[డా. వరిగొండ సత్య సురేఖ రచించిన ‘అవని’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“అవని కరెంట్ బిల్ తీసుకెళ్ళమ్మా. రేపే ఆఖరి తేదీ.”
“నాకు వీలు పడదమ్మా. నాన్న ని కట్టేయమను.”
“వాచ్‌మ్యాన్ బిల్లు పట్టుకొచ్చిన రోజూ నుండి చెబుతున్న మీ నాన్నకి. ఇవాళ కూడా వెళ్ళి కడతారు అని నమ్మకం లేదు. అందుకే నీకు చెబుతున్నా. ఎలాగో అలా కట్టేయమ్మా. నా తల్లి కదు. మీ అటెండర్‌ని పంపి కట్టించు.” వంటింట్లో ఫ్రిడ్జ్ పై పెట్టిన బిల్లుని అవనికoదించింది.
చేసేది లేక, తల్లి ఒక చేతిలో ఉన్న కారేజ్ బాగ్‌ని మరో చేతిలో ఉన్న కరెంట్ బిల్లు అందుకొని తల్లికి “వెళ్లొస్తా..” అని చెప్పి రోజూ వెళ్ళే తన స్కూటీ పై, రోజూ వెళ్ళే దారిలో రోజూ వెళ్ళే ఆఫీసుకి ఆ రోజు కూడా రోజూ మల్లే ఎటువంటి మార్పు లేక బయల్దేరింది అవని.
***
“అన్నయ్య వచ్చి వెళ్లాడా?”
భోజనాల బల్లపై తను తీసుకు వచ్చిన సామానుల సంచి పెడుతూ తల్లిని అడిగింది.
“ఆ వచ్చాడు. నీకు ఫోను చేశాడా? వస్తున్నట్టు?” ఆతృతగా ప్రశ్నించింది తల్లి.
“లేదు..” సమాధానం చెబుతూ తన గదిలోకి వెళ్ళి ఓ ఇరవై నిమిషాల తరువాత బయటికి వచ్చి దేవుడి గదిలోకి వెళ్ళింది.
రోజూ ఆఫీసు నుండి రాగానే స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి ఓ అరగంట పూజ, ధ్యానం చేసుకోవడం అవని అలవాటు. పూజ చేసుకొచ్చాక తల్లి ఇచ్చే కాఫీ తాగుతూ కాసేపు తల్లి తండ్రి కూతురు కబుర్లాడుకుంటారు. రాత్రి ఎనిమిదన్నర అవ్వగానే భోజనాలకి కూర్చుంటారు. ఆ తరువాత ఓ గంట తండ్రి పుస్తకం చదువుతాడు. తల్లి టి.వి.లో ధారావాహికలు చూస్తుంది. పది అవ్వగానే ఆ దంపతులు పడుకుంటారు.
అవని మరో అరగంట మెలకువగా ఉండి, పెండిగ్ ఆపీసు పని ఉంటే ఆ పని చేసుకోవడం, లేదా స్నేహితులతో కాసేపు ఫోనులో చాట్లు, కబుర్లు ఆడుకోవడవం, పుస్తకం చదవడం, లేదా టి.వి. చూడటం ఇలా ఏదో చేసుకు పడుకుంటుంది. మళ్ళీ ముగ్గురు ఉదయమే ఠంచనుగా ఐదు గంటలకి లేస్తారు. తండ్రి కూతురు బయటకి నడకకి వెడితే, తల్లి ఆ అపార్ట్మెంట్ మేడ పైనే తనతో పాటు మరో నలుగురు ఆడవారితో కూడి నడక, చిన్న వ్యాయామాలు చేసుకుంటుంది. ఇంటికి రాగానే అవని తమ ముగ్గురికీ కాఫీలు కలిపి వంటకి, ఉదయం అల్పాహారానికి కావాల్సినవి అన్నీ సమకూర్చి, స్నానానికి వెడుతుంది. తల్లి కాఫీ తాగి స్నానానికి వెళ్ళి వచ్చి, పొయ్యి పైన వంట ఆరంభిస్తుంది.
