[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మానందమే నిజమైన సుఖం’ అనే రచనని అందిస్తున్నాము.]
ప్రపంచంలో మనిషి చేసే ప్రధానమైన అపోహల్లో ముఖ్యమైనది ఇంద్రియ సుఖాలను ఎక్కువగా ఆస్వాదిస్తేనే పరమానందం లభిస్తుందని నమ్మడం. ఈ భ్రమతోనే మనిషి భూమి సంపదలు మాత్రమే కాకుండా, విశ్వంలోని వనరులను కూడా అన్వేషిస్తూ, వాటిని తన అనుభవానికి వినియోగించుకోవాలనే తపనలో ఉన్నాడు. “సుఖం తాత్కాలికమైనదే అయినా, ఉన్నంతవరకు ఆస్వాదిద్దాం” అని అనుకోవడం మానవ సహజం. కానీ ఇది మిథ్యాభావం, మాయ మాత్రమే.
భగవద్గీత (5.22) లో శ్రీకృష్ణుడు ఈ క్రింది శ్లోకం ద్వారా ఇంద్రియ సుఖాల గురించి మానవులలో వున్న అపోహలను పటాపంచలు చేసాడు.
యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః॥
ఇంద్రియ సంబంధం వల్ల కలిగే సుఖాలు తాత్కాలికమైనవే. వాటికి ఆరంభమూ, అంతమూ ఉన్నాయి. కాబట్టి అవి చివరికి దుఃఖానికే కారణమవుతాయి. నిజమైన జ్ఞానవంతుడు వాటిలో ఆనందం వెతకడు.
మనిషి అసలు స్వరూపం శరీరం కాదు, ఆత్మ. భగవద్గీత (15.7) లో కృష్ణుడు అన్నట్టుగా, ప్రతి జీవి నన్ను విడిచిన నిత్యమైన భాగమే. కాని మనస్సు, ఇంద్రియాల వలన ప్రకృతితో బంధింపబడి, తన స్వరూపాన్ని మరచిపోయి తిరుగుతున్నాడు. పదార్థం జడము, నశ్వరము. ఆత్మ మాత్రం చైతన్యమూర్తి, శాశ్వతం. ఇవి పరస్పర విరుద్ధమైనవైనందున కలిసిపోవు. ఆత్మను పదార్థవస్తువులు తృప్తిపరచలేవు. నీటిలోంచి చేపను బయటకు తీసి సుఖమివ్వలేనట్లే, పరమాత్మతో ఏకత్వం పొందకపోతే ఆత్మకు నిజమైన ఆనందం లభించదు.
కృష్ణుడు గీతలో తనలో సంతోషమును పొందినవాడు, తనలోనే వెలుగును ఆస్వాదించినవాడు, తనలోనే ఆనందమును కనుగొన్నవాడు పరబ్రహ్మలో లీనమై నిత్యశాంతిని పొందుతాడు అని స్పష్టం చేసాడు. ఈ బోధనం మనకు చాటి చెప్పేది ఏమిటంటే – నిజమైన ధనం ఆత్మానందమే, భౌతిక సంపదలు కావు.
ఇదే మనిషి మరచిపోయిన సత్యం. ఆత్మానందమే నిజమైనది, శాశ్వతమైనది. ఇంద్రియ సుఖాలు మాత్రం క్షణికమైనవి, అంతిమంగా వ్యసనాల వలె బాధకరమైనవి. ఎవరైతే ఈ తాత్కాలిక సుఖాల మీద ఆధారపడతారో వారు ఎప్పటికీ అసంతృప్తితోనే మిగిలిపోతారు.
నేటి విద్యా విధానం మనిషిని ఒకవైపు పదార్థ విషయాలపైనే కేంద్రీకరించి పెడుతోంది. పాఠశాలలు, కళాశాలలు మనకు శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని నేర్పుతున్నాయి. కానీ ఆత్మస్వరూపం, పరమాత్మ సంబంధం గురించి ఎటువంటి అవగాహన ఇవ్వడం లేదు. అందువల్ల మనిషి తాను శరీరమే అని భావించి, ఇంద్రియ సుఖాల కోసం జీవితమంతా వృథా చేసుకుంటున్నాడు. భౌతిక విలాసాలు, డిజిటల్ వ్యసనాలు, వినియోగవాదం ఇవన్నీ ఆత్మను మరింతగా బంధించాయి. ఇవి తాత్కాలిక మత్తే తప్ప శాశ్వత సుఖం కావు. భక్తియోగం, నిష్కామకర్మ, ధ్యానయోగం – ఇవే మనిషిని ఆత్మస్వరూపాన్ని గ్రహించే దిశగా నడిపిస్తాయి. రాగద్వేషాలను విడిచిపెట్టి, సద్గుణాలను పెంపొందించడం ద్వారానే మనిషి పరమానందాన్ని పొందగలడు.
కాబట్టి, ఇంద్రియాల తాత్కాలిక సుఖాలను అనుభవించడం మనిషి గమ్యం కాదు. ఆత్మస్వరూపాన్ని గుర్తించి, పరమాత్మతో ఏకమవడం ద్వారానే శాశ్వత సుఖం సాధ్యం. ఈ సత్యాన్ని గ్రహించకపోతే, మనిషి ఎంత సంపదలు, సౌఖ్యాలు కూడబెట్టుకున్నా, చివరికి తన మనస్సులో వెలితితోనే మిగిలిపోతాడు. అతనికి తన జీవితం ఎప్పుడూ అసంపూర్ణంగానే అనిపిస్తుంది.