Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ వైఫ్..

[శ్రీమతి అక్షర రచించిన ‘బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ వైఫ్..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

క ప్రైవేట్ విద్య సంస్థలో నేను సంస్కృత సాహిత్య ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న రోజులు అవి. అప్పటికి మా అమ్మాయి మా విద్యా సంస్థ లోనే రెండో తరగతిలో చదువుకుంటున్నది.

ఆ రోజుల్లోనే పెద్ద తరగతి వారికి పరీక్షలు మొదలైనాయి. ఆ రెండో రోజు మా అమ్మాయికి ఫీవర్ ఉండటం వల్ల, నాకూ మా వారికి ఇద్దరికీ సెలవు లేనందువల్ల మా అమ్మాయిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి మా ఉద్యోగానికి వెళ్ళిపోయాము. తీరా, నా డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చిన నాకు హై ఫీవర్ వల్ల సొమ్మసిల్లి పడి ఉన్న మా పాపని చూసేసరికి మతిపోయింది. ఆ సంఘటన తరువాత ఇంక మా అమ్మాయి కొంచెం పెద్ద అయ్యేదాకా ఇంటి బయటకు వెళ్ళి ఉద్యోగం చెయ్యకూడదు అని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నా తోటి ఉద్యోగస్థులు తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఎంతగానో చెప్పారు. కానీ నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోలేదు.

విద్యాలయంలో విషయం తెలిసి, నా శిష్యులు వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడినప్పుడు భావోద్వేగం అడ్డు పడుతుంటే చాలా కష్టమే అయింది నా నిర్ణయం అమలుపర్చటం. ఇటు తల్లిగా పూర్తి న్యాయం చేయలేక అటు సగం మనసు పెట్టి ఉద్యోగం చేయవల్సిన అవసరం దేముడి దయ వల్ల లేనందున నా నిర్ణయంపై నిలబడగలిగాను. అదే ఇంట్లో పరిస్థితి వ్యతిరేకంగా ఉంటే ఏం చేద్దునో తెలీదు. మావారు నన్ను ఎప్పుడు ఉద్యోగం చేయమని కానీ వద్దని కానీ నిర్బంధించలేదు. అందుకే తేలిగ్గా ఒక నిర్ణయానికి రాగలిగాను.

విద్యార్థులకు నా వల్ల ఇబ్బంది కలగకూడదని, వారికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఇంటి నుంచే వారికి సాయం చేస్తానని ధైర్యం ఇచ్చి ఉద్యోగం విరమించాను.

***

ఆకాశంలో మేఘాలు ఒకటొకటి తొలగి మధ్య నుండి ఒక ఉషాకిరణం పెద్దదై నలు వైపులా వ్యాపిస్తూ ఒక అందమైన ఆకృతిని ధరించి, ఎదురు వేదికపై! దర్శకుల ఎనలేని కరతాళ ధ్వని మన్ననల మధ్య ఇహలోకం లోకి వచ్చి చూస్తిని కదా ఆ ఆకృతి ఎవరో కాదు, మా ప్రతిరూపమైన ‘మహతి’ అని గ్రహించాను. నేటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతి అందుకుంటూ కనిపించిన మహతిని చూసి ఆనందంతో నా కళ్ళు అనాయాసంగా చెమ్మగిల్లాయి. నేను కళ్ళు అద్దుకుంటుంటే మా వారు కూడా అటువంటి అనుభూతికే లోనవుతూ వేదిక నుంచి కళ్లు తిప్పుకోలేక అటే చూస్తూ ఉండిపోయారు.

‘దశావతారాల’ని నృత్య నాటికగా రూపొందించి కొన్ని నెలలుగా తన సహ నృత్యకారిణులతో కలసి ఎడతెరిపి లేకుండా కష్టపడి, ఈనాడు వేదికపై ప్రదర్శించారు మహతి, వారి బృందం, దగ్గర దగ్గర రెండు గంటల కాలం. టి.వి. షోలు, రియాలిటీ షోలు, వెబ్ సెరీస్‍లలో మునిగి తేలుతున్న ప్రస్తుత జనాభా ఇటువంటి చారిత్రిక, పౌరాణిక కళాత్మక ప్రదర్శనలని ఎంత వరకు ఆదరిస్తుంది అని తెలియని రోజులు. దశావతారాలలో ప్రతి ఘట్టం ముందూ వెనక ఉన్న వివరాల్ని చదివి అర్థం చేసుకుని, నృత్య నాటికగా రూపొందించి తమ వైపు నుంచి ఎటువంటి తృటి లేకుండా వేదిక పైకి తీసుకు రావటానికి అన్నీ జాగ్రత్తులు వహించి ఫలితం మాత్రం దేముడి పై వదిలేసింది మహతి. అందుకేనేమో తను ఆశించిన దానికంటే ఎక్కువగా దర్శకగణం నుంచి ప్రశంసలు పొందుతుంటే మేమందరం కూడా సంతోషంలో మునిగిపోయాము.

