Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాసట

[షేక్ కాశింబి గారు రచించిన ‘బాసట’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మ్మ వద్దు వద్దన్నా
నాన్న ఆగు ఆగన్నా
ప్రాణవాయువు నందించే
పైరగాలి తరగలా
పరుగు పరుగున వచ్చి గువ్వలా
సందిట్లో ఇమిడి పోతావు..
జవాసత్వాలుడిగిన నా దేహానికి
కొత్త నెత్తుటి ఊరటని చవి చూపిస్తూ..

లేత శరీరపు చిగురాకు పచ్చదనం
నీరెండ లోని చిటికెడంత వెచ్చదనం
కలగలిసిన నీ సుతిమెత్తని స్పర్శతో
నా ఒంట్లో కొడిగట్టిన ఆశా వత్తి నెగదోసి
మిణుకు మిణుకు మనే ప్రాణ దీపానికి
ఆనందపు సత్తువని జోడించి
జీవన కాలాన్నొకింత పొడిగింప జేస్తావు
నిష్కల్మషమైన నీ ప్రేమ నూనె చుక్కలనందిస్తూ..

మరిచిన వారికెల్లా
మరీ మరీ గుర్తు చేస్తూ
ఒంటరిదనపు చీకటిలో ఉన్న నాపై
సమూహపు వెన్నెలవై కురిసి
మిగిలిన ఆయువు బాటెంతున్నా.. ధీమాగా
నడిచేందుకు బాసటగా నిలుస్తావు..
హద్దుల్లేని నీ ముద్దుముచ్చట్లతో
పసిదాని వైనా.. పరిణత మనో సంస్కారంతో!

(మూడున్నరేళ్ళ నా మనుమరాలు చిన్నారి మైజాహ్ నుద్దేశించి..)

[గమనిక: ఈ కవితలో ఉపయోగించిన చిత్రం ప్రతీకాత్మకమైనది మాత్రమే. కవయిత్రి, వారి మనవరాలిది ఫోటో కాదు. ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రం]

Exit mobile version