Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యులు-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలాచార్యులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

వైద్యవేత్త, జ్ఞానమూర్తి, సత్యసంధుడు, దేశప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచిన ఆయుర్వేద కర్మయోగి పండిత దీవి గోపాలాచార్యులవారు.

ఆయుర్వేదాన్ని చిదిమేయాలని ఆంగ్ల ప్రభుత కంకణం కట్టుకున్నప్పుడు, దేశంలో భారతీయ భైషజ్య దీపాన్ని వెలిగించి, వైద్యసేవా మార్గంలో శిఖరానికి చేర్చిన మహోన్నత సేవామూర్తి.. తెలుగువాడుగా జనించి, దివ్య దివిసీమ దీపమై వెలిగిన కారుణ్యమూర్తి ఆయన.

ధర్మం, కర్మ, జ్ఞానం, దయ, వినయం, ప్రజల సేవలో సాక్షాత్కారం – ఇవి ఆయన జీవితం.

నిఖిల దేశమూ గుర్తించిన వైద్య పండితుడిగా, నాయకుడు, పండితుడు, జనపదోధ్వంశ వ్యాధుల సంకట సమయాల్లో నివారకుడై ప్రతి రోగికి సాంత్వనగా ఆయుర్వేదాన్ని అందించిన అమృత కలశి ఆయన.

ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను సేకరించి, పరిశీలించి, వివిధ ఆయుర్వేద పద్ధతులను విస్తరించి సరళీకరించి, విద్యార్థులకు అందించటం ద్వారా భారతీయ వైద్యం దీర్ఘకాలం నిలిచేలా చేశారు.

కేరళ నుండి లాహోరు దాకా అఖండ భారతదేశంలో ఆయుర్వేద జ్యోతి ప్రకాశింపచేసిన వైద్యగురువు. రాగ-ద్వేషాలను దాటిన యోగిపుంగవుడు.

పండిత గోపాలాచార్యులు కేవలం ఆయుర్వేద పండితుడు, ప్రచారకుడు మాత్రమే కాదు, అపారమైన దేశభక్తి కలిగిన జాతీయతావాది కూడా. స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా నిలబడి, స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి కదిలారు.

తిలక్ సమకాలికుడాయన. ఇద్దరూ కొద్దిరోజుల వ్యవధిలోనే మరణించారు. కలిసి తిరిగి కలిసి వెళ్లిపోయారు.

ఆ ఇద్దరికీ సన్నిహితులైన ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు శ్రీ కాశీనాథుని నాగేశ్వర రావు 1921 అంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచికలో ఆ ఇద్దరి జీవిత చరిత్రలను ప్రత్యేకంగా ప్రచురించి నివాళు లర్పించారు.

పైకి వినయంగా కనిపించినా, ఆయుర్వేద అభివృద్ధి కోసం తన స్వేచ్ఛను కాపాడడంలో ఆయన అణగదొక్కలేని సంకల్పి. ఆయుర్వేద రహస్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జనసామాన్యానికి అందించేందుకు నిరంతరం కృషి చేశారు. శాస్త్రీయ దృష్టి కలిగిన పండితుడిగా సత్యం కోసం పోరాటం చేశారు. ఆయన కృషి వల్ల ఆయుర్వేదానికి కొత్త ఊపిరి వచ్చింది.

బ్రిటీష్ ప్రభుత్వపు నిర్లక్ష్య విధానాలపై ఆయన ధైర్యవంతమైన, స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు:

“ఈనాటి ఆయుర్వేద స్థితి దురవస్థకుగల కారణం మన అజ్ఞానం, నిర్లక్ష్యం, బ్రిటీష్ ప్రభుత్వానికి మన శాస్త్రాలపై అనురక్తి లేకపోవడం. మన అభివృద్ధి వారికి పట్టదు.”

జననం

దీవి గోపాలాచార్యులుగారి జననం గురించిన వివరాలను గణించి ఆచంట లక్ష్మీపతిగారు తేల్చిన తేదీ అక్టోబరు 10, 1872.