దృఢమైన శిలాన్యాసంతో కట్టపడిన ఏ కళాకృతి ఐనా ఏ కాలంలో ఐనా సరే అర్థం చేసుకుని ప్రశంసించే దర్శక వర్గం మన సమాజంలో తప్పక ఉంటుందన్న సత్యం, ఈనాడు కళాపిపాసులతో నిండి ఉన్న ఆడిటోరియం చూసి తెలుసుకున్నాము.

***

ఉద్యోగ విరమణ చేసిన కొత్తల్లో చేతిలో ఉన్న మంచి అవకాశం వదులకోవటం అవివేకం కాదు కదా అని కొన్నాళు మథన పడ్డాను. ఆ రోజుల్లోనే ఒనాడు ఒక టి.వి. షోలో మంచి ఒడిస్సీ నృత్య ప్రదర్శనని మా తొమ్మిదేళ్ళ ‘మహతి’ కన్నార్పకుండా వీక్షించటం గమనించాను. అదే కాదు అటువంటి ఏ కార్యక్రమం ఐనా అంతే ఏకాగ్రతకి లోనవటం ఇంతకు మునుపు కూడా చూసిన నేను మహతిని దగ్గరకు పిలిచి “నీకు కూడా అలా డాన్స్ చేయాలని ఉందా?” అని అడిగాను. ఆ చిన్నారి కళ్ళలో ఒక మెరుపు మెరిసి అది తనకు సాధ్యమా? అన్నట్లు అబ్బుర పడుతూ చూసింది. అవును అన్నట్టు గట్టిగా తల ఊపింది. నృత్య ప్రదర్శనలు చూస్తునప్పుడు అప్రయత్నంగానే మహతి పాదాలు లయబద్ధంగా కదలటం కూడా నేను గమనించాను. నిజానికి అటువంటి లలితకళలలో మా కుటుంబంలో నా వేపు కానీ మా వారి వైపు కానీ మునుపు ఎవరికి ప్రవేశం ఉన్నట్లు ఎరగను. ఆ మాత్రాన మహీకి నృత్యంలో అభిరుచి ఉండదు అని నేను అనుకొను. ఏ కళ అయినా సరే స్వతహాగా దీక్షగా శ్రద్ధగా కృషి చేస్తే తప్పక ఫలిస్తుందని నమ్ముతాను. అంతటి మనోబలం, పట్టుదల శిష్యుల్లో ఉండాలి. మహతిలో కలిగిన ఉత్సాహం చూసి ప్రయత్నించగా, మేము ఉంటునది ఒరిస్సా రాష్ట్రం అయినందు వల్ల మంచి ఒడిస్సీ నృత్య కళాశాల దృష్టి లోకి వచ్చింది. రెండు మూడేళ్ళు దగ్గర ఉండి తీసుకు వెళ్ళి రావటం చేసామంటే, ఆ తరువాత తానే స్వయంగా వెళ్ళి రాగలదని నృత్య కళాశాలలో చేర్పించాము. నేను స్కూటర్‌పై దిగబెట్టి వస్తే మా వారు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు తీసుకు వచ్చేవారు. ప్రారంభంలో నృత్య కళాశాల నుంచి అలసిపోయి వస్తుంటే నేను ‘పాపం’ అనుకునేదాన్ని. కానీ మహీ మాత్రం అస్సలు నిరుత్సాహం చూపలేదు. శారీరకంగా మానసికంగా అటు విద్యార్థినిగా ఇటు నాట్యం లోనూ నెగ్గుకు రావాలంటే మంచి పోషణ ఉండాలని, ప్రత్యేకంగా అలాంటి ఆహారమే మహీకి ఇచ్చేదాన్ని. ఆహారం విషయంలో కానీ చదువులో కానీ ఎన్నడూ మహతి అల్లరి పెట్టకపోవటం నా అదృష్టంగానే భావిస్తాను, తరచూ తన ఈడు పిల్లల్తో వాళ తల్లులు పడే అవస్థలు విన్నాక. వారానికి రెండు రోజులు స్కూల్ నుంచి మూడింటికి తిరిగి వచ్చి భోజనం చేసి ఆనాటి హోమ్ వర్క్ చేసుకుని అరగంట విశ్రమించి ఐదు గంటలకు నృత్య కళాశాలలో దిగవిడిచి వస్తే, తిరిగి ఏడు గంటలకు మా వారు తన ఆఫీస్ నుంచి వస్తునప్పుడు తీసుకు వచ్చేవారు. మిగతా రోజుల్లో సాయంకాలం వీలు చూసుకుని ఒక అరగంటైనా కళాశాలలో ఆ వారం నేర్చుకున్న అడుగులు, ముద్రలు అభ్యసించేలా మహతికి అలవాటు చేశాను. వీటన్నింటి మధ్య గంట అయినా సమయం వెచ్చించి ఒక్కో రోజు ఎదురుగా ఉన్న పార్కులో తన తోటి పిల్లలతో ఆడుకుని వచ్చేది.

