Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆసియా దేశాలలో మా యాత్రలు – బహ్రెయిన్

[బహ్రెయిన్‍లో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డా. నర్మద రెడ్డి.]

హ్రెయిన్, పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరంలో ఉన్న చిన్న ద్వీప దేశం. ఇది బహ్రెయిన్ ద్వీపం, ఇతరా 30 చిన్న ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం. దీని పేరు అరబిక్ పదం అల్-బహ్రేన్ నుండి వచ్చింది, దీని అర్థం రెండు సముద్రాలు.

నాలుగు దేశాల సందర్శనలో భాగంగా మేము బెహ్రయిన్‌లో పర్యటించాము. దోహ, ఖతార్, అబుదాబి చూసుకుని అక్కడ నుంచి బెహ్రయిన్ వెళ్ళాము.

బెహ్రయిన్ చాలా చిన్న దేశము. సింగపూర్, మాల్దీవ్స్ తరువాత బెహ్రయిన్ మూడవదిగా పరిగణించబడుతుంది. మేము బెహ్రయిన్‌లో ఫ్లైట్ దిగగానే ఒక టాక్సీ తీసుకున్నాము. టాక్సీ అతనికి అడ్రస్ చెప్పి హోటల్‌కి తీసుకెళ్లమని అడిగాము. ఆ అబ్బాయి మన ఇండియా నుంచి వచ్చిన డ్రైవర్. “మేడం మీరు ఎనిమిది డాలర్స్ ఇస్తారా లేకపోతే మీటర్ వెయ్యమంటారా?” అని అడిగాడతను. ఎనిమిది డాలర్లంటే నాకు చాలా తక్కువ అనిపించింది. “తీస్కెళ్ళు బాబూ” అని చెప్పాను. ఆరోజు రాత్రి 12 గంటలకి హోటల్ చేరాము. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి “మా దగ్గర డాలర్లు ఉన్నాయి. 8 డాలర్లు మీరు ఆ అబ్బాయికి పే చెయ్యండి. మీకు రేపు మార్నింగ్ ఇస్తాము” అని చెప్తే సరేనని రిసెప్షనిస్ట్ డ్రైవర్‌కి డబ్బులిచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఎనిమిది డాలర్లంటే, ఇండియన్ కరెన్సీలో ఎంత అని అడిగాను. “ఒక్క డాలరు 272 రూపాయలు” చెప్పాడు రిసెప్షనిస్ట్. ఓ మై గాడ్! 8 డాలర్లనేసరికి నాకెంతో చాలా తక్కువ అనిపించింది మొదట. నిజానికి చాలా ఎక్కువ అన్నమాట అనుకున్నాను. “మేము రేపు మార్నింగ్ బెహ్రయిన్‌లో ఏమి ప్లేసెస్ చూడొచ్చు?” అని రిసెప్షనిస్ట్‌ని అడిగాను. “సిటీ లోని టూరిస్ట్ ప్లేసేస్ అన్ని చ్చూడొచ్చమ్మా. అన్ని బాగుంటాయి” అని చెప్పాడు.

అలాగేనని చెప్పి మేము మా గదులకి వెళ్ళిపోయాం. ప్రయాణ బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. రూమ్ చాలా విశాలంగా చాలా బాగుంది. మర్నాడు, రెండో రోజు లేచి తయారై, బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళాము. బ్రేక్‍ఫాస్ట్‌కి వెళ్తే అక్కడ ఇండియన్ ఫుడ్ ఏమీ లేదు కానీ కాంటినెంటల్ ఫుడ్ ఉంది. అక్కడ ఆమ్లెట్ బ్రెడ్, బేకన్సి ఇవని చాలా చాలా రకాలు ఉన్నాయి. బ్రేక్‍ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత దోహాలో మాకు పరిచయమైన వారికి ఫోన్ చేశాం, చేసి బెహ్రయిన్‌లో ఏమేమి చూడొచ్చని అడిగాం. అప్పుడాయన “మాకు తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ని తీసుకొని సిటీ టూర్ తిరగండి” అని చెప్పాడు. “అలాగే పంపండి” అని చెప్పాను. ఆ అబ్బాయి పేరు రాజు. మమ్మల్ని పికప్ చేసుకొని ఒక సముద్ర తీరానికి తీసుకువెళ్లాడు రాజు.

