[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]
మద్రాసుకు ఆహ్వానం
ప్లేగు వ్యాధి పైన తన ఆయుర్వేద అస్త్రాల ప్రయోగం విజయవంతం కావటంతో యువకుడూ ఆవేశపరుడూ అయిన గోపాలాచార్యుల మనసులో కొత్త ఆశలు చిగురించాయి. అల్లోపతి వైద్యాన్ని స్థిరపరచాలని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న కుట్రకు తలొగ్గక నిలిచిన మైసూరు రాజా వారిని ఆయన మనసారా అభినందించుకున్నారాయన.
1895: అనతి కాలంలోనే గోపాలాచార్యులవారి ప్రతిభ దేశం అంతా వ్యాపించింది. మనవాడు, మన ప్రావిన్సుకు చెందిన వాడనే భావన మద్రాస్ పురప్రముఖులకు కలిగింది. మద్రాసు రాష్ట్రంలోని ప్రముఖులు – సర్ ఎన్. సుబ్రహ్మణ్య అయ్యర్, కృష్ణస్వామి అయ్యర్, పి.వి. కృష్ణస్వామి శెట్టి ప్రభృతులు గోపాలచార్యుల వారిని మద్రాసుకు ఆహ్వానించారు.
ఆయన మద్రాస్ చేరేనాటికి ఇప్పటిలా అక్కడ ఎలక్ట్రిక్ దీపాల్లేవు. కిరసనాయలు వేసిన తగరపు బుడ్లు వాడేవారు. తరువాత గ్యాస్ లైట్లు, పెట్రోమాక్స్ లైట్లు వగైరా వచ్చాయి. 1910కి గానీ మద్రాసులో విద్యుద్దీపాలు వెలగలేదు.
మనుషులు తమ ప్రయాణ అవసరాల కోసం గుర్రాలను కట్టే పెట్టెలు, మూడుచక్రాల వింతబళ్ళు వాడేవారు. అప్పటికి తన నివాస స్థానమైన బెంగళూరు పరిస్థితి కూడా ఇదే! అప్పటికి నాగరికత అంతకే పరిమితం.
ప్రజలకు మేలుచేసేది, దేశీయమైనది, తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద వైద్య విధానాన్ని కేవలం అసూయతో అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు ఆంగ్లేయులు.
ఆంధ్ర ప్రజల్లో కూడా మనది అనగానే సహజమైన చిన్న చూపు. ఆధునిక వైద్య విధానం ఇంగ్లీషులో బోధించబడినంత మాత్రాన అదంతా బ్రిటిష్ వారి స్వంతం ఎంతమాత్రమూ కాదు. అందులో ప్రపంచ దేశాల పరిశోధనలు ఎన్నో ఉన్నాయి. అల్లోపతి వైద్యాన్ని ఆంగ్లేయ వైద్యం అనుకోవటం బ్రిటిష్ వారి భ్రమ!
అందుకే, ప్లేగు కొంచెం వెనకపడ్డాక ఆయుర్వేద జీర్ణోద్ధరణ పైకి ఆయన మనసు మళ్లింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలనే సూక్తి ననుసరించారాయన! ఏ మద్రాసులో ఆయుర్వేద అణచివేత ముమ్మరంగా ఉందో అక్కడే తన అవసరం కూడా ఉన్నదనే నిర్ణయానికొచ్చారాయన.
1895లో ఆయన మద్రాసుకు చేరారు. అప్పుడే ఆయనకు ఆయనకన్నా కొద్దిగా చిన్నవాడైన మరో యువకుడు, మేధావి కె.యన్. కేసరి పరిచయం అయ్యారు. ఆయన ద్వారా కన్యకా పరమేశ్వరి దేవస్థానం & ఛారిటీస్ వారితో పరిచయం అయ్యింది.
ఆనాటి వైశ్యప్రముఖులు జాతీయోద్యమ స్ఫూర్తితో దేశీయతను పరిరక్షించాలనే లక్ష్యంతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనేక ఆసుపత్రుల్ని నెలకొల్పారు. ఆయుర్వేద సేవలు చేయాలనేది వారి సంకల్పం.
ఆడబోయిన తీర్థం లాగా ఈ సంస్థ గోపాలాచార్యుల వారి లక్ష్యానికి తోడయ్యింది. సంస్థ లక్ష్యాలూ, ఆయన ఆదర్శాలూ ఒకటే కావటాన కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆయనకొక గొప్ప సాధనంగా మారింది.
