Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బహుమతుల రాజు!

[బాలబాలికల కోసం ‘బహుమతుల రాజు!’ అనే కథని అందిస్తున్నారు శ్రీ బోగా పురుషోత్తం.]

పూర్వం కీళ్లపూడిని కీర్తివర్మ పాలించేవాడు. అతనికి కీర్తిని పొందడం అంటే ఎంతో మక్కువ. ఆ మూలంగా తనను ఎవరైనా పొగిడితే ఎంతటి అన్యాయాన్ని, అయినా మరిచిపోయి క్షమించి వదిలేసేవాడు. ఈ కారణంగా కీర్తివర్మ ఒక్కోసారి ప్రాణసంకటంలో పడేవాడు.

ఓసారి రాజ్యంలో ఓ మహిళ తీరని అన్యాయానికి గురైంది. తన భర్త నుంచి దూరమైంది. పిల్లలను పోషించడం కష్టంగా మారింది. తినడానికి తిండి లేకుండా పోయింది. పస్తులతో కాలం గడిపింది. ఇక చేసేదేమీ లేక ఆ మహిళ రాజును న్యాయస్థానాన్ని ఆశ్ర యించింది.

రాజు న్యాయాధిపతి వైపు చూశాడు. న్యాయాధిపతి వ్యాజ్యాన్ని ప్రారంభించాడు. మహిళ తనను, పిల్లలను అకారణంగా భర్త వెళ్లగొట్టాడని ఆ వేదనకు గురై కన్నీరు పెట్టింది. అది విన్న న్యాయాధిపతి కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి.

అది చూసి చలించిన రాజు “సరైన తీర్పు ఇచ్చి కఠిన శిక్ష విధించండి..” అన్నాడు.

అంతలో మహిళ భర్త “మీరు మంచి మనసున్న వారని తెలుసుకున్నాను..” అని నవ్వుతూ విలువైన వజ్రాల ఉంగరాన్ని రాజుకు కానుకగా ఇవ్వబోయాడు.

ధగధగ మెరుస్తున్న ఉంగరాన్ని చూసి రాజు అన్యాయాన్ని మరిచిపోయి “జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయి.. అంతమాత్రానికే నీ భర్తపై ఆధారపడడం కన్నా నీకు నువ్వే స్వేచ్ఛగా బతుకడం నేర్చుకో..” అని కటువుగా చెప్పి ఇద్దరినీ పంపివేశాడు.

రాజు కానుకలకు, ప్రశంసలకు మురిసి ఓ మహిళకు ఎదురైన అన్యాయాన్ని గ్రహించలేకపోయాడని ఆవేదన చెందాడు న్యాయాధిపతి.

మరో నెల రోజుల తర్వాత కీర్తివర్మకు మరో చిక్కు ఎదురైంది.

ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారింది. సమస్య ఏమిటంటే తన బావమరిది వ్యాపారంలో పెట్టుబడిగా ఒకని వద్ద అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వడ్డీ, అప్పు కలిపి యాభై లక్షలు అయ్యిందని రాజు వద్దకు ఫిర్యాదు వచ్చింది.

రాజు బావమరిది ధగధగ మెరిసే వజ్రపుటుంగరాన్ని చూపాడు. రాజుకు ఎక్కడలేని ఆనందం వచ్చింది. మైమరిచి తన బావమరిది అసలు అప్పు తీస్కోలేదని ఆరోపణ మాత్రమే అని వాదించి బాధితుడిని పంపివేశాడు.

ఈ తీర్పుతో రాజుకు బహుమతుల రాజు అని అపకీర్తి వచ్చింది. అందరూ తనను పొగడడం మాని విమర్శించసాగారు. దీన్ని వినలేక లోలోన ఆవేదన చెందాడు. అపకీర్తి పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సారి వ్యాజ్యాలను ఎలాంటి బహుమతులు స్వీకరించకుండా న్యాయంగా తీర్పులు ఇచ్చినా తనకు అంటిన బహుమతుల రాజు అనే మచ్చ పోలేదు.

Exit mobile version