[ఆరుద్ర శతజయంతి 2025 సందర్భంగా కృష్ణ మోహన్ గబ్బిట గారు అందిస్తున్న ప్రత్యేక రచన.]
1960 దశకంలో బొంబాయి ఆంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ సోమంచి యజ్ఞన్న శాస్త్రిగారు. వారిది Bombay Municipal Corporation లో Deputy Commissioner గా ఉద్యోగం. అక్కడ SMY Sastry అని మాత్రమే పరిచయం. అక్కడి ఆంధ్ర మహాసభ ధనిక వర్గానికి చెందినది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు ఒక కార్డులో ఫలానా వారు బొంబాయి వస్తున్నారు, మీకు వీలైతే పూనాలో దింపుకుని ప్రోగ్రాం పెట్టుకోండి, మీకు ఖర్చులు కలిసివస్తాయి అని. ఆ తోడ్పాటుతో రఘురామయ్య గారి రాయబారం, యామినీ కృష్ణమూర్తి గారి డాన్స్, కూచిపూడి వారి ఉషాపరిణయం నా సహకారంతో జరిగినాయి. ఒక ఉగాది నాడు ముగ్గురు ప్రఖ్యాత కవుల ప్రసంగం: జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ, ఆరుద్ర గార్ల ప్రసంగాలు.
కరుణశ్రీ గారు పూనా నగరం కాదిది పునః పునః పిలిచే నగరం అంటూ శ్లేషించారు.
ఆరుద్ర గారు మైక్ ముందుకు వచ్చి ఎలాంటి ఉపోద్ఘాతం లేకండా గాసట బీసటల్ చదివి గాధలు త్రవ్వు తెలుంగువారికిన్ వ్యాసముని ప్రణీతం అయిన భారతాన్ని తెలుగువారికి అందించిన ఆదికవి నన్నయ్య నుంచి ఆధునిక యుగంలో శ్రీశ్రీ వరకూ కవిత్వపు పోకడలని సోదాహరణంగా శ్రావ్యంగా వినిపించారు. ఇది జరిగి దాదాపు అరవై సంవత్సరాల మూలంగా పూర్తి వివరాలు జ్ఞప్తికి రావడం లేదు.
పూనాలో ఒక ఉగాది సాయంత్రం: మధునాపంతుల సత్యనారాయణ గారు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు, ఆరుద్ర గారు (నుంచున్న వారిలో ఎడమనించి మూడు నేను (గబ్బిట , 1968/69)