వాళ్లు నెలకొల్పనున్న ఆసుపత్రిలో ప్రధాన వైద్యుడిగా గోపాలాచార్యులవారు నియమితులయ్యారు. మైసూరు అనుభవం తరువాత కథకి మద్రాసు మరో మలుపు
మద్రాసులో ఉచిత ఆయుర్వేద వైద్యశాల స్థాపన
ఒకపక్క నగరంలోని ప్రసిద్ధ ఆలొపతి ఆసుపత్రులకు విపరీత ప్రచారం ఇచ్చి ప్రజల్ని వ్యామోహపరుల్ని చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయుర్వేదం అశాస్త్రీయమైనదని నమ్మించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏ సత్యాన్ని ప్రస్తావించినా అది ప్రూవ్ కాలేదు అనటం ఓ ఎత్తుగడ. నూట పాతికేళ్ల తరువాత కూడా అదే మాట.. ప్రూవ్ కాలేదు అనే! ప్రూవ్ చెయ్యరు. డిస్ప్రూవూ చెయ్యరు. ఇది అశాస్త్రీయం అని నిరూపించరు. నిరూపణ కాలేదంటూ కాలం వెళ్ళబుచ్చుతుంటారు. స్వాతంత్ర్యానంతరం వచ్చిన భారతీయ ప్రభుత్వాలు కూడా ఈ నాటికీ ఈ ఎత్తుగడనే అనుసరిస్తున్నారు.
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ధర్మ ఆయుర్వేద వైద్యశాల 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో అద్భుంగా తన కార్యకలాపాలు కొనసాగించి ఆయుర్వేద చరిత్రను తిరగరాసింది.
పేరులోనే సూచించినట్లు, ఇది ధార్మిక దాతృత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ. ఇది జార్జ్ టౌన్‌లోని కొత్వాల్ చావడీ ప్రాంతంలో ఉన్న శ్రీ కన్యాకా పరమేశ్వరి దేవస్థానంకి అనుబంధంగా నడిచింది.
ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు డా. కె.ఎన్.కేసరి తన బాల్యస్మృతుల్లో చెప్పిన ప్రకారం, ఈ ఆసుపత్రి ఆరంభానికి ఆలయ పూజారులు మరియు ఆర్య వైశ్య వాణిజ్యవేత్త పాలూరి రాజన్ చెట్టి ముందడుగు వేశారని!
మద్రాసులోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం మద్రాసు వైశ్యవాడ మధ్యలో ఈ ఉచిత ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించింది.
1908లో ఈ ఆసుపత్రి ప్రచురించిన ఒక ప్రకటన ప్రకారం, 1898 ఆగస్టు 14న ప్రారంభమై, మొదటి ఏడాదిలోనే 14,731 మంది రోగులకు సేవలు అందించింది. మొదటి దశాబ్దం ముగిసే సరికి ఈ సంఖ్య 69,000 మందికి పెరిగింది.
శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన ఉచిత హాస్పిటల్లో దీవి గోపాలచార్యులవారి పాత్ర గురించిన ఆధారాలకు ఆయన తన స్వంత ఫార్మసీ గురించిన డిస్క్రిప్టివ్ కేటలాగ్ కొంత సమాచారం మనకు అందిస్తుంది.
“నేను ఆయుర్వేద వైద్య కుటుంబంలో పుట్టాను.కానీ పెద్దవుతున్న కొద్దీ, ఆయుర్వేద శాస్త్రాన్నిపాశ్చాత్య వైద్య విధానాల లాంటి సంస్కృత విధానంలో ప్రజలకు అందించాలనుకునేవాడిని. అందుకే మైసూర్ మహారాజ్ సంస్కృత కళాశాలలో చేరి ఆయుర్వేద వైద్యాన్ని అభ్యసించాను. చదువు అయిపోయాక భారత్ అంతటా ప్రయాణించి ఇతర ప్రాంతాల్లోని ఆయుర్వేద పద్ధతులను అధ్యయనం చేసాను. తరువాత బెంగళూరులోని ఒక డిస్పెన్సరీలో పనిచేస్తూ వైద్యసూత్రాలను విజయవంతంగా అమలు చేశాను. 1901లో, మద్రాస్‌లోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన ఉచిత ఆసుపత్రిలో ప్రధాన చికిత్సకుడిగా చేరాను” అని వ్రాసుకున్నారు. ఆయన జీవిత చరిత్రకు ఇదే ఆధారం.
