[శ్రీ కస్తూరి రాజశేఖర్ రచించిన ‘బంగారు జరీ పట్టు చీర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శ్రీనివాస షాపింగ్ మాల్. రాంనగర్ సందుల్లో దాదాపు యాభై సంవత్సరాల నుంచీ అంచెలంచెలుగా వృద్ధి చెంది, చిన్న బట్టల దుకాణం స్థాయి నుంచి నేటి అల్ట్రా మోడర్న్ మాల్‌గా మారి, వెడ్డింగ్ డిజైనర్ డ్రెస్సెస్‌కి డెస్టినేషన్ స్థాయికి ఎదిగింది. సన్న సందులాంటి ఎంట్రన్స్ లోంచీ పదడుగులేస్తే నాలుగంతస్తుల భవనం. అదే కాంపౌండ్‌లో వాళ్ళ బంధువుల ఇతర సంబంధిత దుకాణాలు. మాల్ లోపల భలే భలే డిజైన్ల ఫాల్స్ సీలింగ్‌లు, వాటిలో పొదిగిన ముత్యాల్లాంటి గుండ్రటి ఎల్ఈడి దీపాల కాంతులు పట్టపగలే కళ్ళు చెదిరే వెలుగులు విరజిమ్ముతూ అదో కాంతి ప్రపంచంగా మార్చేస్తున్నాయి.
బయట ప్రచండ ఎండ వెలుగు కాల్చేస్తోంది. ఎండనబడి, చెమటోడుతూ మాల్ లోకి వస్తున్న కస్టమర్లకు, పెళ్ళివారికి పన్నీరుతో స్వాగతం పలుకుతున్నట్లు, పరిమళాల పెర్ఫ్యూమ్ ఎయిర్ కండిషన్ చల్లదనంతో కలిసి, ఎదురేగి సేదతీరుస్తున్నట్లు భావన కల్గిస్తోంది. లోపలికి అడుగుబెడుతూనే కళ్ళని కట్టిపడేసే రంగురంగుల చీరలు పొందిగ్గా అలమారాలలో పేర్చబడి ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క కేటగిరి దుస్తులు ఉన్నట్లు గోడమీద అతికించిన ఫ్లెక్సీ బోర్డు చెబుతోంది.
ఒక ప్రక్క బిల్ కౌంటర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది, సెలెక్ట్ చేసిన బట్టలకు కస్టమర్ తెచ్చుకున్న బిల్‌కు సరిపడా నగదు చెల్లింపులు, లేదా గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని నిర్వహిస్తూ, సొమ్ము ముట్టినట్టు రసీదు స్టాంప్ వేసి తిరిగి ఇస్తున్నారు. ఎంట్రన్స్‌లో ఒక ప్రక్కగా డెలివరీ కౌంటర్‌లో అమ్మాయిలు తమ దగ్గరికి సేల్స్ సిబ్బంది పంపిన బట్టల్ని ప్యాక్ చేసి, డబ్బు కట్టిన రశీదుల్ని ఇచ్చిన కస్టమర్లకు సంబంధించిన బట్టల్ని బిల్ నెంబర్‌తో సరిచూసి, షాప్ పేరున్న క్యారీబ్యాగ్‌లో వేసి ఇస్తున్నారు. వెనుకగా, షాప్ ఓనర్ జమాఖర్చులు సరిచూసుకుంటూ, డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేస్తూ, అప్పుడప్పుడు సీసీటీవీలో నాలుగు అంతస్తులలో సిబ్బంది పని వ్యవహారం, వారితో మాట్లాడుతున్న కస్టమర్ లనీ యథాలాపంగానూ, ఎవరైనా సిబ్బంది గానీ, కస్టమర్లు గానీ చేతివాటం చేస్తున్నారేమో నిశితంగా గమనిస్తూ, వచ్చిన రద్దీని బట్టి, గోడౌన్ లోంచీ కొత్త సరుకుని అవసరాన్ని బట్టి తెప్పిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
***
లంచ్ సమయం పూర్తవటంతో మళ్ళీ రద్దీ మొదలైంది. పెళ్లిళ్ల సీజన్ కావటంతో షాపే ఒక పెళ్లిమండపంగా, గల గల మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న కస్టమర్లతో సందడిగా కనిపిస్తోంది. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన బట్టలు చూపిస్తూ ఓపిగ్గా అటెండ్ అవుతున్నారు సేల్స్‌మెన్, సేల్స్ గర్ల్స్!
అంతలోనే ఓ డజను మంది ఆడవాళ్ళ పెళ్లి పార్టీ ఒక్కసారిగా లోపలికి కమ్ముకొచ్చింది. రణగొణగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఏ.సి. గాలికి ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోయి రిలాక్స్‌డ్‌గా నిట్టూర్చి మళ్ళీ చర్చల్లోకి దూకారు. చూడటానికి ధనిక కుటుంబంలా కనిపిస్తోంది. ముగ్గురు ముసలి వాళ్ళు, ఆరుగురు మధ్య వయస్కులు, పెళ్లికూతురు, తన ఇద్దరు ఫ్రెండ్స్ – అందరూ అందరితో మాట్లాడుతూ కన్విన్స్ చేస్తూ, కన్‌ఫ్యూజ్ అవుతూ నడుస్తున్నారు. ఎంట్రన్స్ లోనే ఉన్న రిసెప్షన్ ఎగ్జిక్యూటివ్ వారికి సాంప్రదాయక నమస్కారం పెట్టి, వాళ్ళ అవసరం కనుక్కుంది. వాళ్లకి పెళ్లి కూతురు బట్టలు కావాలి అని తెలుసుకుని నాల్గవ అంతస్తుకు వెళ్లాలని సూచించింది.
