[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]
[కుంతి సొంతూరికి వెళ్తూ తన చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది. బాల్యంలో ఉండగా, అప్పటికి దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కుంతి వాళ్ళ ఊరు అంకమారా. ఆ ఊర్లో అందరికీ భూమి హక్కుల సంబంధిత కేసులుంటాయి. ఓ బాబా, జమీందారు ఊరిలో ముఖ్యులు. తండ్రి చనిపోయినప్పటికి కుంతి చాలా చిన్న పిల్ల. ఆమె తరువాత ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆడపిల్లలు మూడో తరగతి వరకు చదివితే చాలని భావించేవారు. పుకార్లు ఎక్కువగా ఉండేవి. కుంతితో అభిమానంగా ఉండే లెక్కల టీచరు, కుంతికి పెళ్ళి వయసు రాగానే ఆమెను పెళ్ళి చేసుకుంటాడని వదంతులు వ్యాపింపజేశారు. ఆయన ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసి, స్కూల్ వదిలి, స్టేట్ గవర్నమెంట్‌లో డిప్యూటీ కలెక్టర్‍గా చేరుతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు గోవిందాని ఇష్టపడుతుంది. పుస్తకాలలో ఉత్తరాలు రాసి ఇచ్చేది. ఆ ఉత్తరాల్లో ద్విపదలు, చాటుపద్యాలు, హాస్యవ్యాఖ్యలు రాసేది. ఆమెను కలవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా గోవిందా వదులుకునేవాడు కాదు. అయితే త్వరలోనే అతను కౌలుదార్ల ఉద్యమం లేవదీసి, ఆ ఊర్లో గొడవలు రేపి, మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతాడు. కుంతికి ఎన్నో పెళ్ళి సంబంధాలొస్తాయి, కాని కుదిరేవి కావు. ఆమె జాతకంలో ఏవో దోషాలున్నాయని పూజలు చేయిస్తాడో జ్యోతిష్కుడు. ఎట్టకేలకు ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‍గా ఉద్యోగం సంపాదిస్తుంది కుంతి. ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా కాలం తర్వాత తన గ్రామానికి వస్తున్న కుంతి ‘అంకమారా సాగునీటి పధకానికి దారి’ అనే బోర్డ్ చూస్తుంది. తమ గ్రామానికి కచ్చా రోడ్ మొదలయే జంక్షన్‌లో సైన్ బోర్డ్ ఉన్న చోట కుంతి బస్ దిగుతుంది. రిక్షా ఎక్కుతుంది. కొంతదూరం వెళ్ళాకా, రిక్షా ఆగిపోతుంది. ఎదురుగా ఓ ఎత్తైన కట్ట. డామ్‍కి ఆ వైపున నది నుండి కొండ భుజం వరకు నీరు పరుచుకుని కనిపిస్తుంది. రిక్షా అతను జాగ్రత్తగా కట్టనెక్కించి అవతలి వైపుకి చేరుస్తాడు. కానీ కొన్నాళ్ళయ్యాకా, ఆమె ఆ ఊరిని వదిలి సెటిల్‍మెంట్‌కి వచ్చేస్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-4
ముందు పొడవాటి చొక్కా లాటిదాని మీద గుండ్రటి ఇత్తడి ముద్ర, నీటి గుర్రం గుర్తు ఉన్న ఒక మనిషి – బహుశా కంట్రాక్టర్ కావచ్చు, సెటిల్‌మెంట్‌కి చేరుకుని పెద్ద పెద్ద బండరాళ్ళు, అడ్డదిడ్డంగా ఉన్న రాతి ముక్కలు, గోధుమ రంగు గులకరాళ్ళు ఉన్న ప్లాట్ ఒకటి కొలిచాడు. సూరీడు తేజోవంతంగా వెలుగుతున్నాడు, తెల్లని పొగ ఒకటి నింగిలోకి ఎగసింది. వాళ్ళ గంభీరత సర్వం తమకే తెలుసన్నట్టుగా మొహం పెట్టడంతో వాళ్ళు ప్రభుత్వం తాలూకు అని ఎవరైనా సులభంగా ఊహించగలరు. అస్పష్టంగా ఉన్న నోటీస్ ఒకటి మట్టి రంగు కాగితం మీద సెటిల్‌మెంట్ ఒక చివరన పెట్టి కొంతమంది చదువూ సంధ్యాలేని వాళ్ళవీ, నగ్నంగా తిరుగుతున్న పిల్లలవీ వేలి ముద్రలు తీసుకున్నారు. ఒక వార్త ఒకరి నుండి ఒకరికి పాకింది, భూమి యజమాని వస్తున్నాడని. అసలు యజమాని ఎవరని రెండు పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు వినిపించాయి. ఒకటి ఆ మనిషి ఐశ్వర్యవంతుడనీ రహస్యంగా బోలెడంత డబ్బు పోగేసాడనీ, మరొకటి, నిండా మునిగిపోయి, నయాపైసా లేకుండా ఎవరో గెంటేస్తే వచ్చే ఏ ఆశా లేనివాడని.
