[డా. కర్నాటి లింగయ్య రచించిన ‘బతుకు బంగారు బాట’ అనే కథని అందిస్తున్నాము.]
ఓ గ్రామములో పాండయ్య అనే వ్యవసాయదారుడు ఉండేవాడు. పాండయ్యకు మెట్ట భూములు మరియు తరి భూములు ఉన్నాయి. ఆ భూముల్లో చాలామంది వివిధ హోదాల్లో నౌకర్లు పనిచేసే వారు ఉన్నారు. పాండయ్య చాలా తెలివైన వాడు. అయినా సోమరిగా ఉండేవాడు. పనులకు దూరంగా ఉండేవాడు. ఒళ్ళు వంచి పని చేసేవాడు కాదు. మొత్తం పనిని తన వద్ద పనిచేసే నౌకర్ల మీద వదిలేసి తిరుగుతుంటాడు. ఈ అవకాశమును అలుసుగా తీసుకొని నౌకర్లు వారి ఇష్టమొచ్చినట్లు పనిచేసేవారు. భూములను దున్నటం గాని, పొలాలకు నీళ్లు పెట్టడం గాని, పంటకు కావలసిన మంచి విత్తనాలు సేకరించడంలో గాని, వేయడంలో గానీ ఎలాంటి శ్రద్ధ చూపేవారు కాదు. ఎందుకంటే పాండయ్య ఎప్పుడు భూముల వైపు వెళ్లేవాడు కాదు. నౌకర్ల పనులను పరీక్షించేవాడు కాదు. ఈ కారణాల వల్ల పంటల దిగుబడి తగ్గుతూ పోతుంది. అందుకే కొంతకాలానికి పాండయ్య పేదవర్గంలో ఒకడిగా అయ్యాడు.
అదే గ్రామంలో శేషయ్య అనే మరో వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి ఎలాంటి భూములు లేవు. కానీ భూములు కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. తను సొంతంగా కష్టపడుతూ కూలీల వెంట వెళ్ళుతూ చక్కగా పనిచేయించేవాడు. భూములు దున్నటం దగ్గర నుంచి కలుపు తీయు వరకు శ్రద్ధ చూపేవాడు. ఇంటిల్లిపాదీ ఎండను మరియు వానను లెక్క చేయక ఒళ్ళు వంచి పని చేయటం వలన పంటలు బాగా పండించి డబ్బు సంపాదించాడు. పాండయ్య భూములు అమ్ముతున్నాడని ఆ ఊర్లో ఆ నోట ఈ నోట విని, ఈ విషయము తెలుసుకోవాలని శేషయ్య పాండయ్య వద్దకు వెళ్ళాడు. ప్రథమంగా ఇరువురు క్షేమ సమాచారాలు ఒకరికి ఒకరు తెలుపుకున్నారు. తర్వాత పాండయ్యతో ఇలా అన్నాడు.. “మీరు మీ భూములను అమ్ముతున్నారని విన్నాను. నిజమేనా? ఒకవేళ మీరు అమ్మితే దయచేసి నాకు అమ్మండి. నేను కొనాలనుకుంటున్నాను. మీకు వెంటనే డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను.”
అతని మాటలు విని పాండయ్య బిత్తరపోయాడు. “నీకు నా భూములనును కొనుటకు డబ్బు ఎక్కడిది?” అని అడిగాడు.
అప్పుడు శేషయ్య – “నాకు ఎక్కడి నుంచి డబ్బు రాలేదు. నాకు ఎవరు ఇవ్వలేదు. నేను శ్రమించి, కష్టపడి సంపాదించినదే, పొదుపు చేసుకున్నదే. మీ సేద్యానికి, నా సేద్యనికి ఎంతో భేదం ఉన్నది. మీరు మీ నౌకర్ల మీద పని వదిలేసి తిరుగుతుండేవారు. కానీ నేను పని వాళ్ల కంటే ముందుగా తయారై వాళ్లను నాతో పాటు పొలాలలో పనిచేయుటకు వెంటబెట్టుకొని వెళ్లేవాడిని. పంటలు బాగా పండించేవాడిని. మొత్తం ఖర్చులు పోగా బాగా డబ్బులు పొదుపు చేసుకున్నాను. నా ఇల్లు సిరిసంపదలతో బంగారు ఇల్లుగా మారింది” అని జవాబు చెప్పినాడు
అప్పుడు పాండయ్య దీర్ఘంగా ఆలోచించి, కళ్ళు తెరిచి తన తప్పును తెలుసుకున్నాడు. అర్థం చేసుకున్నాడు. తనకున్న ఎకరాలలో కొన్ని ఎకరాలు శేషయ్యకు అమ్మి శ్రద్ధతో, క్రమశిక్షణతో శ్రమపడి మిగిలిన తన భూములలో పనిచేసుకుంటూ నౌకర్లవెంట ఉండి సంపాదించి తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాడు. ఇలా కష్టపడి సంపాదించుకుంటూ హాయిగా కుటుంబంతో తన ‘బ్రతుకు బంగారు బాట’ అయినదని గ్రామ ప్రజలందరితో సంతోషంగా ఉన్నాడు.