[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘అపురూపమైన బహుమతి’.]
ఒక ఊర్లో వెంకన్న, సుంకన్న అని ఇద్దరు పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. వెంకన్న చాలా మంచోడు. ఊరిలో అందరినీ అత్తా మామ, పిన్నీ బాబాయ్ అంటూ పలకరిస్తా సొంత బంధువుల మాదిరి ఆప్యాయంగా ఉండేవాడు. ఆపద సమయాల్లో చేతనైన సాయం చేసేవాడు. అర్ధరాత్రి అయినా సరే పిలిస్తే పలికేవాడు. దాంతో అందరికీ అతను అంటే చాలా అభిమానం.
కానీ.. సుంకన్న అట్లా కాదు. పరమ పిసినారి. పక్కనున్నోడు చస్తా వున్నా పైసా తీయడు. ఎప్పుడూ కోపంతో చిందులు తొక్కుతూ ఉంటాడు. చిన్నాపెద్దా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటాడు. చుట్టుపక్కల ఎవరన్నా బాగుపడితే అస్సలు తట్టుకోలేడు. దాంతో అందరికీ అతను అంటే పరమ అసహ్యం.
వెంకన్న ఇంటిముందు పెద్ద పెరడు ఉంది. ఒకసారి అతను గుమ్మడికాయ కూర చేసుకొని విత్తనాలు బయట పారవేశాడు. వానాకాలంలో భూమమ్మ తడిచి అనుకోకుండా అందులో ఒకటి పురుడు పోసుకుంది. నెమ్మదిగా ఆకులు మొలచి, తీగలు కాచి, పువ్వులు పూయసాగింది. ఆ గుమ్మడి తీగను చూసి అతనికి చాలా ముచ్చట వేసింది. రోజూ దానికి నీళ్లు పోస్తూ, పాదులు తీస్తూ, మంచి మంచి బలమైన ఎరువులు వేస్తూ, పసిపిల్లోని లెక్క జాగ్రత్తగా చూసుకోసాగాడు.
ఆ తీగ పెరుగుతూ పెరుగుతూ పెరడంతా అల్లుకుపోయింది. పువ్వులు పూసి కాయలు కాయసాగింది. ఆ కాయలు నెమ్మది నెమ్మదిగా లావు అవుతూ ఒక్కొక్కటి పెద్ద పెద్ద కడవంత కాసాగాయి. వాటిని చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. “అబ్బ.. ఇంత మంచి లావు కాయలు మా జన్మలో మేము ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఒకదాన్ని మించి మరొకటి వున్నాయి” అంటూ మెచ్చుకోసాగారు. వెంకన్న ఆ కాయలు తెచ్చి చుట్టుపక్కల జనాలకు అంతా ప్రేమతో పంచిపెట్టసాగాడు.
ఆ కాయలలో ఒక కాయ మాత్రం రోజురోజుకీ లావు అవుతూ ఏకంగా పది గుమ్మడికాయలంత పెరిగింది. అది చూసి జనాలంతా ముక్కున వేలేసుకున్నారు. “ఇంత లావు కాయను మా జన్మలో ఎప్పుడూ చూడలేదు” అంటూ కథలు కథలుగా చెప్పుకోసాగారు. విషయం విని చుట్టుపక్కల ఊర్ల నుండి జనాలు బండ్లు కట్టుకొని మరీ వచ్చి చూసిపోసాగారు.
వెంకన్నకు ఆ కాయను ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో ఆ ఊరి మహారాజు గుర్తుకు వచ్చాడు. “ఇంత విలువైన దాన్ని ఇస్తే మహారాజుకే కానుకగా ఇవ్వాలి” అనుకున్నాడు. వెంటనే ఒక ఎద్దులబండి సిద్ధం చేశాడు. బండిలో మెత్తని పరుపు పరిచి జాగ్రత్తగా ఆ కాయను కోసి బండిమీదకు చేర్చాడు. దానికి ఎండ తగలకుండా పైన గొడుగు ఏర్పాటు చేసి రాజధానికి బయలుదేరాడు.
