Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 37: గోకర్ణ మఠం

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 37” వ్యాసంలో గోకర్ణ మఠం లోని గోకర్ణేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి.

గోకర్ణ మఠానికి వెళ్ళే దోవ సన్నగా వున్నది. గోకర్ణ మఠం ఊరు కనబడితే అక్కడేనేమో ఆలయం వున్నది అనుకున్నాము. ఇంకా ముందుకు వెళ్ళాలన్నారు. ఊరు చివర కొంచెం దూరం వెళ్ళాక వున్నది ఆలయం. దాదాపు నిర్మానుష్యంగా వుంది. చుట్టూ ఇళ్ళు కూడా ఎక్కువ లేవు. సమయం సాయంకాలం 6-30 అయింది. అప్పటికే చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొత్త ప్రదేశాల్లో చీకటి పడ్డాక ఇలాంటి చోట్లకి వెళ్ళాలంటే కొంచెం భయంగానే వుంటుందిగానీ, ఆ రోజు ప్రోగ్రాం ప్రకారం అన్ని ఊళ్ళూ అయిపోవాలి. లేకపోతే మళ్ళీ అంత దూరం రావటం కష్టం.

మొత్తానికి ఆలయం చేరాం. పూజారిగారున్నారు. ఇల్లు దగ్గరే. వేళకాని వేళ దూర ప్రాంతాలనుంచీ ఎవరైనా వస్తే పిలిస్తే వస్తామన్నారు. జనం ఎవరూ లేక పోవటంతో ఆలయం విశేషాలు చెప్పారు.

ఆలయ చరిత్ర

ఈ ఆలయం చోళ రాజుల సమయంలో నిర్మింపబడింది. ఆ సమయంలో తిమ్మ భూపాలుడు అనే రాజు నిజాంపట్నం పరిసర ప్రాంతాలను పరిపాలిస్తూ వుండేవాడు. ఆయనకి గో సంపద చాలా సమృధ్ధిగా వుండేది. వాటిని గోవుల కాపర్లు ఆ చుట్టు పక్కల ప్రదేశాలలో మేపుకుని వచ్చేవారు.

ఆ కాలంలో చుట్టు పక్కల ప్రాంతమంతా అడవులు చాలా ఎక్కువగా వుండేవి. ఆ అరణ్యంలో లంబకర్ణఋషి చాలా కాలంగా తపస్సు చేసుకుంటూ వుండేవాడు. తిమ్మభూపాలుని గోవులు ఆ ఋషి తపస్సు చేసుకునే ప్రాంతంలో సంచరించేవి. ఆ గోవులలో ఒక గోవు లంబకర్ణ మహర్షికి రోజూ ప్రదక్షిణ చేసి, తన క్షీరాన్ని ఆ మహర్షి ముందు వదిలి వెళ్ళేది. అది గమనించిన ఋషి తన ముందు కమండలం వుంచి, తాను తపో దీక్షలో నిమగ్నమయ్యేవాడు. ఆ గోవు యథాప్రకారం వచ్చి, ఋషికి ప్రదక్షిణ చేసి, ఆయన ముందున్న కమండలంలో క్షీరాన్ని వర్షించి వెళ్ళేది. ఇది నిత్యకృత్యంగా మారింది. ఆ ఋషి కూడా ఆ క్షీరాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడు.

ఆ గోవు ఇంటివద్ద పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో దాని సంగతి గమనించమని గోపాలకుడికి ఆదేశాలు అందాయి. ఆదేశానుసారం ఆ కాపరి గోవును రహస్యంగా వెంబడించి విషయం కనుక్కున్నాడు. గోవు లంబకర్ణ మహర్షి కమండలంలో క్షీరం వర్షించటం చూసి పశువుల కాపరి కోపం ఆపుకోలేక చేతిలోని గొడ్డలితో ఆవుని కొట్టాడు. అది ఆవు కుడి చెవికి తగిలి ఆవు అక్కడికక్కడే ప్రాణం విడిచింది. అది చూసి భయపడిన కాపరి ఇంటికి వెళ్ళి ఆవుని పులి చంపిందని అబధ్ధం చెప్పాడు.