వాళ్లంతా పొలోమని లిఫ్ట్ వైపుకి హడావుడిగా నడుచుకుంటూ వెళ్లారు. లిఫ్ట్ చిన్నది కావటంతో అంతమందికి చోటు లేదని ఎవరికీ వారే ముందు వెళ్లాలని తాపత్రయపడుతుంటే, మధ్య వయస్కురాలు ఒకావిడ –
“మీకెందుకే తొందర? పైసల్లేనివాడు ముందు పడవ ఎక్కాడుట.. అట్లా ఉంది మీ వరస. ముందు పెళ్ళికూతుర్ని, వాళ్ళ అమ్మని, ఫ్రెండ్స్‌నీ వెళ్లనీయండి. తర్వాత వరసలో మనం మెల్లిగా వెళదాం. అప్పటికి వాళ్లకి కూడా ఏమి కొనాలో ఒక ఐడియా, క్లారిటీ వస్తుంది.” అంటూ పెళ్లికూతురు వైపు చూస్తూ,
“స్వర్ణా! నువ్వు ముందు వెళ్ళు, వదినా, నువ్వు, దాని ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళండి” అంటూ మిగిలిన వాళ్ళని ఆపేసింది. వాళ్ళు నవ్వుకుంటూ కదిలారు. మిగిలినవారు రెండో ట్రిప్‌లో వెళ్లేందుకు హడావిడి పడుతున్నారు. ఏవేవో గొణుక్కుంటున్నారు. జడ్జిమెంట్‌లు ఇచ్చుకుంటున్నారు.. ముభావంగా మారిపోతున్నారు.. అంతలోనే ముఖాన నవ్వు పులుముకుంటున్నారు.
ఉన్నవాళ్ళల్లో పెద్దావిడ గదమాయింపుతో ముందుకు తోసుకు వెళ్లి లిఫ్ట్ ముందు నుంచుంటోంది.
ఇంకో భారీకాయం మొబైల్ ఫోన్లో తన కూతురితో మాట్ల్లాడుతోంది – “ఒసేయ్, మాతో రాలేదని నువ్వేమీ బాధ పడక్కర్లేదులే.. ఇక్కడ మమ్మల్ని కింద వదిలేసి, వెళ్లాల్సిన వాళ్ళు వెళ్లి పోయారు. మనకేం విలువ లేదు. వెళ్లి మన సలహా ఇచ్చేంత సీన్ లేదు. గుంపులో గోవిందాలమే మనం..” అంటూ అక్కసంతా వెళ్లగక్కుతోంది.
మిగిలిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంత క్షాత్రం, గాత్రం చూపించలేని ముసలి ముదితలు తమ కాలంలో చీరలవాడు ఇంటికే వచ్చి ప్రదర్శన పెడితే, చుట్టాలూ, పక్కాలూ వచ్చి సెలెక్ట్ చేస్తుంటే ఎంత సందడిగా, సౌకర్యంగా ఉండేదో వివరిస్తూ, ఇప్పటి పరిస్థితిని ఒకింత ఆక్షేపిస్తూ గోడుమంటున్నారు.
అదే ఫ్లోర్‌లో మరో వేపు ఉన్న కస్టమర్‌లు, ఉద్యోగస్తులూ తమ పని చేసుకుంటూనే వీళ్ళని గమనిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే లిఫ్ట్ రెండు రౌండ్లు కొట్టి ఆ గుంపుని నాల్గవ అంతస్తు జేరేసి భారంగా నిట్టూర్చింది.
***
లిఫ్ట్ మూడో రౌండ్ నాలుగో అంతస్తుకు జేరేసరికే పెళ్లి పార్టీ షాపు పీకి పందిరిస్తోంది. గ్రూపులుగా విడిపోయి ఉన్న నాలుగు కౌంటర్లలో నిండిపోయి వేరేవాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా, సేల్స్ సిబ్బందిని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఒక పట్టాన ఎవరికీ ఏదీ నచ్చట్లేదు. ఒకళ్ళు సెలెక్ట్ చేసింది ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.
“వదినా, ఇది చూడు.. మావిగాయ రంగు చీర.. పైన పూల డిజైన్. స్వర్ణకి బాగుంటుంది.” అంటూ పెళ్ళికూతురు తల్లిని ఒకవేపుకి పిలుస్తుంటే-
“పిన్నీ.. ఈ పింక్ రంగు కంచిపట్టు చీర, నీలం అంచుతో చాలా బాగుంది.. ఇటు రా” అంటూ మరోవైపు నుండి పిలుపు.
పెళ్ళికూతురు తల్లీ ఓపిగ్గా అందరికీ నవ్వుతూ సమాధానం చెబుతూ, నొప్పించకుండా తనకు నచ్చిన వాటినే సెలెక్ట్ చేస్తోంది. రేపు పెళ్లి మంటపంలో వాళ్ళందరూ తలా ఒక చేయేస్తేనే కదా మరి పనులు జరిగేది!
పెళ్లి కూతురు స్వర్ణ మాత్రం ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెబుతూ ఉంది. మధ్య మధ్యలో తల్లి పిలిచి చీర చూపించినప్పుడు, తనకు కూడా నచ్చితే ఫోటో తీసి వాట్స్ఆప్ లో ఫియాన్సీకి మెసేజ్‌లు పంపిస్తూ, అక్కడినుంచి ‘ఓకే’ మెసేజ్ వస్తే, తల్లికి తన ‘ఓకే’ చెబుతోంది.