మహామంత్రి ఆ పండును చూసి “అబ్బ.. ఇంత అద్భుతమైన పండును నేనెప్పుడూ చూడలేదు. రోజూ ఎక్కడెక్కడి నుంచో మంచి మంచి కాయలు, పండ్లు రాజు దగ్గరకు కానుకగా వస్తూ ఉంటాయి కానీ.. ఇలాంటి వింతైనదాన్ని చూడడం ఇదే మొదటిసారి” అంటూ రాజు దగ్గరికి పోయి విషయం వివరించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. “బండంత లావు గుమ్మడికాయనా.. నేనెప్పుడూ ఇటువంటి వింత వినలేదు, కనలేదు. వెంటనే ప్రవేశపెట్టండి. చూద్దాం” అన్నాడు.
భటులు జాగ్రత్తగా పసిబిడ్డను కదా మోసుకుని వచ్చినట్లుగా ఆ కాయను మోసుకొని వచ్చి రాజుముందు పెట్టారు. దాని నుంచి వస్తున్న కమ్మని మధురమైన వాసనకు రాజు మైమరచిపోయాడు. “ఆహా అద్భుతం.. ఇలాంటి పండును పండించాలంటే అంత సులభం కాదు. నూటికో కోటికో ఒక్కరికే సాధ్యం. ఏ వందేళ్ళకో వెయ్యేళ్ళకో ఇలాంటి వింత జరుగుతుంది. దీన్ని పండించిన రైతుకు ఏ బహుమతి ఇచ్చినా తక్కువే” అంటూ మంత్రి వైపుకు తిరిగి “ఈ అరుదైన పెద్ద గుమ్మడికాయ లాగానే మన అంతఃపురంలో ఏదైనా అత్యంత విలువైనది ఉందా.. ఈ రైతుకు బహుమానంగా ఇవ్వడానికి” అన్నాడు.
మంత్రి ఆలోచనలో పడ్డాడు. అంతలో రాజు కన్ను అంతఃపురంలో పైన వున్న చందమామ మీద పడింది. అది మామూలు చందమామ కాదు. బంగారు చందమామ. మహారాజు పుట్టినరోజుకు వేయితులాల బంగారంతో తయారుచేసిన అపురూపమైన వస్తువు అది. అందరికీ కనపడేలా ముచ్చటగా పైన తగిలించాడు.
వెంటనే మంత్రితో “మహామంత్రీ.. అదిగో ఆ చందమామను కిందికి దించి ఈ రైతుకు కానుకగా ఇస్తే ఎలా ఉంటుంది” అన్నాడు దాని వంక చూస్తూ.
“ఆ బంగారు చందమామనా.. రాజా అది చాలా చాలా విలువైంది” అన్నాడు మహామంత్రి.
రాజు చిరునవ్వుతో “అది ఎంత విలువైనదైనప్పటికీ ఈ రైతు పడిన కష్టానికి తక్కువే. విలువైనది కానుకగా తీసుకునేటప్పుడు అంతకన్నా విలువైనదే బహుమానంగా ఇవ్వాలి. రాజు చేయి ఎప్పుడైనా పైనే ఉండాలి కదా” అన్నాడు.
వెంటనే మహామంత్రి మారు మాట్లాడకుండా నలుగురి భటుల్ని పంపించి ఆ బంగారు చందమామను తెప్పించాడు. రాజు దానిని ప్రేమగా రైతుకు అందజేశాడు. రైతు సంబరంగా ఆ అపురూపమైన కానుకను తీసుకొని ఊరికి చేరుకున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. “ఆహా.. మన వెంకన్న మంచితనానికి సరియైన బహుమతి దక్కింది. దీన్ని అమ్మితే జీవితాంతం కాలు మీద కాలేసుకుని హాయిగా బతికేయవచ్చు” అంటూ మెచ్చుకున్నారు.
