[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు డా. చంద్రయ్య గురించి వివరిస్తున్నారు శ్రీ పరాల నాగరాజు.]
ఈ సమాజంలోని విద్యార్థులు భావి భారత పౌరులుగా మారి సమాజ శ్రేయస్సులో వారు కూడా ఒక మంచి పాత్ర పోషించాలంటే అది కేవలం ఒక ఉపాధ్యాయుడి వలనే సాధ్యం అవుతుంది. ఇలాంటి విద్యార్థులను తయారు చేసేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తులలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు మా గురువుగారైన డాక్టర్ చంద్రయ్య ఎస్. వీరు ప్రస్తుతం నిజాం కళాశాల (హైదరాబాదు) లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నాలాంటి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
నా గురించి చెప్పుకోవడం అని కాదు కానీ నేను ప్రస్తుతం 2024 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాను. నేను ఈ ఉపాధ్యాయ రంగంలో ఉండడానికి బలమైన కారణం మా గురువు గారు. వారు విద్యార్థుల పట్ల చూపించే ప్రేమ, వృత్తి పట్ల నిబద్ధత నన్ను కూడా ఒక టీచర్‌గా తయారు చేశాయి. అందుకే నాకు మా తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఇష్టమైన వ్యక్తి మా గురువుగారు. ప్రస్తుతం నేను టీచర్, నాకు టీచర్ మా గురువుగారు. ఇప్పటికీ నేను చాలా విషయాలలో వారి సలహాలు సూచనలు పాటిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాను.
ఏంటి వీరి గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు, అందరిలాగా తను కూడా ఒక టీచరే కదా అని అనుకోవచ్చు. కానీ బడిలో పాఠాలు చెప్పే గురువులు చాలామంది ఉంటారు. బడి పాఠాలతో పాటు జీవిత పాఠాలు బోధించేవారు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి కోవలోకి చెందిన వారే మా ఊరి డాక్టర్ చంద్రయ్య గారు. వీరిని మేము చందు సార్ అని ఇష్టంగా పిలుస్తాం.
నేను డిగ్రీ పూర్తి చేసి ఏవీ కాలేజ్‌లో పీజీ మొదటి సంవత్సరంలో చేరాను. మొదటి రోజు భయం భయంగానే కాలేజీలో ప్రవేశించాను. స్నాతకోత్తర తెలుగు శాఖ ఎక్కడుందో తెలుసుకోవడానికి నాకు సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. స్టాఫ్ రూమ్‌కి వెళ్లి “ఎమ్.ఏ తెలుగులో కొత్తగా చేరాను క్లాస్ ఎక్కడుంది సార్?” అని అడిగాను. మా స్టాఫ్ మొత్తం నలుగురు. వారిలో డాక్టర్ చంద్రయ్య గారు మాత్రమే “ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వెళ్లి కూర్చో బాబు” అన్నారు. అసలే హైదరాబాదుకు కొత్త, అందులో కాలేజీ ఇంకా కొత్త. క్లాసులో ఎంతమంది ఉంటారో, అసలే ఆలస్యంగా వచ్చాను ఏమనుకుంటారో అని భయపడుకుంటూ తరగతి గదిలోకి ప్రవేశించాను. తరగతి గది మొత్తం పూర్తిగా నిండిపోయి ఉంది. విద్యార్థులతో కాదు, ఖాళీ బెంచీలతో. ఒక్కడినే ఆ బెంచీల మధ్య చుక్కల మధ్య చంద్రుడిలా కూర్చుండిపోయాను. కాసేపటికే చందు సార్ వచ్చారు. పరిచయం చేసుకున్నారు. “ఎం.ఏ తెలుగు ఎందుకు చదువుతున్నావు బాబు?” అని అడిగారు. అప్పుడు నేను “హాస్టల్ వసతి కోసం సార్” అన్నాను. అప్పుడు చెప్పడం ప్రారంభించారు నాకొక్కడికే – ఎం.ఏ. తర్వాత ఏ కోర్స్ చేయాలి, ఎం.ఏ. తెలుగు వల్ల ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, జీవితంలో ఒక ఉపాధ్యాయుడిగా స్థిరపడితే ఎటువంటి గౌరవం లభిస్తుంది వంటి ఎన్నో జీవిత విషయాలు సుమారు గంటపాటు చెప్పారు. అప్పటివరకు ఎం.ఏ కేవలం ఒక హాస్టల్ వసతి కోసం ఎంచుకున్న నేను, సార్ చెప్పినవన్నీ విన్నాక నా పూర్తి ఆలోచన విధానం మారిపోయింది. తెలుగు చేస్తే ఇన్ని రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయా అనేది సార్ చెప్పేంతవరకు నాకు తెలియలేదు. ఆ తర్వాత దాన్నే ఉద్యోగ అవకాశంగా ఎంచుకొని ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించాను.
