[భగవంత్ కేసరి సినిమాకి జాతీయ అవార్డు ప్రకటించిన సందర్భంగా బగ్మంత్ పొగడరి గారి స్పందన.]
భగవంత్ కేసరి. అబ్బ ఏం సినిమా.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం!!!
భలే! బలే! భలే బాలే!!
అసలీ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం ఏమిటి, అంతర్జాతీయ ఉత్తమ చిత్రోత్తమ చెత్తోత్తమోత్తమ చిత్రోత్తమోత్తమ చిత్రాలకే తిలోత్తమోత్తమోత్తమతిలోత్తమ అవార్డు కూడా ఇవ్వాలి. ఏం సినిమా అది! ఎంత గొప్ప సినిమా అది. అసలది సినిమానా! కాదు, మనమందరమూ పూజించుకునే ముద్దుగారే యశోద ముంగిట శిశువయిన ‘బాలకృష్ణనామా’ అది. అబ్బ మొదటి దృశ్యం నుంచీ అందరికీ పాఠాలు నేర్పుతుందీ అత్యుత్తమోత్తమ చెత్తరాజం! (అప్పుతచ్చులకు కసమించవలెను)
మొదటి దృశ్యం నుంచీ ప్రేక్షకులకే కాదు, భావి తరాల సినీ వికృతాకారకళాకార నిర్మాతలకు (దర్శకుడు, నిర్మాత, కెమేరామేన్, గేయ రచయితలు, నటీనటులు ఎట్సెట్రా, ఎట్సెట్రారారా), అతి వికృతకళాసృష్టికి అత్యంత తీవ్రమైన ప్రేరణనివ్వగల సినిమా ఈ బగ్మంత్ (రక్షించు! రక్షించు! అచ్చుతప్పు) కేసరియా బాల్మా, బావరా (పిచ్చివాడు) బోలె లోగ్, లోగ్ రే అనే భగవంత్ కేసరి అనే సినిమా!
ఏమి స్క్రీన్ ప్లే.. బిగినింగే అదిరిఅదిరికదిరికమిలికదలికడలిఅయిపోతుంది బుర్ర! ఆ చెదిరిన బుర్ర ‘ఇదే ఇదే నేను కోరుకుంది..ఇలా ఇలాంటి సినిమా జాతీయ స్థాయి అవార్డు పొందటం ఇంకా ఇంకా చూడాలని వుందీ’ అంటూ అవార్డుల కీర్తనల అష్టకం అందుకుంటుంది.
ఒక న్యాయమూర్తి భార్యా పిల్లలతో ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమని గుడ్లల్లో కన్నీరుకుక్కుకుని ధక్కుధక్కుమనే గుండె ఎప్పుడాగుతుందో నన్నట్టుంటే, ఒకాయన వచ్చి ‘మీకో కథ చెప్తా’ అంటాడు.
అబ్బ ఏమి స్క్రీన్ ప్లే.. ఏమి అత్యద్భుతమైన ఊహ! గొప్ప సినిమాటిక్ సూపర్ కాన్‌సెప్టిక్ కాంస్ట్రాస్టింగ్ సిల్లీయెస్ట్ గ్రేట్ సినిమాటిక్ విజన్!
భయంతో వణుకుతున్నవారి దృష్టిని వారికి భయం కలిగించే విషయంనుంచి మళ్లించటం ఒక గొప్ప మానసికశాస్త్ర సిద్ధాంతం. అంత గొప్ప సిధ్ధాంతాన్ని పిల్లలు కూడా నవ్వుకునేలా, లాజిక్ కూడా ఆశ్చర్యపోయేలా, మాజిక్ కూడా బిత్తరపోయేలా, ఔచిత్యం చిత్రవిచిత్రమైన ఛిద్రాలు పోయేలా సులువుగా ప్రదర్శించిన ఈ సినిమా మొదటి సీనుకే రాష్ట్ర స్థాయి అవార్డ్ సీను వచ్చేసింది. ఇక తరువాత సీనుతో ఎన్నో మెట్లెక్కి ముద్దుగారే యశోద ముంగిట పొర్లాడే ముత్యం స్థాయికి ఎక్కేస్తుంది. ఈ సినిమా ప్రభావం ఎంత గొప్పదో, చివరికి మళ్ళీ వీళ్ళంతా ‘బగ్మంత్ జాకీ చానరి’ లయి దొంగలను తుక్కుతుక్కు కొట్టటం నిరూపిస్తుంది. మామూలు మనుషులు కూడా ఈ సినిమా చూసి మనిషికి రెండు చెవులెందుకున్నాయో తెలుసుకుని గొప్ప జ్ఞానవంతులవుతారు. మనుషులకింత జ్ఞానం ఇచ్చే ఈ సినిమాకి ఎంతవద్దనుకున్నా అవార్డివ్వకపోవటం తప్పనిసరి.
