[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘అటు నేనే.. ఇటు నేనే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“సాటిమనిషిని గౌరవించడం మరిచిపోతున్న ఈనాటి కపట నాగరిక ప్రపంచంలో, సాక్షాత్తూ భగవంతుడు భక్తుడిని సేవించిన వృత్తాంతం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం.
‘శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం’ – ఇవి శ్రీమద్భాగవతంలో చెప్పబడిన నవవిధ భక్తిమార్గాలు. అంటే తొమ్మిది విధాలుగా ఆ పరమాత్ముడిని సేవించవచ్చు. అందులో ఒకటి ‘దాస్యం’. అంటే స్వామికి దాసుడననే భావంతో సేవ చేయడం. ఆంజనేయస్వామి దాసభక్తికి పర్యాయపదం. వారు శ్రీరామచంద్రమూర్తిని సేవించిన తీరు జగత్ప్రసిద్ధం.
ఐతే, ఆ మహాభాగవత గ్రంథంలోనే శ్రీకృష్ణపరమాత్ములు తమ మిత్రుడు పట్ల చూపిన అపార వాత్సల్యం, చేసిన సేవ వర్ణించబడింది. ఆ ‘కుచేలోపాఖ్యానం’ ఇవాళ మన ప్రసంగం.” క్షణం ఆగారు ఆచార్య దుర్గానందం.
నవరాత్రులు. శ్రీ భక్తతుకారం రామాలయంలో ఆస్తికులు ఆసక్తిగా వింటున్నారు. ఆచార్యుల ఆధ్యాత్మిక ప్రసంగాలు జనాకర్షకంగానూ సాగుతాయి.
“దారిద్ర్యంతో కృశించి, జీర్ణవస్త్రాలు ధరించి ఉన్న కుచేలుడి రాక గమనించిన శ్రీకృష్ణుడు గబగబా పాన్పు దిగి, ఎదురు వెళ్ళి అతనిని కౌగలించుకున్నాడు. స్నేహపూర్వకంగా స్వాగతం పలికి, ప్రేమతో తీసుకువచ్చి, తన పాన్పు మీద కూర్చుండ బెట్టాడు.
ఏ పాన్పు మీద? మహా యోగులచేత పూజింపబడే శ్రీ మహావిష్ణువు తాను పవళంచే శయ్య మీద ఆ పేద బాపడిని కూర్చుండచేసాడు. అంతరాలు ఎరుగని ప్రేమభావం మనిషికుండవలసిన ఉత్తమ లక్షణం.
పాన్పు మీద కూర్చోపెట్టి ఊరుకున్నాడా వాసుదేవుడు! బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి కుచేలుడి పాదాలను కడిగాడు. ఆ నీళ్ళు భక్తితో తలపై చల్లుకున్నాడు.
శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే ఎంతో పరమార్థం ఉంది ఇందులో. ఎదుటివారిని గౌరవించడంలోనే మన గొప్పతనం ఉంటుంది. తక్కువ చేసి చూడడం అంటే, మనల్ని మనం తక్కువ చేసుకోవడమే..” కొనసాగించారు ఆచార్యులు.
శ్రోతలు చెవులప్పగించి వింటున్నారు.
***
ఆరు దాటుతుండగా ఒక తల నెరసిన పెద్దాయన ఆ సభామందిరంలో కాలు పెట్టాడు. ఆయన రాక చూసిన నగర రచయితల సంఘం కార్యదర్శి సుబ్బారావు ముఖం వికసించింది.
“రండి.రండి! రమణయ్య గారు! ఆరు దాటింది. ఇంకా ఎవరూ రాలేదే అనుకుంటున్నాను” అంటూ వారికి స్వాగతం పలికాడు.
“నేనొక్కడినీ వస్తే ఏం లాభమండి. పదిమంది వస్తే గాని సభ మొదలవదు కదా!” అన్నాడు రమణయ్య.
“కార్యదర్శినయ్యాను కదండీ. సమయపాలన విషయమై నా ప్రయత్నం నేను చేస్తాను”
ఇంకా ఏదో అనబోయిన సుబ్బారావుని ఆపి, “మీరు అవలేదండి. మిమ్మల్ని చేసారు అధ్యక్షులవారు. ఇక్కడ ఎవరైనా వారు చెప్పింది తప్ప ఇంకేమీ చేయడానికి కుదరదండి. కొత్తగా వచ్చారు కదా. నెమ్మదిగా మీకే అర్థమవుతుంది” అన్నాడు రమణయ్య.
‘ఎలా స్పందించాలా’ అని సుబ్బారావు ఆలోచిస్తుండగా, అదృష్టవశాత్తు మరో పండుజుత్తు కథకుడు వస్తుండటంతో అటు అడుగులేసాడు.
అప్పుడొకరు, ఇప్పుడొకరు వచ్చి, మొత్తానికి పదిమంది దాకా తేలేరు; కొందరు లబ్ధప్రతిష్ఠులు సహా.
ఆరూముప్పావుకి ఉపాధ్యక్షులు జయలక్ష్మి విచ్చేసారు. రాగానే అన్ని శాల్తీలను లెక్కపెట్టి, చరవాణి చేతబట్టి, అవతల వారికి విన్నవించారు “అయ్యా! నాతో పాటు పదకొండుమందిమయ్యాం. తమరు బయలుదేరవచ్చు”.
ఏడు దాటుతుండగా అధ్యక్షులు సతీసమేతంగా దయచేసారు. ముకుళిత హస్తాలతో అందరూ లేచి నిల్చున్నారు.
సుబ్బారావు వేదిక ఎక్కాడు. అధ్యక్షులు వారిని వేదికపై రావలసిందిగా అభ్యర్థించి, వారు రాగానే, ‘జయలక్ష్మి గారు వారికి పుష్పగుచ్ఛం అందిస్తార’ని ప్రకటించాడు. ఆ తతంగం ముగిసింది.
అధ్యక్షులు ఠీవీగా తమ స్థానంలో ఆశీనులయ్యారు ప్రసన్న వదనంతో. ఆ ప్రక్కనే ఉన్న కుర్చీపై కూర్చోబోయాడు సుబ్బారావు.
‘ఇంత తెగింపా’ అని నివ్వెర పోయారు సభికులంతా.
కట్టలు తెంచుకుంటున్న కోపాన్ని నిగ్రహించుకుని, “దిగు” అని గద్దించి, కొంచెం తగ్గి “దిగండి” ఆజ్ఞాపించారు ఆచార్య దుర్గానందం.