Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బలరాముడు

[2025 ఆగస్ట్ 25 న బలరామ జయంతి సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ]

 

(బలరామ జయంతి ఒక్కో ప్రాంతంలో ఒక్కో తేదీన జరుపుకుంటారు. మన తెలుగు నేలపైన ఈ సంవత్సరం ఆగస్ట్ 25 న జరుపుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కేలండర్‌లో ఇచ్చారు. కనుక నేను 25 అనే ఈ వ్యాసంలో ఇస్తున్నాను)

~

గ్రసేనుడు, దేవకుడు అన్నదమ్ములు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. దేవకుని కుమార్తె దేవకి. పినతండ్రి కుమార్తె పైన కంసుడికి చాలా మమకారం. సొంత చెల్లెలి లాగా చూస్తాడు. దేవకిని వసుదేవుడి కిచ్చి వివాహం చేశాడు. చెల్లెలిని, బావగారితో పాటు అత్తవారింటికి పంపిస్తూ తానే స్వయంగా రథం నడుపుతూ తీసుకువెళుతున్నాడు కంసుడు. దారిలో ఆకాశవాణి “దేవకి అష్టమ గర్భుడు నిన్ను చంపుతాడు” అని చెప్పింది. వెంటనే రథం మళ్ళించి తిరిగి వచ్చి ఇద్దరినీ చెరసాలలో బంధించాడు కంసుడు. వారించిన తండ్రినీ, పినతండ్రినీ కూడా కారాగారంలో పెట్టి తననే ప్రభువుగా ప్రకటించుకున్నాడు. దేవకి చెరసాలలోనే బిడ్డలను కన్నది. పుట్టినవారిని పుట్టినట్లు ఆరుగురిని చంపేశాడు కంసుడు.

ఏడవసారి శ్రీమహావిష్ణువు ఆజ్ఞపై ఆదిశేషుడు దేవకి గర్భంలో ప్రవేశించాడు. “దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుడి తేజస్సుని గోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు” అని యోగమాయని ఆదేశించాడు విష్ణువు. అప్పటికి వసుదేవుడి మొదటి భార్య రోహిణి, కంసుడికి భయపడి గోకులంలో నందుడి ఇంట్లో తలదాచుకుని ఉంది. వసుదేవుడు రాజుగా ఉన్నప్పుడు అతడి ప్రభుత్వంలో గోసంరక్షణ మంత్రిగా పని చేస్తున్నాడు నందుడు. తన ప్రభువు మీద అభిమానంతో ఇప్పటికీ అప్పుడప్పుడు చెరసాలకి వెళ్లి వసుదేవుడిని పరామర్శించి వస్తూ ఉంటాడు.

కొన్నాళ్ళకి రోహిణి మగశిశువుకు జన్మనిచ్చింది. అతడికి బలరాముడు అని పేరు పెట్టుకున్నారు. యోగమాయ చేత ఒక గర్భంలో నుంచీ విడివడి మరో గర్భంలో ప్రవేశపెట్టబడి గర్భసంరక్షణ పొంది జన్మించటం వలన ఆ శిశువుకి సంకర్షణుడు అని పేరువచ్చింది.. అక్కడ దేవకి అష్టమ గర్భంలో విష్ణువు శ్రీకృష్ణుడు అనే పేరుతో జన్మించాడు. పుట్టిన బిడ్డని నందుడి భార్య యశోద పక్కకు చేర్చమని వసుదేవుని ఆదేశించాడు శ్రీమహావిష్ణువు. విష్ణువు ఆదేశం అనసరించి అలాగే చేశాడు వసుదేవుడు. అన్నదమ్ములు ఇద్దరూ గోకులంలోనే పెరుగసాగారు.

