[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘బహుళాశ్వచరిత్రము: దామరల వెంగళ భూపాలుడు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“చిలుకలలోనం జిల్కలయి చెల్వఁపుఁబొన్నలలోనఁ బొన్నలై
యలరులలోనఁ దామలరులై నునుదీవలలోనఁ దీవలై
తలిరులలోనఁ గెందలిరుతండములై మృదువాణు లగ్ర్యనా
భులు దరహాస లుజ్జ్వలవపుల్ మధురాధర లాటలాడుచున్”
చిలుకల్లో చిలకలై, పూవులలో పున్నాగలై, అలరుల్లో తామరల అలరులై, నునులేత తీగలలో తీగలై, చిగురుటాకుల్లో తండోప తండాలైన ఎర్రకలువ లేతాకులై, కృష్ణుడి అంతః పురకాంతలు మధురాధరలాట లాడుతున్నారట. ఇది 16వ శతాబ్దపు భావకవితకి ఓ ఉదాహరణ, రాసినవాడు ఓ రాజకవి. కావ్యం పేరు బహుళాశ్వ చరితము. దాని కర్త దామరల వెంగళ భూపాలుడు.
“వేంగళమేదినీ విభుఁడు విద్యల నెప్పుడు బ్రొద్దు పుచ్చుచుం
జెంగటం జేరి సత్కవులుచిత్రగతిం దను సన్నుతింపగా
నంగజుఁడో యటంచు వనజాయత నేత్రలు కాంక్ష సేయఁగాఁ
బొంగుచు నుండు రాజ్యరమఁ బూని సురేశ్వర భోగవైఖరిన్”
అని ఉషాపరిణయం కావ్యంలో ఈ కవి గురించి అతని అన్న కొడుకు దామరల అంకభూపాలుడు చక్కని పద్యం చెప్పాడు. ఒకవైపు శాస్త్రాధ్యయనం, ఇంకోవైపు సత్కవులతో కొలువుతీరి వాళ్ల కవిత్వం వింటూ వినిపిస్తూ, వాళ్ల ప్రశంసలు పొందటం ఆయన దినచర్య. అందగాడు కావటాన, వనజాయత నేత్రలు ఆయన అనుగ్రహంకోసం చూస్తారట. ఆయన పాలనలో రాజ్యం పొంగుతూనే ఉందట. దామెరల వెంగళ భూపాలుని భోగం అమరభోగమే నన్నాడు.
సంస్థానాధీశుల్లో జటప్రోలు సంస్థానాధీశుడు సురభి మాధవరాయలు, బిక్కనవోలు కామినేని యెల్లారెడ్డి, విజయనగరము పూసపాటి తమ్మభూపాలుడు, గద్వాల ముష్టిపల్లి సోమభూపాలుడు, వనపర్తి అష్టభాషాకవి గోపాలరాయలు, పెద్దాపురము వత్సవాయ బలభద్ర జగపతి, కాళహస్తి దామెర్ల వెంగళ భూపాలుడు, బొబ్బిలి రావురాయడప్ప రంగరాయ నృపాలుండు, సాలూరు బలారిసింహ నరసింహ రాజసింహ, సురపురము బహిరి సామ నృపాలుడు, నూజివీటి వెంకటాద్రి అప్పరాయ ప్రభువు, సంగమవలస మృత్యుంజయ నిశ్శంక బహద్దరు, మొగల్తుర్రు రాజా కలిదిండి రామరాజ బహద్దరు, పాచిపెంటరాజా త్యాడ పూసపాటి వీరపరాజు,పోలవరము కొచ్చర్లకోట వేంకట రామచంద్ర కృష్ణారావు, జగ్గమపేట చినవేంకట రాయణింగారు, పానగల్లు రాజా పార్థసారధినాయని, లక్కవరము మంత్రిప్రెగడ భుజంగరావు మొదలగు సంస్థానాధీశ్వరులు కృతికర్తలుగా కూడా చరితార్థులైనారు” అని దొణప్పగారు కవిపండితులుగా ప్రసిద్ధులైన ప్రముఖుల్ని పేర్కొన్నారు. దామెర్ల వంశీకుల్లో సాహితీ రంగంలో ప్రసిద్ధులు ఇంకా ఉన్నా వెంగళభూపతే ఎన్నదగినవాడయ్యాడు.