అసైన్మెంట్ పొందిన వెంటనే, ఆసుపత్రి విధానాల్లో ఆయన ప్రముఖ మార్పులను తీసుకువచ్చారు. ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించారు. అనేక దీర్ఘ, తరుణ వ్యాధులకు నాణ్యమైన చికిత్సలు అందటంతో ఆసుపత్రికి అనతి కాలంలోనే ప్రసిద్ధి ఏర్పడింది.
జాతీయోద్యమం ఆయుర్వేద పునరుద్ధరణకు ఒక వేదిక కాగా, జాతీయోద్యమం పట్ల బ్రిటిష్ వ్యతిరేకత ఆయుర్వేద వ్యతిరేకతగా పరిణమించింది. దేశభక్తి ప్రేరేపితుడైన గోపాలాచార్యులవారికి జాతీయోద్యమ భావావేశపరుల అండ దొరికింది.
“ఆయుర్వేదాన్ని పాక్షికత లేకుండా లోతుగా అధ్యయనం చేస్తే, అది మానవాళికి అద్భుతమైన లాభం చేకూరుస్తుంది” అంటూ, మైసూరు, బరోడా, కాశ్మీర్, జైపూర్ వంటి రాజులు, దేశభక్తులు, దాతలు ఆయుర్వేద పునరుజ్జీవనానికి చేయూతనివ్వాలని లేఖలు వ్రాశారు. “లేకపోతే ఈ మహత్తర వైద్యవ్యవస్థ ఆచరణలో నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది” అన్నారు.
ఆయుర్వేద కళాశాల స్థాపన
నాలుగేళ్ళపాటు అహోరాత్రులు శ్రమించిన కారణంగా ఆసుపత్రి బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా రూపొందింది. కన్యకాపరమేశ్వరి ట్రస్టుబోర్డు సభ్యులను ప్రేరేపించి వారి చేత ఒక ఆయుర్వేద కళాశాలను ప్రారంభించేలా ఒప్పించారాయన.
గోపాలచార్యులవారు ఈ కళాశాల ప్రిన్సిపాలుగా, ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి, మెడికల్ సూపరింటెండెంట్‌గా బహుముఖీన పాత్రలు పోషించారు. ఈ కళాశాలలో ఉచిత విద్య, తక్కువ ఖర్చుతో వసతి కూడా కల్పించారు. వైశ్యుల వదాన్యతను ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
అంతకు పూర్వం ఆసుపత్రిలో ఇన్-పేషెంట్స్ విధానం ఉండేది కాదు. వచ్చిన రోగులను వచ్చినట్టు చూసి పంపించేసేవారు. గోపాలాచార్యులవారు ఆ పద్ధతిని మార్చి, ఆధునిక వైద్య విధానాలన్నింటినీ ప్రవేశపెట్టారు.
సాధారణ ఆసుపత్రులు మెడికల్ కాలేజీని అనుబంధంగా ఉంచిన విధంగా, ఆయన ఆసుపత్రి కమిటీతో కలిసి ఆయుర్వేద కాలేజీని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో విద్యార్థులు దేశీయవైద్యశాస్త్రంలో శిక్షణ పొందారు. సంస్కృత గ్రంథాలను గోపాలచార్యులవారు, ఇతర ఉపాధ్యాయులు పాఠ్యాంశంగా బోధించేవారు.
ఆలొపతి వైద్య పద్ధతులలో శిక్షణ పొందిన డాక్టర్లు విద్యార్థులకు హైజీన్ వంటి ఆధునిక పాఠ్యాంశాల్ని కూడా బోధించారు. తద్వారా ఆధునిక వైద్యాన్ని కూడా సమాంతరంగా నేర్చుకో గలిగారు విద్యార్థులు. జ్ఞానం విషయంలో ఆయుర్వేద విద్యార్థులు ఒకింత ఎక్కువేనని నిరూపించాలనేదే గోపాలాచార్యులవారి తపన.
ఆయుర్వేద కోర్సు కోసం ప్రత్యేక పాఠ్యక్రమం రూపొందించారు.విద్యార్థులు 25 ఏళ్ల లోపు వయస్సు గలవారై ఉండాలని, సంస్కృత భాషలో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలనీ నియమం ఏర్పరచారు.
నెలకు 10 రూపాయలు దేవస్థానం నుంచి ఇవ్వగా, మరో 10 రూపాయల్ని గోపాలాచార్యులవారు తన జేబులోంచి ఇచ్చారు.