“స్వర్ణా, ఇలా రా.. ఇదిగో.. ఈ ఎర్ర చీర ఎలా ఉంది? ఉప్పాడ పట్టు. మీ అత్తగారికి ఎరుపు రంగు ఇష్టం అని చెప్పింది.”
తల్లి పిలుపుతో చికాగ్గా మొహం పెట్టి అంది – “ఏదో ఒకటి కొనమ్మా .. నాకు పెట్టకు ఈ సెలక్షన్ తలనెప్పి.”
“నీవు కాసేపు ముచ్చట్లు ఆపి, కూర్చుంటే తొందరగ్గా తెముల్చుకోవచ్చు. నీ కేం కావాలో చూసుకో.”
“నాకు చీరలే నచ్చవు. నాకు డిజైనర్ డ్రెస్సెస్ కోసం నేను బంజారా హిల్స్‌లో మాన్యవర్‌కి వెళ్తానంటే ఈ పాత దుకాణంకి తీసుకొచ్చావ్” విసుగ్గా అంది స్వర్ణ.
“ఆలా అనకు. ఇది మన కుటుంబానికి సెంటిమెంట్ షాప్. మీ అమ్మమ్మ పెళ్లి, నా పెళ్లి, మీ అక్క పెళ్లి.. అన్నింటికీ మనం పెళ్లి బట్టలు ఇక్కడే కొంటున్నాం. మీరు ఇంత గత్తర చేస్తున్నా, షాప్ వాళ్ళు ఊరుకుంటున్నారంటే మనకు పరిచయం ఉండబట్టే. తెలుసా?”
“పోనీలే అక్కా.. స్వర్ణకి ఎలాంటి చీర అయినా అందంగానే ఉంటుంది.”
“అట్లా అని పెళ్ళికి సెలెక్టివ్‌గా తీసుంకుంటేనే కదా కలకాలం గుర్తుండేది.”
“నిజమే గానీ, దానికి స్వేచ్ఛ ఇప్పుడేగా.. ఎంజాయ్ చెయ్యనీ.. రేపు అత్తగారింట్లో ఎలా ఉంటుందో ఏమో?”
“ఎలా ఉన్నా సర్దుకుపోవాలి.. మేం సంసారాలు చెయ్యలేదూ.. ఆడవాళ్ళం. రోడ్డున పడతామా ఏంటీ?” ముసలావిడ దీర్ఘం తీస్తూ అంది.
“ఎందుకు సర్దుకుపోవాలి బామ్మా? సరిపడకపోతే వదిలేసి వచ్చేస్తా. ఏం.. నువ్వు రానీవా నన్ను?” అంటూ ఇంకా ఎదో మాట్లాడుతోంది.
“స్వర్ణా” మందలింపుగా కసిరింది వాళ్ళ అమ్మ.
***
చివ్వున తలెత్తి చూసాడు దూరంగా కౌంటర్ వెనుక కొత్తగా వచ్చిన చీరల్ని నీట్‌గా అలమరాలో సర్దుతున్న శివన్నారాయణ. ఎదురుగా ఉన్న కౌంటర్ దగ్గర వాట్స్అప్ మెసేజ్‌లు చూస్తూ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది స్వర్ణ. స్లిమ్‌గా, తెల్లగా ఉంది. చెంపకి చారడేసి కళ్ళు. అవి కూడా చిలిపిగా, నిర్లక్ష్యంగా, అదో రకమైన ఆకర్షణతో ఉన్నాయి. కాటుక అలవాటు లేనట్టుంది. నుదుటిన నల్ల బొట్టు బిళ్ళ పెట్టింది. ఫాషన్‌గా కత్తిరించుకున్న జుట్టు లోంచీ రెండు పాయలు మొహానికి అటూ ఇటూ ముందుకొచ్చి వెళ్ళాడుతున్నాయ్. చెవులకి వ్రేలాడుతున్న బ్లాక్ మెటల్ జూకాలు అరచేతి సైజు ఉంది భుజాలదాకా వచ్చినై. మోకాళ్ళ దగ్గర చిరిగిన జీన్స్ పాంట్, నడుముకు పైవరకు ఉన్న టీ షర్ట్, హై హీల్స్ చెప్పులతో ఆధునికతకు ప్రతిరూపంలా ఉంది.
‘పెళ్లి కూడా కాక ముందే వదిలేసి వస్తానంటున్న వీర వనిత ఈ అమ్మాయేనా?! పెళ్లికొడుకెవరో గానీ పూర్ ఫెలో’ అనుకున్నాడు.
శివన్నారాయణ సేల్స్‌మాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇరవై ఏడేళ్ల కుర్రవాడు. హైదరాబాద్‌కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ అతని వూరు. ఇంటర్ వరకు చదివి, స్తోమత లేక పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి సింగల్ రూమ్‌లో ఉంటూ చిన్న చితకా పనులు చేసుకుంటూ నెలకి రెండు మూడు సార్లు ఊరు వెళ్లి వస్తూ ఉంటాడు. ఆర్నెల్ల క్రితం తన వూర్లో పోచంపల్లి చీరలు నేసే వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య ద్వారా ఇక్కడ జేరాడు. కొద్దిరోజుల్లోనే అందరికీ పనిలో సాయం చేస్తూ, ‘అన్నా’ అంటూ కలిసిపోయి తలలో నాలుకలా మారిపోయాడు. తన శ్రద్ధ, అమ్మకాల్లో నేర్పరితనంతో త్వరగానే మంచి పేరు తెచ్చుకుని జీతం కూడా పెంచుకున్నాడు. పెళ్లి కుదిరింది. చేసుకోబోతున్నాడు.