చిన్నికృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్ళలో వెన్నను దొంగిలించి తినటం, పశువులను కాయటానికి అడవికి వెళ్ళటం, తోటి గోపాలురతో కలసి ఆటలు ఆడటం వంటి పనులలో బలరాముడు కూడా ఉన్నాడు. కృష్ణుడు పసితనంలోనే పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను మట్టుబెట్టాడు. బలరాముడు కూడా తక్కువవాడేమీ కాదు. గోవులను మేపటానికి వెళ్ళే ప్రదేశానికి కొంతదూరంలో ఒక తాటితోట ఉంది. అక్కడ ధేనుకుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో ఉంటూ, అటుగా వచ్చిన వారిని అమాంతం పెద్దపులిలా మీదపడి నమిలి మింగేస్తూ ఉంటాడు. బలరాముడు ఆ తాటితోట లోకి వెళ్లి ధేనుకాసురుడి నాలుగు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరికొట్టేసరికి ఆ దెబ్బకి కిందబడి చచ్చిపోయాడు. ఆ విధంగా ఆ దారిన వచ్చే మనుషులకి ధేనుకాసురుడి బెడద వదిలించాడు బలరాముడు.

ఇంకో సందర్భంలో ప్రలంబాసురుడు అనే రాక్షసుడు గోపాలుడి వేషం ధరించి ఇతర గోపాలురను భుజాల మీద ఎక్కించుకుని ఆటలాడుతున్నట్లు నటిస్తూ దూరంగా తీసుకుపోయి చంపేసేవాడు. అలాగే ఒకసారి బలరాముడిని కూడా మోసగించాలని భుజాల మీద ఎక్కించుకుని దూరంగా తీసుకుపోయాడు. రానురాను అతడి బరువు ఎక్కువైపోయి భుజాల మీద పెద్ద కొండను మోస్తున్నట్లు మోయలేక చతికిలబడ్డాడు. బలరాముడు అతడిని ఒక్క పిడికిలి పోటుతో యమపురికి పంపేశాడు.

బలరామకృష్ణులు పెరిగి పెద్దయ్యారు. శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ వంటి ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. కకుద్మి అనే రాజుకు చక్కని చుక్క లాంటి కుమార్తె ఉంది. ఆమె పేరు రేవతి. ఆమెకి సరైన వరుడిని నిర్ణయించలేక విధాత ఎవరిని నిర్ణయించాడో తెలుసుకుని ఆయన ఆదేశించిన ప్రకారం చేద్దామని బ్రహ్మలోకం వెళ్ళాడు కుమార్తెని వెంటబెట్టుకుని. ఆ సమయంలో దేవతలు బ్రహ్మదేవుని స్తోత్రం చేస్తున్నారు. ప్రార్థన ముగిసేవరకూ కొద్దిసేపు ఆగి, తర్వాత తను వచ్చిన పని వివరించాడు కకుద్మి. బ్రహ్మ నవ్వి “సత్యలోకంలో కొద్ది క్షణాలు అంటే, భూలోకంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయాయి. నువ్వు చెప్పిన రాజులు ఎవరూ ఇప్పుడు జీవించి లేరు. ఇప్పుడు శ్రీమహావిష్ణువు తల్పం అయిన ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో భూలోకంలో ఉన్నాడు. నీ కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం చెయ్యి” అని చెప్పాడు. కకుద్మి అలాగే నని బ్రహ్మకు నమస్కరించి భూలోకానికి తిరిగి వచ్చి రేవతిని బలరాముడికిచ్చి వివాహం చేశాడు.

శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన కుమారుడు సాంబుడు. అతడు దుర్యోధనుడి కుమార్తె లక్షణను ప్రేమించాడు. లక్షణకి స్వయంవరం ప్రకటించగానే ఆమెను రథం మీద ఎక్కించుకుని వెళ్ళబోయాడు. వెంటనే కౌరవ వీరులు అందరూ అడ్డుపడి అతడితో యుద్ధం చేసి బంధించారు. సాంబుడు దుర్యోధనుడి బందీగా ఉన్నాడని వినగానే కృష్ణుడు మండిపడ్డాడు. యాదవులు యుద్ధానికి సిద్ధపడ్డారు. “కౌరవులు మనకి బంధువులు. వారి మీద కత్తి కట్టటం ధర్మ విరుద్దం. సామ్యంగా మాట్లాడి నేను పిల్లవాడిని విడిపించుకు వస్తాను” అని చెప్పి బలరాముడు హస్తినాపురానికి వెళ్లి, అక్కడికి దగ్గరలో ఒక తోటలో విడిది చేసి దుర్యోధనుడికి కబురు చేశాడు.

