[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘బ్యానర్!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
మంత్రిగారి చేతుల మీదుగా స్కూలు భవనానికి ప్రారంభోత్సవం. ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడి, ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారైంది.
ఊళ్ళో ఉన్న మాంఛి పెయింటర్ కిచ్చారు, బ్యానర్ తయారీ.
అరగంటలో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలవ్వాలి.
అంతా రెడీ అయింది గాని, బ్యానర్ రాలేదింకా! బ్యానర్లు రాసే శంకర్రావుకి ఫోన్ల మీద ఫోన్లు వెళ్తున్నై, జవాబే లేదు అట్నుంచి.
మంత్రిగారు ఇంకా అయిదు నిమిషాల్లో వస్తారనగా, ఒక సంచి ఇచ్చి వెళ్ళాడు కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరికి, ఒక 15 ఏళ్ళ కుర్రాడు!
తెరిచి చూస్తే ప్రారంభోత్సవ బ్యానర్!
‘అమ్మయ్య వచ్చేసింది, గొప్ప కళ వచ్చేస్తుంది ఇక’, అనుకుంటూ, “ఒరేయ్,రామూ ఇది తీసికెళ్ళి ముందు ఆ ఎంట్రన్స్ దగ్గర కట్టిరా పో, అర్జంట్”, అని ఇచ్చేశాడాయన, కార్యక్రమం విజయవంతం అయినట్టే భావించి, సంతోషిస్తూ!
రాము కర్తవ్య నిష్ఠతో వెంటనే కట్టేశాడు అందరికీ బాగా కనబడేట్లు హాలు ప్రవేశ ద్వారం దగ్గర.
***
జోగినాధం మంత్రి గారొచ్చేశారు. నవ్వుతూ కారు దిగారు. ఆయన చూడకుండానే కళ్ళబడ్డది ఎదురుగా బ్యానర్, తనను వెక్కిరిస్తున్నట్టు!
మంత్రి గారి చేతబడి ప్రారంభోత్సవం
అని ఉన్నది, తెల్లటి బట్ట మీద ఎర్రటి అక్షరాలతో!
టైమ్ అయిపోవడంతో, ఏమీ కానట్టే, రిబ్బన్ కత్తిరించేసి, స్టేజీ మీదకు వెళ్ళి,నిర్వాహకులు ఇచ్చిన పూల దండనూ, పుష్షగుచ్ఛాన్నీ, వాళ్ళనూ – కొరకొర చూస్తూ తీసుకున్నారు.
యథావిధిగా, ఊకదంపుడు ఉపన్యాసం – విద్యార్థులు, చదువు ప్రాముఖ్యత, తానెంత కష్టపడ్డదీ ‘అంత’ పైకి రావడానికీ వగైరాలు చెప్పి, ముగించారు.
నిర్వాహకులకు ‘సెలవ్’ అని కూడా చెప్పకుండా కారెక్కి వెళ్ళిపోయారు.
***
ఆయనను అటు పంపించి, ఇటు తిరగ్గానే మళ్ళీ ఎర్రటి అక్షరాలతో కనబడ్డది, తెల్లటి బ్యానర్, నిర్వాహకుడు గారి కళ్ళకు!
ఆయనకు వెంటనే లోకం అంతా ఎర్రగా కనబడసాగింది, మంత్రిగారి కోపం లాగా విస్తరించి!
ఏం ఉపద్రవం ముంచుకురాబోతోందో దేవుడా అనుకుంటూ, అక్కసుతో ఆ బ్యానర్ ఆర్డర్ తీసుకున్న శంకర్రావుకి ఫోను చేశాడు!
మొబైల్ మోగగానే శంకర్రావు వెంటనే ఫోను తీశాడు, “చాలా అందంగా తీర్చావయ్యా బ్యానర్‌ని, శహబాష్! వచ్చి నీ డబ్బులు పట్టుకుపో”, అంటారని ఎదురుచూస్తూ!
చెడామడా తిట్టేసి “ఇంకెప్పుడు స్కూలుకు సంబంధించిన పని నీకిచ్చేది లేదు, చావు” అని ఫోను పెట్టేశాడు, నిర్వాహక సుబ్బారాయుడు గారు, శంకర్రావుకి అసలు ఏ అవకాశమూ ఇవ్వకుండా!
ఏదో పెద్ద అచ్చు తప్పే చేసినట్టున్నాడు బ్యానర్ రాసిన కుర్రాడు, అనుకున్నాడు శంకర్రావు.
సమయానికి అది రాసిన ఆ కుర్రాడు కూడా లేడు, వాడు వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు, సెలవు మీద!
శంకర్రావు వారం పది రోజుల వరకు స్కూలు చాయలకే వెళ్ళలేదు!
వేడి తగ్గిన తరువాత వెళ్ళి మాట్లాడుదాంలే, అని!
***
ఒకరోజు వాతావరణం కాస్త చల్లగా ఉన్న వేళ వెళ్ళి కలిశాడు,శంకర్రావు సుబ్బారాయుడిని!
లోపలికి వెళ్ళే ముందే స్కూలు ప్యూనుని అడిగి తెలుసుకున్నాడు, ఆ ‘బ్యానర్ కోపం’ అసలు కారణం!
అందుకని లోపల రాయుడు గారిని చూడగానే, “అయ్యా క్షమించాలి, వాడొక చదుకోని కుర్రాడు తెలియక రాశాడు, మన్నించేయండయ్యా” అంటూ అందుకున్నాడు!
రాయుడు గారు బిర్ర బిగిసి కాస్సేపు తదేకంగా చూశారు శంకర్రావుని కోపంగా!
కోపమో,శాంతమో తెలియకూడదని, తల వాల్చేసుకుని వినయపు ముద్దై నుంచున్నాడు,శంకర్రావు!
వినని వాడికీ, చూడని వాడికీ అవతలి వాడి తిట్లూ, కోపపు చూపులు తెలిసే అవకాశం లేదు కదా, ఆ రకంగా రక్షింపబడ్డాడు, శంకర్రావు ఆ గడ్డు క్షణంలో!!
రెండు నిమిషాలాగి, రాయుడు గారు కుర్చీలో కూచుంటూ “ఆ బ్యానర్ కాదయ్యా అసలు సమస్య”, అన్నారు.
“మరేంటండీ?”, అనడిగాడు శంకర్రావు ఆశ్చర్యంగా!
“ఏంటా? విను. ఆ రోజు ఆ రాత చూసిన మంత్రిగారు కోపంగా ఉండటం చూసి, నా వెనకాలే ఉన్న నా అసిస్టెంటు, మా మేనల్లుడు రమేష్, ఉండబట్టలేక, ఊరుకోక, “అయ్ బాబోయ్ ఎంత సంతోషం, మన మంత్రిగారు చదివేశారు గడగడా ఎంత పాండిత్యం, ఏమి జ్ఞానం” అన్నాడు!
మెల్లగానే అన్నాడు నాతో, కానీ అది కాస్తా ఆయన చెవినా పడ్డట్టుంది!
అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉపన్యాసం చదివేసి, ఆఫీస్ కెళ్ళి నాకు ఫోన్లో పెద్ద ప్రవచనం వినిపించాడు, తిట్టిన తిట్టు తిట్టకుండా!
‘నేనంత పనికిరాని వాణ్ణనా వాడి ఉద్దేశం, చదువురాని దద్దమ్మననా?! మంత్రిగారు చదివేశారోచ్ అని అరుస్తాడా! పైగా రాసిందేమో బండ తప్పు! క్షమాపణ చెప్పాల్సిందే, I hurt’ అన్నారు, మహదావేశంగా!
తప్పు రాసింది మీవాడు, వాగింది మా మేనల్లుడు! మధ్యలో నా తల ప్రాణం తోకకు వచ్చినంత అయ్యింది! మా వాడ్ని ఒప్పించి తీసుకెళ్ళి క్షమాపణ చెప్పించి నిన్ననే వచ్చాను”, అని ముగించారు.
“అయ్యయ్యో, ఎంత పనైంది, సారీ సార్, ఇంకెప్పుడూ ఇట్లా జరగనివ్వను సార్”, అని బోల్డు వినయం నటించి చెప్పాడు, శంకర్రావు!
ఇంకోసారి క్షమాపణ చెప్పి, ఆయన ఉదారంగా ఇప్పిచ్చిన బ్యానర్ రాసిచ్చిన కూలీ డబ్బులు తీసుకొని గుట్టుగా బయటపడ్డాడు!
***
ఆరు నెలలు గడిచాయి!
కొత్త సైన్సు ల్యాబ్ ప్రారంభోత్సవం సభ వచ్చింది. మళ్ళీ స్థానిక మంత్రి గారైన వారే, అంటే జోగినాధం గారే రిబ్బన్ కటింగ్!
ఈ సారి అక్షరం పొల్లు పోకుండా, తప్పుల్లేకుండా వ్రాయించారు రాయుడు గారు బ్యానర్‌ని.
మంత్రిగారు మనస్ఫూర్తిగా చదువుకొని ఆనందించి, ప్రారంభోత్సవం తంతు పూర్తి చేసేశారు.
కొత్త ల్యాబ్ బాగా పెద్దదై జాగా ఉండటంతో, డయాస్ గట్రా అందులోనే. ఏర్పాటు చేశారు.
ఏసి, కొత్త పెయింట్స్ వాసనా, కొత్త పరికరాలతో ఘుమఘుమలాడీ, కళకళలాడీ పోతోంది, కొత్త సైన్సు ప్రయోగశాల!