తండ్రి దామరల వెంకటాద్రి భూపాలుడు:
సాహిత్య పరంగా దామరల వెంగళ భూపాలుడు ఎంత ప్రసిద్ధుడో రాజకీయంగా అతని తండ్రి దామరల వెంకటాద్రి నాయుడు అంత ప్రసిద్ధుడు. అంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినవాడు కూడా! లార్జ్ జనరల్ ఆఫ్ కర్నాటక అనీ, గ్రాండ్ వజీర్ టు ది కింగ్ అనీ ఇంగ్లీషు రికార్డ్సులో వ్యవహరించారు. ‘కర్నాటక అని ఆనాడు పిలిచింది నెల్లూరు జిల్లా ప్రాంతాన్నేగానీ, మైసూరు రాజ్యాన్ని కాదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది చంద్రగిరి రాజధానిగా వెంకటపతి దేవరాయలు(1585-1614) పాలిస్తోన్న కాలం. వాణిజ్యము పెంచగా నేలవలెన్” అన్న కృష్ణదేవరాయలవారి సూక్తిని ఆఙ్ఞగా బావించిన వెంకటపతి దేవరాయలు తన రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చాడు. పోర్చుగీసులు, స్పెయిన్ రాజు రెండవ పిలిప్ లతో సంబంధాలు పెంచుకున్నాడు. చంద్రగిరిలో క్రైస్తవ చర్చి నిర్మాణానికి అనుమతించాడు. డచ్ వారికి పులికాట్ వద్ద వ్యాపారం అనుమతిచ్చాడు. అక్బర్ తన సౌరభౌమత్వాన్ని అంగీకరించమని బెదిరిస్తే దీటుగా తిరస్కరించాడు. దామెర్ల వెంకటభూపాలుడు అనే వెంకటాద్రి ఈ ప్రభువుకు బావమరది వరుస అవుతాడని, వందవాసిలో పరిపాలన చేసేవాడని డచ్‌వారి రికార్డుల ఆధారంగా దిగవల్లి వేంకటశివరావు రాశారు.
1586లో విజయనగర జింజీ రాజ్య పాలకుడు కృష్ణప్పనాయకుడు తన సార్వభౌముడైన వెంకటపతి దేవరాయలపై తిరుగుబాటు చేసినప్పుడు సేనాని దామరల వెంకటాద్రి అతన్ని పట్టి బంధించాడు. కొన్నాళ్ల తరువాత తంజావూరు రఘునాథ నాయకుడు మధ్యవర్తిత్వం నెరపి కృష్ణప్పను విడుదల చేయించాడు. అంతవరకూ దామరల వెంకటాద్రే జింజిని పాలించాడు.
చెన్నపట్న నిర్మాతలు:
వెంకటాద్రి, అతని తమ్ముడు అయ్యనృపతి ఈ ఇద్దరూ దామెర్ల సోదరులుగా ప్రసిద్ధులు. ఆ రోజుల్లో పులికాటు దాకా వీరి ఆధీనంలో ఉండేది. అయ్యనృపతి పూనమల్లి పాలకుడిగా ఉండేవాడు. “ప్రళయ కావేరి మైలాపురంబు గల్మి/బీరమున బోర నది మట్టుపెట్టి తండ్రి/పేర దన్మధ్యభూమిని బృథు విభూతి/నలవరిచె జెన్నపట్టణ మయ్యనృపతి” ఉషాపరిణయంలోని ఈ పద్యం అయ్యనృపతి తన తండ్రి పేర చెన్నపట్టణం నగరాన్ని నిర్మించిన తీరుని వర్ణిస్తోంది. వాణిజ్యాలకోసం 1639, జూలై 22న దామరల వెంకటాద్రి భూపాలుడు ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ అధికారి డే దొరతో ఒప్పందం కుదుర్చుకుని “చెన్న కుప్పం” అనే జాలరుల పల్లెని కౌలుగా పొందాడు. మైలాపూరుకు ఉత్తరాన సెయింట్ జార్జికోట కట్టుకుని ఆ ప్రాంతాన్ని ఆంగ్లేయులు మద్రాసు అన్నారు. తక్కిన ఊరంతా చెన్నపట్టణమే!
