[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అసురీ స్వభావం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 16వ అధ్యాయం, 9వ శ్లోకం
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః॥
ఓ అర్జునా, అల్పబుద్ధి గలవారు, అనుక్షణం ఇంద్రియ భోగములను అనుభవించడంలో మునిగి వుండేవారు అసుర స్వభావులై వుండి అజితములు, జగత్ వినాశ కరమగు ఘోర కర్మలను చేసేవారు అవుతున్నారు. ఇట్టివారికి ఎన్ని కల్పాలకైనా భగవత్ అనుగ్రహం సిద్ధించడం అసాధ్యం అని పై శ్లోకం భావం.
అసురీ మనస్తత్వం కలవారికి, ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్తిత్వాన్ని మరియు కర్మ ఫల ప్రతిచర్య పట్ల నమ్మకం ఉండదు. అట్టి వారికి ఏ సంకోచం లేకుండా స్వార్థ పనులలో నిమగ్నమై, ఇంకా, ఇతరుల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించడానికి వీలుగా ఉంటుంది.
మానవులలో వారి జీవన విధానం, వారి ప్రవర్తన అనుసరించి రెండు రకాలైన గుణాలు వుంటాయని పతంజలి యోగ శాస్త్రం కూడా చెబుతోంది. అవి దైవీ గుణాలు మరియు అసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను మరియు నియమాలను పాటించటం, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం గడుపుతూ, అనునిత్యం భగవంతుని చరణాల విందాలపై మనస్సును లగ్నం చేసుకొని తద్వారా సత్త్వ గుణమును పెంపొందించుకోవటం, మరియు సాధన ద్వారా మనస్సుని ఆధ్యాత్మిక సాధనచే శుద్ధి చేసుకోవటం ద్వారా, దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. అది దైవీ సంపత్తి పెంచుకోవటానికి దోహదపడుతుంది, చిట్ట చివరగా అది భగవత్-ప్రాప్తిని కలిగిస్తుంది.
దైవీ సంపద కలవాని లక్షణములు ఈ విధంగా వుంటాయి. నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు, అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.
భాగవతోత్తములైన ప్రహ్లాదుడు, ధృవుడు, భక్త మార్కండేయుడు వంటి వారు దైవీ గుణాలను పుష్కలంగా వున్నవారికి ఉదాహరణగా నిలుస్తారు. దీనికి విరుద్ధంగా, అసురీ ప్రవృత్తి కూడా ఉంది.
అసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు. వారికి అన్నింటి కంటే తమ భోగాలను తీర్చుకోవడమే అధిక ప్రాధాన్యత కలిగి వుంటుంది. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక సిద్ధం అవుతూ వుంటుంది. తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ అసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని వుంటారు. ఈ విధంగా కామ మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు. ఇతరుల ధన, మాన, ప్రాణాలను స్వార్థంతో మోసంతో, మోహంతో అనుభవించాలనుకోవటమే అసురీ లక్షణం. అలాటి వాటివల్లనే దురాచారాలు, దోషాలు అబ్బుతాయి.
రజో గుణము, తమో గుణములతో అనుసంధానం వలన మరియు భౌతిక ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించటం వలన అది పెరుగుతుంది. ఇట్టివారికి ఇంద్రియ భోగలాలసతయే పరమార్థంగా వుంటుంది. కలలో కూడా ఇతరుల కోసం ఆలోచించరు. భగవంతుడు వారికి పడని పదం అవుతుంది. అసురీ మనస్తత్వం మానవుని వ్యక్తిత్వములో అపవిత్ర నడవడికను కలిగిస్తుంది, మరియు అంతిమంగా ఆత్మను నరకం వంటి స్థితిలోకి నెట్టివేస్తుంది. ఎవరైతే దైవీ గుణములను బాగా అలవరచుకొని పాటిస్తారో వారికి మోక్షము లభిస్తుంది. అలాగ కాకుండా అసురీ గుణములు పెంచుకొని అవే తప్పు పనులు చేస్తున్నవారు మరలా మరలా జన్మలెత్తి, మరల మరలా తప్పులు చేస్తూ ఆ చక్రంలో బంధించబడి వుంటారు.