Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవధానంలో అప్రస్తుత ప్రసంగం

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి ‘అవధానంలో అప్రస్తుత ప్రసంగం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

అలంకార శాస్త్రవేత్త వామనాచార్యుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో చేసిన వ్యాఖ్యానం ప్రకారం ‘అవధానం’ అంటే ఏకాగ్రత. ఎనిమిది అంశాల మీది ఏకాగ్రత అష్టావధానం; వంద విషయాల మీదది శతావధానం. ప్రదర్శన సందర్భంలో అవధానిగారి ఏకాగ్రతకు ఎసరు పెట్టే ప్రయాస పేరు ‘అప్రస్తుత ప్రసంగం’. దీనికే అధిక ప్రసంగం, అప్రస్తుత ప్రశంస లాంటి పేర్లు ఉన్నాయి.

సందర్భశుద్ధి లేకుండా సంభాషణల్లోకి జొరబడే వ్యవహారానికి అప్రస్తుత ప్రసంగం అనే నిందార్థం ఉంది. అవధాన ప్రక్రియల్లోని అప్రస్తుత ప్రసంగం లక్ష్యం అందుకు విరుద్ధం. సమస్యాపూరణమో, దత్తపది వత్తిడో, వర్ణనాంశం అంకుశమో, నిషిద్ధాక్షరి సందిగ్ధతో.. అవధాని గారిని ఇబ్బంది పెట్టే సందు చూసుకుని తలనొప్పి తెప్పించే తింగరి ప్రశ్నలతో మరింత వేధించి వినోదించడం దీని లక్ష్యం.

ప్రశ్నకు తలాతోకా ఉండక్కర్లేదు. సమయాసమయాల పట్టింపు లేదు. ప్రాంతాలు, కాలాలు, వ్యక్తులు, వింతలు, విడ్డూరాలు.. కాదేదీ అధిక ప్రసంగానికి అడ్డంకి – అన్న మాట. ప్రశ్నలు కేవలం క్లిష్టంగానే కాకుండా చమత్కారంతో కూడి.. అవధానిలోని స్థితప్రజ్ఞను, హాస్యస్ఫూర్తిని వెలికితీసేలా ఉంటేనే అప్రస్తుత ప్రసంగానికి ప్రశంసలు దక్కేది.

అవధానం మధ్యలో ప్రపంగి వేసే పానకం పుడకలను తెలివిగా బయటకు తీయడం అవధానిగారి విధి. విసుగు, ఆగ్రహం, నిర్లక్ష్యం లాంటి వికారాల ప్రదర్శన వల్ల అప్రస్తుత ప్రసంగంతో సభ రసాభాస కాకుండా చూసుకొవాల్సిన బాధ్యత అవధానిగారిదే.

తిరుపతి వేంకట కవులు అధిక ప్రసంగికి ప్రశ్నలకు చెంపపెట్టు సమాధానాలు ఇవ్వడంలో ప్రసిద్ధులు. ఆ జంట కవులలో ఒకరైనా చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు ఒకానొక అవధానంలో ‘ఊళ్ళోకి వెళ్లే దారిలో ఎదురయ్యే నక్క ఎడమ నుంచి కుడికి వెళ్లడం మంచిదా, కుడి నుంచి ఎడమకు పోవడం మంచిదా అన్న పృచ్ఛకుడి పిచ్చి ప్రశ్నకు ‘మిమ్మల్ని కరవకుండా ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు వెళ్లినా మంచిదే’ అంటూ చెంపపెట్టు సమాధానం సెలవిచ్చారు.

డా॥ రాళ్ళబండి కవితా ప్రసాద్ ద్విశతావధానిగా మంచి పేరుంది. ‘భార్య ఇంకో గంట దాకా మాత్రమే బతికుంటుందని డాక్టరంటే భర్తగారి జవాబు ఎలావుంటుంది?’ అన్న సందేహానికి తడుముకోకుండా ‘ఇన్నేళ్ళు వహించా, ఇంకో గంట ఓపిక పట్టలేనా!’ అని ఉంటాడు – అని చమత్కరించి సభను నవ్వించాడు.

అమళ్ళదిన్నె గోపీనాథ్ అని మరో గర్వించదగ్గ హాస్యభారతి ఉన్నారు. ఆయనగారో అవధానంలో పృచ్ఛకుడు ‘దయ్యాలు రాత్రిపూటే ఎందుకు సంచరిస్తాయి?’ అని అడిగితే ‘పగలయితే మీలాంటి పెద్దమనుషులు తిరుగుతుంటారు కాబట్టి!’ అంటూ పృచ్ఛకుడితో సహా సభను కేరింతలు కొట్టనిచ్చాడు.

ప్రస్తుతం ప్రవచనకర్తగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న మహాసహస్రావధాని డా॥ గరికపాటి నరసింహారావు ఓం ప్రథమంలో అవధానాల ద్వారా పేరు గడించినవారు. ఆయన్నో అప్రస్తుత ప్రసంగి ‘పెళ్ళి జరిగే సమయంలో పెళ్ళికూతురు బుట్టలో కూర్చుంటుంది. మరి పెళ్ళికొడుకు?’ అని అడిగిన ప్రశ్నకు అనూహ్యమైన జవాబిచ్చి రసజ్ఞులందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసేశారు. ‘పెళ్లికూతురు బుట్టలో కూర్చునేది ఆ ఒక్క అరగంటే. ఆ తరువాత ఆమె గారు ఈయన్ని జీవితాంతం ‘బుట్టలో వేసుకొంటుందిగా!’ అన్నది ఆ సమాధానం.