చాలా మండి అతను భాగ్యవంతుడై ఉండాలని ఆశపడ్డారు. కాని రామచంద్ర మంగరాజ్, భూతపూర్వ జమీందార్ సగం రోజులు తిండి లేక మలమల మాడుతున్నవాడు, అతని పూర్వీకుల పాపాల శాపంగా ధనవంతుల అంచనాలు హేళన చేస్తూ వ్యాఖ్యానించాడు – “ఎక్కడి నుండో ఒక బిచ్చగాడు వస్తాడు కామోసు.”
(నిజానికి ఈ భూతపూర్వ జమీందారు పేరు రామచంద్ర మంగరాజ్ కాదు, చిన్నతనంలో అతను ఒక నాటకంలో వేసిన పాత్ర పేరును తన పేరుగా మలచుకున్నాడు.)
కుంతి అక్కడికి చేరే సరికి చీకట్లు అలుముకున్నాయి. ఆమె తన కొత్త ఇంటికి ఎప్పుడు చేరిందో ఎవరూ గమనించలేదు. కాని చాలా తక్కువ మంది సాక్ష్యాలనూ మౌలిక జ్ఞానాన్నే నమ్ముతారు.
చక్రపాణి అన్నాడు, “ఆమె పల్లకీ కాళ్ళ మీదున్న ఇత్తడి సింహం పిల్లలు పాలిపోయి, నిరాశగా కనిపించాయి. అవి ఆహారంగా పట్టుకున్న కుందేలు పిల్ల బయట చీకట్లోకి తప్పించుకు పోయినట్టు.”
“సింహపు పిల్లలు బంగారంతో చేసినవి” జటాధారి స్థిరంగా అన్నాడు.
“ఆమె పల్లకీలో ఎగురుతూ వచ్చింది” జటాధారి భార్య ఏడ్పుగొట్టు సాకేయి ఉవాచ.
కుంతి పాపం ఏ మెరుపూ లేకుండా చివరలు ఎండి పోతున్న మునక్కాడలా ఉంది. కాని ఆమె చూపులు మాత్రం ఆమె పిల్లలు లేని విధవరాలుగా తిరిగి వచ్చిందా, లేక పెళ్ళీడు దాటిపోయిన పెళ్ళికాని కన్యగానా అనే చర్చను సెటిల్ చెయ్యట్లేదు. ఆమె కట్టుకున్న తెల్ల చీరకున్న సన్నని అంచువల్ల అది చీరనా, విధవరాళ్ళు కట్తుకునే పంచెనా ఎవరికీ అంతుబట్టలేదు.
“అది పంచె” మకర అమ్మ మాట అది.
“చీర” సానియా తల్లి స్థిరమైన నిర్ధారణ.
“కుంతి డియర్, ఎందుకిలా పాలిపోయి, జబ్బుపడినట్టు అయిపోయావు?” నెఫిడీ తల్లి అంది.
“మేమంతా ఎంతో మంది పిల్లల పురుళ్ళు, రోగాలూ, పోగొట్టుకోడాలూ అయినా ఇలా మిగిలాం, కాని నువ్వు నీ నీడలో బ్రతికి ఇలా పురుగు తినేసిన కొమ్మలా అయిపోయావు.”
కుంతి తన పరిచయస్థులందరినీ వదిలేసింది. రకరకాల వయసుల్లో ఉన్న మగవాళ్ళూ, ఆడవాళ్ళూ తమ తమ నైపుణ్యాలను, వైఖరులను ఆయుధాలుగా అందిపుచ్చుకుని చుట్టూ చేరి ఆమె జీవితంలోకి చొరబడాలని చూసినా ఆమె మౌనంగానే వారిని నిరాకరించింది. జనాలు, చుట్టాలు, పక్కాలు, రామా తల్లి తల్లి చెల్లెలి దూరపు జనాలు. భూములు, పంచాయితీ, హోమాలు, మాంత్రికుడు, పూజారులు.. దక్షిణపు వసంత వీవన, కొంగలు, వడిసెలలు, నోరు తిరగని గజిబిజి పలుకులతో చిన్న పిల్లలు ఓనమాలు నేర్చుకోడం, కట్నాలూ, కానుకలూ, పండుగలూ సంబరాలూ గ్రామ సమాజాలు, పెళ్ళిళ్ళు శుభ సందర్భాలూ.