శివన్నారాయణ పెళ్లి పార్టీ వాళ్ళని పరిశీలనగా చూసాడు. ఆడంబరంగా అభిజాత్యంగా కనిపిస్తున్నారు. అక్కడ కౌంటర్ దగ్గర యాదగిరి అన్న విసుగు అనేది లేకుండా రకరకాల చీరలు చూపిస్తున్నాడు.
“మైసూర్ సిల్క్‌లో డిజైన్‌లు ఉన్నాయా” అడుగుతోంది స్వర్ణ స్నేహితురాలు.
యాదగిరి శివన్నారాయణ కేసి చూపిస్తూ “ఆ కౌంటర్‌లో ఉంటాయి మేడం” అన్నాడు.
అప్పటికే ఆ కౌంటర్లో అన్నీ చూసి పెదవి విరిచి వెళ్లిన పెద్దావిడ గుంపులో ఒకావిడ “అక్కడ కూడా వెరైటీగా ఏమీ లేవు” అని జడ్జిమెంట్ ఇచ్చింది.
వాళ్ళ తాకిడికి శివన్నారాయణ కౌంటర్ మీద చీరాలన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి.
“శివా.. లోపల నిన్ననే వచ్చిన మైసూర్ సిల్క్ కొత్త స్టాక్ తెచ్చి చూపించు” అన్నాడు యాదగిరి శివన్నారాయణతో.
“అలాగే అన్నా” అంటూ లోపలి వెళ్లి కొత్త మూట ఒకటి తెచ్చి కౌంటర్ టేబుల్ మీద పెట్టి ముడి విప్పదీసాడు.
కొత్త స్టాక్ అనేసరికి, పెళ్లి పార్టీ చిన్నా పెద్దా అందరూ అటు కేసి వడి వడిగా అడుగులేశారు.
శివన్నారాయణ మళ్ళీ పెళ్లి కూతురు కేసి చూసాడు. ‘వాడు, వీడు’ అంటూ పొగరుగా తన స్నేహితురాలితో ఎవరి గురించో చెబుతోంది.
***
శివన్నారాయణకి ‘సువర్ణ’ గుర్తుకొచ్చింది. సువర్ణ తనకు కాబోయే పెళ్లికూతురు. చామనచాయ రంగు. పెద్ద కళ్ళు, వాటికి కాటుక, నుదుటిన ఎర్రటి తిలకం, జుట్టు బిగించి వేసిన జడ, జడలో అమరిన మూర మల్లెపూల దండతో గుళ్లో దేవతలా ఎప్పూడూ ప్రసన్నంగా ఉంటుంది. ఎర్ర రంగు కలకత్తా కాటన్ చీర నూట యాభై రూపాయలదే అయినా, ఒంటినిండా పద్దతిగా కడితే కంటి నిండా ఇంపుగా ఉంటుంది. పెదవి దాటిన మాట మర్యాదతో కలసి నడుస్తుంది. తనని చూస్తేనే గౌరవం కలుగుతుంది.
పెళ్లి గుంపు రణగొణ ధ్వనితో, ఇహంలోకి వచ్చి, మూటలోంచీ ఒకటొకటీ తీసి చూపించటం మొదలెట్టాడు.
“ఇది చూడండి మేడం.. ఎంబ్రాయిడరీ వర్క్‌తో బ్రౌన్ కలర్‌కి వైట్ అండ్ గ్రీన్ లతల బోర్డర్‌తో బాగుంటుంది..”
“బాగుంటుందా.. ఎవరికీ నీకా..” పొగరుగా అంది స్వర్ణ. “నీ సలహా అక్కర్లేదు గానీ, చీరలు ఇక్కడ పెట్టు.. మేమే చూసుకుంటాం”.
“నిజమే .. ఈ కుర్రాడికి పెళ్లి కూడా అయినట్టు లేదు.. చీరల గురించి ఏమి తెలుస్తుందీ? ఒకొటొకటీ తీస్తూ ఉంటే, స్వర్ణ పెళ్లి కూడా అయిపోతుంది” ఎగతాళిగా అంది స్వర్ణ వాళ్ళ మేనత్త. అందరూ పగలబడి నవ్వారు.
శివన్నారాయణ మోహంలో నవ్వు చెదరలేదు. వారన్నట్లు గానే అన్నీ తీసి కౌంటర్ మీద పరచాడు. గుంపు అంతా, తలా ఒకటీ తీసుకుని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
“ఈ రంగు బాగుంది కానీ డిజైన్ బాగా లేదు.”
“ఈ బుటా డిజైన్ మరీ ఎబ్బెట్టుగా ఉంది.”
“గ్రీన్‌కి ఎల్లో బోర్డర్ కంటే ఎల్లో చీరకి గ్రీన్ బోర్డర్ ఉంటే బాగుంటుంది.”
శివన్నారాయణ కూడా వాళ్ళ మాటలు వింటూ, అన్ని చీరల్నీ పరిశీలించసాగాడు. అతని చూపు ఒక చీరమీద నిలిచిపోయింది.
గ్రీన్ అండ్ గోల్డ్ టోన్డ్ చీర. అక్కడక్కడా ఫ్లోరల్ ఎంబ్రాయిడర్‌తో, గోల్డెన్ థ్రెడ్ బోర్డర్‌తో చాలా అందంగా ఉంది. అంతకు ముందే స్వర్ణ స్నేహితురాలు చూసి కామెంట్ చేసి ప్రక్కన పడేసింది. పెళ్లి కూతురు కూడా ఒక లుక్కేసి పోయింది. శివన్నారాయణ మెల్లిగా ఆ చీర వైపు కదలి, చీర వైపే చూడసాగాడు.
‘తన సువర్ణ ఈ చీర కట్టాలే గానీ, దసరా ఉత్సవాల్లో అమ్మోరి లాగ ఎంత రాజసంగా, ఘనంగా ఉంటుందో?’