జైల్లో ఎవరినో చంపబోతున్నారని తెలిసి బధ్దకపు పోలీసులు అక్కడ మన బగ్మంత్ కీసరి (అచ్చు తప్పులకు క్షమార్పణలు) ఉన్నాడు, వాడు ఒక్కొక్కడినీ కీసరగుట్ట ఎక్కించి కీసరబాసర అనిపించి బాసరలో గోదావరి స్నానాలు చేయించి, గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ వేలో చిందులు వేయిస్తాడు అని పోలీసులు హాయిగా వుంటారు. ప్రేక్షకులకు విశాఖలో ఆ ఆస్పత్రిలో చోటు దొరక్క బగ్మంతా బగ్మంతా అనుకుంటూంటారు. పోలీసులను ఇంత దద్దమ్మలుగా చూపించినందుకు జాతీయ స్థాయి అవార్డు స్థాయికి ఎదిగిపోయింది సినిమా. మనకు దేశం కన్నా వ్యక్తులు ముఖ్యం. అవార్డుకు హీరో ముఖ్యం..
ఇక ఆ తరువాత బక్కెట్ తో ఏం యుధ్ధం చేస్తాడంటే, ఇక చెప్పనక్కర్లేదు. హాలీవుడ్, బాలీవుడ్, ట్రాలీవుడ్, జాలీవుడ్, క్లింట్ ఈస్ట్‌వుడ్ లతో సహా ఈ భూ ప్రపంచంలో అలా బక్కెట్‌ను న్యూక్లియర్ మిసైల్ రాకెట్‌లా ప్రయోగించగలవాడు ఒక్క బగ్మంత్ స్వీపరే (అచ్చుతప్పులన్నిటికీ చివర్లో క్షమార్పణలు ఒకేసారి చెప్పుకుంటాను).
అస్సలు ఆ బెక్కెట్ బక్కెట్ రాక్కెట్ యుద్ధం ఉంది చూశారూ.. ఆ ఒక్క యుద్ధానికి చైనా, జపాన్, అక్సై చాన్, టింటో బ్రాస్, క్వెంటిన్ టొరంటినో, కామెరూన్‌ల ముఖాలన్నీ, అన్నీ అంటే అన్నీ, ‘లుంగీల్లోకి చీమలెక్కిన’ట్టు సిగ్గుతో మరూన్ రంగులోకి మారిపోతాయి. అసలు ఆ యుద్ధమేమిటి! బక్కెట్‍తో ఆ విన్యాసాలేమిటి! బక్కెట్ తగలగానే మిసైల్ తగిలినట్టు మనుషులు ఎగిరెగిరి పడటమేమిటి?ఇంత యుధ్ధం జరుగుతూంటే, పోలీసులు, బెంగాల్ పోలీసుల్లా మతకల్లోలాలు జరుగుతోంటే దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు కటకటాల వెనకనుంచి తమాషా చూడటం ఏమిటి!!! అసలు అలాంటి దృశ్యం సృజనకే ఆస్కార్, యుద్ధం కొరియోగ్రాఫర్‌కి తీన్మార్, ఎగిరెగిరిపడ్డవారికి ఫిల్మ్ ఫేర్, హీరోకి ఖాన్ తీస్మార్ (తీస్మార్ అంటే, ఒకదెబ్బ కొడితే ముఫయి దెబ్బలు కొట్టినట్టు) అవార్డులిచ్చేయాలి. ఒక్కొక్క సీనుకి ఇలా వందలు వేల అవార్డులిచ్చే అర్హత ఉన్న ఈ సినిమాకి జాతీయ స్థాయి అవార్డు చాలా తక్కువ.
