Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘భక్త రామదాసు’ జీవితచరిత్ర నేటికి అపరిష్కృతమే!

[డా. కొప్పరపు నారాయణ మూర్తి గారు రచించిన – ‘భక్త రామదాసు’ జీవితచరిత్ర నేటికి అపరిష్కృతమే! – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“విన్నపమాలకింపు రఘువీర! నహి ప్రతిలోకమందు నా
కన్న దురాత్మున్డున్‌, బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ
కన్న మహాత్మున్డున్‌, బతిత కల్మష దూరుడు లేడు నాగ వి
ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!”

అన్న పద్యం వినగానే ఈ పద్యం రాసింది కంచర్ల గోపన్న అని, ఈయనకు ‘భక్త రామదాసు’ అనే మరో పేరు కూడా ఉందని తెలుగునాట ఎవరైనా చెబుతారు.

అయితే, ఈ భక్త ‘రామదాసు’ జీవితం నేటికీ అసమగ్రం, అపరిష్కృతం అంటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి నేటికీ ఆయన జనన, మరణ వివరాలు వివాదాస్పదమే. అసలు రామదాసును జైల్లో పెట్టింది ఎవరు నుంచి అసలు భద్రాచలంలో రామాలయం ముందే ఉందా, లేక రామదాసు నిర్మించారా వరకూ దేనికీ స్పష్టత లేదు. ఆయనకు తానాషాకు మధ్య గొడవ (ప్రభుత్వ నిధులను రామమందిర నిర్మాణానికై దారి మళ్ళించడం) నిజమేనా? అక్కన్న, మాదన్నలు రామదాసుకు ఏమౌతారు? గోపన్నను భద్రాచలం తహశీల్దారుగా ఎవరు నియమించారు? ఆయనను తానాషా గోల్కొండ కోటలో నిజంగా బంధించారా? రామలక్ష్మణులు తానాషాకు కనపడి, బంగారు ‘రామటెంకెలు’ (నాణాలు) ఇచ్చి రామదాసును విడిపించారా? భద్రాచలంలో కనిపించే సీతారామలక్ష్మణ నగలు, రామదాసు బందిఖానాలో పాడిన కీర్తనలోని నగలు తానాషా కాలం నాటివేనా? – వంటి పలు ప్రశ్నలు నేటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి ఎందుకు?

రామదాసును శివాజీ విడిపించారా బందిఖానా నుంచి లేక తానాషానే విడిచిపెట్టారా? ఔరంగజేబుకు తానాషాకు మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? తానాషా ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? ఎప్పుడు పదవీచ్యుతుడయ్యారు? తానాషా పదవీచ్యుతుడయ్యే నాటికి రామదాసు జైలు నుంచి విడుదలయ్యారా? తానాషా ఎప్పుడు మరణించారు? మరి రామదాసు ఎప్పుడు మరణించారు?

ఈ ప్రశ్నలే ఇతివృత్తంగా సాగే ఈ పరిశోధనా వ్యాసంలో ఎన్నో వైవిధ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని సవివరంగా పాఠకుల ముందుంచడమే ఈ వ్యాస ప్రధాన లక్ష్యం. ఈ వ్యాసం భక్త రామదాసు (కంచర్ల గోపన్న) సమగ్ర జీవితావిష్కరణ చేయడంలో సాహిత్య చరిత్రకారుల వైఫల్యం మాత్రమే తెలుపుతుంది.

భద్రాచలం దేవస్థానం వెబ్‌సైట్‌ కథనం:

మొట్టమొదట భద్రాచలం దేవస్థానం వారు రామదాసు గురించి చెప్పిన దానితో ఆరంభమవుతుంది. భద్రాద్రి దేవస్థానం వారి అధికారిక వెబ్‌ సైట్‌ లో భద్రాచల ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక శక్తి, భద్రుడు తపస్సు, రామసాక్షాత్కారం, చివరకు పోకల దమ్మక్క కల, కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా అక్కడికి రావటం వివరించారు. అప్పట్లో అబుల్‌ హాసన్‌ తానాషా గోల్కొండ పాలించే వారని, ఆయన వద్ద పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలు గోపన్న మేనమామలని, నిరుద్యోగిగా ఉన్న కంచర్ల గోపన్నకు తహసీల్దార్‌ ఉద్యోగం ఇమ్మని వారు సిఫార్సు చేయటం, తదనుగుణంగా తానాషా కంచర్ల గోపన్నను భద్రాచల తహసీల్దార్‌‌గా నియమించటం జరిగిందని తెలిపారు ఆ వెబ్‌‌సైట్‌‍లో.

