పులకేశి-1 దీని నిర్మాత. చాళుక్యులు ఎక్కువగా ఉపనదీ, నదీ సంగమ ప్రాంతాలు, జపతపాలకు, దైవ పూజలకు శ్రేష్టమయినవిగా భావించి, ఆ ప్రాంతాలలో అనేక ఆలయాలు నిర్మించారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురైనా కూడలి సంగమేశ్వరాలయాన్ని అలంపూరుకు తరలించి శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయానికి సమీపంలో విశాలమైన ప్రదేశంలో పునర్నిర్మించారు. అద్భుతమైన ఈ ఆలయాన్ని సంరక్షించారుగానీ, దీని గురించిన సమాచారాన్ని దర్శకులకు తెలిసేవిధంగా శ్రధ్ధ తీసుకోలేదు. అత్యంత సుందరమైన శిల్పకళకు నిలయం ఈ ఆలయం.
అద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన ఈ ఆలయం కిటికీలపైన కిన్నెరలు, కింపురుషులు, హంసలు, తామర పువ్వులు, ఇంకా రకరకాల డిజైనులు ఒక్కొక్కచోట ఒక్కొక్క విధంగా అనేక ఆకృతులు చెక్కబడ్డాయి. ఆలయం వెనుకవైపు ఒక మూలకు మలచబడ్డ మొసలి బొమ్మని పరీక్షగా చూడటం మరచి పోకండి. ఆ మొసలి నోట్లో ఒక యువతి వుంటుంది. జీవితంలోని వివిధ దశలు ఆ శిల్పంలో మలచబడ్డాయి. మొసలి నోట్లోని యువతి ఒక వైపునుంచి చూస్తే 13, 14 ఏళ్ళ బాలికలా కనబడుతుంది. మధ్యనుంచి చూస్తే ప్రౌఢ యువతిలాగు, మరో వైపునుంచి చూస్తే ముసలావిడలాగా..ఒకే శిల్పం అన్ని విధాల కనబడేటట్లు తీర్చిదద్దిన శిల్పికి జోహార్లు చెప్పకుండా వుండలేము. అలాంటిదే ఇంకొక శిల్పం అర్ధ నారీశ్వరుడు. స్త్రీ పురుష శరీర అవయవ నిర్మాణం, అవయవాల ఆకారం, సున్నితత్వం.. జీవకళ ఉట్టిపడేలా రూపు దిద్దుకుంది.
ఆలయం ముఖ ద్వారానికి రెండువైపులా ద్వార పాలకులు శంఖనిధి, పద్మనిధి వున్నారు. వీరిరువురినీ ఐశ్వర్య ప్రదాతలుగా భావించేవారుట. ఆ కాలంలో వారికి శివ కేశవులకు బేధము లేదనటానికి నిదర్శనంగా ఈ శివాలయంలో గర్భాలయ ద్వారంపై విష్ణువు వాహనమైన గరుక్మంతుడు చెక్కబడి వున్నాడు.
ఆలయ శిఖరం ఆమ్లక శిఖరం (ఉసిరికాయ ఆకారంలో వుంటుంది). చాళుక్యరాజుల నిర్మాణాలన్నింటిలోనూ ఇదే శిఖరం కానవస్తుంది.
అద్భుతమైన శిల్ప సంపదతో అలరారే ఈ ఆలయం అలంపూర్ వెళ్ళినవాళ్ళు తప్పక దర్శించండి.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.