[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని సమానత్వ భావన’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 9వ అధ్యాయం, 32వ శ్లోకం:
మాం హి పార్థ వ్యాశ్రిత్య యేపి స్యు: పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేయపి యాంతి పరాం గతిమ్
ఓ అర్జునా! నన్ను ఆశ్రయించే వారందరూ, వారి పుట్టుక, జాతి, లింగం లేదా కులం ఏదైనా, సమాజం తృణీకరించే వారు కూడా, పరమ గమ్యాన్ని చేరుకుంటారు అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు.
భక్తిలో జాతి, కుల మత, ప్రాంతీయ బేధాలు వుండవని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. అటువంటి తన పర బేధాలు భౌతిక భావనలకే కాని ఆధ్యాత్మిక భావనలకు కాదు. భక్తియుత సేవతో నిమగ్నమైన వారు ఎటువంటి జాతి, లేదా మతం లేదా ప్రాంతానికి చెందినవారైనా కూడా భగవంతుని కృపకు అర్హులు అవుతారు. భగవంతుడు చూసేది ఎప్పుడూ కూడా భక్తుని చిత్తశుద్ధి, పాత్రత, హృదయ స్వచ్ఛతలు మాత్రమే. మనం కల్పించుకున్న ఈ ధనిక, పేద, కుల మత జాతి బేధాలకు అతీతంగా సమత్వ భావనతో అందరికీ పక్షపాత ధోరణి లేక కర్మ ఫలాలను భగవంతుడి అందిస్తాడనే భగవానుడి వాక్యానికి ఈ శ్లోకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
గుణాలను అనుసరించి వేదం మానవులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య , శూద్ర జాతుల కింద విభాగించింది. అయితే అతి తక్కువ జాతులకు చెందిన కన్నప్ప, భక్త తుకారాం, నాందేవ్ వంటి ఎందరినో భగవంతుడు వారి స్వచ్ఛమైన భక్తికి మెచ్చి వారికి మోక్షం అనుగ్రహించిన వైనాలు చత్రిత్రలో కనిపిస్తాయి. భక్తియోగం అత్యంత శక్తివంతమైనది అవడం వలన సమస్త మానవాళితో పాటు నోరు లేని జీవాలను సైతం వారి వారి భక్తి భావాలను అనుగుణంగా భగవంతుని కృపకు పాత్రులను చేస్తుంది. అయితే ఇందుకు కావలసింది చిత్తశుద్ధి, పవిత్ర హృదయం మరియు సంపూర్ణ సర్వశ్య శరణాగతి మాత్రమే.
నియమ స్వార్థాన్ని వీడి ఉన్నంతలో సత్కార్యాలు ఆచరించడమే ముక్తికి మార్గం. ‘నిజాయతీతో కూడిన సత్ప్రవర్తనతో జీవించడం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, మంచి నడవడిక కలిగి ఉండడమే భగవంతుని చేరేందుకు ఏకైక అర్హత’ అన్నది గురునానక్ సందేసం కూడా.
భగవంతుడు జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్ కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. పద్మపురాణంలో ‘న దేశ నియమస్తస్మిన్ న కాల నియమస్తథా’ అనే ఒక వాక్యం వుంది. దీని ప్రకారం మనం భక్తి చేసే సమయం లేదా ప్రదేశం గురించి దేవుడు పట్టించుకోడు. ఆయన మన హృదయంలోని ప్రేమను మాత్రమే చూస్తాడు. అన్ని ఆత్మలు దేవుని పిల్లలే, మరియు వారు నిజమైన ప్రేమతో ఆయన వద్దకు వస్తే, ఆయన ప్రతి ఒక్కరినీ సమానత్వ భావనతో స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు.
భగవన్నామం పేద, ధనిక, విద్యావంతుడు, అజ్ఞాని అన్న తేడాలను చెరిపేస్తుంది. సమానత్వ భావనను ప్రేరేపిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా, ఏ భాషలోనైనా భగవన్నామాన్ని జపించవచ్చు. ఉదాహరణగా, హనుమాన్ చాలీసాలో చెప్పినట్టు:
“రామకాజ కరిబే కో ఆతురా, ప్రభు చరిత్ర సునిబే కో రసియారా.”
ఇది భగవంతుడితో ఒకరికి ఒకరిని సమానంగా అనుభూతి చెందే సాధన.
భగవంతుడికి ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉంటే భక్తి మార్గం ఆచరణలోకి రాదు. దీనికి రెండు ఆటంకాలు ఉన్నాయి. భగవంతుడికి భక్తులకు మధ్యవర్తులు ఉన్నారు. సమాజంలో కుల అంతరాలు ఉన్నాయి. అందుకే రామానుజుడు విష్ణు మంత్రాన్ని ఆలయం గోపురం మీదికి ఎక్కి అందరికీ వినిపించాడు. అంతకాలం రహస్యంగా ఉన్నదాన్ని బహిరంగం చేశాడు. భగవంతుడ్ని చేరుకోడానికి మధ్యవర్తుల సాయం అక్కర లేదు. కుల అంతరాల నిమిత్తం లేకుండా అందరూ భక్తి మార్గానికి వచ్చేందుకు అర్హులే.. అని రామానుజుడు ప్రవచించారు.