[శ్రీ వడలి రాధాకృష్ణ రచించిన ‘బావాజీ.. బ్రాస్‌లెట్టూ!’ అనే హాస్య కథని అందిస్తున్నాము.]
బావాజీ కులాసాగాను, కుశలంగాను ఉండాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ అలా ఉండడం వల్ల కావడం లేదు. దాని కోసమని తాడి చెట్టెక్కి తెల్ల కాఫీ త్రాగుతున్నాడు. ఈత చెట్టెక్కి ఊటకాఫీని పట్టించేస్తున్నాడు! ఎన్ని కాఫీలు తాగిగినా, కల్లు తాగినా, కిక్కు వల్ల కావడం లేదు. కారణం బాలామణి వల్ల కానీయడం లేదు. బాలామణి స్వయానా మూడు ముళ్ళకు బదులు, గట్టిగా పడి ఉంటుందని నాలుగు ముళ్ళతో తాళిని కట్టేసిన భార్యామణి.
అప్పుడన్ని ముడులు వేసినా, ఇప్పుడు చిక్కుముడుల జీవితంలో చిక్కి శల్యమైపోతున్న మగ పదార్థం తాను. బావాజీ బాలామణి మాటకు ఎదురు చెప్పలేక చావ చచ్చిపోతూ ఉన్నాడు.
“ఆ కొంటెకృష్ణను చూసి నేర్చుకోండి! ఎప్పుడూ ఎంత గొప్పగా హుందాగా వెలుగుతాడో”
“వెలగడం అనేది తర్వాత ఆరిపోవడం కోసమేనే మనసైన పెళ్ళామా!” వంకర్లుపోతూ అన్నాడు.
“కొరుకుడు పడని కబుర్లు చెప్పమాకండి! అదీ ఈ బాలామణి దగ్గర”
“మరల ఏమయిందట!” కుడి చేతి మణికట్టును తడిమి చూసుకున్నాడు. ఒక్కసారి బుర్రలోని మతి మోకాలి క్రిందకు జారిపోయినట్లయింది. అక్కడ బ్రాస్‌లెట్ లేదు. అది తనకు ఇసుక ఇసుమంతైనా లేని, ఇసుక తోట కాలువ లాగ వెలితిగా అన్పిస్తోంది.
“మా నాన్న అంటే ఏమనుకున్నారు? దాన్ని మీకు ఊరికే పెట్టలేదు. ఆ రోజుల్లో మీ గుర్రపుడెక్కలపూడిలో నాన్న అల్లుడికి పెట్టిన బ్రాస్‌లెట్ ఓ రికార్డు.”
“సంచలనం ఏమీ కాదూ?” పెళ్ళానికి కౌంటర్ ఇస్తూ అనేశాడు.
“చెప్పాగా గుర్రపుడెక్కలపూడిలో అల్లుడనే మగ పదార్థానికి బంగారు బ్రాస్‌లెట్ పెట్టిన మొట్టమొదటి మావగారు మా నాన్నే తెలుసా!!” కళ్ళు మిలమిలా మెటకరిస్తూ పలికింది బాలామణి.
అలా అనడంలో సూర్యకాంతానికి తక్కువగాను, ఛాయాదేవికి ఎక్కువగానూ అన్పిస్తూ ఉంది.
“అంతా మిథ్య!” ఫక్కున నవ్వబోయాడు. కానీ పలకమారడంతో వెనక్కి తగ్గాడు.
“మా డాడీ అంతటి డాబుసరి మనిషిని పట్టుకొని ‘మిథ్య’ అని మీద సెటైర్లు వేయడానికి మీకు నోరు ఎలాగ వచ్చిందండీ!!” తనదైన మేనరిజమ్‌తో తమ గుర్రపుడెక్కలపూడికి కూతవేటు దూరంలో ఉన్న శిఖరంపాలెం గుడి మీది శిఖరమంత ఎత్తుకు ఎగిసి పడిపోయింది.
అంతే, బాలామణి కళ్ళు ఎరుపెక్కేసినాయి.
