Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆధ్యాత్మిక దివ్య సౌందర్యానికి అనువాదపు మైపూత ‘బెంగాలీ బౌల్ కవిత్వం’

[శ్రీ ముకుంద రామారావు అనువదించిన ‘బెంగాలీ బౌల్ కవిత్వం’ అనే కవితా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

బౌల్ కవిత్వం ప్రధానంగా బెంగాల్ కు   చెందినది. బౌల్ సంగీతమంటే అసామాన్యమైన జానపద పాట. హిందూ భక్తి ఉద్యమంతో పాటు సూఫీ ప్రభావం కూడా అందులో కనిపిస్తాయి. బౌల్‍లు ప్రధానంగా సాధువులు. వారు ఏ మతం వారైనా కావచ్చు. మనిషి లోని ఆవశ్యక మనిషిని వెతుకుతారు, ‘మునేర్ మానుష్’ కోసం అన్వేషిస్తారు. ఇతరులు దీన్ని అంతరాత్మ అంటారు. వారిని నడిపించేది మేధస్సు కాదు, మనసు హృదయం అంటారు అనువాదకులు. మానవుడు దైవిక శక్తి ప్రసాదించిన కానుక అనీ, శరీరం ఓ దేవాలయమనీ, సంగీతం ఆ శక్తిని చేరేందుకు మార్గమని బౌల్‍ల విశ్వాసం. బౌల్‍లు బోధకులు కారు. కేవలం గాయకులో, ప్రదర్శకులో కూడా కాదు. వారికి సంగీతం ఆధ్యాత్మికత వైపుకి తీసుకువెళ్ళే ఒక సాధనం, ఒక మార్గం. బెంగాల్ సంస్కృతీ, సాహిత్యాలపై బౌల్‍ల ప్రభావం అమేయం! కొందరు బౌల్ కవుల కవితలని పరిశీలిద్దాం.

~

బౌల్ కవిత్వ ప్రభావంతో రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసిన కవితల్లో నాకు ఇది బాగా నచ్చింది. “నా మనసు మధ్య నువ్వు దాక్కుని ఉన్నావు/నేను నిన్ను చూడలేకపోయాను, చూడలేకపోయాను/బయట అంతటా వెతికాను, బయట అంతటా/నా మనసునే తేరిపార చూడడం మరచిపోయాను”. ఇవి రమణ మహర్షి చెప్పిన ఆత్మవిచారణకు, ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు దారితీసే వాక్యాలుగా తోచాయి.

గగన్ హర్కర అనే పోస్ట్‌మాన్ సృజించిన బౌల్ కవితల్ని టాగోర్ అనువదించారు. “నీ కళ్ళ అతిథిగా, నీ ఇంటికి అతనిని తీసుకురావద్దు/కాని అతనిని నీ హృదయ ఆహ్వానితునిగా రానివ్వు/నీ తలుపులు వానికి తెరువు, చూడడానికీ, కోల్పోవటానికి”. ఎంత లోతైన భావన! ఆధ్యాత్మిక అనుభూతిని కేవలం దృశ్యేంద్రియానికే పరిమితం చేయకుండా, హృదయాంతర్గతం చేసుకోవాలనీ, దానిలో ఉనికిని కోల్పోవాలని సూచిస్తోందీ కవిత.

మనిషిలోనే దైవం ఉంటాడన్న భావనని లాలన్ షా ఫకీర్ రెండు కవితల్లో చూడచ్చు. ‘నా జీవితంలో ఎన్నడూ’ అనే కవితలో “నా జీవితంలో ఎన్నడూ/ఎదురుపడలేదు ఒక్కసారైనా/నా సొంత చిన్న గదిలో/నివసిస్తున్నవాడిని” అన్నారాయన. ‘నాకు తెలియని అతనూ, నేనూ’ అనే కవితలో, “నాకు తెలియని అతనూ, నేనూ/కానీ శూన్యంలో/మా మధ్య/ఒక పది లక్షల మైళ్ళు” అంటారు. ఇక్కడ శూన్యమంటే ఆకాశమో, దేవతల లోకమో కాదు, భౌతికతకీ, ఆధ్యాత్మికతకీ ఉన్న ఎడం!

ఆధ్యాత్మిక పథంలో పయనించేవారు కామానికి ఎంత దూరంగా ఉండాలో ద్విజు కైలాశ్చంద్ర కవిత ‘ఎన్నడూ’ చెబుతుంది. “ఎన్నడూ/కామం నదిలో మునగొద్దు/తీరాలకు నువ్వు చేరవు/తీరాలు లేని/తుఫాన్లు రేగే నది అది” అనే ఈ కవిత – సాధకులకు కోరికలెంత ప్రమాదకరమైనవో చెబుతుంది.