చీరకు ఒక మూలగా దారంతో కట్టి ఉన్న ధర టాగ్ చూసాడు. రూ. 36,850/-. అని వ్రాసి ఉంది. కళ్ళు తిరిగినంత పనైంది. ఆ టాగ్‌ని చేత్తో పట్టుకుని అలాగే నిలబడిపోయాడు.
దూరంనించి పెళ్ళివారిని గమనిస్తున్న యాదగిరి “శివా.. వాళ్లకి ఏం కావాలో చూడు.. తొందరగా తెముల్చు.. సేటు ఫోన్ చేస్తున్నాడు..” అని హెచ్చరించాడు.
శివన్నారాయణ “అలాగే అన్నా” అంటున్నాడే గానీ ఆ చీరని వదల్లేక పోతున్నాడు. తనకొచ్చే పదిహేనువేల రూపాయలతో ఆ చీరని కొనటం అసాధ్యం. తలకు మించిన పని. తనకు మించిన స్థాయి. కలలో కూడా కొనే అర్హత లేదు తనకి. కానీ..
“ఏయ్.. అబ్బాయ్..” అంటూ పిలిచింది ఓ పెద్దావిడ. శివన్నారాయణ యాంత్రికంగా ఆమె వేపు చూసాడు. అప్పటికే మూటలోని చీరాలన్నీ కుప్పగా పోసేసారు.
“ఆ రాక్‌లో కిందగా ఉన్న చీరలు తీయి నాయనా.”
మిగిలిన వాళ్ళు ‘అక్కడేమి కనిపెట్టిందో’ అన్నట్టు రాక్ వేపు చూస్తున్నారు.
శివన్నారాయణ మెల్లిగా చేతిలోని టాగ్ వదిలేసి చీరని ప్రక్కకి జరుపుతున్నట్టు కదిలిస్తూ, మూలగా పడి ఉన్న వదిలేసిన చీరల కుప్ప కిందకి తోసేసి రాక్ వైపుకి కదిలాడు.
మనసులో మాత్రం ఏదో గిలి. ‘తాను కొనుక్కోలేడు. మరి దాచిపెట్టడం దేనికి? పెళ్ళివాళ్ళు ఎటూ సెలెక్ట్ చెయ్యకుండానే వదిలేసి పోయారు. మరేందుకు తనలా చేసాడు.’
గిల్టీగా ఫీలయ్యాడు.
‘ఇటు పెళ్ళివాళ్ళు తినేస్తున్నారు కొత్త వెరైటీలు చూపించమని. అలా అని ఇప్పుడు వెళ్లి అందరి ముందూ మళ్ళీ బయటికి తీయలేడు.’
అన్యమనస్కంగానే క్రింద వరస చీరల్ని తీసి కౌంటర్ పైన పరచి, ప్రక్కన పడేసిన చీరల్ని మడతపెట్టి ఒక ప్రక్కగా లోపల సర్దుతున్నాడు. అది చూసిన మధ్య వయసు మేనత్త పూనకం వచ్చినట్లు ఒక్కసారిగా అరిచింది. “ఏయ్.. అప్పుడే మడత పెట్టేస్తున్నావేంటి? మా సెలక్షన్ అయ్యేదాకా అక్కడే ఉంచు.”
శివన్నారాయణ భయపడిపోయి, మళ్ళీ ఆ చీరలన్నీ కౌంటర్ మీద పరచాడు. అప్పటికి వాళ్ళు వచ్చి రెండు గంటలు దాటింది.
వాళ్లలో ఒకావిడకి ఫోన్ వచ్చింది. ఆవిడకి సరిగా వినపడదు. అందుకుని స్పీకర్ ఆన్ చేసి పెద్దగా మాట్లాడుతోంది.
అవతల వాళ్ళాయన కామోసు. “ఇంకా ఎంతసేపు షాపింగ్.. ఇంటికి వచ్చేదుందా లేక డైరెక్ట్‌గా పెళ్ళికే వస్తారా?”
“మీరు మరీనండీ.. షాపులో అడుగుపెట్టి రెండు నిమిషాలు కూడా కాలేదు. అయినా మాకున్న స్వేచ్ఛ చీరల సెలెక్షనే కదా.. మొగుళ్ళనీ, పిల్లల్నీ మేం సెలెక్ట్ చేసుకోలేం కదా?”
అందరూ పెద్దగా నవ్వారు.
అవతలి పురుషుడు అవాక్కయి ఫోన్ పెట్టేసాడు. అందరూ మరొక్కసారి తిరుపతి తిరువీధుల్లో ప్రదక్షిణ చేసినట్టు అన్ని కౌంటర్లూ తిరిగి పెట్టుబళ్ళు కోసం వేంకటగిరి కాటన్ చీరలు ఒక ఇరవై సెలెక్ట్ చేశారు.
ఇంతలో పెళ్లికూతురు ఫ్రెండ్ వెనక్కి శివన్నారాయణ దగ్గరకు వచ్చి కౌంటర్ మీద తెగ వెదకటం మొదలెట్టింది.
పెళ్లికూతురు ఆమెని కేకేసింది, “ ఏయ్ సుజీ, ఏమిటే వెదుకుతున్నావ్?”
“ఇందాక ఒక చీర చూసానే.. బాగుంది.. అది కనపడటం లేదు..”
“ఇందాక నేను కూడా చూసాను కానీ నాకేమీ బాగున్న చీరలేమీ కనపడలేదే?”
“అఫ్‌కోర్సు.. ఇందాక అనిపించలేదు.. ఇవన్నీ చూసింతర్వాత అది బాగుంది అనిపించింది”
శివన్నారాయణ ప్రశ్నార్థకంగా వాళ్ళని చూడసాగాడు.