బాట దేవత జటాధారిని పూనింది (జనాలు అతని దైవిక శక్తుల గురించి పబ్లిక్ గానే నవ్వుతున్నా, గ్రామం మారినప్పుడే పూజారి తనతో ఆ పాత దేవతను కొత్త సెటిల్మెంట్ దగ్గరకు తీసుకువచ్చాడు, ఆ దేవతను ఇంకా ప్రతిష్ఠించలేదు). జనాలు దీన్ని తెలుసుకున్నది భూకంపం గ్రామాన్ని కుదిపేసినప్పుడు, కొండ మొదట్లో డైనమైట్ బ్లాస్ట్ వల్ల భూకంపం వచ్చింది. పుష్యమాసం, అతి చల్లని నెల, పున్నమి దరిదాపుల్లో, హఠాత్తుగా వేర్లు కొట్టుకుపోయిన చెట్లలా జనాలు నిస్సహాయంగా ఉన్నప్పుడు కొంత నీడ దొరికినట్టు, మూడు రోజుల్లో ఆదేవతను పవిత్రంగా ప్రతిష్ఠించారు, వాళ్ళ నిస్సహాయత నిర్మూలిస్తుందన్న ఆశతో. పూజా విధానం చేసేందుకు సైకిల్ మీద వచ్చిన మరో గ్రామపు బ్రాహ్మణ పూజారి, జనాలు నిట్టూర్చి, “ఏం అనాచారపు కాలం ఇది, బ్రాహ్మలు కూడా ఎంత చెడిపోయారు? అతని కొడుకు టౌన్‌లో మోటర్ బైక్ మీద పూజలు చెయ్యడానికి వెళ్తున్నాడట” అన్నాడు.
జటాధారి పూనకంలో ఏదో ఒక రోజున కుంతికి దేవతా శక్తులు సంక్రమిస్తాయని అన్నాడు. కుంతి (ఎప్పుడో రావలసిన మెనోపాజ్ ఇంకా రాలేదు) ఈ ప్రకటన వింది కాని ఏమీ స్పందించలేదు.
కొన్నాళ్ళ తరువాత కుంతి దేవత సింహాసనం చూద్దామని వెల్లింది. దేవతామూర్తిని పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన మంటపంలో ఉంచారు. ఆ రాళ్ళూ రప్పలున్న సెటిల్మెంట్‌లో దేవతామూర్తిని ఉంచడానికి అక్కడ మర్రి చెట్టు మాట దేవుడెరుగు ఎక్కడా గడ్డి కూడా లేదు మరి. అమ్మవారి మండపం వెనకాల తెల్లటి కొండ శిఖరాలు.
సెటిల్‌మెంట్ ఈ మధ్యనే వాడుకలోకి వచ్చినా, కొంతమంది తెల్లతోలు జనాలు ఏదో శాపం వల్ల శిలావిగ్రహాలుగా మారారని ప్రజల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం.
తొందరలోనే కుంతి గురించి కుదిరినన్ని పుకార్లు కల్పించి, సృష్టించి అలసిపోయారు. తండ్రి వయసున్న కొంత మంది పెద్దవాళ్ళకు కుంతి చదువు, గోవిందా పాల్గొన్న కౌలుదారు ఉద్యమం స్పష్టంగా గుర్తుంది. ఒక ముసలాయనకైతే కుంతి మీద అపనిందకు కారణమైన ఆ నల్లని టీచర్ కూడా గుర్తున్నారు. కాదంటే అతని జిత్తులమారి, అస్పష్టపు జ్ఞాపకంలో నల్లటి టీచర్ కాస్తా తెల్లగా మారిపోయాడు. ఈ మసలి వాళ్ళలో చాలామంది, నియమానికి విరుద్ధంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలను తీసుకుని ఒకరిపైన ఒకరు క్రిమినల్ కేసులూ, సివిల్ కేసులూ పెట్టుకున్నారు, ఇంకా వాటి నుండి విముక్తులు కాలేదు. ఇహ ఆ ముసలివాళ్ళు భవిష్యత్తు గురించి చెప్పినది ఒక్కటీ నిజం కాకపోడంతో, వాళ్ళ లోకజ్ఞానం ఏ మాత్రం పనికి రాక, పాత గ్రామం మునిగిపోయాక వాళ్ళ స్వస్థలం వదిలెయ్యవలసి వచ్చాక వాళ్ళకి ఏ మాత్రం గౌరవం దక్కడం లేదు. మందమతిలైన గ్రామ యువత కొత్త సెటిల్‌మెంట్ నిర్మాణంలో ముసలి జనాల పాత్ర ఏ మాత్రం లేదనే నమ్మకంతో ఉన్నారు.
