శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం, అత్తలూరు-నూతలపాటివారి పాలెం.
పచ్చని చేలు, చల్లని గాలి, ప్రకృతి సౌందర్యానికి మైమరస్తూ ఉదయం 8-10కల్లా మల్లాదినుంచి అత్తలూరు చేరుకున్నాము. ఆ ప్రకృతి రమణీయత మధ్య దూరం నుంచి శ్వేతవర్ణంలో ఆలయాలు చాలా అందంగా కనిపించాయి. ఇది కూడా విశాలమైన ఆవరణలో వున్న ఆలయాల సమూహం. అన్ని ఆలయాలూ తీసి వున్నాయి. పూజలు జరుగుతున్నాయి. అన్ని చోట్లా పూజారులు వున్నారు.
ఇందులో ముఖ్యాలయాలు శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వరస్వామిదీ, అభయాంజనేయస్వామిదీ. వీటిలో అభయాంజనేయస్వామి ఆలయ నిర్మాణం ముందుగా 1510లో జరిగింది. తర్వాత సోమేశ్వరస్వామిది. మూడు సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను పునర్నిర్మించారు. అందుకే అన్నీ నూతన ఆలయాలలాగా వున్నాయి.
సోమేశ్వరస్వామి ఆలయానికి కొంచెం ముందు కుడివైపు వీరాంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం వుంది. ఆక్కడి పూజారిగారు శ్రీ కె.వి.యస్. శర్మగారు చెప్పినదాని ప్రకారం ఈ ఆంజనేయస్వామి ఆలయమే ముందుగా నిర్మింప బడింది.
ఆలయం ముందు బోర్డు మీద (ఆలయాలకన్నా బోర్డు పాతగా కనిపించింది… ఆలయాలు పునర్నిర్మించినప్పుడు బోర్డు తిరిగి వ్రాయించలేదా) రెండు ఊరు పేర్లున్నాయి. అత్తలూరు – నూతలపాటివారి పాలెం గ్రామం అని వున్నాయి. కారణం అడిగాను. రెండు పేర్లూ రాయాలి.. ఒకటి పంచాయతీ రెండవది గ్రామం పేరు అన్నారు.
ఆలయ పునర్నిర్మాణం శ్రీ నూతలపాటి సురేంద్రగారి ఆధ్వర్యంలో శ్రీ గాడిపర్తి సాయిబాబాగారు, ఇంకా భక్త జనుల సహకారంతో జరిగింది.
ప్రస్తుతం పెద్ద కళ్యాణ మంటపం నిర్మించారుట. ఇంకా గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని వీలయినంత అభివృధ్ధి చెయ్యాలని వీరందరి సత్సంకల్పానికి మెచ్చుకుంటూ మా తర్వాత మజిలీ విప్పర్ల చేరాము.
శ్రీ కె.వి.యస్. శర్మగారి సెల్ నెంబరు 9963247505
54. శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, విప్పర్ల
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.