పెళ్లికూతురు తల్లి అడిగింది, “ఎలా ఉంటుందమ్మా ఆ చీర?”
“గ్రీన్ కలర్ ఆంటీ.. గోల్డెన్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది..” చెబుతోందామె.
శివన్నారాయణ గతుక్కుమన్నాడు.
పెళ్ళివారంతా గుంపుగా అక్కడి వచ్చేసారు. మేనత్త పెద్దగా అరుస్తోంది –
“అందుకే నేను మడతలు పెట్టి లోపల పెట్టొద్దన్నాను. ఎందుకంత తొందర.. ఇప్పుడు చూడు.. మళ్ళీ మొదటికొచ్చింది..”
శివన్నారాయణ బెదిరిపోతూ, “నేను మీరు చెప్పగానే లోపలవన్నీ మళ్ళీ ఇక్కడ పెట్టేసాను మేడం.”
“అంటే మేము మళ్ళీ ఒకటొకటీ తీసి వెదుక్కోవాలా?” గయ్యిమందావిడ.
ఇంతలో కిందనుంచి ఫోన్. యాదగిరి మాట్లాడి పెట్టేసి శివన్నారాయణ దగ్గరికి వచ్చాడు.
“శివా, సేటు ఫోన్ చేసాడు. నిన్ను రమ్మంటున్నాడు. వెళ్ళు. విసుక్కుంటున్నాడు” అంటూ తాను పెళ్ళివారి వైపు వెళ్ళాడు .
శివ గుండె జారిపోయింది.
‘తను చేసిన పని సేటు చూసాడేమో?! ఇన్నాళ్ల మంచి పేరు ఒక్కసారిగా మంటగలిసిపోయిందిగా!’ మొఖం మాడిపోయింది.
మెల్లిగా కౌంటర్ ప్రక్కనుంచీ వస్తూ, చీరల గుట్ట క్రింద ఉన్న తన కలల బంగారు జరీ పట్టుచీరని మెల్లిగా పక్కకు కొంత బయటకు కనపడేట్టు లాగి వడి వడిగా బయటకు వెళ్ళిపోయాడు.
మెట్ల దగ్గరకు వెళ్లేసరికి వెనుకనుంచీ పెళ్లికూతురు ఫ్రెండ్ గొంతు పెద్దగా వినిపించింది – “అదుగో.. ఆ చీర అక్కడుంది”.
***
పెళ్లి మంటపం సందడిగా ఉంది. అరటి గెలలతో ఉన్న చెట్లతో, తెల్లటి ముత్యాల పందిరి అలంకరణతో చూడ ముచ్చటగా ఉంది. అయ్యవారు మంత్రాలు చదువుతూ పెళ్ళికొడుకు చేత పూజ చేయిస్తున్నాడు. ఇంటి ముందర వేసిన పందిరిలో ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని తెగ కబుర్లాడేసుకుంటున్నారు అతిథులు. ఆ ముచ్చట్లు ఏమీ వినపడనంత పెద్దగా సన్నాయి, మృదంగం వాయిస్తూ తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాద్య బృందం. ఆడ పెళ్ళివారి కుటుంబ సభ్యులు హడావిడిగా తిరుగుతూ మర్యాదలకు లోటులేకుండా చూస్తున్నారు.
పెళ్లి పీటల మీద కూర్చున్న శివన్నారాయణ గాభరాగా అటూ ఇటూ చూస్తున్నాడు.
కంచి పట్టు దోతీ, జరీ ఉత్తరీయం, బుగ్గన చుక్క, నుదుటిన బాసికం, నెత్తిన తలపాగా, కాళ్లకు పారాణితో ముచ్చటగా ఉన్నాడు. పెళ్లి బట్టల్లో తల్లి అటూ ఇటూ తిరుగుతూ మధ్యలో వచ్చి నుదిటి బాసికాన్నీ, తలపాగానీ సర్ది, చెమట తుడిచి వెళ్తోంది.
వాళ్ళ నాన్న పందిట్లో ముందు వరసలో తన బంధువులు, స్నేహితులతో ముచ్చటలాడుతున్నాడు. మొఖం వెలిగి పోతోంది.
తన కొడుకుది హైదరాబాద్‌లో ఉద్యోగం అంటూ ఇద్దరికీ మాత్రమే చెబుతున్నాడు – అడిగిన వారికీ, అడగని వారికీనూ!
వీడియో కుర్రాళ్ళు మంటపంలో తిరుగుతున్న పేరంటాళ్లను చెదరికొడుతూ, పది రకాల యాంగిల్స్‌లో పెళ్ళికొడుకుని ఫోటోలు తీస్తున్నారు.
తన ఊరి స్నేహితులు వచ్చి శివన్నారాయణని మాటి మాటికీ అడుగుతున్నారు – “మీ షాప్ వాళ్ళు ఇంకా రాలేదు ఏమిటి?” అంటూ.
యాదగిరి అన్న ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకు రాలేదో తెలియటం లేదు. ఆ రోజు.. సేటు పిలిచి గోడౌన్లోని స్టాక్ లెక్క రాసుకుని రమ్మన్నాడు. వచ్చింతర్వాత వివరాలు చెబుతూంటే, ‘నీ పెళ్లికి వెళ్ళిరా, తర్వాత చూసుకోవచ్చు అని తన పెళ్లి వివరాలు అడిగి మరీ సెలవులో వెళ్ళమన్నాడు.’
‘షాపులో తన గురించి ఏమన్నా గొడవయ్యిందేమో’ అని కంగారు పడుతున్నాడు.
