[డా. కర్నాటి లింగయ్య రచించిన ‘భగవంతుడు అంతట ఉన్నాడు’ అనే కథని అందిస్తున్నాము.]


పార్వతమ్మ ప్రతిరోజు తన కుమారుడు కృష్ణమూర్తికి రాత్రి పడుకునే ముందు కథలు చెప్తుంది.
ఓ రోజు రాత్రి కృష్ణమూర్తి తన తల్లిని “అమ్మా, దేవుడు ఉన్నాడా?” అని అడిగినాడు. వెంటనే “భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు” అని తల్లి చెప్పింది.
“ఎక్కడ? కనిపించడం లేదుగా?” అని కొడుకు అన్నాడు.
“భగవంతుడు మనకు కనిపించడు. కానీ మన పనులన్నిటిని గమనిస్తూ ఉంటాడు” అని చెప్పింది తల్లి.
కొడుకు తల్లి చెప్పిన మాటలను జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నాడు.
రెండు మూడు రోజులలో వేసవికాలం సెలవులు పూర్తి అయిన తర్వాత పాఠశాలలను ప్రారంభిస్తారు. అందుకే ఓ రోజు కుమారుని వెంటబెట్టుకొని అన్ని రకాల బట్టలు లభించే ఒక పెద్ద దుకాణమునకు తీసుకొని వెళ్ళింది. అక్కడ దుకాణంలోనే గుమస్తాలు చాలా రకాల బట్టలు చూపిస్తున్నారు. అందులో ఆమె కుమారునికి నచ్చినవి కొన్ని బట్టలు తీసి పక్కకు పెట్టింది. ఇంతలో దుకాణ గుమస్తాలకు లంచ్ టైం అయింది. “మీరు కూర్చోండి నేను అన్నం తిని ఐదు నిమిషాల్లో రాగలను” అన్నాడు.
అతను వెళ్ళగానే తల్లి రెండు బట్టలు తన బ్యాగులోనికి పెట్టబోడం కృష్ణమూర్తి చూశాడు. వెంటనే “అమ్మా, ఆగమ్మా” అన్నాడు.
“ఎందుకురా, ఎవరైనా చూస్తున్నారా ఏంటి?” అని అడిగింది తల్లి.
“అవునమ్మా. చూస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి దుకాణంలో, కొంతమంది ధనికులు గృహములలో సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు. దొంగతనం చేసిన వారిని దాని ద్వారా కనుగొంటున్నారు. శిక్షిస్తున్నారు. అంతేకాదు, భగవంతుడు అన్ని చోట్ల ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు అని చెప్పావు గదమ్మా. అలాంటప్పుడు నువ్వు బట్టలు మన బ్యాగులు పెట్టుకుంటే సీసీ కెమెరాలలో కూడా కనిపిస్తుంది! అంతేకాదు నీవు చెప్పినట్లుగా భగవంతుడు కూడా చూడకుండా ఉంటాడా?” అన్నాడు.
పార్వతమ్మ తన కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయి తన తప్పును తెలుసుకొని బట్టలు చేతిలో నుంచి అక్కడ పెట్టేసింది. దొంగతనం చేయకుండా తన పరువును కాపాడుకుంటూ తను తెచ్చిన డబ్బులు పెట్టి కుమారునికి ఒక జత బట్టలు ఖరీదు చేసింది. ఇద్దరూ తృప్తిగా ఇంటికి వెళ్లారు.
నీతి: భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మరియు సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త.