కృష్ణాజిల్లా, భావదేవరపల్లి (దివిసీమ)కి చెందిన సాంప్రదాయకవైద్య కుటుంబం వీరిది. మచిలీపట్టణంలో మాతామహులు శ్రీమాన్ అగ్నిహోత్రం కోదండరామాచార్యుల ఇంట జన్మించారు.

తండ్రి రామకృష్ణమాచార్యులు, తల్లి రాజ్యలక్ముమ్మల ప్రథమ సంతానంగా జన్మించారు. పదమూడేండ్ల వయస్సు వరకు మచిలీ పట్టణంలోనే తెలుగు, సంస్కృతం చదివారు. స్వతహాగా వైద్యుల ఇంట పుట్టినవాడు కాబట్టి ఆయుర్వేద వైద్యం పట్ల ఆసక్తి మెండుగానే ఉంది. కానీ, అనుభవ వైద్యంగా కాకుండా శాస్త్రీయంగా ఆయుర్వేద వైద్యాన్ని చెప్పించాలని తండ్రి తలంపు. అందుకనే మొదట సంస్కృతభాషలో నిష్ణుతుడు కావాలని ఆ తండ్రి గోపాలాచార్యుల్ని ప్రేరేపించారు.

గురువు కోసం అన్వేషణ

గురువు లేని విద్య గుడ్డివిద్య. ఏ విద్య అయినా, నేర్చుకోవాలంటే గురువు అవసరం తప్పనిసరి. మనిషి జన్మించిన క్షణం నుంచే నేర్చుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితాంతం విద్యార్థే! ఈ విద్యను సరైన మార్గంలో అందించటానికి, మనలను సరైన దిశలో నడిపించడానికి గురువు అవసరం.

గురువు అనగా అంధకారాన్ని తొలగించే కాంతి. మనకు శాశ్వత ఆనందం, శాంతి, సత్య మార్గాన్ని చూపించే వారే సద్గురువులు. లోకంలో ఎన్నో సద్గురువులు ఉంటారు, కానీ, మనం వారిని గుర్తించడం, మనకు అనుగుణంగా గమనించడం ముఖ్యం.

గురువు శిష్యుణ్ని ఎన్నుకుంటాడు; కానీ, శిష్యుడు ఒక గురువును అంత తేలికగా ఎంచుకోలేడు. శిష్యుణ్ణి ఎన్నుకునే ప్రతిభ గురువుకున్నంతగా గురువును ఎంచుకునే ప్రతిభ శిష్యుడికుండదు కాబట్టి!

గురువు తన ప్రణాళికకు తగిన శిష్యుణ్ని తనవంటి వానిగా తీర్చిదిద్దుతాడు, ఆ బంధం జీవితాంతం నిలుస్తుంది. సాధకుడు ఎక్కడ, ఎప్పుడు గురువును పొందుతాడో ముందే తెలుసుకోవడం కష్టం. నిజమైన సాధకుడు అజ్ఞాత గురువుని కోసం ప్రార్థిస్తూ, నిత్య దైవారాధన చేస్తూ, అంతర్యామిని దర్శించడానికి ప్రయత్నిస్తే, ఆ గురువు అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. గురువు లేని వ్యక్తికి శాంతి, ఆనందం పొందడం చాలా కష్టం.

పురందరదాసు చెబుతున్నట్టు, గురువుకు శరణు చెందకపోతే ముక్తి దొరకదు. ప్రతివారు తాము ఎన్నుకున్న గురువుకు ఆత్మ సమర్పణ చేసి, ధర్మమార్గంలో జీవిస్తే, శాంతి, ఆనందం సులభంగా లభిస్తాయి. ధనం, హోదా, సంతానం ఇచ్చే సుఖం కంటే, గురువు ఆశీర్వాదం ద్వారా లభించే ఆనందం శాశ్వతం.

విద్యార్థి బాల్యంలో పరిమిత విద్య ఉన్నా, గురువును వెతకడం, సాధన చేయడం తప్పనిసరి అని పేర్కొన్నాయి. వేదాలు, సూత్రాలు, సంహితల్ని విద్యార్థులు ప్రత్యక్ష గురువుల నుండి మాత్రమే నేర్చుకోవాలి. స్మృతులు, ఉపనిషత్తులు ‘స్వయంవిద్య’ (self-study) కంటే, గురువుల పర్యవేక్షణలో మాత్రమే సత్యంగా గ్రహించదగినవిగా ఉంటాయి. గణితం, ఆయుర్వేద, సంగీతం, కవిత్వం గురువు లేకుండా నేర్చే విద్యలు కావు.