అక్కడినుంచి రామదాసు గురువు భట్టాచార్యుల వారి సలహా మేరకు, ఊరి ప్రజల కోరిక మేరకు రాముల వారి మందిర నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి తానాషా కంచర్ల గోపన్నను పిలిచి రామమందిర నిర్మాణానికి నిధులెక్కడి నుంచి వచ్చాయని వివరం అడగటం, పూర్వాపరాలు, రామదాసు చెప్పిన వివరాలేమీ పరిశీలించకుండా కంచర్ల గోపన్నను ఖైదులో పెట్టమని తానాషా ఆజ్ఞాపించటం, పన్నెండేళ్ల శిక్ష అనంతరం రామలక్ష్మణులు తానాషాను కలిసి బంగారు రామటెంకెలు ఇచ్చి గోపన్నను ఖైదునుంచి విడిపించటం రాశారు. అయితే అదే వెబ్‌‌సైట్‌‍లో 17వ శతాబ్దంలో వాస్తవంగా జరిగిందేంటి అన్న వివరాలు కాలక్రమంలో లేవని కూడా పేర్కొన్నారు.

భయంకర తప్పులు తడకల ఆంగ్లంలో, వర్ణ చిత్రాలతో వివరించిన ఈ భద్రాచల రామక్షేత్ర మహిమ, శ్రీ రామదాసు చరిత్ర అటుంచితే, ఈ వెబ్‌‌సైట్‌ కథనం ప్రకారం కొన్నివిషయాలు స్పష్టం అవుతాయి. ఒకటి కంచర్ల గోపన్న, రామదాసు ఒకరే అని, గోపన్నను భద్రాచలం తహసీల్దార్‌‌గా నియమించింది గోల్కొండ పాలకులేనని, భద్రాచలంలో శ్రీరామచంద్రుల దేవాలయం విషయమై అందిన ప్రజా ధన దుర్వినియోగ అభియోగం పైననే గోపన్నను ఖైదు చేశారని, శ్రీ రామలక్ష్మణులే తానాషాకు బంగారు రామటెంకెలు వరహాలుగా ఇచ్చి గోపన్నను విడిపించారని స్థూలంగా నిర్ధారణ అవుతుంది. ఈ కథనంలో రామాలయ నిర్మాణానంతరం భక్తులకు అన్నదానం చేసేప్పుడు ప్రమాద వశాత్తు గోపన్న కొడుకు మరణిస్తే, గోపన్న శోకతప్తుడై, ఆర్తితో ప్రార్ధిస్తే రాములవారి అనుగ్రహంతో తిరిగి పునర్జీవితుడవటం కూడా నిర్ధారించారు.

వికీపీడియా కథనం:

అయితే భద్రాచల రామదాసు గురించి వికీపీడియాలో కొన్ని వివరాలున్నాయి. వికీపీడియా ప్రకారం రామదాసు అనే కంచర్ల గోపన్న 1620-1688 మధ్య ఉన్నాడని తెలుస్తుంది. ఈయన వాగ్గేయకారుడని, శ్రీ రాముడికి గొప్ప భక్తుడని, కవి అని ఇందులో పేర్కొన్నారు. వీరి స్వగ్రామం నేలకొండపల్లి. ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న అని, తండ్రి పేరు లింగన్న మంత్రి, తల్లి కామాంబ అని, చిన్నప్పుడే ఇతనికి ‘తన’ అనే వారెవ్వరూ లేకపోతే, రామ భజనలు, కీర్తనలు పాడుకొంటూ ఆ గ్రామంలోనే భిక్షం ఎత్తుకొనే వారని రాసుంది. అలా చిన్నప్పుడే రామభజన చేయటం వలననే ఆ ఊరులో ఈ బాలుడికి ‘రామదాసు’ అని పేరు వచ్చిందన్నట్లుంది.

నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడైనా భిక్షాటన చేస్తూ జీవించే కాలంలో రఘునాథ భట్టాచార్య అనే శ్రీ వైష్ణవ గురువు ఈయనను చేరదీసి ‘దాశరథి’ సంప్రదాయంలోకి తీసుకువచ్చారు. ఈ విధమైన రామదాసు వివరాలు ఆయన కవిత్వం నుంచి, హరికథ, యక్షగాన కథల నుంచి కూర్చినవేనని కూడా వికీపీడియా పేర్కొంది. ఇంకా రామదాసుకు గోల్కొండ అబుల్‌ హాసన్‌ తానాషా దగ్గర పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలు వరుసకు మేనమామలని కూడా ఈ వికీపీడియా పేర్కొంది.

అబ్దుల్లా కుతుబ్‌ షా 1672లో చనిపోయిన తరువాత ఆయన మూడవ అల్లుడు అబుల్‌ హాసన్‌ తానాషా అధికారంలోకి రావటానికి అక్కన్న మాదన్నలు సహాయం చేసినందున తానాషా వీరిని తన ఆస్థానంలో మంత్రులుగా నియమించుకొన్నట్లు రాశారు వికీపీడియాలో. అబుల్‌ హాసన్‌ తానాషా పాలించే రోజులలో వారికీ ఢిల్లీ నవాబు మొఘల్‌ చక్రవర్తులలో చివరివాడైన ఔరంగజేబుకు మధ్య గొడవలు జరుగుతుండేవని కూడా ఇందులో రాశారు.

1650లో గోపన్న గోల్కొండ వెళ్లి మేనమామలైన అక్కన్న, మాదన్నలని కలవగా వారు నాటి తానాషా ప్రభువు ఆర్ధిక మంత్రి అయిన సయ్యద్‌ మొహమ్మద్‌ మీర్జులుం మీర్జాఫర్‌ వద్దకు గోపన్నను తీసుకెళ్లి అతనికేమైనా ఉద్యోగం ఇప్పించమని ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నించి సయ్యద్‌ మీర్జాఫర్‌ గోపన్నను భద్రాచలం దేవాలయంలో లెక్కలు చూసే గుమస్తాగా నియమించారని వికీపీడియా కథనం.

పై కథనాల్లో వైరుధ్యాలు:

అంటే ఆ నాటికే భద్రాచలంలో రామ దేవాలయం ఒకటి ఉండింది. ఇక్కడినుంచి రామదాసు జీవితంపై భిన్న కథనాలున్నాయని వికీపీడియా చెబుతుంది. ఒకటేమిటంటే రామదాసు భద్రాచలంలో ఉన్న రాములవారి మందిరం చూసి, కలత చెంది, ప్రజలు జిజియా పన్నుకు చెల్లించిన డబ్బులు, ఇతర పన్నులకు ఇచ్చిన డబ్బులను రామాలయ నిర్మాణానికి వెచ్చించి దానిని పునర్నిర్మించాడని, ఈ వార్త తెలిసి తానాషా గోపన్నను 12 సంవత్సరాలకు ఖైదు చేశారని. రెండవది, ఔరంగజేబు దాడి జరుపబోతున్నట్లు తెలిసి గాభరా గాభరాగా తిరిగి పునర్విచారించి రామదాసును నిర్దోషి అని ప్రకటించి జైలునుంచి పంపించి వేశారని.

