అత్తగారు.. పలకరింపులు
ఆవిడ అమెరికా వచ్చే టైమ్ ఇక్కడ ఎండాకాలం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇలా తిరగడానికి కూడా చలిలో గజగజలాడే వారు. రోజూ సాయంత్రం ఎటో అటు తీసుకెళ్ళేవాళ్ళం. తిరిగినంతసేపు తిరిగి,
“టైమ్ ఐదయిందేమో! ఇక ఇంటికి వెడదాం.” అన్నారు.
వాచీలో టైమ్ చూపించాను. ఎనిమిదయింది.
“ఏంటీ? రాత్రి ఎనిమిదయిందా? ఇదేం వింత? ఇంకా సూర్యాస్తమయం కూడా అయినట్టు లేదు.” ఆశ్చర్యంగా అన్నారు.
“ఇక్కడ ఎండాకాలం అంతే అత్తయ్యా! తొమ్మిది దాకా వెలుగు ఉంటుంది. అదే చలికాలంలో అయితే సాయంత్రం నాలుగు గంటలకే చీకట్లు వచ్చేస్తాయి” అన్నాను.
“మేమూ శీతాకాలం పొద్దు, ఎండాకాలం పొద్దు అనుకుంటాం కానీ, మరీ ఇంత కాదు” అంటూ కారు ఎక్కారు.
డిన్నర్ తింటూ ఈ విశేషాలన్నీ ఈయనకి చెపుతూండేవారు.
“అమ్మా! ఇక్కడ నీ అనుభవాలన్నీ.. ఇలా ముచ్చట్లతో రాసి పెట్టమ్మా! ఎప్పటికీ గుర్తుగా వుంటాయి” అనేవారు ఈయన.
అత్తయ్య గారిని తీసుకుని బయటకి వెళ్ళినపుడల్లా.. ఆవిడని చూడగానే ఇక్కడ అమెరికన్ వారు చక్కగా చిరునవ్వుతో పలకరించేవారు.
‘గుడీవినింగ్, హేవే నైస్ డే’, అనీ ‘యువర్ శారీ బ్యూటిఫుల్’ అంటూ పలకరించడం చూసి,
“అబ్బో, అమెరికాలో మీరు చాలా పలుకుబడి సంపాందించారే! చాలా మందే పలకరిస్తున్నారు.. వీళ్ళందరూ అబ్బాయికి తెలిసివాళ్ళేనా?” అని
అడిగేసరికి నాకు నవ్వాగలేదు.
“అయ్యో! కాదత్తయ్యా! ఇక్కడ వీళ్లు మనకి పరిచయమున్నా, లేకపోయినా కూడా ఇలాగే విష్ చేస్తారు. పైగా వీళ్ళకి మన చీరకట్టు కూడా బాగా నచ్చుతుంది. అందుకే బావుందని మెచ్చుకుంటూంటారు.” అన్నాను.
“ఔనా! ఇదేదో బావుంది ఇలా మెచ్చుకోవడం. అదే మన వాళ్ళు ఉంటారు ఎందుకూ? మెప్పుదల మాట అటుంచి మూతి ముఫై వంకరలు తిప్పుతారు” అన్నారు.
ఔను, అదీ నిజమే కదా అనిపించింది.
వాళ్ళు అలా చిరునవ్వుతో పలకరించినపుడు మనం కూడా తిరిగి జవాబు ఇవ్వడం మన సంస్కారాన్ని తెలియచేస్తుంది అంటూ.. తనని విష్ చేసినవారికందరికీ ఈవిడ తిరిగి.. థాంక్యూ.. థాంక్యూ అనడం నేర్చుకున్నారు.
ఈ పలకరింపుల ప్రహసనంలో ఆవిడకి చుట్టు పక్కల అమెరికన్లు కొందరు స్నేహితులైపోయారు. వచ్చీరాని ఇంగ్లీషు ముక్కలతో ఏదో ఒకటి మాట్లాడేసేవారు. వారందరికీ కూడా అత్తయ్య గారు ప్రీతిపాత్రమైపోయారు.
ఈవిడ చేసిన వంటకాలు కూడా అప్పుడప్పుడు వారికి రుచి చూపించేవారు. పచ్చళ్ళ కారాలకి ముక్కునుండి, కళ్ళనుండీ నీళ్ళు కారిపోతూ ‘ఆసమ్’ ఆసమ్’ అంటూంటే, ‘ఇంకా సమ్ వేయమంటారా?’ అని అడిగేవారీవిడ.