‘అలానే జరిగితే, తన మొహం క్రొత్త పెళ్ళికూతురికి ఎలా చూపించటం? సంతోషంగా కబుర్లాడుతున్న తండ్రీ, సంబరంగా తిరుగుతున్న తల్లీ తలెత్తుకుని తిరగ్గలరా?’
ఇంతలో అయ్యగారు “పెళ్ళికూతుర్ని తీసుకురండి” అని ఆర్డరు వేశారు.
పందిట్లోని అన్ని మొఖాలూ మంటపం వైపు తిరిగి, ఆసక్తిగా చూడసాగినాయి. శివన్నారాయణ ముభావంగా తల వంచుకుని కూర్చున్నాడు. ప్రపంచం పట్టనట్లు, మంగళవాయిద్యాలు టాపు లేచిపోయేట్లు మ్రోగుతున్నాయి .
ఒక్కసారి రణగొణ ధ్వని ఆగిపోయింది. మంటపం వెనకాలగా ఉన్న తెర చాటు నుంచి నాలుగడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ రెండువైపులా కర్రలతో కట్టి, ఇద్దరు శివన్నారాయణతో కలసి పనిచేస్తున్న కుర్రాళ్ళు వాటిని పట్టుకుని వచ్చారు.
దాని పైన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ఫోటోలు ఉంది, మధ్యలో ‘నూతన వధూవరులకు శుభాకాంక్షలు – సిబ్బంది, శ్రీనివాస షాపింగ్ మాల్’ అని వ్రాసి ఉంది. చుట్టూతా పూల డిజైన్, చాలా ముచ్చటగా ఉంది. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆ శబ్దానికి తేరుకున్న శివన్నారాయణ వెనక్కు తిరిగి చూసాడు. బ్యానర్‌ను గమనించి కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూశాడు. వాళ్ళు దగ్గరికి వచ్చి బ్యానర్‌ని ఓ ప్రక్కగా తొలగించారు. వెనుక సేటు, ఆయన భార్య, యాదగిరి, మరికొంతమంది సిబ్బంది నవ్వుతూ నిలబడి ఉన్నారు. శివన్నారాయణ సంతోషం ముప్పిరిగొంటుంటే లేచి నించున్నాడు.
“కంగ్రాట్యులేషన్స్ శివా..” అంటూ సేటు ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శివన్నారాయణ కదిలిపోయాడు.
“థాంక్స్ సర్”
యాదగిరి ముందుకొచ్చి ‘శివా’ అంటూ కావలించుకున్నాడు “కంగ్రాట్స్” అన్నాడు.
“థాంక్స్ అన్నా. మీరు రాకపోయేసరికి భయం వేసింది”
“మరి ఇంత సెట్ అప్ చేసేందుకు లేట్ అవుతుంది కదా” అంటూ నవ్వింది సేటు భార్య. శివన్నారాయణ నవ్వాడు.
ఇంతలో అయ్యగారు “పెళ్లి కూతురు ఎక్కడయ్యా?” చిరాగ్గా అరిచాడు.
“ఇక్కడే సారూ” అంటూ సేటు మిగిలినవాళ్ళూ ప్రక్కకు తొలిగారు.
శివన్నారాయణ ఆసక్తిగా చూసి, ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చినాయి. ఎదురుగా –
సువర్ణ పెళ్లికూతురు బుట్టలో మహాలక్ష్మిలా కూర్చుని ఉంది. గ్రీన్ అండ్ గోల్డ్ టోన్డ్ చీర. అక్కడక్కడా ఫ్లోరల్ ఎంబ్రాయిడర్‌తో, గోల్డెన్ థ్రెడ్ బోర్డర్ – తన కలల బంగారు జరీ పట్టుచీర!
ఆశ్చర్యంగా యాదగిరి వైపు చూసాడు. అతడు తల ఊపి, దగ్గరకొచ్చి మెల్లిగా చెప్పాడు –
“ఆ రోజు సేటు గారు నిన్ను సీసీటీవీలో గమనించి క్రిందకు పిలిచి గోడౌనుకి పంపి తర్వాత నాతో మాట్లాడారు. అందరికీ ఇష్టమైన శివకి తన కిష్టమైన చీర ఇద్దాం అన్నారు. అప్పటికప్పుడు అందరితో మాట్లాడాం. అరవై మంది సిబ్బంది తలా అయిదు వందల రూపాయలు వేసుకున్నాం. బాలన్స్ సీటుగారి భార్య ఇచ్చారు. అంతే!”
శివన్నారాయణ సేటు దంపతులకేసి నమస్కారం పెట్టాడు. సేటు నవ్వుతూ, “ఇలా చేయటం మా దుకాణంలో ఇదే మొదటిసారి. ఇలాంటి సంప్రదాయం నీతోనే మొదలైంది. అంతగా అందరికీ దగ్గరయ్యావ్.” అన్నాడు.
ఇంతలో, బుట్ట దిగి సువర్ణ నడుచుకుంటూ పీటలమీదకి వచ్చింది. శివన్నారాయణ శేటు దంపతుల్ని పరిచయం చేసి, ఆమెతో కలసి, వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులందుకున్నారు. యాదగిరి సిబ్బందితో కలసి వచ్చి పలకరించి పందిట్లోకి కదిలాడు.
శివన్నారాయణకు ఇంకా సందిగ్ధంగానే ఉంది.
యాదగిరిని పిలిచి “ అన్నా.. ఆ రోజు పెళ్లి పార్టీ వాళ్ళు ఆ చీరని చూస్తున్నారు కదా?! మరి..”.
యాదగిరి అతని భుజం మీద చెయ్యేసి “అది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేశాం.”