ప్రాథమిక విద్యాభ్యాసం బందరులోనే జరిగింది. 5 యేళ్లొచ్చాక తాతగారు 1877లో మచిలీపట్నంలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించి విద్యారంభం పలికారు. 14 యేళ్లొచ్చేవరకూ బందరులోనే చదివారు. అప్పటికే గోపాలాచార్యులకు 14 యేళ్లొచ్చాయి. లోకజ్ఞానం మెండుగానే ఉంది. ప్రాథమిక విద్యలు నేర్పిన గురువులు ఆయనకు లోకాన్ని అర్థం చేసుకునే శక్తినిచ్చే విద్యలు నేర్పారు. అందుకు ఆ గురువులకు ఆయనెప్పుడూ కృతజ్ఞుడే!

అయితే ఈ చదువులు తనకు చాలవనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉండేది. ఒకరోజు ఇంట్లో చెప్పకుండా సన్యాసులతో కలిసి దేశాటన చేశారని, ఆ క్రమంలోనే హిమాలయ పర్యంతం సంచరించారని చివరికి తిరుపతి మహంతుల ఆశ్రయం దొరికిందని కొందరు చెప్తారు. ఈ కాలంలో సన్యాసులు, తత్వవేత్తలు, యోగులతో సమాగమం ఎక్కువగా జరిగిందాయనకి. వివిధ వాద ప్రతివాదాలలో పాలుపంచుకున్నారు. శాస్త్ర విషయాలను బాగా ఆకళింపు చేసుకున్నారు.

 ఆ రోజుల్లో శాస్త్రాలన్నీ సంస్కృతభాషలోనే ఉన్నాయి కాబట్టి, సంస్కృతం మీద పట్టు దొరికితేనే శాస్త్ర విద్యల్లో పాండిత్యం అబ్బుతుంది. 1886లో తిరుపతిలోని మహంతు పాఠశాలలో సంస్కృతం వేద విద్యలూ చదివారు. అక్కడే ఆయనకు ‘ఆచార్య’ బిరుదు లభించింది.

3 యేళ్ల తరువాత భావదేవరపల్లి తిరిగి వచ్చారు. ఆ సమయంలో కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినందుకు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడి ఉంటారో చెప్పనవసరం లేదు. బాల్య వివాహాల రోజులు అవి! అతన్ని ఒప్పించి వివాహం చేశారు తల్లిదండ్రులు.

సంస్కృతం, వ్యాకరణం, తత్వశాస్త్రం మీద ఉన్న పట్టుదల ఆయుర్వేదాన్ని లోతుగా గ్రహించడానికి ఎంతో తోడ్పడింది. తిరుపతిలో ఉన్నప్పుడే ఆయుర్వేదంపై ఆయనలో ఆసక్తి మొదలైంది. సంస్కృతంలో ప్రతిభాసంపన్నత సాధించకొన్నాక ఆయుర్వేద ధ్యాస మరీ ఎక్కువ అయ్యింది. తిరుపతి నుండి తనకు ఆయుర్వేదం నేర్పే గురువు కోసం వెదకుతూ మైసూరు చేరారాయన,

నిజానికి తెలుగువారి రాజధానీ నగరం మద్రాసుకు చేరవలసినవారు గోపాలాచార్యులు.

మద్రాస్ నేరుగా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న రాజ్యం. ఆయుర్వేదాన్ని అణగదొక్కే ప్రయత్నాలను ముమ్మరం చేసింది అక్కడి బ్రిటిష్ ప్రభుత్వం. యథారాజా తథా ప్రజా కాబట్టి తెలుగు ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారా రోజుల్లో!

ఈ కారణం చేత మైసూరు రాజ్యం వైపు దృష్టి సారించారు గోపాలాచార్యులు. మైసూరు రాజ్యం బ్రిటిష్ అజమాయిషీలోనే ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాలు స్వతంత్రంగా నిర్వహిస్తోన్నందున ఆయుర్వేదానికి అక్కడ ఆదరణ బావుండటం మైసూరు ఆయన ప్రయాణానికి ముఖ్య కారణం.