ఈ కథనం ప్రకారం పోకల దమ్మక్కకు కల రావటం, ఆవిడ అక్కడ ఆ కొండపై సీతా సమేత రామలక్ష్మణులను కనుగొని, ఒక తాత్కాలిక తాటాకుల పందిరి వేసి ఆ దేవతలను భక్తితో సేవించటం, ఆ సమయంలో రామదాసు తహసీల్దారుగా అక్కడికి వచ్చి, ఈ పోకల దమ్మక్క నిర్మించిన రామమందిరం చూసి చలించి పోయి దాని నిర్మాణానికి ప్రజలనుంచి ధనం సేకరించటం అంతా ఓ కట్టు ‘కథ’ అయిపోతుంది. అసలు రామదాసు పాడుపడ్డ మందిరాన్ని పునర్నిర్మించారా, లేక కొత్త మందిరం కట్టించారా? మందిరం కట్టించేప్పటికీ ఆయన గుమాస్తానా, తహసీల్దారా?

డచ్‌ ఈస్ట్‌ ఇండియా కథనాలు, ఆలయ కథనాలు, జనంలో ఉన్న ప్రచారం వేరు వేరుగా ఉన్నాయని వికీపీడియా రాసింది. ఏది ఏమైనా ఆయన ఎక్కువకాలం భద్రాచలం లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక కథనం ప్రకారం రామదాసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే గోల్కొండలో ఏకాంత జైలు జీవితం గడిపినట్టు ఇందులో ఉంది. ఈ వికీపీడియా గూడా రామదాసు చుట్టూ అల్లుకొని అనేక దైవ సంబంధమైన కథలు ప్రచారంలో ఉన్నాయని రాసింది.

రామదాసు కాలం గురించి వైరుధ్యాలు:

ఇక్కడ నుంచి రామదాసు కాలనిర్ణయ సమస్యల పరిణామమేట్లా సాగిందో చూడవలసి ఉంది. ప్రసిద్ధ చరిత్రకారుడు, శాసన శోధకుడు బి ఎన్‌ శాస్త్రి రాసిన ‘గోల్కొండ చరిత్ర – సంస్కృతి – శాసనములు’ (1989) ప్రకారం అబ్దుల్లా కుతుబ్‌ షా 1626నుంచి 47 సంవత్సరములు గోల్కొండను పాలించి 21-4-1672లో కాలం చేశారని రాశారు. ‘విచిత్ర పరిస్థితులలో అబ్దుల్లా కుతుబ్‌ షా మూడవ కూతురు బాదుషాబీబిని వివాహమాడి అబుల్‌ హాసన్‌ తానాషా (‘తానాషా’ అంటే నిత్యం ఆనందంగా జీవించే తాత్వికుడు అనే అర్థం.) గోల్కొండ నవాబు అయినాడు’ అని నిర్ధారించారు. అంటే 1672కు గోల్కొండ నవాబు అబుల్‌ హాసన్‌ తానాషా. అంతవరకూ ఆయన మామ అబ్దుల్లా కుతుబ్‌ షా నే గోల్కొండ పాలించారు. అబుల్‌ హాసన్‌ తమాషా 1687లో దివంగతుడయినారు. అంటే అబుల్‌ హాసన్‌ తానాషా కేవలం 15 సంవత్సరాలే గోల్కొండ పాలించారన్న మాట.

అంతేగాదు, అబుల్‌ హాసన్‌ తానాషా కింద పనిచేసే సయ్యద్‌ ముజఫర్‌ మీర్జులుం వద్ద పేష్కారుగా మాదన్న, అతనికి కార్యదర్శిగా అక్కన్న పనిచేసేవారు. ముజఫర్‌ రాజద్రోహ చర్యలను బాగా గమనిస్తుండేడివారని, ఫలితంగా వారు తానాషాకు ముజఫర్‌‌ను వదిలించుకొని ఆయన అధికారం పదిలపరుచుకోవటంలో సహాయపడ్డారని శాస్త్రిగారు రాశారు. అందుకు బదులుగా మంత్రిగా మాదన్న, అక్కన్న పేష్కార్‌‌గా నియమితులైనారు. ఈ మొత్తం చరిత్రలో బి.ఎన్‌. శాస్త్రి ఎక్కడా కంచర్ల గోపన్న, భద్రాచలం రామాలయం, గోల్కొండలో ఉన్న గోపన్న ఖైదు గురించి పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇది ఇలా ఉంటే, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత బాలాంత్రపు రజినీకాంత రావు తన పుస్తకం ‘రామదాసు’ (కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ, 1988) లో రామదాసు జీవితంలో ఇద్దరు గోల్కొండ ప్రభువులు భాగమైనట్లు రాశారు. 1925లో భావరాజు వెంకట కృష్ణారావు భారతిలో రాసిన వ్యాసంలో ఈ విషయం పేర్కొన్నట్టు తన పుస్తకంలో ఉటంకించారు. అంతేగాదు, వీరు గూడా నాటి ప్రచారంలో ఉన్న యక్షగానాలనుంచి, హరికథల నుంచే రామదాసు జీవిత చరిత్ర అల్లినట్టు తొలుతే రాసుకున్నారు. పైగా అక్కన్న, మాదన్నలను కంచర్ల గోపన్న మేనమామలుగా ఈయన నమ్మినట్టు రాశారు. వీరి ప్రకారం రామదాసు ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ధనం రామ మందిర నిర్మాణానికి వాడినందుకు 1665-1677 వరకూ జైలులో ఒంటరిగా ఖైదీగా గడిపినట్టు రాశారు.