ఉన్నత విద్యార్థులకు నెలకు రూ.15 ప్రత్యేక వేతనం ఇచ్చే విధానం కూడా ఏర్పాటైంది. ఈ నిధులు ఆయన స్వంతంగా నెలకొల్పిన మద్రాస్ ఆయుర్వేద ల్యాబొరేటరీ నుంచి వచ్చేవి.
జార్జ్ టౌన్, అచ్చప్పన్ స్ట్రీట్‌లో నెలకొన్న ఈ ప్రయోగశాల మహామారి (ప్లేగ్) పైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుండీ, విదేశాల నుండికూడా విద్యార్థులను ఆకర్షించిన అంశం ఈ లేబరేటరీయే!
ప్రతి సంవత్సరం డిసెంబర్లో పరీక్షలు జరిగేవి. వాటికి భారతదేశం నలుమూలల నుండి ప్రసిద్ధ ఆయుర్వేద, అలోపతి వైద్యులను పరీక్షాధికారులుగా ఆహ్వానించేవారు. అవసరమైనంత మేరకు ఆధునిక వైద్యం కూడా నేర్పించారు. తులనాత్మకంగా విద్యార్థి అధ్యయనం చేయటానికి ఇది ఎంతగానో తోడ్పడింది.
1905లో మొదటి బ్యాచి పట్టాలు పొందారు.
ఆయుర్వేదానికి ఆధునిక దృక్పథం
“పాత తాళపత్ర గ్రంథాలను చదవడమే సరిపోదు. విద్యార్థులు ఆధునిక శాస్త్రాల ఆధారంగా కూడా అభ్యసించాలి. రోగికి మేలు చేసే ఏదయినా అది ఉత్తమ ఔషధం; రోగిని నయం చేసే వాడే ఉత్తమ వైద్యుడు.” అని తన విద్యార్థులకు ప్రబోధించారు గోపాలాచార్యులవారు.
పాశ్చాత్య వైద్యశాస్త్రం అందించిన పద్ధతులను స్వీకరించమని విద్యార్థులను ప్రోత్సహించారు.
కళాశాలలో తాళపత్రాలను ముద్రిత పుస్తకాలుగా మార్చి బోధించారు.
విద్యార్థులకు కూర్చోవటానికి బల్లలు, లెక్చర్ హాళ్లు ఏర్పాటు చేశారు.
మైసూరు, మద్రాసు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలకు ఆర్థిక సహాయం చేశారు.
విద్యార్థులు ఒకే శాస్త్రంలో కాకుండా అనేక శాస్త్రాలలో పాండిత్యం పొందాలని, ఆధునిక శస్త్రచికిత్సా జ్ఞానం నేర్చుకోవాలని ప్రోత్సహించారు.
పాశ్చాత్య వైద్యుల్ని కళాశాలలో బోధించేందుకు ఆహ్వానించారు.
దీని వలన ఆయన విద్యార్థులు పూర్తి పండితులు, మంచి వైద్యులుగా తయారయ్యారు. శ్రీయుతులు నోరి రామశాస్త్రి, ఎం దొరస్వామి అయ్యంగార్, అగ్నిహోత్రం పార్థసారధి, వేటూరి శంకరశాస్త్రి, ఎన్ మాధవమీనన్, యేటూరి శ్రీనివాసాచార్యులు, మల్లాది రామమూర్తిశాస్త్రి, దీననాథమిశ్రా ఇలా ఎందరో ఆ కళాశాలలో చదివి ప్రముఖులుగా రాణించారు.
ఆయుర్వేదాశ్రమ స్థాపన
1897–1901 మధ్య గోపాలచార్యులవారు ఆయుర్వేద ఆశ్రమం స్థాపించారు.
పాశ్చాత్య శాస్త్రం, పాశ్చాత్య వైద్యం ప్రాధాన్యం పొందుతున్న కాలం అది! ప్రభుత్వం పని గట్టుకుని ఆయుర్వేదాన్ని కించపరిచేలా వ్యవహరించేది బజారు వైద్యం అని పేరుపెట్టి ఈసడించేవాళ్లు. అలోపతి వైద్యులు రోగి ముందే ఆయుర్వేదాన్ని కించ పరుస్తూ మాట్లాడేవాళ్లు. శాస్త్రీయవైద్యం కాదంటూ గేలి చేసే వాళ్లు. తమ మూలాల్ని, తమ పునాదుల్ని మరిచిపోయిన మనవాళ్లు కూడా దొరల భాషకే వంత పాడేవాళ్లు.