మైసూరులో వైద్య విద్యాభ్యాసం

మైసూరు అనగానే తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో దర్శనమిచ్చే మైసూరు పెయింటింగులు గుర్తుకొస్తాయి. మైసూరు అనంగానే మైసూరు పట్టుచీరలతో పాటు జ్కగత్ప్రసిద్ధమైన మైసూరు పాక్ అనే తీపి భక్ష్యం కూడా గుర్తుకొస్తుంది.

మైసూరు వీటికన్నా ప్రసిద్ధిపొందింది ఆయుర్వేదంలో! టిప్పు సుల్తాన్ మరణం తరువాత 1881లో బ్రిటిష్ పాలకులు మైసూరు రాజ్యాన్ని ఒడయార్ పాలకులకు అప్పగించారు. అప్పటినుండి 1947 స్వాతంత్ర్యం సిద్ధించే వరకు మైసూరు నగరం రాజధానిగా, మైసూరు కోట పాలనాకేంద్రంగా వర్ధిల్లాయి. ఒడయార్ ప్రభువులు కళలతో పాటు కన్నడభాషని, బాగా పోషించారు. మైసూరు నగరాన్ని మైసూర్ పురపాలక సంస్థ (మునిసిపాలిటీ)గా మార్చారు. రాజధాని నగరాన్ని సుందరీకరించి కవులకు కళాకారులకు శాస్త్రవేత్తలకు నిలయంగా మార్చారు. ఆసియాలో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తొలి నగరాలలో ఒకటిగా మైసూరును పేర్కొంటారు.

బ్రిటిష్ వారు ఆ రోజున ఒడయార్లకు రాజ్యాన్ని అప్పగించాలనే నిర్ణయం తీసుకోవటంలో చెట్టిపాణ్యం వీరవల్లి రంగాచార్యులనే బ్రిటిష్ ప్రభుత్వోద్యోగిది ముఖ్యపాత్ర! రాజుగా నియమితులైన చామరాజేంద్ర ఒడయార్ మహారాజావారు రంగాచార్యులవారి కృషికి గుర్తింపుగా ఆయన్ని తన సంస్థానానికి తొలి దివానుగా నియమించారు

ఆ రంగాచారిగారు పదారణాల తెలుగు బిడ్డ. అంతేకాదు ఆయన కృష్ణాజిల్లా వీరవల్లిలో పుట్టి పెరిగినవాడు. గోపాలాచార్యుల పట్ల ఆయన అవ్యాజానురాగం చూపించారు.

మైసూరు ప్రశస్తిని వినడం వలన కానీ, ఒక తెలుగు వాడు దివానుగా ఉండటాన గానీ, ఆయుర్వేదం మీదకు ధ్యాస మళ్ళిన గోపాలాచార్యులవారు మైసూరు చేరటానికే మొగ్గు చూపారు.

1888లో మైసూరులోని మహారాజావారి ఓరియెంటల్ స్కూల్‌లో చేరారు, 1893లో ఆయుర్వేద విద్యను పూర్తి చేశారు.

సంస్కృత కళాశాలలో ఆయుర్వేద వైద్య విద్యలో ఐదేళ్లపాటు శిక్షణ పొందారు. 1893లో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేశాక తనకు గల అపారమైన సంస్కృత పాండిత్యం వైద్య శాస్త్ర పాండిత్యం ఉపయోగించుకుని మరింత మెరుగైన చదువుల కోసం దేశ యాత్ర ప్రారంభించాడు. తగిన గురువు కోసం అన్వేషణ అలా మొదలయ్యింది.

మైసూరు మహరాజా కళాశాలలో అంగరం పౌట్టస్వామి శాస్త్రులుగారు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.