అట్లాగే, అష్టావధాని శ్రీ అష్టకాల నరసింహరామశర్మగారు ‘అట్లాంటిక్ సముద్రాన్ని దాటిన బస్ పేరు చెప్ప’మని ఓ పృచ్ఛకుడు అడిగితే తడుముకోకుండా ‘కొలంబస్’ అని చెప్పి కరతాళ ధ్వనులు కొట్టించుకున్నారింకో ప్రదర్శనలో.

అవధానం చేసేవారికి కేవలం సాహిత్య సంబంధమైన పాండిత్యమే కాకుండా విజ్ఞానం, గణితం వంటి శాస్త్రాదులతో కూడా కొద్దో గొప్పో పరిచయం ఉండాలి. అప్పుడే అవధానాలకు సభను రంజించే యుక్తి సమకూరేది.

‘కొబ్బరికాయల వ్యాపారం పెట్టక ముందు ఒకాయన కాయ మూడు రూపాయల చొప్పున అమ్మేవాడు. ఆరునెలల లోపే అతగాడు లక్షాధికారి అయాడు. ఏ లెక్కన?’ అని దూసుకొచ్చిన ప్రశ్నకు లెక్కల్లో సమాధానం ఇవ్వకుండా ‘వ్యాపారానికి ముందు ఆ అమాయకుడు కోటీశ్వరుడయివుంటాడ’ని లోకరీతిని బట్టి బదులిచ్చాడు. విన్న సభాసదులు పడీపడీ నవ్వకుండా ఉంటారా! సమకాలీనతపై స్పృహ కలిగిన జవాబులు రువ్వాలి. లేని పక్షంలో సభాసదుల ముందు అభాసుపాలయే ప్రమాదం కద్దు.

‘ఆడవాళ్ళు ప్రొద్దున లేచిన వెంటనే తాళిబొట్టు కళ్ళకు అద్దుకుంటారు, ఎందుకు?’ అన్న ఓ అసందర్భ ప్రశ్నకు ‘అది పతిభక్తితో కాదు. మొగుడు దానిని తానాదమరచి నిద్రపోయేటప్పుడు తెంపుకెళ్ళాడేమోనన్న అనుమానంతో’ అని ఓ అవధానిగారిచ్చిన సమాధానం లోకరీతికి అద్దం పట్టి హాస్యరసాన్ని పండిస్తుంది.

ప్రదర్శన విజయం అవధానిగారి భాషా వినియోగం మీద కూడా ఆధారపడి ఉంటుందనడానికి శ్రీ శంకరగంటి రమాకాంత్ గారు నిర్వహించిన ఓ అవధానంలోని ఉదంతమే మంచి ఉదాహరణ. ‘సకల శాస్త్ర పారంగతుడంటే ఎవరు?’ అనడిగిన అప్రస్తుత ప్రశ్నకు ఆ పండితుడి నుండి వచ్చిన సమాధానం అనూహ్యం.. అద్భుతం. ‘నీటిచెంబు కత్తి’ పట్టి వృత్తి పని చేయడంలో నైపుణ్యం చూపించే క్షురకర్మ మహాశయుడు అని బదులు. ఇదేం జవాబు అని పెదవి విరిచే సభాసదులకు అవధానిగారిచ్చిన వివరణతో విరగబడి నవ్వక తప్పింది కాదు. ‘సకలశాస్త్ర’ అంటే అందరూ అనుకునే ‘సకల + శాస్త్ర’ కాదుట! ‘స+ కలశ+ అస్త్ర’ అని కూడా పద విభజన చేసుకోవచ్చుట. ఆ లెక్కన ‘స+ కలశ+ అస్త్ర’ అంటే ‘నీటిచెంబు కత్తి’ అనే అస్త్రం ప్రయోగించడంలో సిద్ధహస్తుడిని ‘సకల శాస్త్ర పారంగతుడు’ అని చెప్పుకోవడం ఉచితం.. అని అవధానిగారి శ్లేషించే ప్రజ్ఞ అద్భుత మనిపించక మానదు కదా!

అశ్లీలానికి తావు లేని సహర్ష ముద్రారాక్షసానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పమన్న పృచ్ఛకుని ప్రశ్నకు ‘భీముడు ఆముదము తీసుకుని యుద్ధానికి బైలుదేరాడు’ అని సమాధానం అవధానిగారి నుంచి వచ్చి అందరినీ అలరించింది. ఆయుధానికి బదులు ఆముదం అనే ముద్రారాక్షసం జొరబడిందని అవధానిగారి భావం!

పలు తెలుగు అవధాన ప్రక్రియల్లో వివిధ కాలాలకు అనుగుణంగా ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించి ఘనమైన కీర్తి కిరీటాలను ధరిస్తున్న అవధానుల జాబితాకు ఆదీ అంతూ లేదు.

అప్రస్తుత ప్రసంగి సంధించే ప్రశ్నలకు జవాబుగా అవధానిగారి నుంచి వచ్చే సమాధానాలు శ్రోతలు తమ లౌకిక క్లేశాలను తాత్కాలికంగా అయినా మరిచి కొద్ది క్షణాల పాటైనా ఆనందాబ్ధిలో మునిగి తేలేవిధంగా ఉంటే ఆ అధిక ప్రసంగం అవధాన ప్రదర్శనకు మరింత రాణింపు తేవడం ఖాయం.

Exit mobile version