ఇలా ఒక్కొక్క సీను గొప్పతనం, అణువణువునా ఉట్టిపడే సృజనాత్మక సందేశం, సినిమా రీలులో ఒక్కొక్క అడుగులో ఉట్టిపడే సృజనాత్మక తూఫాను అలలనుంచి విరుచుకుపడే చినుకుల ప్రవాహ వేగం.. అబ్బబ్బబ్బ.. ఎన్నెన్నో ఎంతెంతో చెప్పాలని వుంది, ఎన్నెన్నో, ఎంతెంతో విప్పిచూపాలని వుంది కానీ, అదంతా రాస్తూపోతే నా జీవితమంతా బగ్మంత్ సేవలో కుడిచిపోవటమే కాదు, ఇంకో పది జన్మలు ఈ బగ్మంత్ గొప్పతన వర్ణనలో గడచిపోతుందనిపిస్తుంది. అందుకని, ఈ జన్మ ఎలాగో ‘బగ్మంత్ చీపురు’ సేవలో అంకితమైపోయింది, కనీసం వచ్చే జన్మలనయినా కే సెరా సెరా సెరా పాడుకుంటూ, ఉయ్యాలో ఉయ్యాలలూగుకుంటూ ‘బగ్మంత్ చూపరి’ లాంటి వాటన్నిటికీ దూరంగా వుండేట్టు చేయమని బగ్మంత్ ని సృష్టించిన ‘బగ్మంత్ ధూళి ధూసరి’ని ప్రార్థిస్తూ, ఈ సినిమాకు, జాతీయ, అంతర్జాతీయ, విజాతీయ, సజాతీయ, దుర్జాతీయ, సుజాతీయ, సనకత్సుజాతీయ అవార్డులెన్నెన్ని ఉన్నాయో అన్నిటితో పాటూ, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ, భూతాల, భేతాళ, భీభత్సలోకాలలో ఉన్న అవార్డులతో పాటూ, భూలోక, భువర్లోక, సువ్వర్లోక, జంతులోక, వింతలోక, అంతులేని గల్లంతు లోకాలలో వున్నన్ని అవార్డులతో పాటూ, అంతరిక్షలోకాలాల్లోకాలలోకాల్లోని అవార్డులు కూడా ఈ సినిమాకే ఇవ్వాలని నిరూపించే కొన్ని సీన్లు మాత్రమే మీకు చూపిస్తాను. అవి చూసిన తరువాత మీరే ఒప్పుకుంటారు నేను కరెక్టాతికరెక్టని.
~
మొదటి జైలు యుధ్ధం దృశ్యంలోనే ‘బగ్మంత్ బాసురి’ బక్కెట్ వదిలి బుల్డోజర్, అదే, చెయ్యితో బాసురి వాయిస్తూంటే, ఒక బుజ్జిపాప సంతోషంతో చప్పట్లు కొడుతుంది. చాలా గొప్ప అర్థవంతమయిన దృశ్యం అది. భారతదేశంలో ఈ తరం పిల్లల్లో హింస పట్ల భయం పోయింది. హింసను ఎంజాయ్ చేసే ఒక ఉచ్చస్థాయికి చేరుకున్నారు వారు. మామూలు హింస కాదు, ‘చిత్రహింస, వారికి రాజహంస’ అన్న గొప్ప నిజాన్ని ఈ దృశ్యం నిరూపిస్తుంది. ఈ జాతీయ సత్యాన్ని నిరూపించినందుకు ఒక జాతీయ అవార్డివ్వాలి. ముఖ్యంగా, ఆ దృశ్యం చివరలో కర్మ సిధ్ధాంతం చెప్తూంటే, బగ్మంతుడు గీత బోధిస్తున్నట్టుంటుంది. సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పిన ఈ సినిమాకు అవార్డిస్తే ఎవరికి అభ్యంతరంవుంటుంది? అసలు ఈ దృశ్యమే కాదు, సినిమాలో ప్రతి యుధ్ధం దృశ్యం ఎంత అద్భుతంగా కోరియోగ్రాఫ్డ్, ఫోటోగ్రాఫ్డ్, సాడిస్టికోగ్రాఫ్డో, కొత్త కొత్త మాటలు సృష్టిస్తే కానీ వివరించటం కుదరదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ‘బగ్మంత్ బాస్మతి’ పడ్డ కష్టాలు, ప్రదర్శించిన పట్టుదల దీక్షలు దేశంలో అందరూ అనుసరించాలి. ఆ ప్రేరణ నిచ్చే గొప్ప ప్రేరణాత్మకమైన సినిమా ఇది. దీన్ని మించిన అవార్డర్హత ఉన్న సినిమా ఇంకోటి చూపించండి!