అవని అన్నయ్య వచ్చిన రోజూ ఆ తరువాతి రెండు రోజులు ఆ ఇంట్లో కొంత అస్థిమిత వాతావరణం ఏర్పడుతుంది. మిగిలిన రోజులు అంతా మామూలే. నిజం చెప్పాలంటే, ప్రతి నెల జరిగే ఆ రెండు మూడు రోజుల తంతులో కూడా ఏ మార్పు ఉండదు.
తల్లి తoడ్రి అన్న వల్ల బాధ పడటం అవనిని బాధిస్తూ ఉంటుంది అపుడప్పుడు. దారిలేక బయట వారికి తల్లి తండ్రి అన్నావదినల గూర్చి గొప్పగా చెబుతూ ఉంటారు. మనవల్ని చూడాలి అని తహతహలాడుతూ ఉంటారు. ఊర్లోనే ఉన్నా కలవడం కద్దు. తండ్రి అప్పుడప్పుడూ వెళ్ళి ,తల్లి చేసిన పిండి వంటలు, పచ్చళ్లు, పిల్లల కోసం అవి కొని వెళ్ళి ఇచ్చి కాసేపు గడిపి వస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల్ని ఇంట్లో దింపి వెడుతూ ఉంటారు. అవని కూడా అన్నావదినల ప్రవర్తన బాధించినా పిల్లల పై గల ప్రేమ వల్ల అడపా దడపా వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది. పార్క్ కానీ ఆట స్థలాలకి తీసుకు వెడుతూ ఉంటుంది. పండగకి, పుట్టిన రోజుకి బట్టలు, బొమ్మలు కొంటుంది. మేనత్తగా కాదు తల్లికి మల్లే ఆ పిల్లల్ని ప్రేమిస్తుంది అవని.
అవని చెబుతూనే ఉంటుంది వెళ్ళి మధ్య మధ్యలో ఓ వారం రోజులు వెళ్ళి ఉండమని, వాళ్ళు రమ్మనకుండా ఏం వెడతాము అంటుంది తల్లి. నీ కొడుకు, నీ కోడలు, నీ మనవళ్ళు. పిలుపులేమిటి అంటుంది అవని. కన్నవారే అయినా పిలవకుండా కూడా వెళ్ళకూడదే అంటుంది తల్లి.
***
“అన్నయ్యా, నాన్నని ఆసుపత్రిలో చేర్చాము. తొందరగా రా. గుండె పోటు అంటున్నారు.” విషయం తీవ్రం కాకపోతే అన్నయ్య రాడు అన్న విషయం తెలిసి ఉన్న విషయం చెప్పేసింది అవని.
“అన్నయ్య వస్తున్నాడా?” భయమూ బాధా మిళితమవ్వగా అడిగింది తల్లి.
“వస్తా అన్నాడు అమ్మ..!” ఎపుడు వస్తాడు, వదిన ని తీసుకు వస్తాడా వెంటనే వస్తాడా లేదా ఇవేవీ అవనికి కూడా తెలీదు. కారణం అవతలి వైపు నుంచి “సరే!” అనే సమాధానం మాత్రమే వచ్చింది.
తల్లి ప్రతీ ఐదు నిమిషాల కొకసారి ఐసియూ వైపు పది నిమిషాల కొకసారి ఆసుపత్రి గుమ్మo వైపు చూస్తూ కూర్చుంది.
అవనికి తోడుగా అవని స్నేహితులు ఇద్దరు వచ్చి ఉన్నారు.
ఉదయం నుండి ఇద్దరూ ఏమి తినలేదు. అప్పటికి సమయం సాయింత్రం నాలుగు గంటలు అవుతోంది.
