[బాలబాలికల కోసం ‘అవాక్కయింది అమ్మ’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]


దీప్తి చదువుకుంటోంది. చాలా సీరియస్‌గా. పిల్లలు ఎనిమిదేళ్ళ ఆరీని ఐదేళ్ళ నివిన్ని సరిగా పట్టించుకోకుండా. రెండు గంటలకోసారి చదువాపి వాళ్ళకి కావాల్సినవి చూసి మళ్ళీ పుస్తకాల్లో దూరి పోయేది. వాళ్ళకి ముందే చెప్పి పెట్టింది – “ఒక్క పది రోజులు నేను మీతో సరిగ్గా ఆడుకోలేను నాన్నా, నేనొక పరీక్ష రాయాలి, దానికోసం బాగా చదువుకోవాలి, మీరు నాన్నతో ఆడుకోండి” అని.
“పరీక్షలు పిల్లలు కదా రాయాల్సింది. నువ్వు కూడా రాయాలా?” అని అడిగాడు ఆరీ.
“చిన్న పిల్లలకి చిన్న పరీక్షలుంటాయి. పెద్దవాళ్ళకి పేద్ద పరీక్షలు. నేను డాక్టర్ని కదరా. ఈ పరీక్ష కూడా పాసయితే పేషెంట్స్‌ని ఇంకా బాగా చూడచ్చు. మంచి మందులిచ్చి వాళ్ళ జబ్బులు తొందరగా నయం చెయ్యచ్చు. ముఖ్యంగా అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకీ ఏ నొప్పీ లేకుండా చెయ్యవచ్చు.” జీరియాట్రిక్స్లో స్పెషలైజేషన్ చేస్తున్న దీప్తి సమాధానం.
నివిన్‌కి ఈ సంభాషణ అర్థం కావటం లేదు. అమ్మ చదువుకునేటప్పుడు దగ్గరకి రాకుండా ఆడుకొమ్మంది. ఇప్పుడు అమ్మ అన్నతో మాట్లాడుతోంది.. అంటే అమ్మ చదువుకోవటంలేదు. కనుక తను ఆడుకోవచ్చు. అందుకే అమ్మ వీపు మీద ఉయ్యాల ఊగుతున్నాడు.
ఆరీ మాత్రం అమ్మ పక్కన మంచినీళ్ళ సీసా తీసుకెళ్ళి నింపి తీసుకొచ్చి పెట్టాడు. బిస్కెట్స్ డబ్బాలోంచి రెండు బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి అమ్మ పక్కన పెట్టి, అమ్మ చేతిని తట్టి ప్లేట్ చూపించాడు తినమన్నట్లు. మరి తను పరీక్షలకి కొంచెం ఎక్కువ సేపు చదువుకుంటుంటే అమ్మ తనని మాట్లాడించకుండా తన దగ్గరే కూర్చునేది. తనకేమన్నా అర్థం కాకపోతే చెప్పేది. తనకి తినటానికి ఏమైనా పెట్టేది. తనకి చదవటం విసుగొస్తే కొంచెం సేపు ఆడించి మళ్ళీ చదివించేది. అమ్మకి కూడా చదివీ చదివీ విసుగొచ్చిందేమో..
“అమ్మా, కొంచెం సేపు ఆడుకుంటావా? కూల్ డ్రింక్ ఇవ్వనా?” అమ్మని అడుగుతూనే తమ్ముణ్ణి అవతలకి పిలిచాడు ఆరీ. “మనం ఆడుకుందాం రారా, అమ్మని చదువుకోనీ. మళ్ళీ ఫైలయితే అమ్మ పేషెంట్స్‌ని సరిగా చూడలేదంట.”
ఆరీ చూపించే శ్రధ్ధకి ముగ్ధురాలైంది దీప్తి. వాడు చదువుకునేటప్పుడు తను వాణ్ణి ఎలా చూసేదో అవ్వన్నీ తనకి చెయ్యాలని చూస్తున్నాడు. వాడికి ఇప్పుడిప్పుడే చదువు, పరీక్షలు లాంటి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. పరీక్షల్లో బాగా రాస్తే మంచి మార్కులొస్తాయి. అప్పుడు ఏడాది కాగానే వేరే క్లాస్‌కి వెళ్ళచ్చు.
