[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘అర్చన’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కడలిని గురువుగా,
జ్ఞాన ఫల సంపదను ప్రసాదించే
కల్పతరువులా
ఆరాధిస్తూ ఆశ్రయిస్తుంటాను!
వినయంగా నా మది నదిని
విద్యార్థినిలా మలచి
అర్ణవాన్ని అర్చిస్తూ
సద్భుద్ది భూతిని అర్థిస్తుంటాను!
జగమంతా తనలో ఇమిడేటంతటి
జగా వైశ్యాలాన్ని నా కవితాత్మకు ఇమ్మంటూ
పాథోనిధి పాదాల చెంత
శ్రద్దగా ప్రార్థిస్తుంటాను!
స్వచ్ఛ మానవీయ గుణ రత్నాలతో
నా ఎదను శోభిల్ల జేయమని వేడుకుంటూ
రత్నాకర తీర్థ తీరానికి
రక్తితో ప్రణమిల్లుతుంటాను!
విద్వేషాల బడబాగ్నుల విస్ఫోటనలను విరమింపజేసే
అక్షర ధైర్యాన్నీ,
అవినీతి అలజడుల సుడుల నణచే
ఆత్మ స్థైర్యాన్నీ,
సధ్ధర్మ శాస్త్ర నిర్మిత సరిహద్దులను
అతిక్రమించని శీలైశ్వర్యాన్నీ
దయతో దానం చేయమంటూ
పారావారాన్ని భక్తితో ప్రాధేయపడుతుంటాను!
మానవ సమూహాలన్నీ మహానదులై
‘నదీనాం సాగరో గతి’ అంటూ
ప్రకటిస్తూ, ప్రవహిస్తూ
విశ్వ శ్రేయస్సు నందించే
జ్ఞానాబ్ధి ఒడిలో సంగమించాలని
ఆకాంక్షిస్తుంటాను!
ఆ సత్కాలం సత్వరం
సంభవించాలని ఆశిస్తుంటాను!
