[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘బంగారు పిచ్చుక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పుల్ల పుడక
ముక్కున కరుచుకొని
నీ కోసం
పిల్లల కోసం
విడి విడిగా
గదులు గదులుగా
చెట్ల కొమ్మలకు
ఉయ్యాలలూగు విధంగా
అందాల భవనాలు నిర్మిస్తావు
అమ్మవై నాన్నవై సాకుతావు
అనుబంధాల విలువలను
నిన్ను చూసి మేము నేర్చుకునే
విధంగా నీవు ఉన్నావు
ఏ కాలేజీలో నేర్చావో కదా
ఇంత మంచి పనితనాన్ని
నీ నైపుణ్యాన్ని పొందటం
ఏ కాలేజికి వెళ్ళినా
ఎంత చదివినా మా వల్ల కాదు
నీవు నిర్మించిన
అందమైన ఆ గూటిలో
గుడ్లను సంరక్షించి
రెక్కలొచ్చేదాకా
వాటిని కాపుకాస్తావు
నీ తెలివితేటలకి
నీ పనితనానికి
మరింత వన్నె తెస్తుంది
నీకు తోడైన నీ జతపక్షి
మమతానుబంధాలకు
నువు నాకు మార్గదర్శివి
నీ చతురతని చూసినవారందరు
నిన్ను బంగారు పిచ్చుకని పిలుస్తారు
నీవు వెళ్ళిన తరువాత
నీ గూళ్ళను ఇళ్ళలో
పదిలంగా దాచుకుంటారీ
మనుషులు
నీ శ్రమకు నీ ప్రేమకు
నిజంగానే
నువు బంగారు పిచ్చుకవే
నీకు వేరెవ్వరు సాటిరారు.