ఆ సముద్రతీరంలో అంత పొద్దున్నే ఇంకా ఏమీ తెరవలేదు. మేము కాసేపు సముద్ర ఒడ్డున తిరిగాం. పక్కగా పార్క్ లాగా ఉంది. ఆ అబ్బాయ్, “మీరు ఇదంతా తిరిగి చూసిన తర్వాత నాకు కాల్ చెయ్యండి. నేను మళ్ళీ రిటన్ వస్తాను” అని అన్నాడు. అలాగే అన్నాము. అది అంతా చూసిన తర్వాత ఒక చిన్న ఆఫీస్‌ని గమనించాం. ఆ ఆఫీసులో ఏముందని వెళ్తే, అక్కడి నుంచి ప్రయాణించే చిన్న చిన్న పడవలు, పెద్ద పడవలు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అది. అందులో ఓ అమ్మాయి ఉంది. ఫొటోల గురించి అడిగాము. మేము అడిగిన వాటికన్నిటికి జవాబు చెబుతూ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. “ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒక మంచి మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంకి వెళ్ళండి. చాలా బాగుంటుంది” అని చెప్పింది. అలాగే అని చెప్పి, అక్కడ ఆ పడవ దగ్గర కొన్ని ఫొటోలు తీసుకొని ఆ అమ్మాయితో కూడా ఫొటోలు తీసుకుని మేము బయటకి వచ్చి, ఒక ఉబర్ బుక్ చేసుకున్నాం. ఉబర్‌లో కేబ్ బుక్ చేయగానే చక్కగా వచ్చింది. అది కూడా రెండు రియాల్స్‌కే. అంటే రెండు రియాల్స్‌కి మేము ఆ మ్యూజియంకి వెళ్ళగలిగాం. ఆ మ్యూజియం నిజంగా ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ 10:00 గంటల నుంచి 1:00 గంట వరకు తిరిగి చూశాం. చాలా చాలా బాగుంది.

ఈ మ్యూజియం మూడు అంతస్తులలో ఉంది. ఒక ఫ్లోర్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్చర్యంగా అనిపించిన, వింతైన విషయం ఏమిటంటే శిశువుల బొడ్డుతాడుతో వ్యవహరించే విధానం. అబ్బాయి పుడితే బొడ్డుతాడుని కత్తిరించి తీసుకెళ్లి మసీదులో పూడుస్తారట. అదే అమ్మాయి పుడితే బొడ్డుతాడుని తీసుకెళ్లి వంటింట్లో పూడుస్తారట. ఆ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరం! అంటే అమ్మాయిలని ఎంత హీనంగా చూసారనేది ఇందులో కనిపిస్తుంది మనకు. ఇలాంటి ఆచారాలు అలెగ్జాండర్ బహ్రెయిన్‌కి వచ్చిన తరువాత నుంటి పాటిస్తున్నారు. అలెగ్జాండర్ బహ్రెయిన్‌కి 325 బిసిలో వచ్చాడు. అంతకుముందు వరకు టైలర్ అనే సాంప్రదాయాన్ని బాగా పాటించారు. తరువాతి శతాబ్దాలలో ఇక్కడ వీళ్లు దృఢమైన ముస్లిం సంస్కృతిని పాటించడం మొదలుపెట్టారు.

తొలుత ఇది బిల్మోన్ క్యాపిటల్ సిటీగా ఉండింది. తరువాత బహ్రెయిన్‌గా మారింది. మేము అక్కడ పూర్వకాలం నాటి అలెగ్జాండర్ ముఖం ఒక వైపు, మరొక వైపు అలెగ్జాండర్ ఫేస్‍తో ఉన్న ఎన్నో నాణాలని చూశాము. ఆర్కియాలజీ వాళ్ళు భూగర్భాన్ని తవ్వి తీసినప్పుడు అలెగ్జాండర్ ముఖంతో ఉన్న వెండి నాణాలు కుండలలో దొరికాయి.

ఇవి ఒక్కటే కాకుండా, ఇక్కడివాళ్ళు అప్పట్లో బంగారాన్ని కూడా కుండలలో నింపి భూమి అడుగున దాచి పెట్టేవాళ్ళు. అవ్వన్నీ కూడా మనం ఇక్కడ మ్యూజియంలో చూడవచ్చు. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఒకచోట బహ్రెయిన్‌లో అప్పటి కాలంలో ఒక చక్కటి ఉద్యానవనంగా ఉన్న స్థలం అంతా ఇప్పుడు ఎడారిగా మారిన ప్రాంతాన్ని చూశాం. అది చూసినప్పుడు నిజంగా చాలా చాలా ఆశ్చర్యమేసింది. ఇదే ఖతార్‌లో కూడా చూశాను. ఈ బహ్రెయిన్‌లో కూడా అప్పటి ఉద్యానవమంతా ఇప్పుడు ఎడారిగా మారిపోయిన వైనం చూస్తే మన భూగోళం చరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది.

అక్కడ నుంచి మేము బయటనే ఉన్న రివర్స్ సైడ్ రెస్టారెంట్‌కి వెళ్లి ఒక టీ, ఒక గ్రీన్ టీ ఆర్డర్ ఇచ్చాము. ఆ అబ్బాయి ఒకటి లెమన్ టీ, ఒకటి గ్రీన్ టీ రెండు తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చినప్పుడు వాళ్లు ఒక కెటీల్‌లో దాన్ని సర్వ్ చేస్తున్నప్పుడు, ఆ కిటిల్ వేడిని తట్టుకోవడానికి ఒక చిన్న క్లాత్‌తో తయారు చేసిన ఒక బొమ్మ లాంటి దానితో పట్టుకున్నాడు. నాకు అది చాలా చాలా నచ్చేసింది. బొమ్మని కూడా ఫోటో తీశాను. నిజంగా ఆ ఆర్ట్ వర్కు, క్రియేటివిటీ చాలా నచ్చేసింది. అక్కడ ఆ సాయంత్రం చక్కటి రివర్ సైడ్ సన్ సెట్‍ను చూసుకుంటూ మేము హ్యాపీగా టీ ని ఆస్వాదించాం.

ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. వాటిని ఓల్డ్ హెరిటేజ్ అంటారు. వాటిని చూసుకుని సాయంత్రం గదికి చేరాము.

తర్వాత, మాకు 9వ ప్రపంచ తెలుగు మహాసభలలో పరిచయమయిన జగదీష్ గారు కాల్ చేసి “నేను ఇప్పుడూ ఫ్రీగా ఉన్నాను. మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పికప్ చేస్తాను” అని చెప్పారు. ఈ లోపల మేము మా హోటల్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాం. కాసేపటికి ఆయనా, ఆయన భార్య వచ్చారు. 8:00 గంటకి బయల్దేరి వెళితే తిరిగి వచ్చేసరికి 11:00 అయ్యింది. ఆయన బహ్రెయిన్ సిటీ మొత్తం చూపించారు. దీపాల వెలుగులలో బెహ్రయిన్ ఎలా ఉంటుందో చూపించారు. ఇందులో భాగంగా ఒక పడవ తీసుకొని పడవలో మొత్తం బెహ్రయిన్ కనిపించే విధంగా చక్కగా ఒక 30 నిమిషాలు బోట్ డ్రైవ్‌కి వెళ్ళాం. పిచ్చి గాలి. కానీ ఆహ్లాదకరంగా ఉండింది. అంత ఎత్తయిన భవనాలు లైటింగ్ తోటి వెలుగుతూ ఆ నక్షత్రాలన్నీ ఇక్కడికే వచ్చాయా అన్నట్టుగా అనిపించింది. సంతోషంలో అలా చూస్తూ మైమరచిపోయాము నేను మా వారు. అక్కడి నుంచి వాళ్ళు భోజనానికి వెళ్దామని అన్నారు కానీ మేము ఆల్రెడీ తినేసామండీ, వద్దు అన్నాం. వాళ్ళు పాపం బోజనానికి తీసుకువెళ్లడానికి మా కోసం వస్తే మేమేమో తినేసి కూర్చున్నాం. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఒక మేళా లాంటి బజారుకి తీసుకెళ్ళారు. ఒకసారే జస్ట్ చూసేసి అక్కడి నుంచి హోటల్‌కి వచ్చి మా గదిలో పడుకున్నాము.