ఇవి పక్కనపెడితే ముసలివాళ్ళ వింత ప్రవర్తన చూస్తే ఎవరు నవ్వకుండా ఉండగలరు? మచ్చుకు ఎవరింట్లోనైనా పాత గ్రామంలో వంటగదికి కేటాయించిన స్థలం ఇప్పుడు సెటిల్మెంట్‌లో ఒక గోడగా మారింది. ఇంట్లోని వయసు మళ్ళిన స్త్రీలు ఇప్పటి ఏళ్ళుగా కొత్త సెటిల్‌మెంట్ ఇంట్లో ఉంటున్నా ఈ మార్పుకు ఇంకా అలవాటు పడక ఎన్నిసార్లో అక్కడ వంటగది తలుపు ఉందనుకుని తలలను గోడకు కొట్టుకున్నారు, గుడ్డి గొర్రెపిల్లల్లా, చెదలు తినేసిన గోడలనుండి మట్టి పూత ఊడిపోయినట్టు. (ప్రియమైన పాఠకులకు నా విన్నపం ఈ ఇళ్ళు కట్టిన ఇంజనీర్ల మీద ఆరోపించడం లేదు, ఒకటి, అసలు నేను చెప్తున్నది ఒక కథ. అది సూటిగా చెప్పాలి. ఎవరినైనా విమర్శించాల్సిన అవసరం నాకేముంది? రెండు, నేనొక బీద గ్రామీణ అమాయకపు, అల్పజీవిని, వాగుడు కాయను. ఈ సాంకేతిక విషయాల గురించి నాకేం తెలుసని?) పాత ఇళ్ళలో ఎక్కడైతే గోడలో ఒక అరను ఏర్పాటు చేసారో అక్కడ కొత్త సెటిల్మెంట్‌లో ఒక మేకు కూడా దిగదు. మొదట్లో జనాలు ఇంటి బయట వరండాలో ఉండేవాళ్ళు, తరువాత ఇంటి ముందు గుడిసెలు వేసుకుని అక్కడికి మారారు.
పైగా, ఆ చంద్ర, మార్కండ తండ్రి చేసాడది. ఏ గ్రామ యువకుడైనా ఈ వయసు మళ్ళిన ఆడ, మగ వారి పట్ల గౌరవం నిలుపుకోగలడా? చాలా కాలం క్రితం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, అతను వెర్రివాడిలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నప్పుడు, అతను గూఢచారేమోననే అనుమాన పడి, పట్టుకుని కొన్ని రోజులు జైలుకి పంపించారు. ఆ జైల్ పేపర్లతో మార్కండ యుక్తిగా తన తండ్రికి స్వాతంత్ర్య యోధుల పెన్షన్ ఏర్పాటు చేసాడు, పంచాయత్ ఎలెక్షన్లలో పోటీకి రూలింగ్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అప్పటి లాండ్ నియమాల ప్రకారం చంద్ర యాజమాన్యం, లాండ్ మీద అధికారం ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయి, అక్కడి నుండి అంకమారా సాగునీటి పథకానికి తరలిపోయింది. కాని చంద్ర, అసలే వెర్రివాడు, ఎలాటి చట్టాలూ, నియమాలూ పాఠించక తన భూమిని అప్పగించలేదు. పోలీస్ అతన్ని సెక్షన్ 109 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, అతని అనుమానాస్పదమైన కదలికలు, పిలిచినప్పుడు దాక్కోవాలని ప్రయత్నించడం కింద అరెస్ట్ చేసారు. ఒకనెల తరువాత జైలు నుండి విడుదలై వచ్చాక అతని భూమి ఉండే చోటుకు వెళ్ళి తన లాండ్ అప్పటికే మునిగిపోడం వల్ల బౌతికంగా దాని మీద తనకు ఏ మాత్రం అధికారం లేదని గ్రహించాడు. అతను మూగవాడిలా డామ్ చుట్టూనే తిరిగేవాడు. పోలీసులు అతన్ని భయపెట్టాలని చూసారు కాని, పిచ్చివాడవటంతో అతనే మాత్రం భయపడలేదు. చెప్పాల్సిందేముంది, పాత గ్రామం నుండి ఇతరులెవరూ క్రిమినల్ నేరం తో జైలుకు వెళ్ళలేదు ఒక్క ఏనుగుకాళ్ళున్న నారద తప్ప. (నిజానికి అతని అసలు పేరు మరేదో ఉంది, చిన్నతనంలో నాటకాల్లో నారదుడి పాత్ర వేసి అదే పేరుతో చెలామణి అవుతున్నాడు). అతను పూర్వ జమీందారు పెరటి తోట నుండి ఒక గుమ్మడి కాయ దొంగతనం చేసి ఒకనెల జైలుకి వెళ్ళాడు. వదిలేసాక రంగూన్ ఎగిరిపోయాడు. ఇహ మార్కండ తండ్రి విషయానికి వస్తే సాగునీటి పథకం ఇంజనీర్ బాబు ఒకడు మార్కండ తండ్రిని తీసుకుని సెటిల్మెంట్‌కు వచ్చాడు. కాని ఆ ఇంజనీర్ బాబు నెమ్మదైన వాడు, సౌమ్యుడు, తెలివైన వాడు. అధికారం అవతరించినట్టు ఎంత బలిసి ఉన్నాడంటే వీధిలో రెండు వైపులా ఇళ్ళ మధ్యన నడవడం కష్టమైంది, అతను గోడలకు, వరండాలకూ కొట్టుకుంటూ సూటిగానూ, పక్కకు తిరిగినా ఊళ్ళో అడుగుపెట్టలేక పోయాడు. బాబు గ్రామస్థుల అజ్ఞానం, మూఢనమ్మకాలు, రోడ్ల మీదకు వాళ్ళ ఇళ్ళను పొడిగించుకునే అనాగరికపు అలవాట్ల మీద ఇంగ్లీషులో విరుచుకుపడి వెళ్ళిపోయాడు. మార్కండ డామ్ దగ్గరకు వచ్చాడు. ఒక వారం తరువాత అతని శరీరం నీళ్ళలో తేలుతూ కనబడింది. మాజిస్ట్రేట్ విచారణ తరువాత ప్రమాదవశాత్తూ అతని మరణం సంభవించిందని ప్రకటించారు.
