అమ్మవారి దేవాలయం….
మాతా అన్నపూర్ణ
“అన్నపూర్ణే సదా పూర్ణే
శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం
బిక్షాందేహీచ పార్వతీ”
నా యాత్రలో నేను చాలా నెమ్మదిగా రోజుకో గుడి చొప్పున తిరుగుతూ పూర్తి చేశాను. హడావిడిగా పడి పూర్తి చెయ్యలేదు. నాకు చేతులలో టైం వుండటము ఒకటి, ఎక్కడికన్నా వెడితే అన్నీ తెలుసుకోవటము, నచ్చిన చోట ఎక్కువ సేపు వుండటము నాకు నచ్చుతుంది. అందుకే హడావిడి లేకుండా ప్రశాంతముగా తిరిగాను.
అన్నము కావాలి ప్రపంచానికి, ఆ రూపములో
జీవిక అన్నపూర్ణ. స్వాహా స్వద్ధా రూపము అమ్మది.
అందరికి అన్నమిస్తుంది కాబట్టి అన్నపూర్ణయే. అనుభవయోగ్యమైనది అన్నము.జీవితము జీవించటానికి శక్తి అన్నము. ఆమె అన్నము రూపము. ఇంద్రియములకు కావలసినది వాటికి
ఆహారము. అమ్మవారు ఇచ్చేది అదే.
అమ్మవారు సదా పూర్ణే!!
సర్వయేశ్వరములతో పూర్ణురాలు. ఆ తల్లిని సేవించి ప్రార్థిస్తే అన్న పానీయాలకు లోటు వుండదు. ఆమెకు బియ్యం పోస్తారు భక్తులు, సామాన్యంగా. అంటే బియ్యం ఆ గుడి వారికి ఇస్తే తమకు అన్నలోటు వుండదని నమ్మకము.
అమ్మవారికి మనము పూజ చేసిన తరువాత కొద్దిగా బియ్యం, ఒక రూపు ఇస్తారు అర్చకులు. ఆ రూపును మన డబ్బులలో, బియ్యం మన ఇంటి బియ్యంలో కలుపుకోవాలి. అలా చెయ్యటము వలన ఆ తల్లి సదా అన్నలోటు లేకుండా చేస్తుందని కూడా భక్తుల విశ్వాసము. ఈ తల్లిని సేవించుకుంటే అన్నపానీయాలే కాదు, జ్ఞాన వైరాగ్యాలు కూడా ఇస్తుంది. ఏది సత్య స్వరూపమన్న జ్ఞానము, ప్రపంచపు మాయ పై వైరాగ్యము ప్రసాధిస్తుంది.
అన్నపూర్ణమ్మ తల్లిని మనము ప్రతి భోజన సమయములో స్మరించటము సామాన్యము కదా!
ఇక్కడ మాత్రమే వున్న అన్నపూర్ణను బంగారు రూపు, దీపావళి సమయములో, వెండి తల్లిని మిగిలిన సంవత్సరము దర్శించవచ్చు.
ఈ దేవాలయములో అన్నీ బోర్డులు తెలుగులో రాసి వుంటాయి. ఆది శంకరులు ప్రసాదించిన అన్నపూర్ణ స్తోత్రం కూడా తెలుగులో చెక్కి అక్కడ గోడ మీద కనిపిస్తుంది.
ఉచిత అన్నప్రసాదము ప్రతి రోజూ వుంటుంది ఆ గుడి నానుకున్న భోజనశాలలో. ఆ గుడి లోనే హనుమంతులవారు, వినాయకుడు కనపడుతారు. గుడికి ఆనుకున్న పెద్ద హాలు అందులో పాలరాయి కాళీ, రాధాకృష్ణులు, శ్రీరామ పరివారము, యోగనరసింహుడు ఇలాంటి ఎందరినో నెలకొల్పారు.
అన్నపూర్ణ గుడిలో యోగేశ్వరుడు, శ్రీచక్రము అని ఒక శివలింగము వుంది. చాలా చిన్న గుడులలో ఇదీ ఒకటిగా కలసిపోయి వుంటుంది. ఆ గుడిలో శివుని లింగముపై శ్రీ చక్ర యంత్రము చెక్కి వుంటుంది.
ఆ లింగము భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠించారుట. ఆయన లలితకు వ్యాఖ్యనము రాసినవారు. జగదంబను పిలిస్తే, అమ్మ పలుకుతుంది. అమ్మ అనుజ్ఞపై ఆయన లలితకు వ్యాఖ్యానము రాశారు. మహాయోగసంపన్నులు. ఆయన లలితకు రాసిన వ్యాఖ్యలో ‘కోటి యోగసమన్విత’ అన్న నామములో ముపై మూడు మంది కోటియోగినులను చూపిన బుషి వారు. ఆయన లలితా ఘాటులోనే తప్పస్సు హోమము చేసి, ఈ శివలింగము నిచ్చట ప్రతిష్ఠించారుట. ఆ శివలింగము వద్ద చేసే జపతపాదులకు ఎన్నో రెట్లు ఫలితముంటుందట.
నేను ఒక శుక్రవారము లలితా సహస్రము చదివి కొంత జపము చేసుకున్నా ఆ లింగము ప్రక్కనే!!
ఆ గుడిలో పూజారులు, అక్కడే కాదు అంతటా ముందు మనకు బొట్టు పెట్టి, లేదా చేతికి తాడు కట్టి డబ్బు దక్షిణగా ఇమ్మంటారు. పదో పరకో పెడితే వప్పుకోరు. కోప్పడుతారు కూడా.
అన్నపూర్ణ గుడికి వెళ్ళారంటే చేతికి తాడు చూసి చెప్పవచ్చు. కాశీలో దక్షణ రూపములో ఖర్చు అధికము మనకు ప్రయాణపు ఖర్చు కంటే. ఆ విషయములో కొద్దిగా జాగ్రత్త పడాలి.
***
దుంతి గణపతి: – సాక్షి గణపతి
చింతామణి గణపతి కేదారేశ్వర గుడి వద్ద వుంటుంది. ఆ గణపతి చింతలు తీరుస్తాడని పేరు. కేదారేశ్వర గుడిలో మూడు కళ్ళ గణపతి వున్నాడు. ఆయనకు తప్ప మూడు కళ్ళ గణపతి మరోటి మనకు కనపడడు.
సాక్షిగణపతి మనకు మొదటి గేటు గుండా అన్నపూర్ణమ్మ గుడికి వెడుతూ వుంటే కనపడుతాడు. చూట్టూ బట్టల దుఖాణాల మధ్య వుంటాడా స్వామి. ఆ స్వామి మన పేర్లు రాసుకొనిన తరువాత అయ్యవారికి, అమ్మవారికి నివేదిస్తాడుట. కాబట్టి ఆయన వద్ద నిలబడి మన పేరు చెప్పాలంటారు. గణపతులు వేలు అని పేరు కాశీలో. ఇక్కడ ఏ మూల చూసినా గణపతి, శివ దేవాలయాలు కనపడుతాయి. ప్రతి గృహపు సింహ ద్వారము పైన గణపతి రూపు వుంటుంది. అలా కాశీ అంతటా శివ పరివారమే అగుపించి కన్నుల పండుగ చేస్తారు.
(సశేషం)