Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భగవంతుని స్వరూపం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని స్వరూపం’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 13వ అధ్యాయం, 15 వ శ్లోకం:
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ॥

ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ భగవంతుడు గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. భగవంతుడికి దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు, అన్ని ద్వందాలకు, గుణాలకు అతీతుడు అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే అన్నది పై శ్లోకం భావం.

స్వామి వివేకానంద ఒక సందర్భంలో విశ్వం అనేది దేవుని స్వరూపమే అని అన్నారు. దేవుడు తన చేత సృష్టించబడిన ఈ విశాల విశ్వంలో అణువణువునా, ప్రతిదానిలో ఉన్నాడు, ప్రతిదీ దేవుడే. దేవుని వెలుపల ఏదీ లేదు, మరియు దేవుడు విశ్వం వెలుపల లేదా భిన్నంగా లేడు. మన చుట్టూ మనం చూసేది – ప్రజలు, జంతువులు, వస్తువులు – దేవునిలో భాగమే అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అదే ఏకత్వ భావన అంతే. ఈ సృష్టిలో ప్రతీ వస్తువు, జీవి కూడా భగవంతుని కంటే వేరైనది కాదు. స్థూలంగా చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టి అంటే ఆయన యొక్క విరాట్ స్వరూపమే.

ఈ ప్రపంచంలో మనం చూసే అన్ని రూపాలు దైవత్వ స్వరూపాలే. ఈ విశ్వంలో దైవికం కానిది ఏదీ లేదు.  కాబట్టి మనం విశ్వంలోని వివిధ వస్తువులను కేవలం వస్తువులుగా భావించకుండా  వాటిని ‘దైవత్వం యొక్క స్వరూపాలు’గా పరిగణించమని పై శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ నర్మగర్భంగా చెప్పారు. కాని అందరిలో అన్నింటిలో వుండే భగవంతుడి దర్శించడం మాని, ఎక్కడో ఆయన వున్నాడనుకొని, పుణ్య క్షేత్రాలలో, నదీ నదాలలో వెదుకుతూ కాలం, ధనం వ్యయం చేస్తున్నాం. మనం  ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడు కాబట్టి, విశ్వంలోని ప్రతిదాన్ని ‘దైవత్వం యొక్క స్వరూపాలు’గా పరిగణించడం అత్యంత అవసరం. విశ్వం దేవుని రూపం మాత్రమే! దేవుడు అన్ని రూపాల్లో వ్యక్తమవుతాడు. అటువంటి సర్వవ్యాప్త దైవత్వాన్ని దేవుడిగా పరిగణించాలి. సాధనలో భాగంగా ఏ వస్తువు యొక్క బాహ్య రూపాన్ని విశ్వసించకుండా ఆ వస్తువులో అంతర్లీనంగా ఉన్న దైవిక శక్తిని దృఢంగా నమ్మమని శాస్త్రాలు మానవాళికి దిశానిర్దేశం చేస్తున్నాయి.

Exit mobile version