శారీరక శ్రమ ఎక్కువ అయి చదువు ఎక్కడ అశ్రద్ధ చేస్తుందో అని ఆది లోనే తనకి చెప్పి ఉంచాను – “పై తరగతుల్లోకి వెల్తున్న కొద్దీ విద్యా భారం ఎక్కువ అవుతుంది, నృత్య కళాశాల నుంచి అలసి పోయి వచ్చి చదువు అశ్రద్ధ చేస్తే మాత్రం నాట్యం మాన్పిస్తాను” అని. కానీ అటువంటి అవసరం రాలేదు. ఏమంటే పిల్లల పరీక్షల రోజులు దగ్గర పడినప్పుడు కళాశాల వారు తేలికైన క్లాసులు తీసుకుని మిగతా రోజుల్లో బాగా అభ్యాసం చేయించేవారు.

మహీకి ఇప్పుడు పద్నాలుగు ఏళు నిండాయి. నృత్య కళాశాలకి ఒక్కర్తి ఆటోలోనో, దొరికితే బస్సులోనో వెళ్ళి వస్తోంది. ఒకనాడు నృత్య కళాశాల నుంచి చాలా చికాకుతో రావటం గమనించి ఏమైందని అడిగాను. కొన్ని రోజులుగా ప్రత్యేకించి బస్సులో వచ్చినప్పుడు ఇద్దరు అబ్బాయిలు తనని వెంబడిస్తున్నారని తెలిసి ఏం చెయ్యాలో తెలీటం లేదంది. విని ఆలోచనలో పడ్డాను. ఈ వయస్సులో సామాన్యంగా అమ్మాయిలు ఎదుర్కునే సమస్యే అయినా దీనికి పరిష్కారం ఏమిటి?

“వాళ ఇళ్లు కూడా దగ్గర్లోనే ఏమో” అన్నాను.

“నేనూ అలా అనుకునే నా దారిన నేను వస్తుంటే వాళు పిచ్చి వేషాలు వేయటం మొదలెట్టారమ్మా” అంటూ మహీ అలసటగా బెడ్‌పై వాలిపోయింది.

“నాన్న వచ్చాక ఆలోచిద్దాం ఏం చేసేది. లేచి బట్టలు మార్చుకుని భోజనం చేద్దువు గాని రా.” మహీకి ధైర్యం చెప్పి నేను ఆలోచనలో పడ్డాను.

ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఆది లోనే పరిష్కరించాలి కానీ, ఎలా??? అలా అని మహీని ఇంట్లో కూర్చోబెట్టలేము కదా!! ప్రతిసారి తన వెంట ఉండటం కూడా సాధ్యం కాదు. నేనూ మావారూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. మరుసటి రోజు మహీ నృత్య కళాశాలకి వెళ్తునప్పుడు మేమిద్దరం కూడా ఐదు నిమిషాలు వ్యవధి ఇచ్చి కారులో తన ఆటో వెంట బయలదేరాము. నృత్య కళాశాల దాకా ఎవరు అనుమానస్పదంగా కాన రాలేదు. సరే అని మహీ నృత్యశాల లోపలికి వెళ్లాక మేమిద్దరం అక్కడే దగ్గర్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మహతి క్లాసు అయిపోయేవేల్టికి తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి కొంచెం దూరంగా కారు పార్క్ చేసి వేచి ఉన్నాము. కాసేపటికి మహతి మిగతా శిష్యులతోపాటు నృత్య కళాశాల వెలుపలకి వచ్చింది. కారు వైపు యథాలాపంగా చూసి మేము వెంటే ఉన్నామని గ్రహించి బస్ స్టాప్ వైపు నడిచింది. మేము ఉన్న చోటు నుంచి స్టాప్ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అప్పటికే చిన్నా పెద్దా కలిసి ఓ పది మంది దాకా వేచి ఉన్నారు బస్సు కోసం. వారిలో ఓ నలుగురు అబ్బాయిలు ఉండటం కూడా గమనించాము. కావల్సిన బస్సు వచ్చి పాసెంజర్లని ఎక్కించుకుని బయల్దేరింది నిండు గర్భిణిలా మందంగా. బస్సు మెల్లగా పయనించటం వలన మేము కూడా ఎవరికి అనుమానం రాకుండా మెల్లగా డ్రైవ్ చేయటం కష్టమే అయింది. ఒక పది నిమిషాలకి మా ఇంటి దగ్గర స్టాప్ వద్ద ఆగిన వెంటనే బస్సు ముందు ద్వారం నుంచి మహతి, వెనుక నుంచి ఇద్దరబ్బాయిలు కూడా దిగటం గమనించి కారు పక్కకి ఆపి మేము కూడా కొంచెం దూరం నుంచి వాళ్ళని వెంబడిస్తున్నాము. మా ఇంటికి వెళ్ళే దారి లోనే చిన్న మార్కెట్ వస్తుంది. అక్కడ కొంచెం జనాలు ఉన్న ప్రదేశలో మహీ గిరుక్కున్న వెనక్కి తిరిగి ఆ కుర్రాళ్ళని కోపంగా చూస్తూ “ఎప్పటినుంచో చూస్తున్నాను నన్ను వెంటాడుతున్నారు తరుచుగా..” అంది. అప్పటికి మేము కూడా వారి దగ్గరకు చేరాము. ఆ కుర్రాళ్ళని పరీక్షగా చూసాము. నునుగు మీసాలతో ఉన్నారు. అల్లరి చిల్లరగా టైమ్ పాస్ చేస్తునట్లుగా ఉన్నారు. “చూడండి అంకుల్, కొన్ని దినాలుగా వీరిద్దరు నన్ను వెంబడిస్తున్నారు..” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఊహించని పరిణామానికి మొదట తెల్లబోయి మళ్ళా తేరుకుని “అబ్బే లేదండీ మీ వెంట రావటం లేదు, మా ఇల్లు కూడా ఇటు వేపే. మీరు పొరపడ్డారు” అంటూ ఒరియా భాషలోనే సర్ది చెప్తున్నారు వాళ్ళిద్దరూ.