లంబకర్ణ మహర్షి మృతి చెందిన ఆవుకి ఉత్తమ గతులు కలిగేలా సంకల్పం చేసి ఆ ఆవు కళేబరాన్ని సమాధి చేశాడు. రాజు పశువుల కాపరి మాటలు నమ్మక స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి లంబకర్ణ మహర్షిని చూసి వివరమడిగాడు. మహర్షి మీ గోవుని మీ పశువుల కాపరే చంపాడు, కావాలంటే సమాధి తవ్వి చూసుకోమని చెప్పగా రాజు సమాధి తవ్వించాడు. సమాధిలో వున్న ఆ గోవు కుడి చెవ్వునుండి శివలింగం బయల్పడింది. రాజు ఆశ్చర్య చకితుడై ఆ శివలింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేసి గుడి కట్టించాడు. గోవు కర్ణంనుండి వెలువడిన లింగం కనుక గోకర్ణేశ్వరుడు అని పేరు పెట్టి, ఆ రాజు ఆలయం నిర్మించి గోకర్ణేశ్వరాలయంగా పేరు పెట్టారు. స్వామి నిత్య పూజాదికాలకు ఆలయానికి 16 ఎకరాల మెట్ట, 6 ఎకరాల మాగాణి భూములు ఇచ్చాడు.

గోకర్ణేశ్వరాలయం నిర్మింపబడి, ఈ కథ అందరికీ తెలిసింది. తర్వాత ప్రజలు ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ ఇళ్ళు నిర్మించుకుని వుండటంతో అక్కడ ఒక గ్రామమేర్పడినది. అదే గోకర్ణ మఠం. ఈ పేరుకీ ఒక కారణం వున్నది.

లంబకర్ణ ముని ఆదేశంతో దేవాలయానికి అనుబంధంగా ఆలయానికి ఆనుకునే నంది మండపం నిర్మించాడు తిమ్మభూపాలుడు. ఈ నంది మండపంలో లంబకర్ణఋషి నిత్యం తపస్సు చేసుకునేవాడు. ఆయన తత్వోపదేశాలు చెయ్యటంతో ఆయనకి శిష్యులు పెరిగారు. లంబకర్ణఋషి కైవల్యం పొందబోయే ముందు తన శరీరాన్ని నంది మండపంలోనే సమాధి చేయమని ఆదేశించాడు. శిష్యులు ఆయన ఆదేశాన్ని పాటించి నంది మండపంలోనే ఆయన శరీరాన్ని సమాధి చేశారు. అదే మఠం.

లంబకర్ణ ఋషి పెంపుడు కొడుకు, వారి సంతానం 17 తరాలుగా ఆ దేవాలయాన్ని, మఠాన్ని నిర్వహిస్తూ తపస్సులోనూ, తత్వోపదేశంలోనూ జన్మ ధన్యమొనర్చుకుంటున్నారు. దేవస్ధానం, మఠం రెండూ సమాంతరంగా నడుస్తూ వుండటంతో ఈ రెండూ కలిసి గోకర్ణ మఠంగా పేరుబొందింది.

పురాతన ఆలయం శిథిలం అవటంతో తిరుమల తిరుపతి దేవస్ధానంవారి ఆర్థిక సహాయంతో స్ధానికుల ఆర్థిక సహాయం కూడా జత కలిపి ఆలయాన్ని పునరుధ్ధరించారు.

   

ఎక్కడో కుగ్రామంలో వున్న ఆలయానికి కూడా ఎంత చరిత్ర వున్నదో అనుకుంటూ 6-45కి అక్కడనుంచి బయల్దేరి నిజాంపట్నం వచ్చాం.

చీకటి, లైటింగ్ సరిగా లేకపోవటంతో ఫోటోలు సరిగ్గా రాలేదు.

Exit mobile version