ఆ వెంకటాద్రి గారి కొడుకు వెంగళభూపాలుడు. తల్లి గురువమాంబ. వీళ్ళది పద్మనాయక వంశం. ఇనిగెల గోత్రం. తన తండ్రి వెంకటాద్రి “వాలూరీపురిపతి” (రాయవేలూరు పాలకుడు), గడికోటమల్ల బిరుదాంకితుడు (గడికోట రాయచోటి దగ్గర ఉంది), “ఆంధ్ర ధరాధినాధుడు”, “కోర్కొండసింహ” బిరుదుడనీ పేర్కొన్నాడు. “భుజాగ్రమహోగ్రజయాంక నిజామశ, హైదులశా కుతుపనశాహ సమాగత హాటకఘోటక ఝాటకరిప్రవరా” అనే బిరుదుల్ని బట్టి గోల్కొండ కుతుబ్ షాహీకి ఇతను సమకాలికుడు. ఈ కుతుబ్ షాహి బహుశా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626) కావచ్చు. దామరల, దామెరల, దామెర్ల ఇలా ఆ ఇంటిపేరుని రకరకాలుగా రాస్తున్నారు.
బహుళాశ్వచరితము కథ:
విదేహదేశానికి మిధిలానగరం రాజధాని. దాన్ని బహులాశ్వుడు అనే రాజు పాలిస్తున్నాడు. మునుల ప్రేరేపణతో కృష్ణుడు సపరివారంగా మిధిలను చూడాలని బయల్దేరాడు. దారిలో హూణ, కాశ, కురాశ, కోసల దేశాలు సందర్శించాడు. మిధిలలో ‘శృతదేవుడు’ అనే మరో కృష్ణభక్తుడున్నాడు. కృష్ణుడు ఒకేసారి రెండు రూపాలెత్తి ఆ ఇద్దరి ఆతిధ్యం స్వీకరించాడు. ఆ నగరంలో కళానిధి అనే మరో కృష్ణభక్తుడు కూడా ఉన్నాడు. అతను వేశ్యాలోలుడై, ఆస్తినంతా వేశ్యకిచ్చి చివరికి కృష్ణుడి భక్తుడిగా మారి ఆయన అనుగ్రహం పొందిన కథ అనుబంధంగా కనిపిస్తుంది. బహుళాశ్వచరిత్రంలో కథ ఇంతే! దామరల వెంగళ భూపాలుడు దీన్ని ఐదు అశ్వాసాల్లో 683 పద్యాల్లో రసవంతమైన కావ్యంగా వ్రాశాడు. కథ లేకుండా, ఒక నాయకుడు, ఒక నాయిక కూడా లేకుండా కావ్యాన్ని రాసిన ఘనుడాయన. అన్ని కావ్యలక్షణాల సమన్వితంగా రాశాడు. “శాస్త్ర సాహిత్యములు మాకె చాల జితమ/ టంచుం గలగూరగంప సేయకుము బాద/రాయణ! కవిత్వ సందర్భ రసము నిలుపు/ మనుచు..” అంటూ కావ్యాల్ని కలగూరగంప చేయొద్దని సుతిమెత్తగా హెచ్చరించాడు.
సంగీత నాట్య సాహిత్య సమ్మేళనం:
పద్యం ఈ రాజకవికి నల్లేరు మీద నడకలా సాగిందనిపిస్తుంది. వీణపాట గురించి వర్ణించే సందర్భంలో రాసిన ఈ పద్యం చూడండి
“వాణిపాణి విపంచికాకల కలక్యాణా స్తికిం జొక్కి వా
క్ప్రాణేశుండె వీణ కాయకుచ వాంతి న్నఖంబొత్తి బ్ర
హ్మాణి హాసముగాంచి కచ్చపీ సమాఖ్యం దానిపై వ్రాయు గీ
ర్వాణ జ్యేష్టుఁడు ప్రోచు వేంకటనృప ప్రద్యుమ్నునెల్లప్పుడున్”
అంటూ ‘ణ’కార ప్రయోగాలు వీణమోగినట్టే అనిపిస్తాయి.