ఇంతలో ఇంకొద్దిమంది అక్కడ గుంపుగా చేరటంతో మా మహీ రెచ్చిపోతూ “అవునా అయితే పదండి, మీ ఇల్లు ఎక్కడో చూపండి. మీరు కూడా వస్తారా అంకుల్?” అంటూ మా వేపు చూసింది. మా వారు చూపు తోనే మహీ ని ఊరుకోపెట్టి. “పద బాబు ఈ రోజు మేము మిమ్మల్ని ఇంటి దాకా దిగబెట్టి వస్తాము” తను కూడా ఒరియాలోనే అంటూ ఒక కుర్రాడి భుజంపై చేయి వేశారు. చుట్టూ పెద్ద గుంపుని చూసి వాడు ఇక లాభం లేదని మాకు ఒక దణ్ణం పెట్టి ఇంకెప్పుడూ ఈ దారిన రామని చెప్పి వారిని వదిలేయమని అడిగారు. మహీ వేపు చూసి ఏమంటావని అడిగాము. “ఇదిగో, నన్నే కాదు మరో అమ్మాయిని అయినా ఇలా అల్లరి పెట్టారని తెలిస్తే ఇంతటితో ఊరుకునేది లేదు.” అని ఓ గట్టి వార్నింగ్ ఇచ్చి “ఈసారికి వదిలేయండి అంకుల్” అని మాతో చెప్పి వాళ్ళతో “వెళ్ళండి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా” అని అంది.

ఆ ఇద్దరిలో అయితే ఒకడు నోరు విప్పనే లేదు. వెంటనే ఇద్దరూ పరుగు లాంటి నడకతో ముందుకు వెళ్ల పోతుంటే ఆపి “అటు ఎటు మీరు ఎక్క వలసిన బస్సు స్టాప్‍కి వస్తుంది. వెళ్ళండి” అని తరిమాము. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు కనుమరుగు అయ్యాక మేము కూడా సామాన్య స్థితికి వచ్చి మహీతో పాటు కారు వైపుకి నడిచాము. అంతటితో సమస్య కనీసం కొన్నాళ వరకైనా పరిష్కారం అయినట్టే అనిపించి తేలికైన మనసుతో ఇంటికి చేరాము. ఎందుకో అప్పుడు మొదటిసారి అనిపించింది నాకు మహీకి ఒక తోబోట్టువు అయినా ఉంటే బాగుండేది అని. మాకు ఒకరే సంతానం కావాలని గాని, ఇద్దరైనా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు మేము. దేముడు మాకు ఇవ్వటమే ఒకర్ని ఇచ్చాడు. ఆనాటి నుండీ నేను ప్రయత్న పూర్వకంగా మహతితో ఇంకా సన్నిహితంగా మెలగటం మొదలెట్టాను.

