[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని నిస్వార్ధ సేవ’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్రీ మద్భాగవతం 4.31.14 వ శ్లోకం
యథా తరోర్మూలనిషేచనేన
తృప్యన్తి తత్కన్ధభుజోపశాఖాః।
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం
తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా॥
చెట్టు మూలానికి నీరు పోయడం ద్వారా కొమ్మలు, రెమ్మలు, ఆకులకు కావాల్సిన ఆహారం అందించి తద్వారా వాటిని సంతృప్తి పరచడం జరుగుతుంది. అదే విధంగా భగవంతుని దివ్యమైన సేవలో నిలవడం ద్వారా మానవుడు ముక్కోటి దేవతలను, ఈ సృష్టిలో వున్న అసంఖ్యాక జీవులను కూడా సంతృప్తి పరచినవారం అవుతాము. కాబట్టి మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కరు తమ తమకు విధించిన కర్మలను, విధులను, బాధ్యతలను నిర్వర్తిస్తునే భగవంతుని నిస్వార్థ సేవలో చిత్త శుద్ధిలో తరించమని భాగవతంలో పై శ్లోకం ద్వారా వ్యాసభగవానుడు మానవాళికి ఒక అపూర్వమైన సందేశం ఇచ్చారు.
భగవంతుడు ప్రతి జీవిలోనూ నివసిస్తున్నాడు. తోటి మనుషులకు నిస్వార్థంగా సేవ చేయడం అనేది భగవంతుణ్ణి ప్రేమించినట్టు. ‘నేను’ అనే అహంభావం లేకుండా చేసే సేవే నిజమైన నిస్వార్థ సేవ. అదే మానవ జన్మకు పరమార్థంగా మారాలి. ‘నేను’, ‘నాది’ అనే భావాలే భగవంతుడితో భక్తుడి మధ్య నిలిచే అడ్డుతెర. ఆ తెర తొలగినపుడే భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుంది.
మన జీవన లక్ష్యం భగవంతునిలో ఐక్యత సాధించడమే. కానీ కొన్ని లక్షల మందిలో ఒకరే తమ శరీరాన్ని, జీవితాన్ని భగవంతుని ప్రేమకు అంకితం చేస్తారు. అటువంటి అంకితభావంతో ఉండే వారికే భగవదైక్యం సాధ్యమవుతుంది.
ఇతరుల కోసం చేసే సేవా కార్యక్రమాలు పూర్తిగా నిస్వార్థంగా ఉండాలి. ప్రతిఫలం కోసం కాకుండా, పేరు కోసం కాకుండా చేయాలి. ఆర్భాటాలు లేకుండా, ప్రజారంజకంగా కాకుండా చేయాలి. చేసిన ఉపకారాన్ని వెంటనే మర్చిపోవాలి – అదే భగవంతుడికి ప్రీతికరమైన ధర్మం. మానవులకు సేవ చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. మన చేత పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, ఆయన మనను కాపాడుతూ ఉంటాడు.
నిస్వార్థ సేవ ద్వారా మనలోని అన్ని దోషాలు తొలగిపోతాయని, మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి నిస్వార్థ కర్మకు భగవంతుడు నిజమైన ఫలితాన్ని ప్రసాదిస్తాడన్న విషయాన్ని మరిచిపోకూడదు.
భగవంతుడిని పూజించేవారు, ఆరాధించేవారు చాలామందే ఉన్నారు. కానీ అవకాశం వచ్చినపుడల్లా ఆయన సేవలో పాల్గొనడం, అంకితభావంతో చేయడం అవసరం. ఏ పని చేసినా, అది హృదయపూర్వకంగా, భక్తితో చేయాలి. సమర్పణ భావంతో చేసిన ప్రతి కార్యాన్నీ భగవంతుడు గుర్తిస్తాడు, దానికి తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు.