[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘బానిస బతుకులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనంద్ భార్యతో విమానాశ్రయం నుండి కారులో బయలుదేరాడు. తనకు షష్టిపూర్తి అయింది. జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. తను చదివిన చదువుకు ఆ రోజుల్లో స్పెయిన్‌లో ఒక మంచి ఉద్యోగం లభించింది. ఎన్నో ఆశలతో విదేశం వెళ్లి, వినయ విధేయతలతో, సమర్థతతో విధి నిర్వహించాడు.
పిల్లలు బాగా చదువుకున్నారు, స్థిరపడ్డారు. ఇంక చాలు. మన దేశం మనం వెళ్లిపోదాం, అనిపించింది. సతీమణి సుధ సహకరించింది.
అదొక మహానగరం. తన మిత్రుని సహాయంతో అక్కడ ఒక బంగ్లా కొన్నాడు. ఇప్పుడు అందులో నివసించి, ప్రకృతికి, తనవారికి దగ్గరగా గడపాలని అభిలాష. నగరమంతా సిరి తాండవిస్తోంది. విద్యుద్దీపాల అలంకరణలు, రంగు రంగుల దీపాలు, వానితో బోర్డులకు అందాలు. నాలుగు లేన్ల రోడ్డులు, ఫ్లైఓవర్లు – ఓహో! వాహనం హాయిగా జోరుగా పరుగులు తీస్తోంది.
ముఖ్య రహదారుల్లో పెద్దపెద్ద కార్యాలయాలు, అంతస్తుల మేడలు. వాటిని దాటి ముందుకు వెళుతున్నారు. అకస్మాత్తుగా అనిపించింది, “అవునూ ఇదేమిటి ఇంతసేపై నగర వీధుల్లో నుంచి కారు వచ్చింది. ఆఫీసులన్నింటి బోర్డులూ ఆంగ్లంలోనే. మాతృభాషలో ఉన్నది ఒక్కటి కూడా కనిపించలేదు!”
చిత్రం ఏమిటంటే ముందుకు సాగిన కొద్దీ దుకాణాల పేర్లు అన్ని కూడా ఆంగ్లంలోనే ఉన్నాయి. ‘Chocolate King’, ‘Tiara’, ‘Noble Restaurant’, ‘King’s Court’, ‘Chrome Plaza’, ‘Wooden Street’, ‘Diamond’, ‘Pizza Plaza’, ‘Cudo’, ‘Smart Bazaar’, ‘Garments for All’ ఇలాగ.
ఆనంద్ మతిపోయింది. ఆహా ఏమిటి యీ విపరీతం! దాదాపు రెండు వందల సంవత్సరాలు వలస రాజ్యంగా గడిపిన బానిస బ్రతుకు మనది! ఆ బానిసత్వం మన నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. ఇంత పరాయి వ్యామోహం ఏమిటి?
నిజమే, ఆంగ్ల భాష నేర్చుకోవడం తేలిక, ప్రపంచంలో ఎక్కువమంది ఆ భాషను ఉపయోగిస్తున్నారు! అరే! మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై అయిదేళ్లయింది కదా!
మన భాష, మన వునికికి, మన జీవితాలకు ఊపిరి! తను ఇన్ని దేశాలు ఐరోపాలో తిరిగేడు. ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, రొమేనియా, ఆస్ట్రియా, పోలాండ్ మొదలగు దేశాలు. ఎవ్వరూ, ఎక్కడా తమ దేశ భాష తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. అలా మాట్లాడగా తాను వినలేదు. అన్ని కార్యకలాపాలు వారి వారి మాతృభాషల్లోనే!
విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, అన్ని రంగాల్లోనూ వారు మాతృభాషనే ఉపయోగిస్తున్నారు.
మరి మనదేశంలో వాళ్ళు? ఆంగ్లేయుల వ్యామోహంలో పడి తమ మూలాలు మరచిపోయి, ఆ సంస్కృతిని అలవర్చుకున్నాము. దుస్తులు, నడక, నడత – అన్నీ వారి అనుకరణే కదా!
నగర శివార్లకు చేరుకుంది వాళ్ల కారు. ఇప్పుడు సీను మారిపోయింది సిరి కానరాదు పేదలు రోడ్డు పక్క కాలిబాట మీద చిన్న గుడారాలు వేసుకొని బ్రతుకుతున్నారు. ఎండ, వాన, చలి ఎలా సహిస్తున్నారో కదా! చింకి పాతలతో పోషణలేని దైన్యంతో ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లు, సీసాలు ఏరుకునేవారు కొందరు. వృద్ధులు, వికలాంగులు, బిచ్చము ఎత్తుకుంటూ బ్రతుకు. ఎముకల గూళ్ళు – మనుషులు కారు!
చిన్న బడ్డీ కొట్లు కొన్ని కనపడ్డాయి. కూరగాయలు అమ్ముతున్నారు. పాన్ మసాలాలు కూడాను. ఎవరైనా వచ్చి కొంటారా అని ఎదురుచూపులు. పాపం అవి ఎదురు చూపులే మరి. ప్రస్తుతం జనం అంతా డిజిటల్ మాధ్యమం మోజులో ఉన్నారు. ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తారు. ఇంటికి చేరుతున్నాయి.
ఆనంద్ బంగ్లా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. దానికి దగ్గరగా ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. ముఖ్యమైన సామాన్లు – భోజనాల బల్ల, కుర్చీలు, వంట సామాగ్రి అన్నీ కొనాలి. ఈ లోగా ఈ గదిలో ఉండి ఇల్లు సర్దుకుని రావాలి.
కొత్త ఇంటికి మారారు ఆనంద్, సుధ. ఆవరణలో సుమారు ఒక వంద బంగ్లాలు ఉన్నాయి. సమిష్టి కుటుంబం వారి కోసము అదనపు గదులు, ఇలా రకరకాల వారికి తగిన పథకం ప్రకారం గృహ నిర్మాణాలు చేసేరు. కాని, పైకి చూడ్డానికి అన్నీ ఒకే విధంగా వుండి కన్నులకు విందుగా వున్నాయి. చక్కని చెట్లు, రెండు లేక మూడు కమ్యూనిటీ పార్కులు; పండుగలు, ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినపుడు అన్ని కుటుంబాల సభ్యులూ సమావేశమవడానికి ఒక ఆవరణ కేటాయించేరు. వ్యాయామం కోసం వ్యాయామశాల వున్నది. వయోవృద్ధులు నడక, యువకులు పరుగులు, సూర్యోదయానికి ముందు, సాయంత్రం వేళల్లో మంచి సందడి. ఒకరినొకరు పలుకరించుకొని నవ్వులే పువ్వులు.
ఒక్కొక్క బంగ్లాకు కనీసం మూడు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, పార్కింగ్‌కు చోటు సరిపోక రోడ్డు పైన పక్కగా నిలిపి ఉంచేరు.
ఆనంద్ పరిశీలిస్తూ సాగుతున్నాడు. ఒక వైపు దారిలో నడుస్తూండగా మగవాళ్లు రోడ్లు తుడవడము, అది చాలక, పేరుకు పోయిన మన్నును తొలగించడానికి నేలమీద కూర్చుని పీచు బ్రష్ లతో లాగి, ఎత్తి పోయడం కనపడింది. తుడిచిన చెత్తను చెత్త డబ్బాలలోకి ఎత్తి పోస్తున్నారు. ఇందులో యువకులు కూడ వున్నారు.
ఆనంద్ మనస్సు వికలమైంది. మగవాళ్లు ఇళ్లల్లో వంట సామాను కడిగి, ఆరబెట్టి, తుడిచి లోపలపెట్టడం, గదులు నేల మీద కూర్చుని, గుడ్డతో బకెట్ నీళ్లలో తడిపి వత్తడము, ఇవి మరీ బాధ కలిగించేయి.
అపర కుబేరులు ఒక వైపు; గతి గడవక చాకిరీ చేసి జీవించే నిరుపేదలు మరో వైపు! ఏమి యీ దౌర్భాగ్యం అనుకున్నాడు. వెగటుగా అనిపించింది. ఇక చూడలేనని ఇల్లు చేరేడు. ఆ రోజంతా ఏవో ఆలోచనలతో గడిపేడు. సుధకు ఆందోళన ఆశ్చర్యం కలిగేయి.
ఏం జరిగింది అని అడిగింది. విషయాలు విని ఆమె కూడ మనస్తాపం చెందినది.
“మరి మనమేం చేయగలం? ఆలోచన చేయండి” అన్నది. “అవును సుధా – మనిద్దరము ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం” అన్నాడు ఆనంద్.
“మనం ఒక ఉపాధ్యాయుణ్ణి బతిమలాడి, ఒప్పించి, ఖాళీ సమయాల్లో వీళ్లకు చదువు నేర్పిద్దాము. ఇక్కడ కాదు. వేరే ప్రదేశంలో. అక్షరాలూ వచ్చి, మాతృభాష నేర్చుకుని, చదవడము, వ్రాయడము వస్తే కొంత మేలు జరుగుతుంది. వయస్సు పరిపక్వము చెందిన మీదట, అవసరాన్ని గుర్తించిన వారు చదువుకొనుట ఇంకా తేలిక. ఆకలి దహిస్తున్న మనిషి పేచీ పెట్టకుండా అన్నము తినిన విధంగా అన్నమాట.
అలా మొదట యువకులకు శిక్షణనిప్పించుదాము. వారు ఏదైనా కర్మాగారాల్లోనూ, కార్యాలయాల్లోనూ వుద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి.
ఆ తర్వాత పెద్దవారికి విద్య నేర్పించడం వలన వారికి తగిన ఉపాధి లభిస్తుంది. ఇలా పెద్ద బంగ్లాలు, ఆఫీసులకు, సెక్యూరిటీ కార్మికులగాను చేరడానికి అవకాశం. ఫోన్ ఉపయోగం, అందులో అన్ని విధాలుగా చురుకుగా స్పష్టంగా, సమాధానాలు ఇవ్వడం – ఇవి నేర్పించాలి. అదే విధంగా వయోజనులకు చేదోడు వాదోడుగా వుండే వారిగా అవకాశాలు వస్తాయి.”
ఆనంద్, సుధా తమ అంతర్మథనంలో దొరికిన పరిష్కారాలివి. ఆ రాత్రి వారి మనసులు తేలిక పడినవి.
కలత నిద్దుర బెడద లేదిప్పుడు. నిద్రాదేవి ఒడిలోకి హాయిగా జారుకున్నారు.
తెల్లవారిన దగ్గర నుండీ బోలెడంత పనికదా మరి.