నిజానికి, ఈ కాలానికి అబుల్‌ హాసన్‌ తానాషా గోల్కొండ నవాబు కాదు. అప్పటికి అబ్దుల్లా కుతుబ్‌ షానే గోల్కొండ పాలకుడు. అప్పటికి అక్కన్న, మాదన్నలు ఇంకా గోల్కొండలోకి ప్రవేశించలేదు. వాళ్ళు వచ్చింది అబుల్‌ హాసన్‌ తానాషా హయాంలో. అబ్దుల్‌ కుతుబ్‌ షా కింద పనిచేసే సయ్యద్‌ మిర్‌ జుంలా ముజఫర్‌ ఆదాయవ్యయాల మంత్రిగా వ్యవహరిస్తున్నప్పడు ఆయనకు సహాయకులుగా (పేష్కార్లుగా) ఉండేవారు. ఒక వేళ ఇదే జరిగి ఉంటే సయ్యద్‌ మిర్‌ జుంలా ముజాఫర్‌ రామదాసును భద్రాచలంలో ఉన్న రామాలయానికి పన్నులు, జిజియా వసూలు చేసేందుకు పంపిన గుమాస్తానే కానీ, తహసీల్దారు కాదు.

రామదాసు ఎన్నేళ్ళు జైలులో ఉన్నారు?

అయితే రజనీకాంతరావు రచనలో రెండు ముఖ్య విషయాలు పేర్కొన్నారు. ఒకటి అబ్దుల్లా కుతుబ్‌ షా 1972 వరకు గోల్కొండ పాలకుడు. రామదాసుకు 12 ఏళ్ళు జైలు శిక్ష విధించినా, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన అబుల్‌ హాసన్‌ తానాషా మహామంత్రి మాదన్న, అక్కన్నల విజ్ఞప్తి మేరకు రామదాసు కేసును పునః పరిశీలించి ఆయనను 1677లో జైలు నుంచి విడుదల చేయటం జరిగిందని. ఇందుకు ఆధారంగా ఆయన ఆరుద్ర, వేదం వెంకటరాయ శాస్త్రి రచనలను ఉటంకించారు. ఇంకా మార్టిన్‌, హవార్ట్‌ అనే డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు కూడా ఇదే వాదనను సమర్థించారు. అయితే వారి విమర్శలో వారు రామదాసును భద్రాచలం తహసీల్దార్‌ గానే అభివర్ణించినట్టుగా రజనీకాంతరావు పేర్కొనటం గమనార్హం.