కుంతికి క్షుద్ర విద్యలు తెలుసనే నమ్మకం, ఆమె కళ్ళద్దాలు నిజానికి ఇతరుల దృష్టి నుండి దాచుకుందుకు అని పుకారు గ్రామంలో వ్యాపించింది. ఒకరిద్దరు మూర్ఖులైన అబ్బాయిలు ఆమె అద్దాలనుండి ఆమె కళ్ళలోకి సూటిగా చూసి భయపడిపోయి, వారిలో ఒకడు జ్వరం తెచ్చుకున్నాడు. మలేరియా తగ్గించే మాత్రలతో జ్వరం తగ్గినా, కుంతి మంత్రగత్తె అనే పుకారు నిజమే ననిపించింది, అది ఉత్తేజకరింగా ఉందిగా మరి. గ్రామ దళారి చక్రపాణి, నల్లటి గ్రానైట్‌లా బట్టతల ఉన్నవాడు, ఈ పుకార్లకు నవ్వేస్తూ వినేవాళ్ళ మొహాల మీద ఎర్రని ఉమ్మి చిలకరించాడు.
(సెటిల్‌మెంట్ వస్తున్న సమయంలో భూసేకరణ కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. చక్రపాణి రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో మార్కండ కుటుంబానికి చెందిన నాలుగెకరాల పొలం తన పేరున రాయించుకుని, ఇచ్చిన నష్టపరిహారాన్ని జేబులో వేసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం నలుగురు అన్నదమ్ములూ చక్రపాణిని దొరకబుచ్చుకుని అతను పారిపోవాలని చూస్తుంటే జుట్టు పట్టుకు ఎంత గట్టిగా లాగారంటే సగం జుట్టు ఊడివచ్చింది. ఇదైన కొన్నాళ్ళకే ఈ భయంకరమైన సంఘటన జ్ఞాపకాలకో ఏమోగాని చక్రపాణి జుట్టంతా ఊడిపోయి బట్టతల మిగిలింది.)
ఒక వారం తరువాత ఆమె సెటిల్మెంట్‌కి వచ్చింది. కుంతి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఒత్తి కాలిపోయే వరకు అక్కడే ఆగి లోపలికి వచ్చింది. మెయిన్ డోర్ ఘడియ వేసి పెరటి వైపు చూసింది. అక్కడ మెత్తని వెలుతురు వ్యాపించి ఉంది. బహుశా వెన్నెల రాత్రి కావచ్చు. అక్కడ చంద్ర, మార్కండ తండ్రి నిల్చుని ఉన్నాడు. అతని తలమీద ఓ పిడికెడు వెంట్రుకలు, అదే సంఖ్యలో వాచిన నరాలు కనిపిస్తున్నాయి. అతని నవ్వు వానకు నలుపెక్కిన తాటాకులా ఉంది.
“అంకుల్, ఎప్పుడు వచ్చావు? ” అడిగింది కుంతి.
ఆ ముసలాయిన నేల మీద కూచున్నాడు. యుద్ధం తరువాత, జైలు నుండి విడుదల అయినది మొదలు అతను చాప మీద కాని, కుర్చీ మీద కాని కూచోలేదు. చంద్ర ఎప్పుడూ వదురుబోతే ఒక్కోసారి ఏదో ఒక కథ జైలు గోడల ద్వారానో, ఆ కాంపస్ లోని కదంబ చెట్టు ద్వారానో విన్నానని అనేవాడు. అతను పోయాక కూడా ఆ అతివాగుడు అతనితోనే ఉంటుంది.