“ఈ ఎరుపులో నా బాల ఎంత బాగుందో తెలుసునా!?” మెత్తగా పలికాడు.
“చాల్లే ఊరుకోండి! మావగారికి తాటాకు మంట పెట్టడము, దానిలో పెళ్ళాన్ని చలి కాగించడమూనూ.”
“అసలు నేనేమన్నానని! ది గ్రేట్ మిథ్యారావు గారిది అంతా మిథ్య అన్నానంతే!”
“అంతే మా డాడీ మిథ్య అనేగా మీ ఉద్దేశం?”
“అది కాదు బాలా, పేరు చివరన ‘రావు’ని నన్ను ఎప్పుడు పలకనిచ్చావు చెప్పు?”
“అంటే ఏమిటి మీ ఉద్దేశం! మా గుర్రపుడెక్కలపూడిలో మా తాతలకి గుర్రాలుండేవి తెలుసా! మా నాన్న దగ్గర కొచ్చేసి అవి సంకలించి పారిపోయాయి, అయిన మాత్రాన మిథ్యారావు గారు ఎప్పుడూ మిథ్య కానే లేదు.”
“……”
“అసలు ఊరు మొత్తానికి ఆ రోజుల్లో కన్న కూతురు పెళ్ళిలో అల్లుడికి అరకాసు బంగారం పెట్టి దులుపుకుపోకుండా, ఏకంగా ఆరు కాసుల బంగారంతో అల్లుడి చేతికి బ్రాస్‌లెట్ చేయించి తగిలించేసిన ఘనమైన మామగారిగా ఈ ఊరిలో చరిత్రలో మిగిలిపోయాడు నాన్న! అటువంటిది..”
“అటువంటిదీ లేదు.. ఇటువంటిదీ లేదు. మిథ్యారావు గారి ఘనమైన చరిత్ర ఎటువంటిదో మిథునవతి గారిని అడిగితే తెలుస్తుంది.”
“చాల్లే ఊరుకోండి! మర్యిలో అమ్మను సీన్ లోకి తెచ్చారంటే ఈ బాలకు రేగుతుంది” ఊగిపోతూ అంది.
“అల్లుడికి అత్తాశ అని ఊరికే అన్నారా చెప్పు! అత్తమ్మ ది గ్రేట్!!”
“మీరు ఏమయినా అనుకోండి, రాత్రి పార్టీలో ఆ కొంటె కృష్ణుడు చేతికి బ్రాస్‌లెట్ వేసుకుంటే ఎంత గొప్పగా ఉన్నాడో!!”
“ఈమధ్య గిల్టు బ్రాస్‌లెట్స్ మార్కెట్లోకి వచ్చి మహా మెరిసిపోతున్నాయి తెలుసా!!”
“తెలుసును! అయినా మా డాడీ పెట్టింది ముప్ఫై క్యారెట్ల బంగారంతో చేయించింది.”
“అంతా మిథ్య!”
“మావ ఇచ్చిన వస్తువును చేతికి తగిలించుకోని గిరుటు అల్లుణ్ణి లోకంలో మిమ్మల్నే చూస్తున్నాను. అందుకే విషయం తెలిసిన నాన్న అదే పనిగా నొచ్చుకుంటాడు ఎప్పుడు.”
“అది కాదు బాలా!”
“వద్దు. ఈ బాలకి ఇక ఏమీ చెప్పొద్దు! రేపు అట్లతద్దికి గుర్రపుడెక్కలపూడి వెళుతున్నాం. నాన్న మన పెళ్ళిలో పెట్టిన బంగారు బ్రాస్‌లెట్‌ని చేతికి పెట్టుకు రావాల్సిందేను!”
బావాజీకి భార్య మాటలు మింగుడు పడకుండా ఉన్నాయి. బిపీ అమాంతంగా పెరిగిపోయేసరికి మనసు బావురుమంటోంది.
“బావా! రాత్రి పార్టీకి దిగిపోతున్నావా!!?” పాణస్నేహితుడు చిట్టిరాజు ఫోన్ చేశాడు.