ఆ రోజుల్లో ప్రజలు సంస్కృతంలో చదవటానికి సంకోచించేవారు. ఈ భాషా అవరోధాన్ని అధిగమించడానికి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఆయుర్వేద పండితులు ఆయుర్వేద గ్రంథాలను తెలుగు పద్యాల రూపంలో సులభంగా అర్థమయ్యేలా రచించారు. వాటిలో రాయసం పేరయ్య “నవనాథ సిద్ధసారం”, “వైద్యచింతామణి”, “శరభరాజియం”, “నేత్రదర్పణం” ముఖ్యమైనవి. అయితే ఆ సమయంలో బృహత్రయీ వంటి గ్రంథాలను తెలుగులో బోధించడం చాలా కష్టమైన పని. కానీ గోపాలచార్లు ఆ సవాలను స్వీకరించి, తెలుగులోనే బృహత్రయీని బోధించారు.
ఆయన స్వాతంత్ర్య సమరయోధులతో కలసి ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన పెంచారు. “ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల” పేరుతో అనేక విలువైన హస్తప్రతులను సేకరించి, వాటిని తెలుగులో అనువదించి ప్రచురించారు. ఈ శ్రేణిలో సుమారు 20 ఆయుర్వేద గ్రంథాలు వెలువరించారు. వాటిలో మాధవనిదానం, ఆయుర్వేద పరిభాష, పథ్యాపథ్యము, రసప్రదీపిక, భేషజ కల్పము, అగస్త్య వైద్యము, ఆయుర్వేద శల్య తంత్రము, వస్తికర్మము, అర్కప్రకాశము వంటి గ్రంథాలు ముఖ్యమైనవి.
తన కాలంలో ఆయుర్వేద ప్రాచీన గ్రంథాలకు తెలుగు అనువాదాలు, వ్యాఖ్యానాలు సమకూర్చిన అరుదైన పండితుడిగా గోపాలచాయులవారు నిలిచారు.
1919లో ఆయన “ధన్వంతరి” అనే పత్రిక ప్రారంభించారు. ఇందులో ఆయుర్వేద పరిశోధనా ఫలితాలు ప్రచురించబడేవి. తరువాత ఈ పత్రికను ఆచంట లక్ష్మీపతి స్వీకరించి, ఆయుర్వేద వైద్యులలో విశేష ఖ్యాతి పొందేలా తీర్చిదిద్దారు.
1914లో తమిళనాడు మెడికల్ రిజిస్ట్రేషన్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ సందర్భంలో దివి గోపాలచార్లు సంప్రదాయ వైద్య విధానాలు కూడా ప్రభుత్వ నియంత్రణలోకి రావాలని గట్టిగా వాదించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరికీ వైద్యాన్ని ఆచరించే హక్కు ఉండకూడదు. ఆయన కార్యనిర్వాహక మండలి సభ్యులు, న్యాయమూర్తులు, ప్రముఖులను కలసి, “ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం ప్రజలూ – ప్రభుత్వమూ కలసి చేయాల్సిన కర్తవ్యమే” అని స్పష్టం చేశారు.
“వైద్యంలో నైపుణ్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. వైద్య జ్ఞానం, అనుభవాన్ని ప్రజల మేలుకోసం, దేశ పురోగతికోసం ఉపయోగించాలి. అదే వారి రాజకీయ అభివృద్ధికి కూడా ఒక పథం అవుతుంది.”
ఔషధ తయారీ ఆధునీకరణ
చెన్నపురి జార్జ్ టౌన్లో ‘మద్రాసు ఆయుర్వేద లాబొరేటరీ’ని స్థాపించారు.
భారీగా ఔషధాలు తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేశారు. ఇవ్వాళ పెద్ద పెద్ద ఆయుర్వేద ఔషధ తయారీదార్లకు ఆయన మార్గదర్శకుడు.
56 ప్రత్యేక ఔషధాలు, వందలాది ప్రాచీన ఆయుర్వేద ఔషధాలను తయారు చేశారు. వివిధ వ్యాధుల వారీగా మందుల జాబితా, వాటి ప్రయోగాలు, మోతాదు, పథ్యాపథ్యాలు, వాటి ధరల పట్టిక కూడా ప్రచురించారు.
1908లో ప్రచురించిన డిస్క్రిప్టివ్ కేటలాగులో ఔషధ నిర్మాణానికి వారు అనుసరించిన విధానాన్ని వివరించాయి.
వారి ఆసుపత్రిలో మందుల నిల్వ గదిని ఎక్కువ మంది సందర్శకులు చూసారు. అందులో అన్ని ఔషధాలు వ్యాధులవారిగా వర్గీకరించి, దూరానికి కనిపించేలా లేబుల్స్ వేసి ఉంచారు.