దేశాటన

వైద్యగ్రంథాలు అనంతమైన వైద్య పరిజ్ఞానాన్ని నిక్షిప్తం చేశాయి. గురువులు మాత్రమే వాటిని విశ్లేషించి వివరించగలరు. చరకసంహిత మీద ప్రామాణికత కలిగిన పండితులు ఒకరైతే సుశ్రుత సంహిత మీద ప్రామాణికత కలిగినవారు వేరొకరు. వారిని ఆశ్రయించి, సుశ్రూష చేసి సందేహాలను తీర్చుకోవటం జిజ్ఞాస కలిగిన వైద్యుడి బాధ్యత. అలాంటి గురువులను అన్వేషిస్తూ ఆయన లాహోరు నుండి తిరువనంత పురం దాకా దేశాటన చేశారు. 1887లో హైదరాబాద్‌లో గోసాయి వైద్యులతో జరిగిన పరిచయం ఆయుర్వేద గ్రంథాలు, వ్రాతప్రతులు చదవడానికి ఆయనలో ఉత్సాహాన్ని రగిలించింది. ఆయన స్వయంగా పరిశోధనలు ప్రారంభించి, ఆయుర్వేదాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి కృషి చేశారు.

ఈ పర్యటనల ద్వారా ఆయన జ్ఞానం, అవగాహన మరింత పెరిగాయి. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని సిద్ధవైద్యులు, సంప్రదాయ గ్రంథాలతో పరిచయం ఆయనపై గొప్ప ప్రభావం చూపింది.

ఈ ప్రయాణాల్లో ఆయన అనేక ఔషధ మొక్కల నివాస స్థలాలను గమనించి, వాటి వైద్య వినియోగాన్ని లోక వైద్యుల ద్వారా అర్థం చేసుకున్నారు. “ఇంగ్లాండుకు ఇనుము, బొగ్గు గనులు ఉండి తమ దేశ అభివృద్ధికి తోడ్పడితే, భారతదేశానికి ఔషధ మొక్కలే నిజమైన గనులు” అన్నారాయన.

కలకత్తా, వారణాసి, బొంబాయిలలో ప్రసిద్ధ ఆయుర్వేద పండితులను కలిశారు. అనేక వైద్య రహస్యాల గురించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. ఇలా ఎందరో ప్రముఖ వైద్యుల్ని కలిశారు. వారి నుండి సందేహ నివృత్తులు పొందారు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో తనకు క్షుణ్ణత ఏర్పడిందని నమ్మకం కుదిరాక బెంగళూరు చేరారు.

బెంగళూరులో వైద్యుడిగా ఉద్యోగం

1893లో బెంగుళూరులోని థియొసాఫికల్‌ సొనెటీ వైద్యశాలలో చికిత్సకుడిగా ఉద్యోగంలో చేరారు. ధియోసాఫికల్ సొసైటీని మేడమ్ బ్లావెట్‌స్కీ అనే రష్యన్ వనిత 1875 లో అమెరికాలో స్థాపించారు. తల్లాప్రగడ సుబ్బారావుగారు 1882లో ఈ సంస్థని దివ్యజ్ఞాన సమాజం పేరుతో మద్రాసులోని అడయారుకు మార్పించి ఆయనే నిర్వహించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ఈ మతాల తత్వంను తెలుసుకొనుట కొరకు వాటి అధ్యయనం, ప్రకృతిలో, మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధించటం లక్ష్యంగా ప్రాచీన హిందూమతం, బౌద్ధమతం, జుడాయిజాల సమ్మేళనం కోసం ఈ సమాజం ప్రయత్నించింది.

బ్లావెట్‌స్కీ వ్రాసిన ‘రహస్య సిద్ధాంతం’ (ది సీక్రెట్ డాక్ట్రైన్) చదివిన అనిబిసెంట్‌ ప్రభావితమై 1889లో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో దివ్యజ్ఞాన సమాజం శాఖలు వెలిశాయి. ఆధ్యాత్మిక ఉన్నతిపైన అధ్యయనంతో పాటు మానసేవలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర వహించింది. అనీబిసెంట్ చేరిక తరువాత ఈ సంస్థ సామాజికంగా ఎదిగిందనే చెప్పాలి.