బావాజీ దిగాలు పడిపోయాడు.
“బావా! మాట్లాడు! ప్రతి ఆటకీ ముందు క్వార్టరు ఫైనల్స్, సెమీ ఫైనల్స్ ఉంటాయి. మరి న్యూ ఇయర్ పార్టీకి ముందు క్వార్టర్లు, సెమీస్లు ఉండకపోతే బార్లు ఏమయిపోతాయి చెప్పు?”
“……”
“బార్లు బావురుమనడం నాకిష్టంలేదు బావా! బావగాడివి నువ్వు మా పార్టీలో లేకపోతే ఆ లోటే వేరు!!” చిట్టిరాజు అదేపనిగా ఆటాడుకుంటున్నాడు.
ఇక్కడ బావ కిక్కురుమనడం లేదు. బ్రాస్‌లెట్ బాగోతం ఒక్కసారిగా చుట్టుముట్టేస్తుంటే బావ హృదయం బావురుమంటోంది. చెప్పాలంటే పరిచయం అయిన ప్రతివాడికీ బావాజీ కాస్తా బావ అయిపోతున్నాడు.
“రాత్రికి నువ్వు గ్లాసు పార్టీకి వస్తున్నావు అంతే!”
“మూడ్ లేదురా!”
“మూడాఫ్ చేసుకుంటే ఎలాగ చెప్పు! దేశం ఏమయిపోవాలి చెప్పు!!!”
బావాజీకి రోతగా ఉంది. చేతిని తడిమి చూసుకున్నాడు. బ్రాస్‌లెట్ లేదు. తాకట్టులో ఉంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ అది అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు అలరించడం తప్ప. తన అప్పుల బ్రతుకులో తాకట్టులోనే ఉంటోంది. కాకబోతే వాకట్టు కాకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.
తన మధ్య తరగతి జీవన మందహాసాన్ని అదేపనిగా గుర్తు చేస్తూ ఉంది. తన చేతిన మెరవదు అంతే. తన అవసరాలు మెరవనీయకుండా చేస్తూ ఉన్నాయి.
పది సంవత్సరాల క్రితం మావగారు పెళ్ళిలో పెట్టిన బ్రాస్‌లెట్. ఆరు సవర్ల బంగారు బ్రాస్‌లెట్.. ఆరిందాలాగ ఉంటుంది. అందంగాను మెరుస్తుంది!! కానీ అదేమిటో పెళ్ళి అయి పది సంవత్సరాలయినా పట్టుమని పది నెలలు కూడ తన చేతిని అంటిపెట్టుకొని ఉండలేదు. ఎప్పుడూ జారిపోతుండింది. తనను దిగజారిపోయేలా చేస్తూ ఉంది.
“మా అయ్య పెట్టిన బ్రాస్‌లెట్!!” బాలామణి వీరలెవెల్లో వీరంగం చేస్తోంది. భార్యకు భర్త పరమ లోకువ అన్న లోక రీతిని నిజం చేస్తూనే ఉంది.
తన చేతిన మెరవదు అంతే! ఇలా వచ్చి అలాగ వెళ్ళిపోతూ ఉంది ఇన్నాళ్ళు.
“అమ్మాయి కడుపు పండలేదు అల్లుడూ. ఓ నలుసు బయలుదేరితే మాకు అదే చాలు” అత్త మిథునవతి తబలకు, మిథ్యారావు నట్టువాంగ మవుతున్నాడు.
“తిని తిరుగుతూ ఉంటే ఎలాగంట! తిరుపతి వెళ్ళి పెద్ద డాక్టర్‌కి చూపించుకోవాలి గాని!”
అత్త పోరు మీద పోరు బావాజీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. బాలామణిని తీసుకెళ్ళి తిరుపతి డాక్టర్‌కి చూపించాడు. అన్ని టెస్టులు చేయించాడు. చారెడంత హాస్పటల్ బిల్లుకి చేతి బ్రాస్‌లెట్ సమాధానమయింది. తాకట్టు పెట్టక తప్పింది కాదు.