దుర్యోధనుడు వచ్చి మొదట సామ్యంగానే మాట్లాడాడు. “మా రాజు ఉగ్రసేనమహారాజు పంపగా వచ్చాను. మా పిల్లవాడిని వదిలి పెట్టు” అని చెప్పాడు బలరాముడు. దుర్యోధనుడు అహంకారంతో “గొల్లవాడు రాజట, మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడట. మీవాడు చేసింది గొప్ప పనా? భీష్ముడి లాంటి మహావీరులని ఎదిరించి విడిపించుకుపోవటం మీ వల్లకాదు” అని వెళ్ళిపోయాడు.

బలదేవుడికి ఆగ్రహం వచ్చింది. ఉగ్రాకారంతో హలాయుధం తీసి భూమిని ఒకపక్క నుంచీ పెళ్ళగించి గంగలో కలపటానికి ప్రయత్నించాడు. హస్తినాపురం ఏటవాలుగా వాలిపోయింది. పట్టణంలోని వారు అందరూ గగ్గోలు పెట్టారు. భీష్ముడు మొదలైన కురువృద్ధులు హుటాహుటిన వచ్చి బలరాముడిని ప్రసన్నం చేసుకుని సాంబుడికి లక్షణను ఇచ్చి వివాహం చేసేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. బలరాముడు శాంతించాడు. వివాహం అయిన తర్వాత కొడుకునీ, కోడలినీ రథం మీద ఎక్కించుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు బలరాముడు.

పాండవుల రాజ్యభాగం కోసం కౌరవులతో మాట్లాడటానికి రాయబారిగా వెళ్ళాడు శ్రీకృష్ణుడు. సంధి పొసగలేదు. యుద్ధం నిశ్చయం అయింది. ఒక పక్క దుర్యోధనుడు బలరాముడికి ప్రియశిష్యుడు. గతంలో అతడికి గదాయుద్ధం నేర్పాడు. మరోపక్క కృష్ణుడు అతడికి స్వయానా తమ్ముడు, పాండవులు మేనత్త కొడుకులు. ఇరుపక్షాల వారూ బంధువులే! ఎవరివైపు యుద్ధం చేయటానికి ఇష్టపడక తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు బలరాముడు.

బలరాముడు మొట్టమొదట ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థంలో స్నానం చేసి పితృ దేవతలకు తర్పణాలిచ్చి, అక్కడనుంచీ బిందు సరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయూనది, యమునానది మొదలైన చోట్ల మునుగుతూ దేవతలకు, పితృదేవతలకు పూజలు చేస్తూ వెళ్ళాడు. అలా వెళ్లివెళ్లి నైమిశారణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉంటున్న మునులు సత్రయాగం (పది నుంచీ వంద రోజుల పాటు జరిగే యజ్ఞాన్ని సత్రయాగం అంటారు) చేస్తున్నారు. బలరాముడిని చూడగానే ఎదురు వచ్చి అర్ఘ్య పాద్యాదులతో పూజించి మర్యాద చేశారు. కానీ అక్కడ ఎత్తైన పీఠం మీద కూర్చున్న సూతుడు మాత్రం లేవలేదు. దాంతో బలరాముడు ఆగ్రహంతో ఉడికిపోయాడు.

“ఏమిటీ వీడి పొగరు? నన్ను చూసి పీఠం మీద నుంచీ లేవలేదే? ఏవో కొన్ని కథలు నేర్చుకున్నంత మాత్రాన మహా పండితుడు అయిపోయాడా?” అంటూ అక్కడ చిన్న దర్భపుల్ల తీసి మంత్రించి సూతుడి మీదకు విసిరేశాడు. అది ఖడ్గంలా రివ్వున వెళ్లి అతడి కంఠం తెగవేసింది. ఈ పరిణామానికి మునులందరూ నివ్వెరపోయారు. “మహాత్మా! శాంతించు. నీకు తెలియని దేమున్నది? సూతుడు వ్యాసభగవానుని వలన సమస్త్ర శాస్త్రాలు నేర్చుకున్న విజ్ఞాని. అతడికి మేమే బ్రహ్మాసనం ఇచ్చాము. బ్రహ్మాసనం మీద కుర్చున్నవాడు మద్యలో లేవటం ఆగమశాస్త్రానికి విరుద్దం అని, నిన్ను చూసి కూడా లేవలేదు. ఈ ధర్మసూక్ష్మం నీకు తెలియదా! అతడిని పునర్జీవితుడిని చేసి యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యేటట్లు చెయ్యి” అన్నారు.