సంప్రదాయ రామదాసు భక్తులు మార్టిన్‌, హవార్ట్‌‌లు రాసిన దానిని విశ్వసించారు. అయితే యక్షగాన రచయితలు, కవులు రామ, లక్ష్మణులు మారు వేషంలో అబుల్‌ హాసన్‌ తానాషాకు కనిపించి రామదాసు చెల్లించవలసిన మొహరీలని ‘రామటెంకె’ల రూపంలో బంగారు నాణేలుగా చెల్లించినట్టు చెబుతారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. రామదాసుకు కబీర్‌ దాసు ‘రామతారక మంత్రం ‘ఉపదేశించినట్టు రజనీ రాశారు (పుట 29). కానీ, భాగవతుల సుబ్రహ్మణ్యం తన పుస్తకం ‘భక్తరామదాసు’లో దీన్ని నిర్ద్వందంగా ఖండించారు. కబీర్‌ దాసు 15వ శతాబ్ది వాడని, రామదాసు 17వ శతాబ్ది వాడని, వీరిరువురి మధ్య శతాబ్దం పైగా కాలాంతరం ఉందని, అందువల్ల రామదాసుకు కబీర్‌ ‘రామతారక మంత్రం’ ఉపదేశించినట్టు చెప్పటం సుతారము అసంబద్ధం’ అని సుబ్రహ్మణ్య శర్మ వాదన. నిజానికి కబీర్‌ కాలం 15వ శతాబ్దమేనని అనేక ఇతర రచనలు నిరూపిస్తున్నాయి. ఏటుకూరి బలరామ్మూర్తి గారి ‘ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర’ (2018)లో భక్తరామదాసు ఉన్నాడని, ఆయన భక్తి సాహిత్యం క్రింద రామభక్తి ప్రచారం చేశారని రాసుకొచ్చారు. కాకతీయుల పతనం తరువాత దక్షిణాదిన ముస్లిం నవాబుల పాలనలో దక్షిణాపథం ముక్కలు చెక్కలయింది. ఈ కాలంలో భక్తి సాహిత్యమే ప్రబలంగా వ్యాప్తిలో ఉందన్న అభిప్రాయం ఏటుకూరివారి రచనల్లో కన్పిస్తుంది.

కబీరు-రామదాసు ఒకే కాలంవారు కారు:

కొండపల్లి రామచంద్రరావు రాసిన ‘శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్రము’ (1957) లో ప్రచురితమైంది. ఇందులో రామదాసు జనన కాలం ఇవ్వకపోయినా ఆయన 1670లో పాల్వంచ-భద్రాచలం పరగణాధికారిగా నియమితుడైనట్టు పేర్కొన్నారు. అయితే వీరు అబ్దుల్లా కుతుబ్‌ షా 1669లో మరణించినట్టుగా కృష్ణజిల్లా మాన్యువల్‌‌ను ఉదహరిస్తున్నారు. 1674 వరకు భద్రాచలం రామమందిర నిర్మాణం గావించి అదే సంవత్సరం కారాగార బంధితుడైనట్టు రాసుకొచ్చారు. పన్నెండేళ్ల ఖైదు అనంతరం 1686లో విడుదలై తిరిగి భద్రాచలం చేరినట్టు ఈయన రాశారు. అయితే వీరు కూడా రామ లక్ష్మణులు తానాషాకు గనిపించి దేవాలయమునకైన రొఖ్ఖమును ‘రామటెంకెల’ రూపంలో చెల్లించి రామదాసును విడిపించారనే రాసుకొచ్చారు. ఇది ఇంతకు పూర్వం పేర్కొన్న వికీపీడియా కథనానికి, రజనీకాంతారావు కథనానికీ పూర్తిగా భిన్నమైన కాల వివరణ.

అంతేగాక, తానాషా 1687లో పదవీచ్యుతుడై ఔరంగేజేబు వద్ద చాలాకాలం బందీగా ఉన్నాడు. కానీ, వికీపీడియా ప్రకారం రామదాసు 1688లోనే, అంటే బందిఖానానుంచి విడుదలైన రెండేళ్లకే, కాలం చేసినట్టుగా ఉంది. ఈ విషయమై ఏ రచయితా, పరిశోధకులు స్పష్టత ఇచ్చే స్థితి అందుబాటులో ఉన్న సాహిత్యంలో లేదు.