కడుపున నలుసు పడగలదన్న ఆశలో, ఆనందంలో బాలామణి ఉర్రూతలూగిపోయింది. చివరకు డాక్టరు గారు ఎందుకు పెదవి విరిచాడో అర్థం కాలేదు. ‘‘అమ్మడు కడుపు పండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామికి దణ్ణం పెట్టుకుపోండి! అదే మీకు నేను చేయదగిన చిట్టచివరి వైద్యం!!!”
పిల్లలు పుట్టరని తెగేసి చెప్పిన తిరుపతి డాక్టరుగారి పెదవి విరుపు బాలామణిని తట్టుకోలేకుండా చేసేసింది. కోసం పెల్లుబికిపోయింది. చిన్న కోర్టులో ఓడితే పెద్ద కోర్టు అన్నట్లు పెద్ద డాక్టరు కోసము పెద్ద దేవస్థానము కోసము వెతుకులాటను ప్రారంభించేసింది. ఏదీ కలిసి రాకపోవడంతో ఆక్రోశం అక్కలరెడ్డి పాలెం ఆయకట్టులాగ పెల్లుబికిపోయింది.
అంతే మతి తప్పిన ఆమె దృష్టి బావాజీ బ్రాస్‌లెట్ మీద పడిపోయింది.
మొగుడు మీద దాని వంక పెట్టి సతాయింపుల పర్వానికి తెరతీస్తూ ఉంది.
“ఆ కొంటె కృష్ణను చూసి నేర్చుకోండి, అదృష్టం. చేతికి బ్రాస్‌లెట్ వేసుకొని తిరిగేవాడు తిరుగులేని మనిషి అవుతాడు” నోటికొచ్చినట్లు మాట్లాడేస్తోంది.
“అది అసలు గొలుసో, సిసలు గొలుసో తెలుసుకోకుండా బాకా ఊదేయడం బాగా లేదు బాలా!!”
చివరకు పెళ్ళాం పెట్టే గృహహింసను భరింపలేక బలవంతం మీద పెద్దవడ్డీకి అప్పు తెచ్చి తాకట్టు వస్తువును విడిపించుకొచ్చేశాడు.
“అద్సరే. మా డాడీ ఫోన్ చేశాడు. మొన్న పెన్నానది వరదలకి పంట అంతా కొట్టుకుపోయిందట! బండి మైనస్‌లో పడిపోయిందట. అల్లుడు గారేమయినా డబ్బులు సర్ది ప్లస్ లోకి లాగి పారేస్తారేమో తెల్సుకోమన్నాడు.”
బావాజీకి ఆవేశం నషాలానికి ఎక్కిపోతోంది. “అల్లుడి గిల్లుడి కాలం పోయి, మామ గిల్లుడు మాయదారి కాలం వచ్చి కమ్మేస్తోంది.” ఆవేశంగా పైకి అనేద్దామనుకున్నాడు. కానీ తర్వాత పరిణామాలన్నీ బుర్రకు తట్టడంతో మౌనం పాటించేశాడు.
“మాట్లాడరే! ఆ రోజుల్లో పెళ్ళిలో అల్లుడికి ఆరు కాసుల బ్రాస్‌లెట్ పెట్టిన ఒకే ఒక్క మావగారి లాగ రికార్డు సృష్టించేశాడాయన. కాలం కలిసిరాక పెన్నా నీళ్ళొచ్చి పంటల్ని ముంచేశాయి గానీ లేకపోతేనా మిథ్యారావు గారంటే ఏమిటనుకున్నారు.”
“అంతా మిథ్య!”
“అసలు విషయం చెప్పక మాట దాటిస్తే నాకు ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది.”
“మావ అడిగాడు.. అప్పు ఇవ్వక చస్తానా! ఇవ్వకబోతే చస్తాను గాని. అయినా అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఎప్పుడు వస్తాయంటావ్?”