బలరాముడు శాంతించి, “మనులారా! తొందరపడి నేను చేసిన ఈ పనికి చింతిస్తున్నాను. సూతుడు పునర్జీవితుడు కావటమే కాక దీర్ఘాయువు, అరోగత్వము (రోగం లేకపోవటం), సకల విద్యా విశారదత్వము కలిగి ఉండు గాక!” అంటూ మంత్ర జలం జల్లాడు. వెంటనే సూతుడు నిద్రలో నుంచీ మేల్కొన్నట్లు లేచి బలరాముడిని అనేక విధాల స్తోత్రం చేశాడు. వారి వద్ద శలవు తీసుకుని అక్కడ నుంచీ కదిలి కౌశికీనదికి వెళ్ళాడు బలరాముడు. శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని, భీమానదిలో మునిగి కుమారస్వామిని చూసి, కంచికి పోయి కామ కోటిశక్తిని పూజించి, కావేరి వెళ్లి శ్రీరంగనాథుని అర్చించి మొక్కులు చెల్లించుకున్నాడు.

ప్రభాస తీర్థానికి వెళ్లేసరికి అక్కడ ఉంటున్న బ్రాహ్మణులు కౌరవులకూ, పాండవులకూ మహాయుద్ధం జరిగిందనీ, రాజులందరూ హతులయ్యారనీ, కొన్ని అక్షౌహిణుల సైన్యం నశించి పోయిందనీ చెప్పారు. ప్రస్తుతం భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేసుకుంటున్నారనీ చెప్పారు. వెంటనే బలరాముడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. “ఆగండి. మీరిద్దరూ సరిసమానులే! యుద్దంలో గెలుపు ఎవరికీ రాదు. ఇలా పెనుగులాడటం వృథా” అని ఎంత వారించినా భీమ దుర్యోధనులు ఆగలేదు. “సరే, మీ తలరాత ఎలా ఉంటే అలాగే జరగనివ్వండి” అని అక్కడ నుంచీ ద్వారకకు వెళ్ళిపోయాడు.

కౌరవులు వందమందీ మరణించేసరికి గాంధారి పుత్రశోకంతో శ్రీకృష్ణుడిని చూసి “నువ్వు తలచుకుంటే యుద్దం ఆపలేకపోయేవాడివా? బుద్ధిపూర్వకంగా అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రగిలించి నా నూరుగురు బిడ్డలనూ ఆహుతి చేశావు. మా కౌరవవంశం నశించినట్లే నేటికి ముప్పైఆరు సంవత్సరాల తర్వాత మీ యదువంశం కూడా పరస్పర కలహాలతో నశించిపోతుంది” అంటూ శపించింది.

ఆ సమయం సమీపించింది. కాలం తీరితే ఎంతటి వారికైనా పెడబుద్ధులు పుడతాయి. యాదవులు సాంబుడికి ఆడవేషం వేసి అటుగా వెళుతున్న మునులతో “ఈమె గర్భవతి. కొడుకు పుడతాడో, కూతురు పుడుతుందో చెప్పండి” అని అడిగారు. నిజం గ్రహించిన మునులు ఆగ్రహంతో “ఈ మాయా గర్భవతికి ముసలం జన్మిస్తుంది. అది యాదవ వినాశనానికి కారణం అవుతుంది. పొండి!” అన్నారు. మర్నాడు సాంబుడి ఉదరంలో నుంచీ భయంకరంమైన రోకలి బయటకు వచ్చింది. వాళ్ళు భయపడిపోయి బలరాముడి దగ్గరకు తీసుకుపోయారు. “దీన్ని అరగదీసి సముద్రంలో కలిపేయండి” అని చెప్పాడు బలరాముడు. వాళ్ళు అలాగే చేసారు. ఆ చూర్ణంలో నుంచీ తుంగ మొలిచింది.