అవని అన్నయ్య రాలేదు. తల్లి అడుగుతూనే ఉంది. అవని ఉదయం తొమ్మిది గంటలకి విషయo చెప్పింది. అప్పటి నుండి గంట గంటకి ఫోను చేస్తూనే ఉంది. ఒక్కోసారి ఫోను ఎత్తి “సరే..” అని చెప్పి పెట్టేస్తున్నాడు. ఒక్కోసారి కనీసం ఫోను ఎత్తడం కూడా లేదు. తల్లికి ఆరాటం తగ్గడం లేదు. భర్త పరిస్థితికి ఆందోళన, కొడుకు వైఖరి వల్ల ఆవేదన ఏకకాలములో కలుగుతున్నాయి ఆవిడకి.
అవని స్నేహితుడు, డాక్టర్‌తో వెళ్ళి మాట్లాడి వచ్చాడు. పరిస్థితి మెరుగుపడుతోంది అని చెప్పాడు. అయినా ఇద్దరూ స్థిమితపడలేదు. మరో స్నేహితురాలికి పురమాయించాడు. ఇద్దర్ని కాంటీన్‌కి తీసుకు వెళ్ళి కొంత ఆహారం తినిపించమని. అవని, తల్లి ఇద్దరూ ఒప్పుకోలేదు.
“రూమ్‌కి రాత్రి ఏడు గంటల వేళ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరిద్దరూ తిని వస్తే మీకు, అంకుల్‌కి కావలసిన సామాన్లు, రూమ్ ఏర్పాట్లు మేము వెళ్ళి చూసుకోవడానికి వీలవుతుంది ఆంటీ. మీరు షుగర్ పేషెంట్. మీకు మళ్ళీ ఏమైనా అయితే అవని ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయ చేసి కాస్త టిఫిన్ అన్నా తినేసి రండి.” అభ్యర్థిస్తూ అన్నాడు అవని స్నేహితుడు.
రూమ్‌కి షిఫ్ట్ చేయడం అనే వార్త ఆ ఇద్దరిలో కొంత ధైర్యాన్ని ఇచ్చింది. అవని బలవంతం పైన తల్లి కూడా కాస్త ఇంగిలి పడింది. తిరిగి ఇద్దరూ ఐసియూ దగ్గరకి రాగా, అవని అన్నయ్య అక్కడ కూర్చొని ఉండటం చూశారు.
“ఎంత సేపయింది?” అడిగింది అవని.
“పావుగంట. మీరు తినడానికి వెళ్ళినట్టున్నారు.” ఆ గొంతులో వచ్చిన వెటకారం ఆ సమయములో భరించడం చాలా కష్టంగా అనిపించింది అవనికి.
తల్లి మాత్రం తప్పు చేసిందానిలా మౌనంగా తల వంచుకు కూర్చుంది. బెంచీ మీద.
అన్నయ్య ప్రవర్తన అవనికి జుగుప్స కలిగించింది.
పది నిమిషాల తరువాత అవని స్నేహితులు ఇద్దరూ వచ్చారు. అవని అన్నని దూరంగా తీసుకు వెళ్ళి ఏదో చెప్పారు.
తల్లికి దగ్గరగా అన్న చేరి కూర్చోడం అవనికి అనుమానం కలిగించింది. అమ్మ చుట్టూ అన్న వేసిన రెండు చేతులతో అవనికి విషయం బోధపడింది. తాము తినడానికి వెళ్ళే సమయానికే తండ్రి తమని విడిచి వెళ్లారు అని. ‘తండ్రి శవం లోపల ఉండగా తాను కడుపు నిండుగా తింటూ కూర్చుందా!?’ అని ఓ నిమిషం తనమీద తనకే అసహ్యం వేసింది. స్నేహితుల మీద కోపం కూడా వచ్చింది. కానీ వార్త విని స్పృహ తప్పిన తల్లిని చూసి, స్నేహితులు ముందుచూపుతో చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
***
కార్యక్రమాలు ముగిసాయి. మూడు నెలలు గడిచాయి. తల్లి పరామర్శకి వచ్చే వారందరికీ ఒకటే చెబుతోంది. ఆయన పోయే సమయానికి వాడు మాత్రమే ఉన్నాడు. ఆఖరి చూపు వాడికే దక్కింది అని.