ప్రజల ఫిర్యాదుల కోసం ఒక పెట్టెను ఉంచారు. అందులో ఒక ఫిర్యాదు దారుడు “రోజుకు 200 మందికీ పైగా రోగులను చూసే ఆసుపత్రికి గది చిన్నది.” అని వ్రాసి చీటీ వేశాడు. ప్రజలు ఆసుపత్రి అభివృద్ధిని మనసారా కోరుకున్నారనటానికి ఇది సాక్ష్యం.
ఆ ఉచిత ఆసుపత్రిలో ఓపీ విభాగం ఎలా కళకళలాడుతూ ఉండేదో ప్రత్యక్షసాక్షిగా అవటపల్లి నారాయణరావుగారు విశాలాంధ్రము పుస్తకంలో ఇలా వ్రాశారు:
“ఆచారప్పన్ వీథి: ఆయుర్వేదాశ్రమం. కొంచెం పొట్టి, కాస్త స్థూలమైన ఆకారం, కాళ్లు దిగిన పెద్ద పట్టుకోటు, జరీపోగులు వేసిన మస్లిన్ తలగుడ్డ, బ్రహ్మతేజస్సును ప్రతిఫలిస్తున్న ముఖం. శాంతమైన చూపులు, ఋషి సంప్రదాయాన్ని సూచించే పెద్ద గెడ్డం యిలాటి లక్షణాలున్న మహాపురుషులొకరు బల్లముందు కూరుచుండి ఏవో మందులకు సంబంధించిన చీట్లను ఆడువారికి, మగవారికి, పిల్లలకూ వ్రాసి యిస్తూ, అందరి క్షేమాన్నీ విచారిస్తూ ధైర్యపు మాటలు చెప్పుతూ, చిరునవ్వుతో పంపి వేస్తూవున్నారు.
వచ్చేవారు వస్తున్నారు, వెళ్లేవారు వెళ్లుతున్నారు. తెంపులేదు. ఆ బల్లకు కొంచెం అవతలో ఏవో ఓషధులు రాసులు రాసులుగా పడివున్నాయి. రవంత వెనక్కు పోతే పెద్ద పెద్ద యిత్తడి కాగులలో ఏవో ద్రావకాలు కాగుతున్నాయి. స్త్రీలు పంక్తులు పంక్తులుగా కూరుచుండి కల్వాలమీద మందులను నూరుతున్నారు. ఏ ప్రక్క చూచినా వ్యాధి నిర్మూలనానికీ, ఆరోగ్యాభివృద్ధికీ జరుగుతున్న కోలాహలమే!
సుమారు పాతిక సంవత్సరాలు ఆంధ్రదేశానికే కాదు, భారతవర్షం అంతకున్ను ఒక నూతన సందేశాన్ని యిచ్చి, ఒక నూతన వుత్సాహాన్ని కల్పించి, జీర్ణమైన ఆయుర్వేదాన్ని వుద్దరించడానికై అవతరించి, మహాయజ్ఞాన్ని ప్రారంభించిన యీ ఆశ్రమవాసులే ఆయుర్వేద మార్తాండ, వైద్యరత్న, పండిత గోపాలాచార్యులవారు.”
1904లో మద్రాస్ హైకోర్ట్ జడ్జ్, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడుగా కూడా తరువాతి కాలంలో పనిచేసిన వకీలు శ్రీ వి. కృష్ణస్వామి అయ్యర్ “ఆయుర్వేద ఆసుపత్రి అనే సంకల్పం ప్రోత్సహనీయమైనది, ఇంకా ఇలాంటి మరిన్ని ఆసుపత్రులు రావాలి.” అంటూ ప్రశంసించారు. ఈ కృష్ణస్వామి అయ్యర్ గారే 1915లో మహాత్ముడు తొలిసారి చెన్నై వచ్చినప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. దీవి గోపాలాచార్యులవారిని ప్రభావితం చేసిన ప్రముఖుల్లో కృష్ణస్వామి అయ్యర్ ఒకరు.
ఔషధ నిర్మాతగా..
పూణేలోని ఆయుర్వేద మహాసభలో ప్రసంగిస్తూ గోపాలాచార్యులవారు ఇలా అన్నారు:
“ఆయుర్వేద ఔషధాల తయారీకై కావాల్సిన పదార్థాలన్నీ మన దేశంలోనే లభ్యమవుతాయి. వాటి కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మహాయుద్ధమో, ప్లేగో, ఫ్లూనో వచ్చినా మనకెంత కావాలంటే అంత పొందగలం.”
