Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అతనిప్పుడు..

[డా. కోగంటి విజయ్ రచించిన ‘అతనిప్పుడు..’ అనే కవితని అందిస్తున్నాము]


~
తనొకప్పుడు కవితలల్లేవాడు
ప్రపంచానికి తన మాటల కరవాలాలిచ్చి కదిలించే వాడు
అప్పుడతను భగ్నమవని వనాలని
భయమెరుగని మేధస్సును
అసమానతలు లేని సమాజాల్ని కలగన్నాడు
అందరూ చదువుకుంటారని
అందరికీ స్వేచ్ఛ ఉంటుందనీ
అన్యాయాలను ఎదిరించొచ్చనీ కలగన్నాడు
అతని కవితలన్నీ అతని కలలే ఉండేవి.

రాను రాను అతడు
అధికార మదాంథులనూ
బూటకపు న్యాయాలనూ
తలపుకైనా రాని ఘోరాలనూ చూసాడు
నాయకత్వపు నీడ కింద
నంజుకు తింటున్న త్రాచుపాముల్నీ చూసాడు
వెనుక నడిచిన వారే
వెన్నులో కత్తులు దింపుతారనీ గ్రహించాడు
తన జాగృత గీతాలకు అర్థం లేదనీ
జగతిని మత్తు ఆవరించిందనీ
స్వేచ్ఛ అంటే బరి తెగించడ మయిందనీ
కలలు కల్ల మాటలేననీ తెలుసుకున్నాడు.

ఇప్పుడతనికి కనులు మూత పడవు
అందుకే ఏ కలలూ లేవు
ఏ ఊహలూ పోవు
అందుకే ఏ మాటలూ రావు
ఏ క్షణాలనూ ప్రేమించడు
అందుకే ఏ ఉదయాలనూ చూడడు
ఏ భావాలనూ పొదువుకోడు
అందుకే ఏ అక్షరాలకూ రంగులద్దడు.

అతనిప్పుడసలు ఏ కవీ కాడు
ఎందుకిలా అని అడిగితే-
నేను మనిషిని కూడా కానేమో అని అంటాడు.

Exit mobile version