ఇక శివాజీ మహారాజ్‌ మాటకొస్తే ఆయన ఒకసారి గోల్కొండ రావటం జరిగిందని వేదం వెంకటరాయ శాస్త్రి తన ‘ది స్టోరీ అఫ్‌ అక్కన్న, మాదన్న’ అనే పరిశోధనాగ్రంధంలో రాశారు. ప్రహ్లాదనీరాజి అనే రాయబారి మాదన్నను సంప్రతించిన మీదట ఉభయులకూ లాభం చేకూరేలా మాదన్న రాయబారమును నెరిపించారు. ఫలితంగా శివాజీ గోల్కొండ కొచ్చి అక్కడ బస చేయటం జరిగిందని వేదం వెంకటరాయ శాస్త్రి రాశారు (పుట 42). కానీ శివాజీ ఈ సంధిలో కుదిరిన ఒప్పందమును ఉల్లంఘించి, మాదన్నను మోసం చేశారు. అటువంటిది చారిత్రక వాస్తవం కాగా కొందరు చరిత్రకారులు శివాజీ చెప్పినందునే తానాషా రామదాసును ఖైదు నుంచి విడిపించెనని వాదించారు. ఇది అవాస్తవమని వేదం వెంకటరాయ శాస్త్రి రాసిన రచన స్పష్టం చేస్తుంది. కొందరు ఇంకొంచెం ముందుకు వెళ్లి మాదన్న, అక్కన్నలు మహారాష్ట్రీయులని, ఇక్కడికి వలస వచ్చారని కూడా రాశారు (ఎస్‌.ఎమ్‌. ప్రాణ్‌ రావు). అయితే వేదం వెంకటరాయ శాస్త్రి దీనిని సమూలంగా ఖండించారు. వారు పింగళి వంశస్థులని, నియోగి బ్రాహ్మణులని, రామదాసు తల్లి వైపు వారని స్పష్టం చేశారు.

అయితే ఇక్కడ వేదం వెంకటరాయ శాస్త్రి రచన ఒక మెలిక వేశారు. ఆ మెలికేమిటంటే తానాషాకు కంచర్ల గోపన్న (రామదాసు) పై ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ తానాషా వాటిని ఏనాడు పట్టించుకోలేదని. చివరకు ఈ ఫిర్యాదులు నానాటికీ పెరిగిపోగా, ఆయన రామదాసును తన కొలువుకు రప్పించి విచారించారని. అయితే, ఆ విచారణలో వారికి రామదాసు పరమ భక్తుడని, నిర్దోషి అని తేలటంతో ఎటువంటి శిక్ష వేయకుండా రాచ మర్యాదలతో తిప్పి పంపించేశారని వేదం వెంకట రాయ శాస్త్రి రాశారు (పుట 88). ఈ వ్యాఖ్యానం రజినీకాంతరావు వ్యక్తం చేసిన భావాలను, ఇతర కథనాలను ఖండిస్తోంది. ఆరుద్ర, వేదం వెంకటరాయ శాస్త్రి ‘12 ఏళ్ల జైలు శిక్ష తరువాత దయతో క్షమించి, విడిచిపెట్టమని అక్కన్నా, మాదన్నలు కోరిన మీదట తానాషా రామదాసును జైలునుంచి విడుదల చేసినట్టు’ రజనీ పేర్కొన్నారు. కానీ వెంకటరాయశాస్త్రి గారి పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు.

ఇలా కంచర్ల గోపన్న అనే రామదాసు జీవిత చరిత్ర అనేక ఖండన మండనాలతో, పరస్పర విరుద్ధ రచనలతో, శోధనలతో నేటికీ అపరిష్కృతంగానే ఉంది. వీటన్నింటీలో నిజమేమంటే రామదాసు దాశరధీ శతకం, రామదాసు కీర్తనలు, భద్రాచలంలో రామదాసు వారు శ్రీ రామలక్ష్మణులకు చేయించిన బంగారు ఆభరణాలు. ఎప్పటికైనా ఈ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు లభిస్తాయా అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న? సాహిత్య చరిత్ర పరిశోధనలలో మన తెలుగు మహాకవుల జీవితాలు ఇంత అసమగ్రంగా, అపరిష్కృతంగా ఉండిపోవడం చాలా శోచనీయం. వివాదాలకు అతీతంగా సాహిత్య చరిత్ర పరిశోధకులు వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

Exit mobile version