గోపాలాచార్యులవారు శాస్త్రసిద్ధమైన, శ్రేష్ఠమైన ఔషధాలను ప్రత్యేకంగా తమ ఆయుర్వేదాశ్రమంలో తయారుచేయించి, దేశీయమహాజనసభకు అనుబంధంగా దేశీయ వస్తు ప్రదర్శనలకు పంపిస్తూ, దేశీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు.
ఆయనకు పరిచయం లేని, ఆయన్ని అభినందించని జాతీయ నాయకుడు ఆనాడు లేరంటే ఆశ్చర్యం లేదు.
ఆనాటి జాతీయోద్యమ నాయక త్రయం లాల్, బాల్, పాల్ ముగ్గురితోనూ ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వారివలన తాను జాతీయతా స్ఫూర్తిని పొందారు. వారిలో ఆయన దేశీయ వైద్యాన్ని ఉద్ధరించటమే దేశభక్తి అనే భావనను బాగా నూరి రంగరించి పోశారు. ఆ విధంగా జాతీయోద్యమాన్ని దేశియ వైద్య ఉద్యమంగా మార్చగలిగారు గోపాలాచార్యులవారు.
మరాఠా యోధుడు బాలగంగాధర తిలక్ పూనేలో ప్లేగు మహమ్మారి వచ్చినప్పుడు దాని నివారణకు గోపాలాచార్యులవారి సహకారాన్ని తీసుకున్నారు. ఆయుర్వేదం శక్తిని స్వయంగా దగ్గరగా పరిశీలించి నిర్ధారించుకున్నారాయన! పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ గోపాలాచార్యులవారిని ఎంతగా గౌరవించేవారంటే, లాహోరులో ఆయుర్వేద ఆసుపత్రికి గోపాలాచార్యులవారిని తీసుకువెళ్లి ఆయనతో శంకుస్థాపన చేయించారు.
అవుటపల్లి నారాయణారావుగారు ఇలా వ్రాశారు:
“ఆనరబుల్ మహామహోపాధ్యాయ గంగాధరశాస్త్రి, ఆనరబుల్ రావుబహద్దూరు విద్యావినోది ఆనందాచార్యులు, డాక్టరు సర్ బాలచంద్రకృష్ణ, మహామహోపాధ్యాయ కవిరాజ ద్వారకానాథసేన్ లాంటి మహామహుల అభినందనలను పొందుతూ, తమ ఔషధాలకు ప్రతిష్ఠను గోపాలాచార్యులవారు సంపాదించుకొన్నారు. కాని, వీటి నన్నిటిని వొక యెత్తుగాను, వారి ప్లేగు ఔషధాలను యింకొక యెత్తుగాను గణింపవలసివుంది. దేశం నాలుగు ప్రక్కలా ప్లేగు బయలుదేరి ప్రజను తినివేస్తున్న సమయంలో వారి హైమాది పానకం. శతధౌత ఘృతం యెందరి ప్రాణాలనో కాపాడి, చాలా ఉపకారం చేసినాయి. ఇందుకై వారిని శ్రీశ్రీ గద్వాల మహారాణీవారు సువర్ణపతకంతో సన్మానించారు.”
ఆయన ఎన్నో పరిశోధిత గ్రంథాలు వ్రాశారు. సుశ్రుత సంహిత, మాధవనిదానాది గ్రంథాలకు ఆధునిక దృష్టితో వ్యాఖ్యానాలు వ్రాసి జీర్ణ గ్రంథాలను వుద్ధరించారు. తమ పుస్తకభాండాగారంలో పరిశోధకులకు వసతులు కల్పించారు
రాజకీయంగా ప్రభావవంతులైన వారితో అనుబంధాలు కలిగి, దేశవ్యాప్తంగా ఆయుర్వేద వర్గాలను ఏకం చేసి అడ్డంకులను తొలగించడానికి కృషి చేశారు. సంపాదనలో ఒక భాగాన్ని నిర్భందంగా ఆయుర్వేద అభివృద్ధికి సమర్పించారు. ఆయన జీవితం మనకు ఒక బోధన
“ధర్మం చేయాలంటే మరణం ప్రతి క్షణం మనల్ని లాక్కెళ్తున్నట్లుగా త్వరగా చేయాలి” అని చెప్పిన మాటలే ఆయన ఆచరణలో చూపారు.