ఇక్కడ అనీబిసెంటమ్మ ప్రస్తావనకు కారణం ఉంది. 24 యేళ్ళ కుర్రాడుగా ఉన్న గోపాలాచార్యులలో దాగున్న ప్రతిభను మొదటగా గుర్తించిన వ్యక్తి అనీబిసెంటే! అవతార పురుషులనదగిన వ్యక్తుల్లో దాగున్న అనంత శక్తిని ప్రేరేపించేందుకు కొందరు సద్గురువులు అవతరిస్తారు. అనీబిసెంట్ అలాంటి పాత్ర పోషించి, గోపాలాచార్యుల ప్రతిభకు ఒక గోడ చేర్పు అవసరం కూడా!

1893లో ఆమె ఆహ్వానం మీద దివ్యజ్ఞాన సమాజ ఆసుపత్రి బెంగళూరు శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఆయన జీవితంలో తొలిసారిగా వృత్తిలో కుదురుకున్నారు. ఆదాయం కోసం కాకపోయినా అనుభవం కోసం ఒక కొత్త వైద్యుడికి మంచి అవకాశం ఇది!

ఓ ఐదేళ్లపాటు ఆయన అక్కడే చికిత్సకుడుగా కొనసాగారు.

మైసూరు రాజ్యంలో ప్లేగు ఉధృతి

1897 నుండి 1923 వరకు మైసూరు రాజ్యంలో ప్లేగు వ్యాధి నిరంతరంగా వ్యాపించింది.

మొదట బాంబే ప్రెసిడెన్సీ సరిహద్దులోని ధారవాడ జిల్లాలో హుబ్లీలో ఈ వ్యాధి ప్రబలంగా వ్యాపించింది. మైసూరుకు కేవలం 80 మైళ్ళ దూరంలో ఉండటంతో, వ్యాధి రాకుండా అడ్డుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని భావించారు మైసూరు రాజావారు. ముందుజాగ్రత్త చర్యల కోసం తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

అయినా, 1898 ఆగస్టు 12న బెంగళూరు నగరంలో ప్లేగు మొదటగా కనిపించింది. అక్కడి నుండి అది మైసూరు, కోలార్, తుమకూరు జిల్లాల వైపు వేగంగా వ్యాపించింది. వ్యాధి అత్యధికంగా ప్రబలింది మొదటి ఏడాదిలోనే. అప్పుడు దాదాపు 15,000 మంది ఈ వ్యాధికి గురయ్యారు; వారిలో 12,000 మందికి పైగా మరణించారు.

మైసూరు రాజ్యంలో ప్రజలు స్వయంగా లాక్‌డౌన్ పాటించినట్టు గుమ్మాలకు వేపమండలు కట్టి,తలుపులు మూసుకుని బైట “ ఓ స్తీ! రేపు రా!” అని రాయసాగారు.

ప్లేగు బాధితుల కోసం నిర్మించిన ప్రత్యేక చికిత్సా శిబిరాలు

వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వైద్య అత్యవసర పరిస్థితిలో, గోపాలచార్యులవారిని మైసూరు ప్రభుత్వం ప్రత్యేక ప్లేగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఆయుర్వేదంలోని తన వైద్య అనుభవంతో ఆయన తయారుచేసిన హైమాది పానకం, శతధౌత ఘృతం. అనే రెండు ఔషధాలు ప్లేగు చికిత్సలో అపారమైన ఫలితాలను ఇచ్చాయి. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

“విదేశం నుంచి వచ్చిన పరికరమని తక్కువగా చూడకూడదు. పాశ్చాత్య వైద్య శాస్త్రం వేగంగా ఎదుగుతున్నదని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మనం ఆయుర్వేదానికి కొత్త మార్గాలను కనుగొని అభివృద్ధి చేయాలి” అన్నారాయన.

ఆయన మాటలు ఎల్లప్పుడూ స్పష్టంగా, విమర్శనాత్మకంగా ఉండేవి. సహచర వైద్యులకు ప్రేరణ కలిగించేవి.

“ఆయుర్వేద ఔషధాల తయారీకై కావాల్సిన పదార్థాలన్నీ మన దేశంలోనే లభ్యమవుతాయి. వాటి కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మహాయుద్ధమో, ప్లేగో, ఫ్లూనో వచ్చినా మనకెంత కావాలంటే అంత పొందగలం.”