శివన్నారాయణ నమ్మలేకపోయాడు. “మరి ఆ పొగరుమోతు పెళ్లికూతురు ఒప్పుకుందా?”
యాదగిరి నవ్వుతూ, “నీకో తమాషా తెలుసా? కొన్నదెవరు అని అడిగి విషయమంతా తెలిసిన తర్వాత, తన వంతుగా వెయ్యిన్నూట పదార్లు బహుమతిగా ఇచ్చింది.” అని భుజం తట్టి వెళ్ళిపోయాడు.
శివన్నారాయణ కదిలిపోయాడు. అప్రయత్నంగా కళ్ళు చెమర్చినయి పశ్చాత్తాపానికి గుర్తుగా!
కాసేపటికి తేరుకుని, దీర్ఘంగా నిట్టూర్చి సువర్ణకేసి చూసాడు. బ్రహ్మోత్సవాల్లో అమ్మోరు ‘నేనున్నానుగా బంగారం’ అన్నట్లుగా కనిపించింది.
తన మనసు దోచిన బంగారు జరీ పట్టుచీర మరింతగా నచ్చేసింది.
హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కస్తూరి రాజశేఖర్ వృత్తిరీత్యా -విశ్రాంత యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రా బ్యాంక్) చీఫ్ మేనేజర్. ప్రవృత్తి రీత్యా రచయిత, అనువాదకులు.
ఎం. ఏ. (తెలుగు), ఎం.ఎస్. (పబ్లిక్ రిలేషన్స్), ఎం.ఎస్ సి. (గణితం) విద్యార్హతలు. ప్రస్తుతం ఎం. ఏ. (సైకాలజీ) చేస్తున్నారు.
అనువాదకునిగా – నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ వారికి అనువాద/ప్రూఫ్ రీడింగ్ సేవలందించారు. జోతిరావు ఫూలే చరిత్ర, భక్త్ ఖాన్ అనువదించారు. ఈనాడు ఆదివారం పత్రికకు ఎన్నో సిండికేట్ ఆర్టికల్స్ అనువాదం చేశారు.
పి. దినకర రావు గారి ‘Ramblings’ ఇంగ్లీష్ కవితా సంపుటి తెలుగులోకి అనువాదించారు.
వీరి కథలు ఈనాడు ఆదివారం పత్రిక, విపుల (అనువాద కథలు), చతుర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ఓ సారి చూడండి అంతే.. whatsapp ప్రసారభారతి సంచిక’ నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ఎక్కడ ఉన్నా.. ఏమైనా..’ బహుమతి పొందింది
వీరి నవల ‘చక్రవ్యూహం’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో 3వ బహుమతి పొంది 28 వారాల పాటు ధారావాహికగా ప్రచురితమైనంది.
నాటక రచనలు:
– ఆమె త్యాగం (చలం గారి కథకు నాటక రూపం – అజో విభో కందాళం సంస్థ వారి కథా నాటికల పోటీలో ప్రదర్శింపబడింది.)
– నాతిచరామి (న్యూ ఢిల్లీ – శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారు నిర్వహించిన జాతీయ నాటక పోటీలలో 2వ బహుమతి)
– త్వమేవాహం (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో 8 బహుమహతులు), తిరుపతి మహతి స్టేడియం, మరెన్నో వేదికల పైన ప్రదర్శింపబడింది.
– శతమానం భవతి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో జ్ఞాపిక )
– సర్వేజనా సుఖినోభవంతు (హైదరాబాద్ BHEL నాటక పోటీలో ఉత్తమ బాల నటుడు బహుమతి)
– పారిజాతం (డిసెంబర్, 2022 – న్యూ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, జనవరి, 2023 – హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ, జనవరి , 2023 – విజయవాడ లలో ప్రదర్శింపబడింది)
– పరంపర (రస రంజని వారి ఆధ్వర్యం లో 26-10-2023న శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారిచే ప్రదర్శింపబడింది)
– గురుభ్యోనమః
ఇవి కాక, ఈనాడు అదివారం పత్రిక కోసం పుస్తక సమీక్షలు చేశారు. యండమూరి రచనల సమీక్షా వ్యాసానికి బహుమతి పొందారు. 2016 బాంకాన్ సమావేశ పత్రాల ముద్రణలో సహాయ సేవలందించారు. డా. బి. కామేశ్వర రావు వ్రాసిన ‘ఆనంద విజయం’ (బెర్ట్రాండ్ రస్సెల్ ఆంగ్ల రచన – ది కాంకేస్ట్ అఫ్ హ్యాపీనెస్‌కు అనువాదం) కు; సీహెచ్ శ్రీనివాస శాస్త్రి వ్రాసిన ఇంగ్లీష్ రచన – the unanswered questions కు, కొండపల్లి సనత్‌కుమార్ రచించిన ‘శ్రీ సాయి బాబా చరిత్ర’ (ఇంగ్లీష్)కు సంపాదకత్వ బాధ్యలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్ house magazine ‘magicart’ సంపాదక మండలి సభ్యులు.
ఎన్నో కవితలు రాశారు. ‘కాల ధర్మం’ ప్రసిద్ధి చెందిన కవిత. ఆల్ ఇండియా రేడియోలో కవితా శ్రవణం. అభినందన పంచరత్నాలు వగైరాలు.
‘పడమటి ఉషస్సు’ అనే లఘుచిత్రానికి కథ, మాటలు అందించి, నటించారు. Kasturi Dreamworks అనేది వీరి యూట్యూబ్ ఛానెల్.
పలు తెలుగు ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈనాడు – ఆదివారం, విపుల, చతుర పత్రికలకు సబ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఫోన్: 9848378034