ద్వారకలో ఎన్నో అపశకునాలు కనిపించాయి. రాత్రుళ్ళు ఎక్కడి నుంచో నల్లటి స్త్రీ వచ్చి తెల్లటి పళ్ళు బయటపెట్టి వికృతంగా నవ్వుతూ నగరమంతా తిరగసాగింది. సూర్యుడు నల్లటి కిరణాలు ప్రసరిస్తున్నాడు. ద్వారకలో స్త్రీలు భర్తలను కాదని స్వేచ్ఛా విహారం చేస్తున్నారు. వండుకుని తినటానికి పెట్టుకున్న ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయి. యాదవులందరూ మద్యం సేవించి ఒళ్ళు తెలియని మత్తులో సముద్రంలో పెరిగిన తుంగగడ్డితో ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించారు. కాల వైపరీత్యాన్ని గుర్తించిన శ్రీకృష్ణుడు తండ్రితో “యాదవులందరూ ఈ విధంగా నశిస్తారని నాకు ముందే తెలుసు. ఇక నేను ద్వారకలో ఉండలేను. అన్నగారితో కలిసి తపస్సు చేసుకుంటాను” అని చెప్పి ద్వారకను వదలి బయటకు వచ్చాడు. బలరాముడు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు.

వెతుకుతూ వెతుకుతూ ఒక నిర్జన ప్రదేశానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. అక్కడ చెట్టుకింద యోగనిద్రలో సమాధి స్థితిలో కనబడ్డాడు బలరాముడు. శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే అతడి ముఖంలో నుంచీ పెద్ద పొడవైన తెల్లటి సర్పం వెలువడింది. దానికి వెయ్యి తలలు ఉన్నాయి. దాని నోరు ఎర్రగా ఉంది. అది సముద్రం వైపు పాకిపోయింది. సముద్రుడు వెలుపలికి వచ్చి ఆ మహా భుజంగానికి స్వాగతం చెప్పాడు. వాసుకి, తక్షకుడు మొదలైన సర్పాలు కూడా వచ్చి ఆదిశేషుడికి స్వాగతం చెప్పి సముద్రంలోకి తోడ్కొని పోయాయి.

అన్నగారు అలా వెళ్ళిపోగానే తాను కూడా శరీరం త్యజించవలసిన సమయం ఆసన్నమైనదని శ్రీకృష్ణుడు కూడా యోగముద్రలో నేలమీద శయనించాడు. ఇంతలో ఒక బాణం రివ్వున వచ్చి ఆయన పాదం తాకింది. మృగమనే భ్రాంతితో వచ్చిన వేటగాడు నీలమేఘ శ్యాముడిని చూసి అపరాధం క్షమించమని పాదాలు పట్టుకున్నాడు. కృష్ణుడు ఆ వ్యాధుడిని ఓదార్చి శరీరం త్యజించి భూమ్యాకాశాలు కప్పివేసే కాంతితో పైకి వెళ్లిపోయాడు. ఇంద్రాది దేవతలు అందరూ ఎదురువచ్చారు. ఆదిశేషుడు, లక్ష్మీదేవి కూడా ఎదురు వచ్చి నమస్కరించారు. విష్ణువు ఆదిశేషుడి మీద పవళించాడు. లక్ష్మి పాదసంవాహనం చేయసాగింది. ఈ విధంగా శ్రీకృష్ణ, బలరామావతారాలు ముగిసిపోయాయి.

(ఈ వ్యాసం రాయటానికి నాకు ఆధారం – 1. పోతన రచించిన శ్రీమద్భాగవతం 2.కవిత్రయం రచించిన మహాభారతం. 3. ఎర్రన రచించిన హరివంశం.)

Exit mobile version