ఈ మాటలు ఈనాటి కోవిడ్-19 మహమ్మారి సందర్భంలో కూడా అద్భుతంగా వర్తిస్తాయి. అల్లం, మిరియాల్లాంటి మసాలా దినుసులు, కషాయాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో ఉపకరించాయి కూడా!

ప్రభుత్వం ఆనాడు కోవిడ్ వ్యాధికి చికిత్స చేయకుండా ఆయుర్వేదాన్ని కట్టడి చేసినా ప్రజలు ఇళ్ళలో అల్లం రసం తులసాకులు మిరియాల కషాయాలు తాగి వైరస్ బారి నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. రెండో విడత కోవిడ్ వచ్చినప్పుడు లాక్‌డౌన్ ఆంక్షలున్నప్పటికీ ఆనందయ్య గారి మందుల కోసం ప్రజలు క్యూలు కడితే ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది. మొదటి విడతలోనే ఆయుర్వేద సలహాలు, ఔషధాలను స్వీకరించి ఉన్నట్టయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలిగే వాళ్లం!

గోపాలచార్యులవారి జీవితమంతా ఒకే ధ్యేయంతో గడిచింది. ఆయుర్వేదాన్ని కాపాడటం, అభివృద్ధి చేయటం, ప్రజల్లో విస్తరింపజేయటం ఆయన లక్ష్యాలు. విద్యార్థులను, పండితులను ప్రేరేపించిన జీవమూర్తి. చిన్న వయసులోనే విద్యా, వైద్యరంగాల్లో అద్భుత ప్రమాణాల్ని నెలకొల్పి, ఆయుర్వేద వాణిజ్య రంగానికీ దారులు తీశారు.

మైసూరులో ప్లేగు ఉధృతిని కట్టడి చేయగలగటంతో గోపాలాచార్యులనే పాతికేళ్ల కుర్ర వైద్యుణ్ణి చూసి దేశం అంతా నివ్వెర పోయింది. అదీ స్వంతంగా తయారు చేసిన మందులతో..!

నెయ్యితో ప్లేగుని జయించారాయన

శతధౌత ఘృతం అంటే, వందసార్లు కాచి సంస్కరించబడిన నెయ్యి. నేతికి చలవచేసే గుణం ఉండటాన పిత్తదోషాన్ని, వేడిని, స్నిగ్ధగుణం కలిగింది కాబట్టి వాతాన్ని శమింప చేస్తుంది. నెయ్యీ, కఫం సమాన గుణాలు కలిగినవే అయినప్పటికీ సంస్కరించబడిన నెయ్యి కావటాన కఫ దోషాన్ని కూడా శమింపచేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొన్నాయి. పావుచెంచా నుంచి అరచెంచాడు మోతాదులో తీసుకుంటే చాలు గొప్పగా పనిచేస్తుంది.

“జ్వరితోఽనేన నిర్వాతి ప్రదీప్తం చామ్బునా గృహమ్” ఇల్లు దగ్ధమౌతుంటే నీళ్లు మంటల్ని ఆర్పినట్టు తీవ్రమైన జ్వరాన్ని నెయ్యి చల్లబరుస్తుందని కాశ్యప సంహిత నెయ్యి గురించి పేర్కొంది. మహమ్మారిలాగా వ్యాపించి శరీరాల్ని తపింప చేసిన ప్లేగు వ్యాధి మొన్న వచ్చిన కోవిడ్ లాగానే వైరస్ కారణంగా వచ్చిన వ్యాధి. వైరస్ వలన రావటాన చాలా త్వరగా వ్యాపించింది. వేల సంఖ్యలో ప్రజలు ఒకేసారి దాని పాలిట పడ్డారు. యుద్ధప్రాతిపదికన ఈ ఔషధాన్ని భారీ ఎత్తున తయారు చేసి రోగులకు అందించ గలిగారాయన. అది తక్షణ నివారకంగా పనిచేసింది.