జోగినాధం గారు బ్యానర్ బాగా వచ్చిన సంతోషంతో రెచ్చిపోయారు, తమ ఉపన్యాసంలో!
బాలబాలికలు బాగా సైన్సూ లెక్కలు నేర్చి, గొప్ప గొప్ప బాబాలంతటి వారు కావాలన్నారు. హోమీ బాబా అంతటి వారని వారి ఉద్దేశం అని, సూక్ష్మగ్రాహులు పిల్లలూ, వారి నడిగి టీచర్లూ తెలుసుకున్నారు.
అంతలో కరెంట్ పోయింది, కిటికీలన్నీ తెరిపించారు గాలి కోసం!
ఇంకా ఆ సెక్షన్‌కి జనరేటర్ పెట్టించలేదు, కరెంటు రావాల్సిందే, కాస్త గాలి ఆడటానికి!
అకస్మాత్తుగా బయట ఒక పెద్ద గాలి వచ్చి, మూలన పెట్టి ఉన్న రికార్డు పుస్తకాల మీద కప్పిన తెల్ల బ్యానర్ లాంటిది అటుదిటుగా పడ్డది!
ఆ పడటమే, మళ్ళీ కొంప ముంచింది.
అది గతంలో ఇబ్బంది పెట్టిన ‘మంత్రిగారి చేతబడి’ బ్యానరే!
ఇప్పుడు సర్వీసులో లేదు కాబట్టి, పిల్లలకు మంత్రి గారి చేత ఇప్పించాల్సిన రికార్డు పుస్తకాల మీద కప్పి ఉంచారు, అటుదిటు చేసి ఖాళీగా ఉన్న తెల్లభాగం పైకి కనబడేటట్టు!
రెండు కిటికీలకు దగ్గరగా, వాటి మధ్యన ఆ పుస్తకాలు ఉండటంతో, ఆ దుష్ట గాలి వచ్చి అంతా పాడు చేసింది, ఆ వేసిన బ్యానర్‌ని అమాంతం ఇటుదటు చేసీ; మంత్రిగారి కంటికి నచ్చని ఆ ఎర్ర అక్షరాలను మళ్ళీ చూపించీ!
***
ఇంతలో కరెంట్ వచ్చేసింది, కానీ జోగినాధం గారి మతి ఆ పాటికే పోయింది. పైగా సరిగ్గా అదే సమయానికి రాయుడుగారి మేనల్లుడు అటుగా కారిడార్‌లో పోతూ, వారి కంట పడ్డాడు.
“వీడింకా ఇక్కడే ఉన్నాడా”, అని పళ్ళు పటపటా కొరికారు నిస్సహాయంగా, లోలోపల పాపం!
మిగిలిన ఉపన్యాసంలో ఏవేవో పేలి ముగించారు.
“మీకు కావాలంటే నన్నడగండి, వెధవ గాజు టెస్ట్ ట్యూబులేంటి, నాలుగు కాలాలు ఉండేటట్టు స్టీలువి కొనిపెడతాను నా లోకల్ డెవెలప్‌మెంటు ఫండు నుంచి” లాంటివి!
పిల్లలు నవ్వుకున్నారు. పెద్దలూ టీచర్లూ నవ్వాపుకున్నారు!
***
మళ్ళీ సభ రభసే, మంత్రిగారి దృష్టిలో!
కారణం?!
అదే బ్యానర్, ఈసారి మారువేషంలో!
ఛస్తే ఇంక ఆ స్కూలు ప్రారంభోత్సవాలకు వెళ్ళకూడదని నిశ్చయించేసుకున్నారు.
***
కానీ ఆ అవసరమే రాలేదు వారికి, అదృష్టవంతులు!
ఇది గడిచిన మూడు నెలల లోపే ఆ ప్రభుత్వం పడిపోయింది, వీరి మంత్రిగిరీ, ‘శ్రీమద్రమా రమణ గోవిందో హారి’ అయింది.
***
మొన్న రాయుడు గారు కనబడితే షాపింగ్ కాంప్లెక్సు దగ్గర, దిగబోయిన కారు చటుక్కున మళ్ళీ ఎక్కేసి మాజీ మంత్రిగారు తుర్రుమన్నారని, అభిజ్ఞవర్గాల భోగట్టా!
పాపం జోగినాధం గారు!
వెధవ బ్యానర్ ఎంత పని చేసింది, మంత్రి గారనే ఖాతరీ కూడా లేకుండా, ఆయ్ఁ, అమ్మా!!
ఇప్పుడైతే మాజీ గానీ, అప్పుడు సర్వీసులో ఉన్న మంత్రిగారేగా!!
ఆ మాత్రం ఇంగితం ఉండొద్దూ?!
అవును ఉండొద్దూ!