“రోజులు ఎప్పుడూ ఒకే లాగుంటాయా చెప్పండి! పంట చేతికి రాకామానదు.. అప్పు తీరకా మానదు!!”
“సొమ్ము చేతి కందాలంటే పెన్నమ్మ తల్లి పొంగకుండా ఉండాలి అంతే!”
“మాటలెందుకు గాని, బ్యాంక్ ఎకౌంట్ నెంబరు యస్.యమ్.ఎస్. చేస్తానన్నాడు నాన్న.”
అంతే బావాజీ గుండె బరువెక్కిపోయింది. చేతికి వ్రేలాడుతూన్న బ్రాస్‌లెట్‌కు మరల రెక్కలు వచ్చేస్తూ ఉన్నాయి.
***
చేతిని తడిమి చూసుకున్నాడు. బ్రాస్‌లెట్ తన చేతిని అంటిపెట్టుకొని ప్రేమగా పలకరించినట్లయింది. ఎంతో కష్టపడి డ్యూటీలో ఓటీలు చేసి దానిని తాకట్టు నుండి విడిపించుకొచ్చాడు. పెళ్ళయిన పది సంవత్సరాల కాలంలో పట్టుకుని పదినెలలు కూడ తన దగ్గర ఉండలేదు. అయినా సహనం వహిస్తూనే ఉన్నాడు.
ఈసారి మటుకు ఎట్టి పరిస్థితి లోను దాన్ని విడనాడకూడదని తన మీద తాను ఒట్టేసుకున్నాడు..? కానీ అంతా మిథ్య, మావ కారణంగా బంగారాన్ని కుదువబెట్టి అప్పు తీసుకురాక తప్పలేదు. తన ఒట్టును మరో మారు తీసి గట్టు మీద పెట్టక తప్పడం లేదు.
***
అత్త మథనవతి చెప్పిన మాటలు నిజం.
“రోజులు ఎప్పుడూ ఒక్కలాగ ఉండవు అల్లుడూ, పడ్డాడు లేచి కూర్చుంటాడు. లేచాననుకున్నాడు పడిపోర్లిపోతాడు. ప్రతి సన్నాసోడికీ ఓ మంచి రోజు ఉంటాది.”
పోయినసారి పోలేరమ్మ తిరునాళ్ళకి సతీసమేతంగా వెళ్ళినపుడు ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నదో అర్థం కాలేదు.
ఏది ఏమయినా అత్తమ్మ మాటలు అత్తరు పూసిన అట్లకాడ లాగ అన్పించసాగాయి.
తను చేస్తున్న ఉద్యోగంలో బుల్లి ప్రమోషన్ వచ్చింది. దానితో బావాజీ ఆర్థికంగా పుంజుకున్నాడు. ఇన్నాళ్ళూ పంటి నొప్పిలాగ ఉన్న పర్సు బాధలు కొంచెం తగ్గసాగాయి,
బావాజీ చేతి బ్రాస్‌లెట్‌ని అపురూపంగా తడిమి చూసుకున్నాడు. మావగారు గుర్తుకు వచ్చాడు. అడిగిన అప్పు గుర్తుకు వచ్చింది. ప్రమోషన్ పుణ్యమా అంటూ బంగారం కుదువ పెట్టకుండానే మిథ్యారావుకి సహాయం అందించేశాడు. ఇక బాలామణి నోటికి ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించేసుకున్నాడు.
***
బావాజీకి రోతగా ఉంది! జీవితం మీద విరక్తి గాను ఉంది. బాలమణికి ఈమధ్య కాలంలో తీర్థయాత్రల పిచ్చి జాస్తిగా పెరిగిపోతోంది. తిరగని ఊరు లేదు, దర్శించని గుడీ లేదు!! పెనిమిటితో బాటు పుణ్యాన్ని మూట కట్టేసుకుంటోంది.
అందులో భాగంగానే ఇప్పుడు కన్యాకుమారి వైపు బయలుదేరిపోయారు.