“ఢక్కానినాద భేరి హుడుక్కా పటహఛ్చటాపటు ధ్వనులును స
మ్యక్కాహళ కారవములు దిక్కాండము ప్రక్కలించె
ధిక్కారమునన్”
అంటూ డక్కానాదాన్ని వర్ణించిన నడక అద్భుతంగా సాగుతుంది.
“తిగుడుత తత్తర తకిట ధిక్కిట ధిక్కిట ధిక్కతో తఝం
జగ జగ ఝక్కు ఝక్కు కిణ ఝంకిణ యంచులతాంగి రంగముం
వగఁ జొరఁబాణికై మొరఁబదబుఁగదల్బె వతత్స దోద్ధత
న్ని గళముఁ ద్రెంచుకొన్న రతినేర్పు మహోగ్ర మదావశంబునన్”
అంటూ తన నాట్యకళాభినివేశాన్ని చాటుకుంటాడు. “సరస సంగీతసాహిత్య సకల కళావిచక్షణ” అనే తన బిరుదుని సార్థకం చేసుకున్నాడు.
అద్భుత ఆహార వర్ణనలు:
కృష్ణుడికిచ్చిన విందుని ఈ కావ్యంలో 52 పద్యాల్లో అత్యద్భుతంగా వర్ణించాడు. చారులో మాధుర్యాన్ని, దాన్ని వడ్డించే అందమైన అమ్మాయి సోయగాన్ని కలగలపి చేసిన ఈ వర్ణన చూడండి:
“పులిచాఱువంచె నొక్కతె, పులి చాఱల చీరకఁగట్టి భోక్తలకేకావళిచారు చంచరీకావళి చారు చలత్కవాళి వహి మహి పొగడన్” అని!
“ఔరా కూరల యొప్పిదంబు.. అహో చారుల్ చారులుపో సెబాసు కడుమెచ్చన్ వచ్చు..” అని, గాధేయోపాఖ్యానంలోనూ, “చారులేకాదు బజ్జి పచ్చళ్ల తీరు పేరుకోకున్న యీతైరునీరు మోరు” అని పాంచాలీ పరిణయంలోనూ చారు వర్ణనల కన్నా వెంగళ భూపాలుడి వర్ణన విశేషంగా ఉంటుంది.
“అజ్ఞారే కజ్జాయము, మజ్జారే బజ్జి నీరు మజ్జిగ భళి లా/సౌరభ మజ్జల, గజ్జల మయ్యారె యనిరి కౌశికముఖ్యుల్” ఇలాంటి పద్యాలు వీటిలో చాలా ఉన్నాయి. “అజ్జారే కజ్జాయం” అనగానే మాయాబజారులో “మజారే అప్పడాలు, పులిహోర దప్పళాలు, వహ్వారే పాయసాలు” పాట ఇవన్నీ గుర్తుకొస్తాయి.
“తేనెతోలల్ వలే విలసిలి, తేనతొలల్ చిగురులనెడు తియనవాతెఱలన్/దేనెతెరల్’ గల తెఱవలు, తేనెతోలల్ పంచి రెడల దెప్పలు గాఁగన్. అంటూ ‘తేనెతొలలు’ అనే వంటకాన్ని వర్ణిస్తాడు. తేనెపట్టులాగా మెరుస్తూ, తేనెతెరల్లాంటి తియ్యని అధరాలు కలిగిన తెరవలు అందరికీ తేనెతొలల్ని వడ్డించారంటాడు. బెల్లం పాకం పట్టకుండా వండిన జిలేబీ లాంటివి తేనెతొలలు.
చివరిగా ఒక మాట:
పద్యంలో డక్కా డమడమాలు మోగించినా, వీణా నిక్వాణం వీనుల విందుగావించినా, తథిగిణతోం చిందులు వేయించినా అది దామెరల వెంగళ భూపాలుడికే చెల్లింది. శ్రీనాథుడి తరువాత అత్యధికంగా ఆహార వర్ణన చేసినవాడు ఈయనే! బహులాశ్వచరిత్రము కావ్యంలో పద్యాల్ని అనుకరిస్తూ అనేకమంది భావకవులు, సినీ కవులు చేసిన ప్రయోగాలు ఆ మహాకవికి నీరజనాలే!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.