పై సంఘటన అయ్యాక కూడా మేము కొన్నాళ్ళ పాటు తగు జాగ్రత్త వహించాము, ఎక్కడ ఆ కుర్రాళ్ళు పగ పట్టి మరోలా మహతిని అల్లరి పెడతారేమో అని. కానీ దేముడి దయ వల్ల అటువంటి పరిణామం ఏదీ ఎదురవనందువలన మేము మళ్ళా రిలాక్స్ అయ్యాము. అలా చిన్న ఒడుదుడుకులతో సాగిన మహతి నృత్య కళారాధన మరో అయిదేళ్ళకి వేదికపై ఒక్కర్తీ నృత్య ప్రదర్శన ఇవ్వగలిగే స్థాయికి వచ్చింది. ఈ లోపు మహీ టెన్త్, తొంభై ఎనిమిది శాతం మార్కులతో నెగ్గి ఇంటర్ ఫైనల్ ఇయర్‍కి వచ్చింది. ఆ తరువాత ఏమిటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు “నాకు నృత్యంలోనే ఇంకా ముందుకి వెళ్లాలని ఉందమ్మా. ఏదైనా తేలిక సబ్జెక్ట్ తీసుకుని డిగ్రీ చేస్తాను” అంది మహీ. ఓ క్షణం మౌనంగా ఉండిపోయాను. నృత్యాన్ని తన జీవిత లక్ష్యంగా ఎన్నుకోవడంలో తప్పు ఏమీ లేదు కానీ నృత్యం కానీ మరో లలిత కళని వృత్తిగా ఎన్నుకొని సుఖంగా జీవిత యాపన చేయటానికి ముందు మన కాలం – ధనం పెట్టుబడిగా పెట్టాక ఎప్పుడో కానీ స్థిరపడలేము, అని నా నమ్మకం.

“తల్లీ బోలెడంత కష్టపడి నీవు ఇచ్చే ప్రదర్శనలు దర్శకగణం వీక్షిస్తారు, ప్రశంసిస్తారు, బిరుదులు కూడా ఇస్తారు. జీవించటానికి సరిపడే ఆదాయం మాత్రం ఎవరికో కానీ లభ్యం కాదు. మేము పక్కన లేకపోయినా ఆర్థికంగా నువు స్థిరపడాలంటే, దానికి తగ్గ విద్య ఉండాలమ్మా. జీవితంలో నీకు ఇంక ఆదాయం చింతలేని నాటి నుంచి నాట్య కళా పోషణ ప్రారంభించు. అప్పుడు మేము కూడా నీ వెంటే ఉంటాము” అని మహతికి వివరించాను. సరే అని అర్థ శాస్త్రం ఆనర్స్‌తో పట్టా పుచ్చుకోవటానికి సంసిద్ధురాలైంది. మంచి డిగ్రీ కాలేజీలో చేరింది.

ఓనాడు కాలేజీ నుంచి తిరిగి వచ్చి టీ తాగుతూ “అమ్మా ఓ విషయం చెప్పేదా?” నా వేపు చూస్తూ అడిగింది. రాత్రికి కావల్సిన వంట పని చేసుకుంటూ “చెప్పు మహీ. నా అనుమతి దేనికి కొత్తగా” అన్నాను.

“మరేం లేదమ్మా, విని నువు ఎలా రియాక్ట్ అవుతావో అని..” ఇంకా నానుస్తున్నది మహీ. ఇక ఉండపట్టలేక “చెప్పు తల్లీ, సస్పెన్స్‌తో చంపక” అంటూ చేతిలో పని వదిలి మహీ దగ్గరకు వచ్చాను.

“నీకు గుర్తున్నారా అమ్మా, అప్పట్లో ఇద్దరు అబ్బాయిలు నా వెంట పడ్డారు..” తన మాట పూర్తవకుండానే నేను మధ్యలో అందుకున్నాను – “మళ్ళీ నీ వెంట పడ్డారా?” అని.

“అదిగో మరి, అందుకే నీకు చెప్పటానికి సందేహించాను. ఊరికే టెన్షన్ తీసుకోవద్దు. ఆ ఇద్దరిలో ఒకడు అసలు నోరు విప్పనివాడు ఇప్పుడు కాలేజీలో నా బాచ్‌మేట్. చూసి గుర్తించి నేనూ నీ లాగానే భయపడ్డాను. కానీ మా కాలేజీలో తొంభైయ్యో శాతం మార్క్స్ ఉంటేనే కానీ సీటు ఇవ్వరు కదా!!! సో అబ్బాయి మరీ అంత అల్లరి చిల్లరగా తిరిగే రకం కాదు అనుకుని ధైర్యం తెచ్చుకున్నా.” అంటూ ఏమంటావ్ అన్నట్లుగా నా వేపు చూసింది మహీ.

“నిజమే అనుకో.. అతను మంచివాడు అయినా వెంట ఉన్న రెండో కుర్రాడు మళ్ళీ అల్లరి పెడతాడేమో, జాగ్రత్తగా ఉండు.” అని నేను ఆలోచనలో పడ్డాను. మా వారికి చెప్తే “మహీ అప్పటికి ఇప్పటికీ పెద్దైంది కదా. నువు భయపడి తనని భయపెట్టకు. అలాంటి అవసరం వస్తే మనం ఉన్నాము కదా” అని నన్ను శాంతపరిచారు.

