[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]
అప్పుడే రెండ్రోజుల్నించి వదిన దగ్గర్నించి ఫోన్ లేదు. పోనీ నేనే చేద్దామనుకున్నా కూడా మొన్న మాట్లాడినప్పుడు వదిన నన్ను అన్న మాటలు నేను మర్చిపోలేక ఫోన్ చెయ్యలేకపోతున్నాను.
నాకు బతకడం తెలీదంటుందా! అలాంటి నేను ఇంకోళ్ళకి సలహాలు ఇవ్వకూడదంటుందా! హూ.. ఈవిడకే మహా అన్నీ తెల్సినట్టు. ఏదో నేను మా వదినని అడగండీ, మా వదినని అడగండీ అంటూ నాకు తెల్సినవాళ్లందరినీ వదిన దగ్గరికి పంపిస్తున్నాను కనక ఆవిడకా మాత్రం పేరొచ్చింది కానీ లేకపోతే వచ్చేదా!
ఇంతకీ జరిగిన విషయమేంటంటే మా అక్క మనవరాలు అర్చనకి కొత్తగా పెళ్లయి కాపరానికి వెడుతోంది. మా అక్క కూతురు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి, “పిన్నీ పిన్నీ, నువ్వంటే అర్చనకి ఎంతో ఇష్టం. నువ్వు చక్కగా మాట్లాడతావని అస్తమానం చెపుతుంటుంది. నీ దగ్గరికి పంపిస్తాను, కొత్త కాపరంలో ఎలా మసలుకోవాలో కాస్త దానికి చెపుతావా!” అనడిగింది.
అంతకన్నానా.. అనుకున్నాను. ఎందుకంటే అత్తవారిళ్ళల్లో మా అక్కచెల్లెళ్లం, వాళ్ల పిల్లలూ అందరం చాలా మంచిపేరు తెచ్చుకున్నాం. అందరూ అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో మమ్మల్ని చూసి నేర్చుకోమనేవాళ్ళు. అలాంటిదాన్ని అర్చనకి మంచిచెడ్డలు చెప్పడానికి అభ్యంతరం ఏవుంటుందీ! ఈ మాటే వదిన దగ్గర అన్నాను. అంతే..
“ఏం.. మీలాగే అర్చన కూడా తయారవాలనా! ఆ పిల్లనైనా కాస్త సుఖపడనివ్వరా!” అంది.
“అదేంటి వదినా!”, అంటే “మరీ, మీరంతా మంచివాళ్ళు కదా.. ఇంట్లో పెద్దలని గౌరవిస్తారూ, పిల్లలని ముద్దు చేస్తారూ, అందరికీ ఏవేవి ఇష్టమో అవి కనుక్కుని వండి పెడతారూ, మిమ్మల్ని ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తారూ.. ఇవే కదా మీ మంచి లక్షణాలు! ఇవన్నీ చెప్పి ఆ పిల్లని కూడా బాధ పెట్టకండి.” అంది.
నాకు కాసేపు నోట మాట రాలేదు. మళ్ళీ వదినే అందుకుంది.
“ఆ అర్చనని నా దగ్గరికి పంపు. ఎలా ఉండాలో నేను చెపుతాను.” అంది.
వదిన అన్న మాటలకి టక్కని ఫోన్ పెట్టేసిన నేను మళ్ళీ వదినకి ఫోన్ చెయ్యలేదు.
నేను అనుకున్నట్టు అర్చన నా దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదోనని అక్కకి ఫోన్ చేస్తే అర్చన నా దగ్గరికి కాకుండా వదిన దగ్గరికి వెడతానందిట.
“ఏవోనే చెల్లాయ్, అర్చన కార్ డ్రైవింగ్ నేర్చుకుందుకు మంచిది ఏది అని అడగడానికి వదినకి ఫోన్ చేస్తే, “అసలు డ్రైవింగే నేర్చుకోవద్దూ.” అందిట. అదేంటంటే ‘కార్ డ్రైవింగ్ కనక నేర్చుకుంటే చాలా ఇబ్బందులుంటాయీ. అవేవిటో తెలియాలంటే మా ఇంటికి రా.’ అందిట. ఇందాకే అర్చన వదినా వాళ్ళింటికి వెళ్ళింది.” అంది అక్కయ్య.
ఈ వదిన కేమైందీ! కార్ డ్రైవింగ్ ఇప్పుడు అందరూ చేస్తున్నదే. కార్ చేతిలో ఉంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇంకోళ్ల మీద ఆధారపడకుండా వెళ్ళిపోవచ్చు. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళందరూ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. దాని వల్ల లాభమే కానీ ఇబ్బందు లేవుంటాయీ!
నాకేవీ అర్థం కాలేదు. ఇంతలో వదిన ఫోన్ వచ్చింది. “అర్చన వచ్చింది, నువ్వూ వస్తావా మా ఇంటికీ..” అంటూ.