మర్నాడు ఉదయం దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌ని చూడడానికి వెళ్ళాం. అక్కడ వాళ్లు స్వామివారికై చక్కగా పూలు, ఆకులతో మాలలు కడుతూ కనిపించరు. వాళ్లతో పాటూ నేను కూడా కూర్చొని ఒక పావుగంట పాటు పూలు గుచ్చాను. ఆ ప్రాంగణమంతా చాలా చక్కటి అలంకరణతో చాలా బాగుంది. ఆ గుడి చూసుకొని అక్కడి నుండి బయలుదేరి షాపింగ్ ఏరియాకి వచ్చాం.

షాపింగ్ ఏరియాకి వచ్చి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము. అక్కడ కూడా మన ఉడిపి హోటల్ ఉంది. ఆ ఉడిపి హోటల్లో దోశ తినేసి, తర్వాత షాపింగ్ చేశాము. తర్వాత మా డ్రైవర్ వచ్చాడు. మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకెళ్ళి ఆ అబ్బాయి ఒక పెద్ద బిల్డింగ్ చూపించాడు. అది దయ్యాల మేడ అట. అందులో ఎప్పుడో ఏదో అగ్ని ప్రమాదం జరిగిందంట. అప్పుడు చాలామంది చనిపోయారంట. తర్వాత రోజుల్లో భవనాన్ని మంచిగా, నార్మల్‌గా చేసి వాడుకుందామని చూస్తె, అక్కడికి వెళ్ళినవారు అక్కడ దయ్యాలు ఉన్నాయని, నేను చూశానంటే, నేనూ చూశాను అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసారట. అప్పటినుండి అక్కడి నుంచి ఇప్పటివరకు.. దగ్గర దగ్గర కట్టి 30 ఏళ్ళు అవుతుందేమో, ఈ 30 ఏళ్ళ నుంచి అది ఖాళీగానే ఉంది. దాన్ని దయ్యాల మేడ అంటారు.

ఆ మేడను చూసి అక్కడ ఒక ఫోటో దిగేసి అక్కడి నుంచి మేము మధ్యాహ్నం ఒక మసీదుకి వెళ్ళాము. తర్వాత రూమ్‌కి వెళ్లి సామాన్లు సర్దుకున్నాం, ఎందుకంటే మాకు ఫ్లైట్ 3:00 కి ఉంది. అందుకని ఈ అబ్బాయితో “ఎక్కడైనా బిర్యాని దొరికితే తీసుకొని రండి. మధ్యాహ్నం లంచ్ తినేస్తాము” అని చెప్పాము. పాపం ఆ డ్రైవరబ్బాయి ఆపసోపాలు పాడుతూ ఎక్కడెక్కడో తిరిగి చాలా లేటుగా వచ్చాడు. మేము ఫ్లైట్ మిస్సవుతామేమోనని నాకు చాలా భయమేసింది. కానీ బిర్యానీ వేడివేడిగా తీసుకొచ్చాడు. సరే ఇంక, ఇక్కడ తినడానికి మాకు టైం లేదు, ఎయిర్‍పోర్ట్‌కి వెళ్లి తింటామని చెప్పి ఆ అబ్బాయిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చెయ్యమని చెప్పాం. ఎయిర్‌పోర్ట్‌లో మమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్లిపోయాడు.

ఇలా చాలా చక్కగా బహ్రయిన్ అంతా చూసి ఎంతో ముచ్చటగా ఇల్లు చేరాము.

Exit mobile version