పరీక్షలో ఖాళీ పేపర్లిచ్చి ఎక్స్‌ట్రా షీట్స్ తీసుకుని ఫేవరెట్ హీరో సినిమాలో వెదజల్లేందుకు ముక్కలు చేస్తామని ఎంత ముద్దుగా చెప్తారో! భావి తరాల విద్యార్ధులందరికీ గొప్ప ఆదర్శంగా నిలచే ఇంతటి గొప్ప దృశ్యాన్ని సృజించినందుకు సృజనవీర అవార్డునిచ్చేయచ్చు.
ఇక పోలీసు స్టేషన్ సీనయితే లోలైటుకే హైలైటు.
అదేదో సినిమాలో పోలీసుమీద ఏదేదో పోస్తారని గోల చేశారు. ఈ సినిమాలో పోలీసు శరీరాన్నే పొయ్యి చేసి వేడి వేడి చాయ్ చేసి పోస్తాడు. బనీను వేసుకున్న పోలీసు, పోలీసు వ్యవస్థపై ప్రజలకు గౌరవాభిమానాలు పెంచే సన్నివేశమది. చివరలో పోలీసు డ్రెస్ వేసుకొమ్మని ఇచ్చిన సందేశానికి పోలీసులంతా ఈ సినిమాకు అవార్డివ్వాలి.
ఈ సినిమాలో ఒక సైకాలజిస్టుంటుంది. సైకాలజిస్టులూ మనుషులేననీ, వారికీ మామూలు మనుషుల్లాగా మెదడు లేకుండా ప్రవర్తించే హక్కుంటుందని ఆ పాత్ర నిరూపిస్తుంది. లేకపోతే ప్రపంచమంతా పిచ్చోళ్ళు, తామే మంచివాళ్ళమనుకుంటారు సైకాలజిస్టులు. వారందరూ నిజం గ్రహించేలా చేసినందుకు సైకాలజిస్టులంతా ఒక అత్యుత్తమ సైకో అవార్డిచ్చేయాలి.
ఇక ఒక యువతి తలచుకుంటే ఎంత గొప్ప ఫైటర్ కాగలదో, పట్టుదలే వుంటే కాగలదు మరో బ్రూస్లీ అని మహిళా శక్తిని నిరూపించిన ఈ సినిమాకు ఫెమినిస్టులంతా, మహిళోద్ధారకులంతా నీరాజనహారతులిచ్చి ఉత్తమ ‘ఫెమ్మెమ్మెనిస్టు’ సినిమా అవార్డిచ్చేయాలి.
ఇలా చెప్తూ పోతూంటే మళ్ళీ మొత్తం సినిమా చెప్పేయాల్సివస్తోంది. అలా ప్రతి ఒక్క సీనులో ఒక పది సందేశాలు, ఒక ఇరవై గొప్ప నీతులు, ఒక నలభై సృజనాత్మక సృష్టులు.. అబ్బబ్బ.. ఈ మధ్యకాలంలో ఇంత పర్ఫెక్టంటే పర్ఫెక్టుకే పర్ఫెక్ట్ అనిపించే సినిమా రాలేదంటే, నమ్మండి. లేకపోతే జాతీయ స్థాయి అవార్డు ఉట్టిగానే వస్తుందా?