ఉదయం తొమ్మిదింటికి ఫోను చేస్తే సాయింత్రం ఐదు గంటలకి వచ్చాడు అని కానీ, ఆయన నాలుగు గంటలకే పోయారు అన్న నిజం మాత్రం ఎవరికీ చెప్పడం లేదు. చిత్రం ఏమిటంటే తల్లి తను చెబుతున్న అబద్ధాన్నే నిజంలా నమ్మే ప్రయత్నం చేయడం.
ప్రయత్నమో, అప్రయత్నమో తెలీదు కానీ రాత్రి హఠాత్తుగా “మీ నాన్న పోయే సమయానికి వాడే ఉన్నాడు చూశావా? మనిద్దరం ఉదయం నుంచి ఉన్నాం. ఏం ప్రయోజనం. ఆఖరి చూపుకి నోచుకోలేదు. ఆయన వాడికోసమే అంతసేపు ఊపిరి బిగబట్టుకున్నట్టు ఉన్నారు. వాడి ప్రేమ బయటికి కనపడదు అంతే..” అమ్మ మాటలకి అవని నిశ్చేష్టురాలయింది.
కోపం వచ్చింది కానీ తమాయించుకుంది. సరైన సమయం కాదని.
***
సంవత్సరీకం తంతు పూర్తయింది. వచ్చిన చుట్టాలoదరి నోటా దాదాపు ఒకటే మాట అవనితో. “నువ్వు ఒంటరిగా ఉంటావని పాపం వారిద్దరూ నీతో ఉన్నారు. నువ్వేమో మీ అన్నా వదినల దగ్గర ఉండవాయే. మీ నాన్న ఎన్ని సార్లు చెప్పుకు బాధపడేవారో. మీ అన్నయ్య కూడా అందువల్లే పాపం నలుగురిలో తల్లీ దండ్రిని చూడని వాడుగా పేరు పడుతున్నాడు. ఇపుడు కూడా నువ్వు ఇలా పట్టు పడితే మీ అమ్మ కోలుకోవడం మరింత కష్టo అవుతుంది. నువ్వా పొద్దుననగా వెళ్ళి సాయింత్రం వస్తావు. అక్కడుంటే కనీసం పిల్లలతో, మీ వదినతో కాస్త పొద్దు పోతుంది. ఆలోచించు” అన్న వారు కొందరైతే, ఒక అడుగు ముందుకు వేసి, “నీకంటే భర్తని వదిలేసి ఉండే ఒంటెద్దు జీవితం అలవాటు కానీ, పాపం మీ అమ్మ అలా కాదు 40 ఏళ్లుగా మీ నాన్నే జీవితంగా బ్రతికింది, ఒక్కసారిగా ఈ వయసులో ఒంటరిగా ఇంట్లో పలుకరించే వారు లేకపోతే ఎలా చెప్పు, గబుక్కున నువ్వు లేని సమయంలో ఆవిడకే ఏదన్నా అయిందనుకో పరిస్థితి ఏమిటి.? ఆలోచించు. చిన్నదానివేమీ కాదుగా నువ్వు..” ఇలా సాగాయి.
వచ్చిన వారoదరూ, అమ్మని ఓదార్చారు. అన్నయ్యని ఓదార్చారు. ఆఖరికి వదినని కూడా పరామర్శించారు. కానీ అవనిని మాత్రం దోషిలా చూశారు.
‘తండ్రిని పొగుట్టుకున్న దుఃఖo తనకి లేదా?’ అవనికి తనకి తానే దోషిలా కనపడ సాగింది.
***
తండ్రి పోయిన 14వ నెల అన్నయ్యని పిలిచింది అవని. సంవత్సరీకం రోజూ అందరూ తనతో అన్న మాటలు అవని మర్చిపోలేదు.