“డియర్, మీ నాన్న ధర్మ విరుద్ధంగా నేను చెయ్యబోయే తప్పునుండి నన్ను రక్షించాడు. నీకు తెలుసుగా శ్మశానాన్ని ఆనుకుని నాకో చిన్న స్థలం ఉండేది (లేదు, కుంతికి తెలియదు). నీకు తెలీదు గాని అదెంత సారవంతమైన భూమో! నీకు తెలీదు. నువ్వెప్పుడైనా ఊళ్ళో వ్యవసాయం చేసావా? ఒకరోజున నేను నా స్థలానికీ, శ్మశానానికీ మధ్యన ఉన్న సరిహద్దును వేస్తున్నాను. ఒట్టు నా మనసులో ఒక దురాలోచన వచ్చింది, శ్మశానంలో కొంత స్థలం ఆక్రమించుకుందామని. పక్క స్థలంలో కలుపు తియ్యడం జరుగుతోంది. అయిదారుగురు మనుషులు అక్కడ పని చేస్తున్నారు. మీ నాన్న వచ్చి నా ముందు నిల్చున్నాడు.
‘ఏం చెయ్యబోతున్నావు? నన్నెక్కడ కాల్చేసారో ఆ స్థలం కనబడటం లేదా? ఇంకా పగిలిన కుండ ముక్కలు అక్కడ పడి ఉన్నాయి. అవి కనబడటం లేదా?’ అన్నాడు. నేను సర్వేయర్‌ను పిలిచాను. అతను నా స్థలాన్ని కొలిచి ఇచ్చాడు. శ్మశానం తాలూకు అంగుళం స్థలంతో సహా వదిలేసాను. కాని డియర్, మీ నాన్న నీతి నియమాలేమిటో, న్యాయాన్యాయాలేమిటో నాకు అర్థం కాలేదు. మరో పక్క చక్రపాణి ఇంకేదో చేసాడు. మరి మీ నాన్న అతనికెందుకు చెప్పలేదు?” అన్నాడు.
ఆ మనిషి రాత్రంతా ఎన్నో విషయాలను ఏకరువు పెట్టాడు, కుంతి అయిష్టంగానే ఎంతో జనరల్ నాలెడ్జ్ సంపాదించుకుంది. గ్రామ జమీందార్, కాదు, ఇప్పుడున్న వాడు కాదు, అతని తాత. అతనంటే భయానికి మారు పేరు. అతను గ్రామం కింది భాగానికి చెందిన చంద్రభాను ముసలి తండ్రికి, చెప్పులు వేసుకుని అతన్ని దాటి వెళ్ళిన కారణానికి ఒక రూపాయి పైన్ వేసాడు. జమీందారు గ్రామ వీధుల్లో నడిచేప్పుడు ఎవరినైనా సూటిగా చూసాడంటే జనాలకు తెలుసు ఏదో ఒక ఉపద్రవం వారికి ముంచుకు వస్తుందని. కేవలం ఈ కారణం వల్లే పై గ్రామానికి చెందిన చాలా కుటుంబాలు కింది భాగానికి మారిపోయి అక్కడ రహస్యంగా సెటిల్ అయిపోయారు.
అతను ఎదుగుతున్న రోజుల్లో, (అప్పుడు అతను జమీందారు కాదు) పెరుగుతున్న ఒక బాల విధవరాలితో ప్రేమాయణం సాగిస్తూ పట్టుబడి దెబ్బలు తిని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి నదిలోకి దూకాడు. అయితే అతను మునిగిపోలేదు, మెడవరకు నీళ్ళలో కూచుని మొహానికి తామరాకులు కప్పుకున్నాడు. సాయంత్రం అవుతుంటే అతను బర్మాకు పారిపోయి ఒరిస్సా నుండి బర్మాకు కూలీలను పంపుతూ ఎన్నో లాభాలు గడించి, తన జమీందారీ సంపాదించుకుందుకు గ్రామానికి తిరిగి వచ్చాడు. కానీ చాలా కాలం తరువాత, కౌలుదారీ ఉద్యమం తార స్థాయిలో జరిగే సమయంలో, ఆందోళన చేస్తున్న గుంపు ఒకటి జమీందార్ తలుపులు బద్దలుకొట్టి ఇంట్లో దూరి చూసినది – ఒక చిన్న మనిషి చిరిగి, మురికి పట్టిన పాత గుడ్దలు కప్పుకుని నీరసంగా దగ్గుతూ ఉన్నాడు. ఆ ముసలి మనిషి లేచి నిల్చుని ఆ గుంపు వంక చూసాడు. అతని కనుగుడ్లు గుంటలు పడిన కళ్లలో ఇరుక్కుపోయాయి. ఆ గుంపు భయంతో వెనక్కు పోబోయింది. గోవింద ఆజ్ఞాపించాడు, “ఆగండి, వెళ్ళ వద్దు”. ఈ క్షీణించిపోయిన మనిషి గుర్తుపట్టలేని మనిషి పూర్వ జమీందారు వారసుడు. ఊపిరికి తన్నుకుంటూ తలపైకెత్తి నిశ్శబ్దంగా చూసాడు. గట్టిగా దగ్గడానికి భయపడుతున్నట్టుగా నీరసంగా దగ్గుతూ పడుకున్నాడు. ఆందోళన చేసే గుంపు తలదించుకుంది, సవాలు విసిరి, ఒళ్ళు జలదిరింపజేసే పర్వతం, ఎక్కబోయే ముందు హఠాత్తుగా తమ కళ్లముందే మాయమైనట్టు అనిపించింది. చంద్ర ఎప్పుడు వెళ్లాడో తెలియదు కాని కుంతి అంతకు ముందే నిద్రలోకి జారిపోయింది.
