[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని అత్యుత్తమ ఆరాధనా మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 12వ అధ్యాయం (భక్తి యోగం) 3,4 శ్లోకాలు:
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే।
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్॥ (3)
సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ॥ (4)
ఈ ఆద్యాయంలో 3వ, 4వ శ్లోకాలు ఒకదానికొకటి కొనసాగింపు కాబట్టి రెండు శ్లోకాలను కలిపి విశదీకరించడం జరుగుతుంది.
ఓ అర్జునా, ఎవరైతే నిరాకారమైన పరమ సత్యాన్ని, అవినాశి, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, సర్వవ్యాప్తమైన, ఊహించశక్యం కాని, మార్పుచెందని, శాశ్వతమైన మరియు చలనం లేని, ఈ సృష్టి సమస్తం నశించినా, ఎన్నటికి నాశనం చెందనట్టి నిరాకార తత్త్వాన్ని – తమ అన్ని ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ నిత్యం నా చింతనలోనే సమయం గడుపుతూ, సర్వశ్య సరణాగతి భావనతో నన్ను ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.
ఇంద్రియాల అవగాహనకు అతీతంగా ఉన్న, సర్వవ్యాప్తమైన, ఊహించలేని మరియు స్థిరమైన – పరమ సత్యం యొక్క వ్యక్తిత్వం లేని భావనను – పూర్తిగా ఆరాధించే వారు – వివిధ ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా మరియు అందరి పట్ల సమానంగా వైఖరి కలిగి ఉంటారు, అటువంటి వ్యక్తులు, అందరి సంక్షేమంలో నిమగ్నమై, చివరికి నన్ను సాధిస్తారు అంతే నా శాశ్వత సాన్నిధ్యం పొందుతారు అని భగవానుడు పై రెండు శ్లోకాల ద్వారా తెలియజేసాడు.
పైన వర్ణించిన విధంగా సాధకులు ఆర్తితో, తపనతో, సచ్చీలతతో, పవిత్రమైన మనస్సుతో భగవంతుని ఆరాధిస్తే వారు భగవంతుని ప్రీతికి పాత్రులవుతారు. వారి జీవన ప్రయాభం సాఫీగా, ఎట్టి ఒడిదుడుకులు లేక సాగిపోతుంది.
పరమాత్ముడు రూపంతో మరియు రూపం లేకుండా ఉంటాడు (సగుణం మరియు నిర్గుణం), కాబట్టి భగవంతుడిని ఏ విధంగానైనా ఆరాధించవచ్చు. ఈ రెండు రకాల పూజల లక్ష్యం ఒకటే. పూజా విధానం ఏదైనా, దానిని విశ్వాసం మరియు భక్తితో ఆచరిస్తే, మనిషి పరమాత్మను చేరుకుంటాడు. సాధకులకు మనస్సు యొక్క స్వచ్ఛత, స్వీయ నిగ్రహం, సమానత్వం మరియు అన్ని జీవుల పట్ల ప్రేమ లేకపోతే, అతని ప్రయత్నం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. ఈ సద్గుణాలు లేకుండా, బ్రహ్మ సాక్షాత్కారం అసాధ్యం అని తెలుసుకోవాలి. ఈ సృష్టిని సృష్టించిన పరమాత్మ ఒక్కటే. అదే పరబ్రహ్మం, అది సాకారసగుణంగా వ్యక్తంగానూ ఉన్నది; నిరాకార నిర్గుణంగా అవ్యక్తంగానూ ఉన్నది. సగుణోపాసన అయినా – నిర్గుణోపాసన అయినా అంతిమలక్ష్యం ఆ పరమాత్మను చేరుకొనుటే. నిర్మలమైన భక్తితోను, శ్రద్ధతోను నిరంతరము భగవంతుని యందే మనస్సు నిలిపి ఎలా ధ్యానించినా – ఎలా ఉపాసించినా ఆ పరమాత్మను చేరుకోవటం తథ్యం అని గీతాచార్యుడు మానవులకు సాధనా మార్గాన్ని విశదపరిచాడు.
సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమిస్తూ వుంటుంది. అందుకే వేదం మనస్సును ఒక కోతితో పోల్చింది. అటువంటి మనస్సును దాని మానాన విదిలేస్తే అది మనలను చిత్రవధకు గురిచేస్తుంది. కాబట్టి అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, దానిని, పరమాత్మ యందే స్థిరముగా వుండేటట్లు అభ్యాస, వైరాగ్యాల చేత ప్రయత్నించాలి. సాధకుడి తమలో పూర్తి స్వీయ నిగ్రహం, సమాన మనస్తత్వం, సార్వత్రిక ప్రేమ, సర్వశ్య శరణాగతి అనే లక్షణాలను విధిగా పెంపొందించుకోవాలి.