నాలుగురోడ్ల కూడలిలో జనతకు ఉత్కంఠ కలిగిస్తూ
లేబ్రాయపు పిల్లల పసిమనసుల్ని చెదిరిస్తూ
అర్ధదుస్తుల జంటతో అర్ధరాత్రి వెలసిన అసభ్య పోస్టర్
అక్కడ రోడ్ పై నిల్చిన ట్రాఫిక్కుని వణికిస్తుంది
జిలుగుల వెండి తెరమీద మెరిసిపోవాలని
ఒక్క ఛాన్స్ ఇస్తే, తమ సత్తా చూపించాలని
కళ మీద మోజుతో భవిష్యత్తుని పణమొడ్డి
ఒక చౌరస్తాలో అభిమానం నేల రాలుతుంది
ఒక నిస్సహాయ ఔత్సాహిక సమూహం
చదువు వదిలొచ్చి తల్లడిల్లిన తపన
జీవితంలో నిలదొక్కుకోవాలన్న ఆత్రుత
సరికొత్త కథనేదో చెప్పాలన్న తొందర
యువతనైనా ఆకర్షించాలన్న దీనత్వం
నాలుగు రాళ్లు నిర్మాతకు తేవాలన్న దీక్ష
వైకుంఠపాళీ నిచ్చెనల కోసం నిరీక్షిస్తూ
సృజన,నటన,నాట్యం చేతులు జోడిస్తాయి
గుడి మెట్ల మీద కూచున్న అంగవికలురైనా
సిగ్నల్ దగ్గర దీనవదనపు బాలింతలైనా
బస్టాండ్లో బేరం కోసం నిలబడ్డ పడుచులైనా
నీలికథలతో నిలదొక్కుకునే మేధావులైనా
అందరిదీ బతుకు తెరువుకై తన్నులాట
సవ్య ప్రదంగా బతికే దారులు దొరకక
ఎలాగైనా నాలుగు కాసులు పొందాలన్న
కసి,ఆర్తి జనం దయ కోసం జోలెపడతాయి
అంతరిక్ష పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలూ
పాపపుణ్యాలు చెప్పే ప్రవచన, ప్రవక్తలు
ప్రపంచ ప్రజలకై శ్రమించే శాంతి దూతలూ
ఏ ఒక్కరూ బదులు చెప్పలేని సవాళ్లివి.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.