రైలు ప్రయాణంలో కిటికీ ప్రక్కన ఏమరుపాటుగా కూర్చున్న బావాజీ కుడి చేతి మణికట్టు మీద సగర్వంగా నిలిచి మెరిసిపోతూన్న బంగారు బ్రాస్‌లెట్‌ని ఎవడో దొంగ లాక్కొని పారిపోయాడు.
బావాజీ అరిచి గీపెట్టాడు. బావురుమన్నాడు.. బాలామణి లబోదిబోమంది. జనాలు గుమికూడిపోయారు. కానీ దొంగ దొరకలేదు. ఏదయినా పెళ్ళినాడు తనకు పెట్టిన వస్తువుకు రెక్కలొచ్చి ఎగిరిపోవడం, బావాజీకి ఇదివరకటిలాగ ఉడుకు మొత్తనం ఏమీ లేదు. కారణం తిరిగి గూటికి చేరిపోవడం మామూలు విషయమయిపోయింది. అటువంటిది ఇప్పుడు శాశ్వతంగా తన నుండి దూరంగా జరిగిపోయింది.
“మా ఊరిలో పోలీసు పర్వతాలు నాయుడు గారు డాడీకి మంచి ఫ్రెండ్! ఆయనకు చెప్పి కేసు పెట్టిస్తాను!!”
భార్యచేసి వికృతంగా చూశారు. తనకు నమ్మకం కుదరడం లేదు. ఎప్పుడూ తన దగ్గర లేనిదాని కోసం అంత ఆరాటం..??
“కేసూ లేదు. గీసూ లేదు!”
ఇప్పుడు అతగాడి ప్రాణానికి హాయిగా అన్పిస్తోంది.
అవే మాటలు పదేపదే బాలామణి దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నాడు.
బ్రాస్‌లెట్ పోయిన షాక్ నుండి తేరుకుంటున్నాడు. ఇప్పుడు వికృతిగా లేదు. ప్రకృతిగా ఉంది. బ్రాస్‌లెట్‌ను దొంగ ఎత్తుకు పోయాడన్న బాధ తనను తొలిచేస్తున్నా, మొదటిసారిగా భర్తను అర్థం చేసుకున్న భార్యగా అతగాడిని ఓదార్చడానికి బావాజీ దగ్గరగా జరుగుతోంది బాలామణి.
వడలి రాధాకృష్ణ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. బిట్స్ పిలానీలో ఎం.టెక్, ఆ తర్వాత ఎం.బి.ఏ. పూర్తి చేసి, ఐ.ఎల్.డి.టి. కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. మూడు దశాబ్దాలుగా కథ, కవిత్వ రచనలలో నిమగ్నమై ఉన్నారు. ‘ది రైటర్’ అనే కథతో రచనా ప్రయాణం ప్రారంభించి, ఇప్పటివరకు 700కిపైగా కథలు, 500 కవితలు వ్రాశారు. వారి రచనలు మానవ సంబంధాల్లోని నిసర్గ(స్వభావం) సహజతను, జీవన సంఘర్షణల్ని సానుకూలంగా ఆవిష్కరిస్తాయి. వ్రాయకుండా ఉండలేనపుడే వ్రాయడం వారి స్వభావం. వైవిధ్యభరిత వస్తువులు, నూతన కథాకథన శైలితో ఆయన కథలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
డా. వల్లభనేని నాగేశ్వరరావు స్మారక సాహితీ పురస్కారం, కుర్రా కోటి సూరమ్మ స్మారక పురస్కారం, కొడవటిగంటి కుటుంబరావు స్మారక సాహితీ పురస్కారం, డాక్టర్ నాగభైరవ స్మారక సాహితీ పురస్కారం, గోదావరి మాత సాహితీ పురస్కారం, పాతూరిపురస్కారం, తిక్కన రచయితల సంఘం వారి సాహితీ పురస్కారం.. అంతేగాక పలు సాహితీ సంస్థల నుంచి సత్కారాలు పొందారు. ‘సహజ సాహితి’ అనే సంస్థను స్థాపించి సాహితీ, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తున్నారు.