శ్రేయస్సునిచ్చే సత్యం కన్నా ఆకర్షించే అసత్యాన్నే జనాలు కోరుకుంటారని గోబిందదాస్ అన్నారు. “నీ శ్రోతల్ని తెలుసుకొని/నీ మాటల్ని ఎన్నుకో/నువు సత్యం మాటాడితే/కర్రతో నిన్ను కొడతారు/అసత్యం నువు మాటాడితే/ప్రపంచాన్ని నువు అకర్షిస్తావు” అన్నారాయన. ‘నేను’ గురించి ఈయన చెప్పిన వాటికి తెలుగు అనువాదం అద్భుతంగా వచ్చింది (పేజీ 92-93).

దివ్యస్వరాన్ని వింటున్నప్పుడు కలిగే అనుభూతిని ఇషాన్ జుగి అద్భుతంగా చెప్పారు. “నాకు విచారమన్నదే లేదు/నేను పూర్తిగా ముగించినా/నేను నా కోసం ఏమి కోరుకోగలను ఎక్కువగా/అటువంటి స్వరమాధుర్యంతో కొట్టుకుపోవడం కంటే” అన్నారు.

నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతే భగవంతుడిని తెలుసుకోలేవని అన్నారు కాలాచంద్. “నువు గుర్తించలేకపోతే/నీ సొంత హృదయాన్నే/ఎప్పటికైనా నువు తెలుసుకోగలవా/ఆ గొప్ప అజ్ఞాతుడిని” అన్నారాయన.

నీ దేహంలోనే నివసిస్తున్న/ఆ సహజ మానవుని/ఎరుక నీకు లేకపోతే/జీవితం ఏమి గొప్ప” అంటూ ప్రశ్నిస్తారు నితయిదాస్. గాజుముక్క కోసం బంగారాన్ని వదులుకోవద్దని సూచిస్తారు.

అనుభూతి రహస్యం/నా హృదయమా/నిన్ను తెలుసుకోవడమే” అన్నారు పదం లోచన్ (పొదా). మూడు పాదాలలో ఎంతటి గాఢమైన భావనని ఇమిడ్చారో!

భగవంతుని సన్నిధికి చేరాలంటే భౌతికమైన బంధాలకు దూరంగా ఉండాలని శశాంకొ గోసాయి చెప్తారు. “నువు చేరాలనుకుంటే/ఓ వెర్రి హృదయమా/హరి ప్రదేశానికి/ నువు చేరాలనుకుంటే/అనుబంధాల గదికి తాళం వేయు”. ఎంతటి సరళమైన సూచనో కదా!

కోరికలు మానవుల్ని ఏ రీతిలో బంధిస్తాయో ఒదిన్ శరత్ అద్భుతంగా చెప్పారు. “చితి మంటలో మాత్రమే మనిషి పూర్తిగా దగ్ధమైపోతాడు/దాని పట్టులో ఉన్నంత కాలమూ కోరిక మంట దహిస్తూనే ఉంటుంది”. పెద్దగా వివరణ అక్కర్లేని సత్యమిది.

~

మూల కవులు ఎవరో తెలియకపోయినా, తరతరాలు కొన్ని బౌల్ కవితలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం.

సంవేదనల పూలను/కన్నీళ్ళ ప్రార్థనల్ని/అతని పాదాల మీద ఉంచాను/అతనిని వెతకడానికే/మరణంతో మరణిస్తూ/బ్రతికే ఉన్నాను”. ఈ కవిత చదివినప్పుడు కొందరికి అనుమానం రావచ్చు, మరణిస్తే, బతికి ఉండడం ఎలా అని. మన శరీరంలో రోజూ ఎన్నో కణాలు నశిస్తూ, కొత్త కణాలు జన్మిస్తూనే ఉంటాయి. కానీ మనకి తెలియదు. అవి మరణిస్తున్నా, మనం బ్రతికి ఉన్నాం కదా! కవి అంతరార్థం అదేనేమో!

~

తరువాత బౌల్ స్త్రీల గురించి వివరించారు అనువాదకులు. బౌల్ సంగీతపు రాణిగా ప్రసిద్ధురాలైన రీనా దాస్ గురించి, పార్వతి బౌల్ గురించి సంక్షిప్తంగా తెలియజేశారు. పార్వతి బౌల్ రాసిన మూడు కవితల అనువాదాన్ని అందించారు. మురళీధరుడిపై ఆమె రాసిన కవిత ఆకట్టుకుంటుంది.

~

ఈ కవితలని చదివి, వాటి సారాన్ని గురించి లోతుగా చింతన చేస్తుంటే, ఏదో తాదాత్మ్యపు భావన కలుగుతుంది. ఆధ్యాత్మికత లోని దివ్య సౌందర్యం కళ్ళకు కడుతుంది. ఆ సౌందర్యానికి అనువాదమనే మైపూత పూసి మరింత సొగసుగా మార్చి పాఠకులకు అందించారు ముకుంద రామారావు గారు. అనువాదకులకు, ప్రచురణకర్తలకు అభినందనలు.

***

బెంగాలీ బౌల్ కవిత్వం
అనువాదం: ముకుంద రామారావు
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్
పేజీలు: 186
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఛాయా రిసోర్స్ సెంటర్, ఫోన్: 7093165151
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/BENGALI-BAUL-KAVITVAM-MUKUNDA-RAMARAO/dp/B0BW49RY9X

Exit mobile version