హైమాది పానకం

ఎమర్జెన్సీలో పనిచేసే మందు అనగానే ఆధునిక వైద్యంలో వేలాది రూపాయలు ఖరీదు పెడతారు. వైద్యానికన్నా వ్యాపారానికి అవకాశాలెక్కువ. ఇలాంటి సందర్భాల్లో మధ్య దళారీల ప్రమేయం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! కానీ, కరోనా ఉధృతి సమయంలో ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగినా కిమ్మన్నాస్తిగా ఉండిపోయారంతా!

ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు ఆఖరికి మైసూరు మహరాజాగారు కూడా తన అంతఃపురాన్ని ఖాళీ చేసి ఏకాంత జీవితంలోకి వెళ్ళిపోయారంటే ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకనే తేలికగా దొరికే చవకైన ద్రవ్యాలతో ఫార్ములాని రూపొందించి జనసామాన్యానికి అందుబాటులోకి తేవాలని భావించారాయన.

అలా తయారైనదే హైమాది పానకం. పానకం అంటే సిరప్ అని! చేదుకట్టు మూలికలతో తయారైన ఔషధాన్ని పిల్లా జెల్లా అందరూ వేసుకోవటానికి అనువైన ఔషధం అది.

ఇదే అదనుగా జేబులు నింపుకునే ప్రయత్నం చెయ్యలేదాయన! సామాజిక దృష్టితో వైద్యుడిగా మారిన వారాయన!

ఇంతకీ ఈ ఫార్ములాలో ఏముందీ? దీవి గోపాలాచార్యుల వారి జీవిత చరిత్ర వ్రాసిన వైద్యులు డి. వి. ఏ ఆచార్య జిసిఐయం గారు ఈ ప్రశ్నకి చక్కని సమాధానం వ్రాశారు:

“రహస్యంగా యోగాలను దాచిపెట్టే పద్ధతి పోగొట్టి ఆయుర్వేదాన్ని వృద్ధి చేయు నిమిత్తం ఆయన ఆయుర్వేద కళాశాల పెట్టారు. అయితే వారు మాత్రం తన కలరా, ప్లేగు యోగాలను రహస్యంగా ఉంచారు. తన విద్యార్థులు ఈ రహస్యాన్ని తమ విజ్ఞానం వల్ల కనిపెట్టాలని వారి ఆశయం.

ఈ రహస్యం తెలియక కళాశాల విద్యార్థులు అందరూ ఏకమై కళాశాల బహిష్కారం పేరుతో స్ట్రైక్ చేశారు.

ఈ విషయమై నేను ఆచార్యులు గారితో ప్రస్తావించగా యీ యోగాలలో ఏమీ రహస్యం లేదనియూ, హైమాదిపానకంలో హైమమనగా నేలవేము (భూనింబ-సుదర్శన) అనియు, నేలవేము మొదలగు చేదు పదార్థములు వేసుకొనవచ్చుననియు, హైమాది పానకమనగా పంచతిక్త పానకమే అనియు వ్యాపార దృష్టిచే పేరు మార్చబడినది కానీ విద్యార్థులకు తెలియపరచరాని రహస్య మేమియు లేదనియు గోపాలాచార్యులు గారు చెప్పిరి. అందుపైని విద్యార్థులులు సమ్మె నిలిపి యథాప్రకారం కళాశాలలో చేరిరి.”

నేలవేము, నాభి తదితర జ్వర నాశక ద్రవ్యాలతో తయారైన ఔషధంగా దీని గురించి పెద్దలు చెప్తారు. అంటు వ్యాధులు ప్రబలే సమయంలో నేలవేము టీ కాచుకుని రోజూ ఒకటి లేక రెండు కప్పుల చొప్పున తాగుతుంటే అదే గొప్ప ఇమ్యూనిటీ బూష్టర్. వైరస్, బాక్టీరియాలను అంతం చేయగల శక్తివంతమైన ఔషధం అది.

తమిళనాడులో పెద్ద ఎత్తున జనసందోహం ఉండే చోట శిబిరాలు వేసుకుని ఈ నేలవేము కషాయాన్ని ఉచితంగా అందిస్తుంటారు. ప్రజలు బారులుతీరి నిలబడి దీన్ని తీసుకుంటూ ఉంటారు. అంటు వ్యాధులు ప్రబలకుండా కాపాడే ఔషధం అది!

(ఇంకా ఉంది)

Exit mobile version