[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘బండబారిన శిలల వైపు చూస్తావేం?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కళ్ళ ముందు పరమాన్నం
కనిపిస్తూంటే
ఎంగిలి మెతుకుల కోసం
ఆశ పడతావేం
పండు వెన్నెల్లో
దిండు సవరిస్తూ
అమాశ నిశికై
ఆరా తీస్తావేం
గుండెల నిండా
ప్రేమ పంచేవారున్నా
బండబారిన శిలల వైపు
మొండిగా చూస్తావేం
శాశ్వతమైన అనురాగం
నట్టింట కొలువు తీరగా
గాలివాటం ప్రేమలకై
గోల చేస్తావేం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.