రోజూ వాకింగ్ వెళ్ళే సమయంలో కూడా, ఇక్కడ తమ పిల్లల దగ్గరకి వచ్చిన తల్లి తండ్రులు కొందరు తెలుగు, కన్నడ, హిందీ మిత్రులని కూడా సంపాదించేసారు. ఇతర భాషలు రాకపోయినా హావభావాలతోనే మాట్లాడేసేవారు. ఇలాగే ఒకసారి వాళ్ళందరూ కలిసి మా కమ్యూనిటీ పార్క్‌లో పార్టీ చేసుకుందామనుకున్నారట. ఇంటికి వచ్చాక నాతో “మా వాకింగ్ మిత్రులందరూ కుండ అదృష్టం పార్టీ చేసుకుందామంటున్నారు. నేను పులిహోర చేసుకుని వస్తానని చెప్పాను” అన్నారు. ముందు నాకు ఆ కుండ అదృష్టం అంటే ఏంటో అర్థం కాలేదు. తర్వాత తర్జుమా చేసుకుని, ఓహో అది పాట్ లక్ పార్టీకి వచ్చిన పాట్లా అనుకున్నాను. ఈ పార్టీలు ఇక్కడ మామూలేగా!
అంతకుముందు ఒకసారి ఇలాగే మా ఇంట్లో ఓ పది కుటుంబాలు పాట్ లక్ పార్టీ అనీ.. తలా ఒక రకం చేసుకుని తీసుకొస్తే ఇక్కడ తినడానికి ప్లాన్ చేసుకున్నాము. ఎవరెవరు ఏవేం చేయాలో చెప్పుకున్నాము.
‘మనింటికి భోజనానికి వస్తూ వస్తూ వాళ్ళందరూ చేసి తీసుకురావడమేంటి? అలా బావుండదు’ అంటూ వాళ్ళందరికీ వద్దని చెప్పు.. అందరికీ నేను వంట చేసేస్తాను. మన ఊళ్ళో నాకు అలవాటే.. నలభై ఏభై మందికైనా అవలీలగా చేసేయగలను’ అనేసరికి.. ఈయన “ఇక్కడ ఎవరూ తప్పు పట్టుకోరమ్మా! ఫర్వాలేదు. మనం చేస్తామన్నా వాళ్ళందరూ ఒప్పుకోరు. ఒక్కళ్ళకే శ్రమ అవుతుందని అందరూ ఇలా పంచుకుంటారు. నువ్వు లేనిపోని శ్రమ పడకు.” అనేసరికి ఊరుకున్నారు. అలా ఆవిడకి పాట్ లక్ పార్టీలు అలవాటయి, వాళ్ళ వాకింగ్ స్నేహితులు కూడా కలిసి చేసుకున్నారు. ఈవిడ పులిహోర చేసి పట్టుకెళ్ళారు. మరో కన్నడ ఆవిడ బిసిబెళబాతు, నార్త్ వారు డోక్లా, పోహా ఇలా రకరకాలు చేసుకుని వచ్చారనీ, అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నామనీ ,ఇంటికొచ్చాక ఒకటే చెప్పడం.
బయట షాపింగులకి వెళ్ళినపుడు అత్తయ్య గారు, చీర కట్టుకుని తెలుగువారిలా కనిపించిన వారితో మాటలు కలుపుదామని చూసేవారు. కానీ చాలా మంది జవాబే ఇచ్చేవారు కారు. కొందరు ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళిపోయేవారు.
“ఎందుకమ్మా? అలా అందరినీ పలకరిస్తావు? ఎవరైనా ఏమైనా అనుకుంటారు? అలా వాళ్ళందరూ ఏం కొనుక్కున్నారా అని వాళ్ళ కార్టులలోకి చూడకు. మనల్ని తక్కువ చేసుకుంటారు వాళ్ళు. గట్టి గట్టిగా మాట్లాడకు.” ఈయన ఇలా ఏదో ఒకటి అంటూండేవారు. ఆవిడ ఆ మాటలకి,
“మాట్లాడితే తప్పేంటిరా! ఏ ఊరి నుంచి వచ్చారో తెలుసుకుందామని అడుగుతున్నానంతేగా! ఒకవేళ మన తూ.గో. వాళ్ళయితే మన ఊరి ముచ్చట్లు తెలుస్తాయేమో అని. అయినా జవాబు ఇవ్వడానికే ఫోజు కొడుతున్నారు. వాళ్ళ సొమ్ము కరిగి పోతుందనుకుంటున్నారో ఏంటో.. అయినా, మీ అమెరికా వాళ్ళే నయం, భాష తెలీక పోయినా ఎంచక్కా పలకరిస్తారు” అనేవారు.
వచ్చే వారం కూడా ఆవిడ చూసిన మరికొన్ని పార్టీలూ.. ఫంక్షన్ లలో కలుసుకుందాం.. ఆవిడేం చెపుతారో విందాం. సరేనా?
కలవల గిరిజా రాణి.
హాస్య కథా రచయిత్రి