ఏ అవార్డూ ఉట్టిగా రాదు, గుర్తుంచుకోండి. దాని వెనుక ఎంతో శ్రమ వుంటుంది.
ఇక క్లైమాక్స్‌లో ఫైటింగ్ ఉందీ!!!! ఎంత చెప్పినా తక్కువే!! అందుకే అంతరిక్ష స్థాయి అవార్డులు ‘కుప్పలుకప్పలు’గా రావాల్సిన సినిమా ఇది. మొత్తానికి ఇన్నాళ్ళకి ఒక డిజర్వింగ్, మెస్మరైజింగ్, హైయ్రిర్ రైజింగ్,హై రైజ్, సూపర్లేటివ్, స్లిప్పెరేటివ్ మోటివేటివ్ సినిమాకు అవార్డిచ్చి అవార్డింగ్ కమిటీ తమ కమిట్మేంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమని తామే గౌరవించుకున్నారు. తమకు తామే అవార్డిచ్చుకున్నారు.
ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలి. విద్యార్ధుల న్యూ సిలబస్‌లో మహిళా సాధికారికతకు ఈ సినిమాను పాఠంగా చూపాలి. ఆడిన మాట తప్పని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆధునిక ’బగ్మంత్ చీదరి’ గురించి పరిశోధనలు చేయాలి.
ఇకపై తెలుగు సినిమాలన్నీ ఇలాగే ఉత్తమంగా రూపొందాలి. ఈ స్థాయి తగ్గకుండా కళాకారులంతా తమ కళను కాపాడుకోవాలి. ఇలాంటి అత్యుత్తమ సినిమాలతో మన సినీ పరిశ్రమ ‘బగ్మంత్ బ్లెస్సింగ్స్’ పొందాలి.
ఇంకా ఎంతో రాయాలన్న ఆవేశం వుంది కానీ, అంత వేశం లేదు, అదే, అంత సన్నివేశం లేదు. కాబట్టి ఇంతటితో ముగిస్తూ, భవిష్యత్తులో ప్రతి అవార్డూ ఇలాంటి సృజనాత్మకావేశాన్ని కలిగించే, రగిలించే, పొంగించే సినిమాలకే ఇవ్వాలని ‘బగ్మంత్ దుర్మతి’ సాక్షిగా సినిమా అవార్డు కమిటీలన్నిటినీ అభ్యర్ధిస్తున్నాను.
రాత తరువాత రాతః ఉత్తమ నటుడి అవార్డు చక్కటి నిర్ణయం. చొక్కాల్లేకుండా కండలు చూపిన అరవై ఏళ్ళ జవాన్, జాలీ మాన్‌కు ఇవ్వటం సముచితం. అలాగే చిన్నటి సన్నటి బికినీలో గొప్పగా నటించిన దీపికా బికినీకి ఉత్తమ నటి, ఢాకినీబికినీకి ఉత్తమ కాస్ట్యూమ్స్ అవార్డులిస్తే అవార్డుల ‘సిగ్గు శోభ’ ఇనుమడించేది. ఉత్తమ నటనకూ, దుస్తుల డిజైనింగ్ కూ ఆదర్శంగా వుండేది.
~
క్షమించాలి. ఎందుకో ఆవేశం హద్దులు దాటిందో, ఆనందాక్రోశం అవధులు మీరిందో, సంతోషం సామగానం చేసిందో, ఆనందాశ్రువుల తుఫాను నీళ్ళు కళ్ళకడ్డుపడ్డాయో కానీ, చాలా అప్పుతఛ్ఉలొఛ్ఆయి. ఎంత ప్రయత్నించినా సరి చేయలేకపోయాను. ఎడిటర్ కూడా చేతులెత్తేశారు. కాబట్టి నా ఆనందావేశాశ్రువులకు నన్ను క్షమించి, తప్పులన్నిటినీ సరిగ్గా చదువుకోవలెను. ధన్యవాదాలు.ఇట్లు
మీ.. బగ్మంత్ పొగడరి.