ఆ మర్నాడు, సాయంకాలం అదే సమయానికి, సుందరి వాళ్ళమ్మ అక్కడే నిల్చుని ఉంది. వెల్లువలా వెన్నెల. బహుశా పౌర్ణిమ కాబోలు, గాలి తనతో పాటు వేడినీ ధూళినీ తోడు చేసుకుని బరువెక్కి ప్రతివాళ్ళనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కుంతి గుర్తుచేసుకుంది, అప్పుడు తను చాలా చిన్నపిల్ల. ఎందుకో గుర్తులేదిప్పుడు కాని తల్లి తనను అదిమిపట్టుకుని చక్కిలిగిలి పెట్టడం. ఎంతగా గిలిగింతలు అంటే, యుగాలు గడిచాక ఇప్పుడాపనికి కోపం వస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా సుందరి వాళ్ళ అమ్మను చూడగానే మళ్ళీ ఆ గిలిగింత అనుభూతి కలిగింది.
“లేదులే తల్లీ, ఇప్పుడు నీకు చక్కిలిగిలి పెట్టను, నువ్వేమీ చిన్నపిల్లవు కాదుగా”అంది సుందరి తల్లి.
“నాకు ఇప్పుడు కూడా అలానే అనిపిస్తోంది” అంది కుంతి.
పిలవకుండానే వచ్చి ఆంటీ అక్కడ కూచుంది కాళ్ళు ఊపుతూ.
“డియర్, అప్పుడప్పుడు వరి కాస్త మంఛులో ఉంచు. అది వెన్నెలలో కాస్త తొలిస్తే నీకు మల్లెపూల లాటి వరి గింజలు వస్తాయి. నేను ముసలైపోయి వడ్లు దంచలేకపోతున్నాను.
సుందరి నేను అనుకున్నట్టు పెరగలేదు. అది నన్నో రోజు అడిగింది, ‘అమ్మా, నాకు ఉన్నవిషయం సూటిగా చెప్పు. నేను కుంతి కన్న అందంగా లేనా? నేను తనకన్న తెల్లగా లేబా? నామొహం మీద ఉన్న ఈ పుట్టు మచ్చల వల్ల నేను వికారంగా కనిపిస్తున్నానా? అయినా ఎందుకా నల్లటి టీచర్ కుంతి వైపు అలా చూస్తాడు?’
‘మీరు స్నేహితులే కదా?’ అని అడిగాను.
‘పోటీ లేకుండా స్నేహం ఏమిటి అమ్మా? శత్రువు లేకుండా జీవితం ఏమిటి? జగడం లేకుండా ఎవరైనా జీవితం ఎలా గడుపుతారు?’ అంది.
ఏమిటీ ప్రదర్శన? నీకు తెలుసు, సుందరి తండ్రికి ఒక అంగుళం భూమి కూడా లేదు. ఒక రూపాయి సంపాదించే ఉద్యోగమూ లేదు. ఆరునెలలు ఆ సంగీత నాటకాల సంపాదన ఆయన ఆరోగ్యం సరిచేసుకుందుకే చాలదు.
డియర్, సంగీతనాటకాలు ఆడటం ఏమైనా సులభమైన పని అనుకుంటున్నావా? ఎంతగా తిరగాలి, టాటా, రంగూన్, టెక్కలి, రాత్రీ పగళ్ళూ నిద్ర ఉండదు. అయినా నాకు బాధవేసేది కనీసం మాకు తిండి కూడా సంపాదించలేకపోడం. నాకు మొత్తం అర్థమయింది, కాని ఏం చెయ్యగలను? గోవింద సుందరిని పెళ్ళి చేసుకుంటాడని ఆశపడ్డాను, కాని చేసుకోలేదు.