తమ్ముణ్ణి తీసుకుని అవతలకి వెళ్తున్నవాడు కాస్తా ఏదో గుర్తొచ్చినట్లు అక్కడే ఆగి “అమ్మా, పెద్దయ్యాక నేనూ మెడిసన్ చదవాలి కదా” అని అడిగాడు.
పుస్తకం తెరుస్తూ దీప్తి చెప్పింది “నీ ఇష్టం నాన్నా, నీకేది చదవాలనిపిస్తే అది చదవచ్చు.”
“అయితే ఒక్క నిముషం ఆగు, తమ్ముణ్ణి నాన్న దగ్గర దించేసి వస్తాను” అని వెళ్ళాడు.
రెండు నిముషాల్లో తిరిగొచ్చాడు ఆరీ చేతిలో ఒక నోట్ బుక్, పెన్సిల్‌తో, “చెప్పమ్మా” అంటూ.
దీప్తికి అర్థం కాలేదు. “ఏం చెప్పాలిరా?” అంది.
“అదే, నువ్వా పుస్తకమంతా చదువుతున్నావు కదా. నాకు నోట్స్ చెప్తే నేనూ రాసుకుంటాను.”
“నీకిదంతా ఎలా అర్థమవుతుందిరా? అయినా నోట్స్ రాసుకుని ఏం చేస్తావు?” వాడి ఉద్దేశం ఏమిటో దీప్తికి అర్థం కాలేదు.
“పెద్దయ్యాక నేనెటూ మెడిసన్ చదవాలి కదా. మళ్ళీ ఈ పుస్తకాలన్నీ చదవటం టైం వేస్ట్ కదా. నువ్వు చదివినప్పుడే నేనూ నోట్స్ రాసుకుంటే నాకు పెద్దయ్యాక టైం సేవవుతుంది. మళ్ళీ ఇవ్వన్నీ చదవకుండా సరిపోతుంది.”
అవాక్కయ్యింది అమ్మ.
(ఈ నోట్స్ ఐడియా మా మనవడు ఆరీదే. అందుకే అమ్మమ్మ చేతిలో కథ అయింది.)

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
8 Comments
G. S. Lakshmi
నిజమే. ఈ తరం పిల్లలు అంత దూరమూ ఆలోచిస్తున్నారు. మనవడి ప్రేరణతో మంచి కథ అందించారండీ లక్ష్మి గారూ.
పి.యస్.యమ్. లక్ష్మి
దూరదర్శిని వగైరాల్లో మార్పులు వస్తున్నట్లే మనుషుల బుర్రలో కూడా అనేక మార్పులు తెస్తున్నాడేమో భగవంతుడు.
Dharbasthu radha
చక్కని చిట్టి కథ చాలా బాగుంది. మీ కథ నా కాలేజ్ రోజులని గుర్తు చేశాయి నేను చదివేటప్పుడు మా అమ్మ ముఖ్యంగా మా నాన్న నాకు చాలా కేర్ తీసుకునేవాడు. అలాగే పాప పుట్టక నేను D.sc రాశాను అప్పుడు దీప్తి లాగే నా పాపను దూరం పెట్టి తనకు అన్ని చేస్తూ చదివి టీచర్ జాబ్ పొందాను రిజల్ట్స్ తరువాత ఎక్కువ సంతోషపడింది నా పాపనే.
పి.యస్.యమ్. లక్ష్మి
మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నందుకు సంతోషమండీ.
Mala
మనవడి ఐడియా, అమ్మమ్మ చిట్టికథ బాగున్నాయండి.
పి.యస్.యమ్. లక్ష్మి
ధన్యవాదాలు మాలా గారూ
కృష్ణవేణి
నమస్తే
హృదయపూర్వక అభినందనలు తమ థీమ్ అద్భుతం ఈ కాలం చిన్నారులు ఇలాగే వున్నారు మనకు అందని ఆలోచనలు వారివి
పి.యస్.యమ్. లక్ష్మి
అవును కదా. అలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయా అని మనం విస్తుపోవాల్సిందే.