మరునాడు మహీ కాలేజీకి బయల్దేరుతుంటే ఇటువంటి అవసరాలకి ఉపయోగించే పెప్పర్ స్ప్రే ఒకటి ఇచ్చి “ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇది ఉపయోగించు, ఇది వీలు కాకపోతే ఎదురువచ్చిన వాడి రెండు కాళ్ళ మధ్య గట్టిగా తన్ను. అసభ్యులైన వారిపై దాడి చేయటానికి కరాటే రాకపోయినా నీ ధైర్యాన్ని ఉపయోగించుకో” అని ధైర్యం చెప్పి పంపించాను మహీని మర్నాడు కాలేజీకి.

నేను మాత్రం ప్రతి నిత్యం అటువంటి అవసరం రాకుండా మహీకి తోడుగా ఉండి ఎల్లవేళలా రక్షించమని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నాళ్ళు పోయాక మహీ కాలేజీ నుంచి వచ్చి చెప్పింది – “అమ్మా ఈ వేళ ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ‘మీతో రెండు మాటలు మాట్లాడవచ్చా’ అని అడిగాడు, క్లాసులు అయిపోయి బయటకు వస్తున్నప్పుడు. వెంటనే నా చేయి నువు ఇచ్చిన స్ప్రే వైపు వెళ్తుంటే ఎలాగో తమాయించుకుని అతని వేపు ఏమిటన్నట్లు చూశాను. నా చేతిలో ఈ కాయితం పెట్టి వెళ్ళిపోయాడు. ఏ లవ్ లెటరో పెట్టాడనుకుని చూస్తే పైన ‘సారీ’ అని రాసి ఉంటే మొత్తం చదివాను. ఇదిగో నువ్వు కూడా చదువు” అంటూ నా చేతిలో ఆ లెటర్ పెట్టింది.

“కొన్ని ఏళ్ళ క్రితం నేను ఎంత వద్దంటున్నా తనతో పాటూ నన్నూ మీ వెనక రమ్మని పట్టుపడితే, స్నేహం వదులుకోలేక తనతో పాటూ నేనూ ఉండేవాడిని. ఆనాడు మీరు పెట్టిన చివాట్లకి ఏమైతే అయిందనుకుని నేను వాడి స్నేహం వదిలేశాను. అయినా నేను చేసింది తప్పు అయినందు వల్ల మిమ్మల్ని క్షమాపణ అడగాలని ఉండింది. నేను చెప్పింది మీరు నమ్మితే నన్ను క్షమించిన వారవుతారు.”

చదివి తలెత్తి చూస్తే మహతి నా ప్రతిక్రియ కోసం నన్నే గమనిస్తునది.

“నమ్మక పోవటానికి కారణం ఏదీ లేదు. అయినా నువు ఎప్పటిలా సామాన్యంగానే ప్రవర్తించు. సారీ చెప్పి దగ్గర అవుదామనుకుంటున్నాడేమో” అన్నాను ఆ కాగితం తిరిగి తనకి ఇస్తూ. నా మనసు కొంచెం తేలిక పడింది. మనం భయపడుతున్నంత చౌకబారు యువత కాదని కొంత ధైర్యం కూడా వచ్చింది.

మరో మూడేళ్ళకి అర్థశాస్త్రంలో ఆనర్స్ చేసి గోల్డ్ మెడల్ పుచ్చుకుంది మహతి. వెంటనే గట్టిగా ప్రయత్నించి ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ లో సీటు సంపాదించుకుంది మహతి. ఇక పరవాలేదు, తన చదువుకి తగ్గ ఉద్యోగం చేసినా, తిరిగి నృత్యాన్ని తన జీవిత ధ్యేయంగా ఎన్నుకున్నా తన ఇష్టం. కష్టపడి చదువుకునే వారు చాలా మందే ఉంటారు కానీ ఇటువంటి సదవకాశం, అదృష్టం కలిసి రావటం బహు కొద్దిమందికే ఉంటుంది. అందులో ఒకర్తి మా మహీ అని చెప్పొచ్చు.

డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అవకాశం, సందర్భం కలిసి వచ్చి నప్పుడు – వివాహం తరువాత ఎదురయ్యే పరిస్థితులు, మంచీచెడులూ తరవాత పిల్లలతో పెరిగే బాధ్యతలూ మహీకి సూచిస్తూ – “నీ వివాహం ఎప్పుడు, ఎలా, ఎవర్ని అని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నీకుంది మహీ. ఆ నేర్పు కూడా నీకుంది. అయినా నీ వయస్సులో ఎదుటవారి మాయ మాటలకి ప్రవర్తనకి మోసపోయే సందర్భాలు కూడా నీ జీవితంలో రావచ్చు. అటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా మేము నీ పక్కనే ఉంటాము. కానీ మా దగ్గర ఏ విషయం అయినా దాచవలసిన అవసరం రాకుండా జాగ్రత్త వహిస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తల్లీ” ధైర్యంతో కూడిన సలహా ఇస్తూ ఉండేదాన్ని. ఈనాటి వరకు అంతా సవ్యంగానే గడిచిపోయింది. ముందు ముందు కూడా ఇలాగే మాకు సరైన మార్గం చూపిస్తూ ఉండమని ఆ కనిపించని, మానస మందిరంలో నిత్యం మెలిగే దైవాన్ని ప్రార్థించకుండా ఉండలేకపోయాను.

ఆనాడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అన్న సందేహం మచ్చకు మాత్రంగా కూడా లేదు ప్రస్తుతం నాకు. నేను ఉపాధ్యాయినిగా విద్యాలయంలో చేస్తున్న రోజుల్లో అలిసిపోయి ఎలాగో ఇంట్లో అత్యవసర పనులు చేసుకునేసరికి పొద్దుపోయి, మహతి దగ్గరకు వచ్చి తన చిన్ని చిన్ని మాటలు నాతో పంచుకుందామంటే నా ముఖంలో అలసట చికాకు గ్రహించి, వాళ్ళ నాన్న దగ్గరకు పోయి కూర్చునేది. ఇక అటువంటప్పుడు తనలో దాగి ఉన్న కళాభిరుచిని గుర్తించగలిగే తీరిక నాకు ఎక్కడ!! ఆలాని ఇంటాబయటా సమంగా సమర్థించుకోలేని నారీమణులు లేకపోలేదు. అది ఒక్క నా బలహీనతే కావచ్చు.

మహతి స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే నేను మెల్లిగా సంస్కృత ఆన్‌లైన్ క్లాసులు చెప్పటం ప్రారంభించాను. విభిన్న పాఠశాలల నుండి పలు విద్యార్థులు నా క్లాసుల్లో చేరారు. తరువాత ఇంకా తీరిక అయినప్పుడు సంస్కృత సాహిత్యం లోని మంచి కావ్యాంశాలను ఎన్నుకొని ఆంగ్ల భాషలోకి, తెలుగు లోకి అనువదించటం ప్రారంభించాను. నా అనువాదాలు చదివి గుర్తించి కొన్ని ఆంధ్ర, ఒరిస్సా విశ్వవిద్యాలయాలు వారికి కావల్సిన కావ్యాలని అనువదించమని నాకు కావల్సినంత పని కల్పించాయి.

నా ఈ జీవితం నాకు కావాల్సింది ఇచ్చింది. ఇక నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏమీ లేదు అన్న తృప్తితో ఉన్నాను. మా వారి ఉద్యోగ విరమణ కాలం కూడా దగ్గర పడింది. మహతి లండన్ స్కూల్ నుంచి పట్టా పుచ్చుకుని అక్కడే ఒక కంపెనీలో ఫైనాన్షియల్ ఎడ్వైసర్‌గా ఉద్యోగస్థురాలైంది. రెండు రోజులకి ఒకసారి కాల్ చేస్తూ ఉంటుంది. అలా కాల్ చేసి ఒక రోజు చెప్పింది – “అమ్మా డిగ్రీ కాలేజీలో ‘సారీ లెటర్’ ఇచ్చిన అబ్బాయి ఇక్కడ కూడా తటస్థపడ్డాడమ్మా. ఇక్కడే మరో కంపెనీలో మంచి పొజీషన్‍లో ఉన్నాడు. ఫేస్‍బుక్‌లో కలిసి ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నాము. మొన్ననే నాకు వాట్సప్ మెసేజ్ పెట్టాడు ‘విల్ యు మేరీ మీ’ అని. చాలా కాలం నుంచి అతని మనసులో ఉన్నది నాకు చెప్పటానికి సంశయిస్తున్నాడని అనిపించింది. ఎలా అయితేనేమీ ఇప్పుడు ధైర్యం చేసి అడిగాడు. అతను మన కులం, జాతి వాడు కాదు. ఒరియా అబ్బాయి. అది మినహా అతనిలో ఎంచటానికి ఏమి కనిపించటం లేదు. నువ్వూ నాన్న ఏమంటారో చెప్పండి.”