కాస (దగ్గు), మధుమేహం, ఊపిరితిత్తులు, రక్తహీనత, పేగు సమస్యలు, జుట్టు నష్టము, కడుపు సమస్యలు, నరాల బలహీనత వంటి అనేక వ్యాధుల కోసం ఔషధాలు సిద్ధం చేశారు.
“తమ ఆశ్రమంలో ఔషధాలను తయారుచేయడానికిన్ని, తమ ధర్మ వైద్యశాలలో రోగులను పరీక్షించి ఔషధాలు నిర్ణయించడానికిన్ని, తమ ప్రయత్నాల నన్నిటిని కేంద్రీకరించే నిమిత్తమై శ్రీ బొబ్బిలి మహారాజవారు అలాగే, డాక్టరు సర్ సుబ్రహ్మణ్య అయ్యరు, సర్ పి. త్యాగరాయశెట్టి, దివాన్ బహద్దూరు రాజరత్నం మొదలియారు మొదలయిన ప్రముఖుల యాజమాన్యం క్రింద ఆయుర్వేద ప్రచారిణీ సభను స్థాపించారు. తమ ఉద్యమ వ్యాప్తికై ఒక ముద్రాలయాన్ని, ఒక వార్తాపత్రికను నెలకొల్పారు.
ధన్వంతరి ఉత్సవాలలో మద్రాసులో సభలు చేయించి ఆయుర్వేద ప్రచారం చేయిస్తూ వచ్చారు.
స్వాతంత్ర్య సమరంలో పోరాట యోధుడిగా
గోపాలాచార్యుల వారికి దేశీయతా భావాన్ని దేశీయ వైద్యం పట్ల అభిమానాన్ని, దేశీయ వైద్యాన్ని అభివృధ్ధి పథంలోకి తీసుకువెళ్లాలనే సంకల్పానికి అప్పుడే ఆరంభదశలో ఉన్నప్పటికీ జాతీయోద్యమం ఎంతగానో ప్రేరణ నిచ్చింది! అప్పటికి ఇంకా వందేమాతర ఉద్యమం, బెంగాల్ విభజన లాంటి సంఘటనలు జరగలేదు. తరువాతి కాలంలో ప్రసిద్ధి చెందిన నాయకులెవ్వరూ అప్పటికి ఇంకా ఉద్యమంలోకి రాలేదు.
1885 నుండి 1905 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమం అంతా మితవాద యుగం. ప్రార్థన, విఙ్ఞప్తి, నిరసన విధానాలు మాత్రమే అవలంభించే వారు. దానికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ జాతీయవాదులపైన గుర్రుగా ఉండేది.
ఎ.ఓ హ్యూమ్, గోపాలకృష్ణగోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా లాంటి నాయకులు ఉండేవారు. వీళ్లు తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా జాతీయతాభావాన్ని పెంపొందించేవారు.
మద్రాసుకు సంబంధించినంత వరకూ, 1852లో గాజుల లక్ష్మీనరసు శెట్టి (మద్రాస్ నేటివ్ అసోసియేషన్, క్రిసెంట్ పత్రిక), 1884లో పి. రంగయ్యనాయుడు (మద్రాస్ మహాజనసభ), 1885లో పార్థసారధి నాయుడు (ఆంధ్రప్రకాశిక వారపత్రిక), 1891లో నాగపూర్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తెలుగు వాడు పి ఆనందాచార్యులు, భారత జాతీయ కాంగ్రెస్ కు కార్యదర్శిగా పనిచేసిన న్యాపతి సుబ్బారావు ప్రభృతులు ఆనాడు గోపాలాచార్యుల వారిని ప్రభావితం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు.
ఆ రోజుల్లో గోపాలాచార్యులవారు లేనిదే రాజా రామ్మోహన రాయికి నగరంలో వార్షికోత్సవమే జరిగేది కాదని, బీచి దగ్గర జరిగే సమావేశాల్లో ఆయన ప్రముఖంగా కనిపించేవారనీ సమకాలికుల వ్రాతల్లో కనిపిస్తుంది.
కాంగ్రెస్ సభలు ఎక్కడ జరిగినా సభాస్థలిలో ఆయన ఒక స్టాలు అద్దెకు తీసుకుని తన ఆయుర్వేదాశ్రమం పక్షాన ఉచిత వైద్యశిబిరం నిర్వహించేవారు. ఎక్కడ చూసిన ఆయుర్వేదం పేరు వినబడాలనేదే ఆయన లక్ష్యం.
(ఇంకా ఉంది)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.