ఊరంతా సంబరపడ్డారు కానీ ఒకే ఒక సుంకన్న మాత్రం అసూయతో రగిలిపోయాడు. తాను అంతకన్నా పెద్ద బహుమతిని రాజు నుండి పొందాలి అంటే ఏమి చేయాలా అని తెగ ఆలోచించాడు. “తాను ఎంత పెద్దది తీసుకుపోతే రాజు వద్దనుండి అంతకన్నా పెద్ద కానుక వస్తుంది కదా” అనుకున్నాడు.
ఆ రాజ్యానికి పది రాజ్యాల అవతల ఒక రైతు దగ్గర ఒక ఎద్దు ఉంది. అది చాలా బలంగా, అందంగా, చూడముచ్చటగా, ఏనుగులతో పోటీ పడుతున్నట్లుగా ఉంటుంది. కానీ దాని ఖరీదు చాలా ఎక్కువ. మామూలు మనుషులు ఎవరూ కొనలేరు. ఏది ఏమైనాసరే దాన్ని కొని రాజుకు బహుమతిగా అందించి అంతకన్నా విలువైనది కొట్టేయాలి అనుకున్నాడు.
వెంటనే తన పెద్ద ఇల్లు, పొలాలు అన్నీ అమ్మేశాడు. ఆ డబ్బంతా ఖర్చుపెట్టి ఆ ఎద్దును కొన్నాడు. దానికి శుభ్రంగా స్నానం చేయించి, ఒళ్లంతా నున్నగా నిగనిగలాడేటట్లు నూనె పట్టించి, కొమ్ములకు రకరకాల రంగులు వేయించి, చూడముచ్చటగా అలంకరించి రాజుకు బహుమానంగా ఇవ్వడానికి రాజధానికి బయలుదేరాడు. ఆ ఎద్దును చూసి మహామంత్రి చాలా ముచ్చటపడ్డాడు. “ఆహా.. ఇది కనీవినీ ఎరుగని వింత. ఇంత అద్భుతమైన ఎద్దును ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు” అంటూ తీసుకువెళ్లి రాజు ముందు నిలబెట్టాడు.
రాజు ఆ ఎద్దును చూసి ఆశ్చర్యపోయాడు. ఎత్తుగా, బలంగా, ఠీవిగా, తెల్లగా, ఐరావతం మాదిరి ధగధగా మెరిసిపోతా ఉంది. ఏనుగులు సైతం భయంతో వెనకడుగు వేసేలా ఉంది. దానిని ముట్టుకొని మురిసిపోయాడు. “మహామంత్రీ.. అద్భుతం.. అపురూపం.. అపూర్వం. ఇలాంటి ఎద్దును ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. కన్నుల పండుగగా ఉంది. ఇంత అద్భుతమైన కానుకను అందిస్తున్న ఇతనికి మనం ఇంతకన్నా అపురూపమైన కానుక బహుమానంగా ఇవ్వాలి. ఇటీవల మనకు వచ్చిన కానుకల్లో ఏవైనా అపురూపమైనవి ఉన్నాయా” అన్నాడు.
మంత్రి కాసేపు ఆలోచించి “మహారాజా.. మనం మన బంగారు చంద్రుని బహుమానంగా ఇచ్చి ఒక రైతు దగ్గర అంతకన్నా అపురూపమైన గుమ్మడిపండును రెండు రోజుల కిందట తీసుకున్నాం. అది ఇంకా భద్రంగా అలాగే ఉంది” అన్నాడు.
ఆ మాట వినగానే రాజు “అవును అదే సరైన బహుమతి. అపురూపమైన కానుకకు అపురూపమైన బహుమతి” అంటూ వెంటనే తెప్పించి ఆ పెద్ద గుమ్మడి పండును సుంకన్నకు అందించాడు. ఆ పండును చూసి సుంకన్న అవాక్కయ్యాడు. నోట మాట రాలేదు. కక్కలేక మింగలేక లోలోపల కుమిలిపోతూ చిరునవ్వుతో ఆ గుమ్మడి పండును అందుకున్నాడు. విషయం తెలిసి ఊరు ఊరంతా “సుంకన్న అసూయకు తగిన అపురూపమైన బహుమతే దక్కింది” అనుకుంటా కిందామీదాపడి నవ్వుకున్నారు.
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