ఇండియాలో ఆ ఆబ్బాయి ‘నీరజ్’ ఇంటి ఎడ్రెస్ అడిగి వారి ఇంటికి వెళ్లాము. విషయం చెప్పి, వారి విషయాలు వాకబు చేసిన మీదట ఒరియా సాంప్రదాయబద్దంగా, మంచీ మర్యాద తెలిసిన మద్య తరగతి కుటుంబంలా అంచనా వేసుకున్నాము. నీరజ్ కాక ఇద్దరు అమ్మాయిలు వారికి. వారి వివాహాలు కూడా అయిపోయినాయి. పిల్లలు ఇద్దరు ఇష్టపడితే వారికి ఏం అభ్యంతరం లేదన్నారు. మహతికి ఆ విషయం చెప్పి నీరజ్‌ని కలిసి, వివాహనంతరం భర్తగా నీరజ్ నుంచి ఏమి ఆశిస్తున్నదో, ఆలోచించి, అడిగి నీకు తృప్తికరంగా అనిపిస్తే ‘సరే’ అను. అతన్ని కూడా ముందే ఆలోచించుకుని చెప్పమను నీ నుంచి భార్యగా ఏమాశిస్తున్నాడో. నీవు నృత్యంలో కూడా ముందుకి వెళ్ళాలి అన్నావు కదా, అది కూడా అతనికి స్పష్టం చేసి, మీద్దరూ ‘ఓకే’ అనుకుంటే మాకు చెప్పండి” అన్నాము. ఆ తరువాత ఎంతో కాలం పట్టలేదు. పెళ్లి మన పద్ధతిలో నిరాడంబరంగా చేయమంటే అలాగే అని మా ఇంటిలోనే చేసి పంపించాము. ఇప్పుడు వారికి ఒక బాబు. బాబుకి నాలుగేళు వచ్చాక మహతి లండన్ లోనే ఒక నృత్య కళాశాల ఏర్పర్చి తిరిగి నాట్య రంగంలోకి ప్రవేశింది. ప్రస్తుతం మేమిద్దరం కనులపండుగగా వీక్షించి ఆనందించిన ‘దశావతార నృత్య నాటిక’ మహతి నాట్య బృందం వారి ప్రదర్శనే.

ఆనందం నిండిన మనసుతో ఇంట్లోకి అడుగు పెట్టి అలవాటుగా తన లాప్‍టాప్ తెరిచి చూసి నన్ను పిలిచారు మావారు. ఏమై ఉంటుందా అని వెళ్తే జూమ్ చేసి ఉంచిన ఈ మెయిల్ ఒకటి చూపించారు. ‘మృచ్చకటిక’ అన్న సంస్కృత నాటికని ఆంగ్ల భాషలో అనువదించిన నా కృతిని భారతీయ సాహిత్య అకాడమీ అవార్డుకి నామినేట్ అయిందని సూచిస్తున్న మెయిల్ అది. సంభ్రమాశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. ఆ అనువాదానికి చాలానే కష్టపడ్డాను. కానీ నా కష్టానికి ఇంత మంచి ఫలితం ఉంటుందని మాత్రం ఎప్పుడూ ఆశించలేదు. వెంటనే మా వారి రెండు చేతులూ అందుకుని “ఇన్నేళ్ళ నుంచీ ఎప్పుడూ మీ దగ్గర నా మనసులో మాట చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే మన ఇన్నేళ్ళ సహచర్యం వృథాయే. మన పెళ్లి అయిన మొదటి దినం మొదలు పైకి కనిపించకుండా ఎప్పటికీ అప్పుడు నా ప్రతి చర్యలో నాకు తోడుగా నిలచి, ప్రోత్సహించినందుకు మీకు ఏమని కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలీదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ మాన్ దేర్ ఈజ్ ఎ వుమన్ అంటారు. నా స్వానుభవం ఏమని చెపుతోందో తెలుసా? బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ వైఫ్ దేర్ ఈస్ ఏన్ అండర్‌స్టాండింగ్ హస్బెండ్” అంటూ నా తృప్తిని వ్యక్తపరుస్తుంటే నన్ను ఆపి “చాల్లేవోయ్ నేనేమైనా పరాయి వారి కోసం చేశానా ఏం! నువ్వు నా అర్ధాంగివి, మహతి నా కూతురు, నా అంశం. కాదంటావా?? అయినా అసలీ కష్టం అంతా మీది. నాది ఉట్టి మాట సాయం. ఆది కూడా లేకపోతే ఇంక ఎందుకు ఈ పెళ్లి?” అని హఠాత్తుగా ఎదురైన నా ప్రశంసకి మొహమాటపడిపోతూ నన్ను దగ్గరకు తీసుకుంటుంటే “మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు తిరిగి ఇటువంటి జీవితమే ఇవ్వు తండ్రీ” అని ప్రార్థిస్తూ పక్కనే ఒదిగిపోయాను.

మా ఆనందాన్ని చూసి ‘సై’ అన్నట్లు వెలుపలనుంచి వర్షపు మొదటి జల్లుతో తడిసిన మట్టి యొక్క సువాసన వెదజల్లుతూ చల్లటి గాలి వాతావరణాన్ని ఇంకా ఇంకా సుఖమయం చేస్తూ వీస్తోంది.

Exit mobile version