Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బంతి శపథం!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘బంతి శపథం!!’ అనే హాస్య కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దేమి వేడుకో, అందరి నడుమ, ఒకే బంతి నెడాపెడ
బాదుట, ఆ మృదంగము కన్న అభాగ్యశాలినై అడడా!

ముద్దుల మద్దెల వాయింతు రొద్దికల, స్థిరముగ నుంచి!
ఏ దిక్కని లే దెగిరెగిరి నన్మోదుటేమొ, అదయులై!

ముక్కుట మూల్గుట, ఎక్కడి శక్తి చేర్చుకొని వాయించుట
అక్కజమగు! ఈ హింసాట చూచుటకు వేనవే లకటా!!

ఇరువురు కలసి ఒంటి కొట్టుట కహో తగవరులు
పరుగిడి నన్నందించు బల్సహాయకు, లివేమి పగలో?!

బంతులము మేము, వర్తుల శాంత, విశుధ్ధ వర్తుల మిల
ముద్ద కట్టిన గుణ పూర్ణులము, గుర్తింపరెటు చోద్యమై!!

అదేమి పరపీడన తత్త్వమొ ముక్కున వేలేసికొందు
నెదిరికి నేనందక ఏడ్పించు రీతుల చూసి.నవ్వుచున్!!

సుబ్బి పెళ్ళి వెంకి చావు కన్నటుల వీరి వీర వినోద
మబ్బబ్బ! నాకు బుర్ర రాంకీర్తనాయె,రక్షించు వారెవ్వరో?!

ఇదె శపథము, మరు జన్మమున పుట్టెద రాకెట్టుగ
లేద, పెట్టి పుట్టిన ‘బాదరి’గ! బంతిగ పుట్టనె పుట్టన్!!
~
(తగవరులు= referees, సహాయకులు=ball boys/girls, బాదరి=బంతిని బాదు ఆటగాడు/గత్తె)

Exit mobile version