“అన్నయ్యా, ఇవి నాన్న నీ పేరు మీద చేసిన ఐదు లక్షల ఫిక్సెడ్ డెపోసిట్ రిసీట్. అమ్మ పేరు పైన 10 లక్షలు చేశారు. నామినీ కింద నిన్ను పెట్టారు. పిల్లల ఇద్దరూ పేరు మీద పోస్ట్ ఆఫీసులో వేసిన చెరి ఐదు లక్షల డెపోసిట్. ఊరిలో ఉన్న స్థలం నువ్వు ఇల్లు కట్టుకుంటా అన్నప్పుడే రాసిచ్చారు కదా. వాటి నకలు ఇవి.” అన్నీ ఒక్కోటి అమ్మకి అన్నయ్య కి చెబుతూ అన్నయ్య చేతిలో పెట్టింది అవని.
కానీ అతడి మోహం ఇంకా ‘నేను వినాలనుకున్నది నువ్వు చెప్పలేదు’ అన్నట్టుగా చూసింది.
అవని ఆ మాట గ్రహించినా గ్రహించనట్టుగానే కూర్చుంది.
ఇక లాభం లేదనుకొని అడిగాడు “మరి ఈ ఇల్లు..”
“నాన్న వీలునామా ఏమి రాయలేదు అన్నయ్యా. అమ్మ ఇష్టం. ఈ ఇంట్లో అమ్మా నేను ఉన్నన్నాళ్లు ఉంటాo. లేదు అంటే నాకు రావాల్సిన వాటా పోను నీ వాటాకి ఎంత అవుతుందో చూసి నీకు ఆ అమౌంట్ ఇస్తాను. ఇల్లు నాకు రిజిస్టర్ చేసేయి.”
“అదెలా కుదురుతుందే, నీకెందుకు వాటా వస్తుంది ఉంటే నాకు వాడికి వాటా ఉంటుంది కానీ..” 14 నెలల క్రితం ఈ మాట కనుక తల్లి నోటి వెంట వస్తే అవని ఆశ్చర్యపోయేదేమో కానీ తండ్రి పోయాక అవనికి చాలా విషయాలు అవగతమయ్యాయి. తండ్రి ఆసుపత్రి ఖర్చు దగ్గరి నుంచి మొదలు సంవత్సరీకాల వరకు ఒక్క రూపాయి కూడా కొడుకు పెట్టలేదు అన్న విషయం తల్లికీ తెలుసును. తల్లి నచ్చచెప్పగా నచ్చచెప్పగా బ్రాహ్మణల సంభావన, దానాల ఖర్చు మాత్రం పెట్టుకున్నాడు. కానీ ఇదంతా లోకానికి తెలీదు.
“పర్లేదులేమ్మా! మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఊరికే అడిగాను ఇంటి గురించి. అయినా వాటాలు దేనికీ. అది విడాకులు తీసుకున్న రోజే మనకి తెలుసు, దాని బాధ్యత మనదే అని. ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు ఇల్లు గురించిన వాటాల ప్రస్తావన ఎందుకు.. ఈ ఇల్లు నాన్న కష్టపడి కట్టించారు. దీన్ని వాటాలు వేయడం, అమ్మడం నాకిష్టo లేదు.” అని..
అమ్మ నిర్ణయంపై గల అమిత నమ్మకముతో “ఆ పైన అమ్మ ఇష్టం, నీ ఇష్టం.. అమ్మా బయల్దేరుతాను..” అని చేతిలో కావాల్సిన కాగితాలతో బయల్దేరాడు.
తల్లి వైపు మౌనంగా చూసింది అవని. తల్లి దోషo అంతా తనదే అన్నట్టు చూసింది.
అవని ఒక్క ప్రశ్న మాత్రం వేసింది తల్లిని “అమ్మా, అన్నయ్యకి అనుదీప్ అని నాకు అవని అని ఎందుకు పేరు పెట్టారు?!” అని.
“వాడు మనందరి జీవితాలకి వెలుగు అవుతాడు అని..” వ్యంగ్యం విసుగు కలగలిసన స్వరంలో చెప్పి తన గదిలోకి వెళ్ళింది అవని తల్లి.
తన పేరుకి మాత్రం అర్థం పరమార్థం గ్రహించలేదు అనుకుంది.. అవని.