నేను వడ్లు దంచుతున్నప్పుడే అది నా కడుపులోంచి జారి భూమ్మీదపడింది. దాని తల ముక్కలై ఉండేదే, వెంట్రుకవాసిలో తప్పిపోయింది. మేము మా ఇంటి ఆవరణ తాకట్టు పెట్టాము, ఒక కోర్ట్ కేసులో దాని తీర్పుకు అరవై ఒక్క సంవత్సరాల ఆరునెలల రెండురోజుల సమయం పట్టింది. నేను మేం ఓడిపోయామనే నిజాన్ని భరించలేకపోయాను. నేను నా చివరిశ్వాస వదిలి మౌనంగా చచ్చిపోయా.”
భార్య మరణించాక సుందరి తండ్రి సంగీత నాటకాలు వదిలేసి లాయర్ కోర్ట్ ఖర్చుల కింద వెట్టి వాడిగా వెళ్ళాడు. డామ్ నిర్మాణ పనులు మొదలవగానే చాలా మంది బయటి వాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళంతా ఎంతో సంపాదించారు. సుందరి ఒంటరిగా ఉంటోంది. అంకమారా గ్రామపు వందేళ్ళ చరిత్రలో సుందరి మొట్ట మొదటి వేశ్యగా మారింది. గ్రామం మునిగిపోయినప్పుడు సుందరి ఇంటి మీద ఉన్న సివిల్ కేస్ సెటిల్ అయింది. కొత్త సెటిల్మెంట్ లో ఆమెకు ప్లాట్ దొరకలేదు. ఆమె అదృశ్యమైపోయింది.
చాలా కాలం క్రితం గోవిందా దేశదిమ్మరిగా, లోఫర్‌గా తిరిగేప్పుడు, సాయంత్రం వేళ ఒకసారి రావడం కుంతికి గుర్తుంది. అతని సమక్షంలో స్కూల్ గార్డెన్‌లో ఎన్ని మల్లెలు విరబూసాయనీ. సుందరి పెరుగు అడగడానికి వచ్చింది. కుంతి పెద్ద వదిన గొణుక్కుంది. (ఏ మాట కామాటే చెప్పుకోవాలి, పెళ్లై వచ్చినప్పుడు పిల్లల పుస్తకంలో దేవకన్యలా ఉండేది. కాని ఇప్పుడు అన్నదమ్ములు భూమిని పంచుకోడం, నాలుగు పురుళ్ళ వల్ల కలిగిన ఆందోళన, ప్రతి ఏడాదీ ఇరవై ఎనిమిది క్వింటాళ్ళ వరి పండించే రైతుగా అహం, దర్పం వల్ల నిప్పుల మీద పడిన ఎండుటాకులా మారిపోయింది.) కుంతి మజ్జిగ తాగాలని పెరుగు తెచ్చింది. సుందరి ఆ పెరుగు పట్టుకెళ్ళి గోవిందాకు ఇచ్చింది కాని ఎక్కడి నుండి ఎవరినడిగి తెచ్చిందో చెప్పలేదు. అయినా కుంతి ఇంట్లో ప్రతి వాళ్లకూ ఈ విషయం తెలుసు. ఆ రాత్రి పొద్దుపోయాక కుంతి తనవైపు చూసే తీక్షణమైన చూపులకూ, వంకర చూపులకూ కూడా జవాబు చెప్పాల్సి వచ్చింది. గోవిందా తెలివితేటలు ఈగ కంటి లాగా కలగా పులగంగా, సంక్లిష్టంగా, అనాగరికంగా ఉండి ఏమీ అర్థం అయ్యేదే కాదు.
పరిశుభ్రత గురించి స్కూల్లో చదువుకున్నాక గ్రామ చెరువులో నీళ్ళ రుచి చెత్తగానూ, క్రిముల మయంగానూ అనిపించాయి. కుంతి ఆ నీళ్ళు తాగినప్పుడు ఆ క్రిములు నోట్లోనుండి కిందకు గొంతులోకి, కడుపులోకి పాకుతున్నట్టు అనుకునేది. ఆ రోజులు అలాటివి. మీ శరీరపు రహస్యభాగాల్లో పుట్టుమచ్చల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు – అలాటివి ఆ రోజులు. మెత్తని గొంతులు పూల మాదిరి వికసించే రోజులు అవి. అయినా అంకమారా గ్రామపు వెయ్యేళ్ళ చరిత్రలో సుందరి ఆ ఊరి మొదటి వేశ్యగా మారవలసి వచ్చింది.
“ఆంటీ, పాపం పిచ్చిపిల్ల ఎంత బాధపడిందో ఇది నాకు తెలుసుంటే దాన్ని నాతో పాటు తీసుకుపోయేదాన్ని.” కుంతి ఉద్వేగంగా అంది.
“అవును కుంతీ నాకు తెలుసు. అది ఎక్కడయినా ఉంటే, బ్రతికి ఉంటే తప్పకుండా తిరిగి వస్తుంది, నాకు తెలుసు, చివరికి మరణించినా కూడా.” ఆంటీ చెప్పింది.
(సశేషం)
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.