“ఎందుకులే వదినా, నీకు ఇబ్బంది.” అన్నాను వెటకారంగా.
“అయ్యో స్వర్ణా, నేనేమన్నాననీ అంత ఫీలై పోతున్నావూ! మీరందరూ నలుగురిలో మంచివాళ్లనిపించుకుందుకు మీకు ఇష్టమైనవి ఎన్ని పోగొట్టుకున్నారో నాకు తెల్సు. ఆ రోజులు వెళ్ళిపోయేయి స్వర్ణా..
అంతా ఒకే కుటుంబం, నా మరిదీ ఆడపడుచులే నాకు తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అనుకుంటూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఉమ్మడి కుటుంబానికే జీవితాన్ని అంకితం చేసిన ఉత్తమ ఇల్లాలి రోజులు ఎప్పుడో పోయేయి. అసలు ఇప్పుడు ఎవరికి వారికి స్వార్థం తప్పితే తప్పితే నలుగురితో పంచుకుందాం అన్న భావనే ఎవరిలోనూ కనపడడం లేదు.
ప్రతీ ఇంట్లోనూ ఇప్పుడు ఏ పని చెయ్యాలన్నా వాళ్లకి వాళ్ళు ‘నాకేంటీ!’ అనే ప్రశ్న వేసుకుంటున్నారు. అందులో తప్పేవీ లేదు. రోజులలా ఉన్నాయి. ప్రతివాళ్లకీ ఇప్పుడు టైమ్ అనేది లేకుండా పోతోంది. అందుకనే ఏ పనులు తప్పించుకుని తమ టైమ్ సేవ్ చెసుకుందామా అనే ఆలోచనలో ఉన్నారు.
అలాంటప్పుడు అర్చనకి కార్ డ్రైవింగ్ కనక వస్తే ఇంక ఆ ఇంట్లో తనొక డ్రైవరై పోతుంది. పెద్దవాళ్లని గుడులకీ, ఆస్పత్రిలకీ తీసికెళ్ళడం, పిల్లలని ఆటోవాడు రాకపోతే స్కూళ్లల్లో దింపి తేవడం, మధ్యలో మార్కెట్ నుంచి ఇంట్లోకి కావల్సిన సరుకులు తేవడం లాంటి తనకి అఖ్ఖర్లేని పనులన్నీ చెయ్యవలసి వస్తుంది. మొహమాటస్థులం. ఒకసారి డ్రైవింగ్ అంటూ వచ్చేక ఎవరైనా ఎక్కడికైనా తీసికెళ్లమంటే కాదనలేం. అదే కనక డ్రైవింగే రాకపోతే ఈ ఇబ్బందు లేవీ ఉండవు కదా. అర్చనకి తనకి తను సిటీలో తిరగడానికి స్కూటీ చాలు. తనకి కావల్సిన చోటుకి ఇంకోళ్ల మీద ఆధారపడకుండా వెళ్ళిపోతుంది. అందుకనే కార్ డ్రైవింగ్ నేర్చుకోవద్దని అర్చనకి చెప్పేను.”
డ్రైవింగ్ వస్తే ఇన్ని ఇబ్బందులుంటాయని ఇన్నాళ్ళూ నాకు తెలీనే తెలీదని నేను ఆశ్చర్యపోతుంటే వదిన మళ్ళీ అంది.
“స్వర్ణా, ఒక చిన్న సూత్రం చెప్తాను, గుర్తు పెట్టుకో. ఎవరైనా ఏదైనా పని బాగా చేస్తున్నారంటే వాళ్ళకే బోల్డు పనులు అప్పచెప్తారు ఇంట్లోవాళ్ళు. అదే అసలు పనే రాదనుకో.. ఇంక ఎవరూ ఏ పనీ చెప్పరు. మన టైమ్ మనకే ఉంటుంది. మనకి ఇష్టమైన పని మనం చేసుకోవచ్చు. అదే చెప్పేను అర్చనకి. తనకి కావల్సినట్టు ఉండమని. తనకి ఇంకా చదువుకోవడం ఇష్టం. మంచి ఉద్యోగంలో చేరాలని ఆశ. అలాంటి అర్చన ఇలా డ్రైవింగులూ గట్రా నేర్చేసుకుని అందరికీ పనులు చేసి పెట్టేసి కీర్తికిరీటాలు తెచ్చుకోనక్కర్లేదు. ఏవీ నేర్చుకోకుండా, నీకు నచ్చినట్టు సంతోషంగా ఉండూ అని చెప్పెను. కాదంటావా!”
వదిన చెప్పిన మాటలకి అవునన్నాలో కాదనాలో నాకు తెలీలేదు. మీకేమైనా తెల్సిందా!
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