క్లాస్ మొత్తం విద్యార్థులు ఉంటేనే పాఠం చెప్పలేని రోజులు అలాంటిది ఒక్కడే వచ్చాడు కదా అని మిగతా అధ్యాపకుల లాగా ఆలోచించకుండా తన వృత్తి ధర్మాన్ని కాపాడుతూ పాఠం బోధించారు. ఆ ఒక్క రోజే కాదు ఎం.ఏ పూర్తయ్యే వరకు అలాంటి సందర్భాలు చాలా జరిగాయి. తరగతిలో పాఠం బోధించడంతోపాటు ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవారు. కాలంతోపాటు మారుతూ ఉండాలని, సమాజంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని, ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోవాలని, పరిగెడుతున్న ప్రపంచంతో పోటీ పడాలని, నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండేవారు. “కళాశాల దశ ముగిసే నాటికి అంటే మీరు ఈ కాలేజీ నుండి కోర్సు పూర్తయి బయటకు వెళ్ళే నాటికి, మేము ఈ సమాజంలో ఎక్కడైనా బ్రతకగలం ఈ పోటీ ప్రపంచంలో నెగ్గగలం అనే నమ్మకంతో కాలేజీ బయట అడుగు పెట్టాలి” అనేవారు. వారి మాటలను అక్షరాల నిజం చేసిన ఎంతోమంది విద్యార్థులలో నేను ఒకడిని.
కాలేజీలో మాత్రమే కాకుండా మిగతా సమయాలలో కూడా అందరితో మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తూ ఉండేవారు. నేను ఇప్పటికీ ఏ సమస్య వచ్చినా వారితోనే పంచుకుంటాను. వారిచ్చిన సలహాలే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. అయినా వారు ఇప్పటికీ “ఇది సరిపోదు నాగరాజు గొప్ప ఉపాధ్యాయుడుగా నీ వృత్తిని నిజాయితీతో, నిబద్ధతతో నిర్వర్తిస్తూ పిల్లల మనసులో స్థానం సుస్థిరం చేసుకొని వారి కష్టనష్టాలలో, విజయాలలో నీ పాత్ర ఉండేలాగా చూసుకో. అప్పుడే నీ వృత్తికి నీకు నిజమైన గౌరవం” అని అంటారు. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నీ మూలాలు మరచిపోకుండా అందర్నీ గౌరవిస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఉత్తమ ఉపాధ్యాయుడుగా అందనంత ఎత్తుకు ఎదగాలి అని ప్రతినిత్యం ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఇలాంటి గురువు దగ్గర నేను విద్యాబుద్ధులు నేర్చుకున్నందుకు నేను కూడా వారి పాత్రను పోషిస్తూ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను.
You must be logged in to post a comment.
జైత్రయాత్ర-12
సంపాదకీయం ఫిబ్రవరి 2021
మంత్రఫలితం
మిర్చీ తో చర్చ-25: ప్రేమ – మిర్చీ… ఒకటే-7
వానపాములు
సిరివెన్నెల పాట – నా మాట – 71 – శివాత్మకమైన పాట
అమ్మణ్ని కథలు!-18
స్వేచ్ఛ
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-10
మాకో చరిత్ర ఉంది
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®