Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరిచిత సూర్యాస్తమయం లోకి-5

[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]

[మర్నాడు కుంతి నిద్ర లేచేసరికి గోవిందాను రాత్రి పోలీసుకు అరెస్టు చేసి తీసుకెళ్ళారని తెలుస్తుంది. తన వెనుక తన నేస్తాలు గోవిందాతో సాగించిన రాసలీలలు కుంతికి తెలియవు. గోవింద అసలు స్వరూపమే తెలియదామెకు. చాన్నాళ్ళ తరువాత గోవింద తమ ఊరు వచ్చేసరికి ఉద్యమం మిషతో తన కోసమే వచ్చాడని భావిస్తుంది. కానీ గోవింద ఇక రాడు. ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. గోవింద మంత్రి అయ్యాడని తెలుసుకుంటుంటుంది కుంతి. కోరాపుట్‌కి తన బదిలీని ఆపడంలో ఏమైనా సాయం చేస్తాడేమోనని అతన్ని కలవడానికి వెళ్తుంది. తన పేరు, గ్రామం పేరు రాసి పంపినా, ఆమె ఆశించినట్టు వెంటనే ఏమీ పిలుపురాదు. చేస్తాను చేయను అని చెప్పకుండా వివరాలు తీసుకుని పంపేస్తాడు. ఒక వారం తరువాత కుంతి తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన గ్రామానికి బయల్దేరిపోతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-3

కుంతి బాల్యంలో భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కాని అందరికీ గట్టి నమ్మకం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి తీరుతుందని, అదీ అతి త్వరలోనే. కుంతి తండ్రి ఈ మామూలు జనం నమ్మకాన్ని పెద్దగా విశ్వసించకపోయినా, ఎందుకయినా మంచిదని వాళ్ళ పూజగది పక్కన రెండు వైపులా ఒక గాంధీఫొటో, ఇంకో గోపబంధు ఫొటో వేళ్ళాడదీసాడు. నిజానికి బ్రిటిష్ పాలన నుండి భారతదేశం విముక్తి పొందినా, మానినా అతనికేం వచ్చేదీ లేదు, పోయేది లేదు. అతనేమీ జమీందారు కాదు తన అధీనంలో ఉన్న జాగీర్లనో, విశేష హక్కులనో పోగొట్టుకుందుకు. మరో వైపు చూస్తే అతని భూమి రికార్డులు నిర్దుష్టంగా ఉన్నాయి, అందుచేత దేశాన్ని ఎవరు పాలించినా అతను పోగొట్టుకోడమో, పొందడమో ఏదీ జరగదు.

ఆ రోజుల్లో బ్రాహ్మలు పిలక ఎగరేసుకుంటూ తిరగడమే కాకుండా ఇతర గ్రామ ముఖ్యులతో కలిసి ప్రతి వారి అన్నిరకాల వ్యవహారాల్లో తలదూర్చేవారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ సన్యాసి పొడుగైన పిలకతో ఒకవారం యాయవారం చేసాక (నిజానికి ఎవరినీ అతను యాచించే వాడు కాదు). అతని మధ్యమ స్థాయి స్వరంలో గంభీరమైన పాట ఒకటి సాధారణం గా, ద్విపద నీతి వాక్యాలో, వేదాంత గీతమో, పురాణాల నుండి పాటలో పాడేవాడు.

తన ఏడుగురు పిల్లలనూ అంకుల్ టైగర్‌కు ఇచ్చి బదులుగా ఇద్దరికి భోజనం సంపాదించుకున్నాడు. అతను అవసరమైనంత సంపాదించలేదు, పైగా అతనికి భార్య అంటే భయం, ఇద్దరి భోజనంతో, ఒకటి తనకు మరొకటి భార్యకు అతను తినకుండా తిరిగివచ్చాక, ఒక చిలిపి దయ్యపు పిల్ల ఆ తిండిని మాయం చేసింది. ఒకవేళ గ్రామంలో ఏ మనిషికైనా మతి భ్రమిస్తే, అతను జబ్బుపడటానికి చేతబడి చెయ్యడం లేదా అతన్ని గొడవల్లోకి లాగడానికి అతని భార్యను సోదరుడు ప్రేరేపించి నేరం చేయిస్తే లేదూ ఏ శుక్రవారమో మరణించిన ఏ మగమనిషి దుష్ట ఆత్మ అతన్ని ఆవహించినా ఆ దౌర్భాగ్యపు బలిపశువు గ్రామం వదిలి వెళ్ళవలసి వచ్చేది. సోదరులు అయిదుగురు పెద్దలను పిలిచి అతని భూమి సాగుచెయ్యడానికి శాశ్వత ఏర్పాట్లు చేసారు. ఆ క్రమంలో దేశం స్వాతంత్ర్యాన్ని పొందింది. ఒకప్పటి పిచ్చివాడు తిరిగివచ్చాడు. అతను మానసికంగా ఆరోగ్యవంతుడై తన భూమిని అడిగాడు. ఎప్పుడో తరువాత కుంతి ఊరు వదిలి స్కూల్ మిస్ట్రెస్‌గా పనిచెయ్యడానికి వెళ్ళేప్పుడు ఆ మనిషి కోర్ట్ కేసులు ఇంకా సెటిల్ అవలేదు. ఊళ్ళోని వయసు మళ్ళిన వాళ్ళు నిట్టూర్చి ప్రకటించే వారు, “ఈ మొత్తం విషయం ఎంత దురదృష్టకరం. బ్రిటిష్ కాలంలో ఇలాటివి ఎంత త్వరగా తెమిలిపోయేవి? మన తీర్పును పాలించే ఆ పాపభీతి, నీతి నిజాయితీలు ఏవీ?” (దీనికి ఒకటి రెండు ఉదాహరణలు కూడా పొందుపరచేవారు.).

ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఎత్తి చూపకూడదుగాని ఆ పెద్దమనుషులకు కూడా పోరాడవలసిన వారి వారి స్వంత కోర్ట్ కేసులు ఉన్నాయి. మరి ఈ భూప్రపంచంలో ఒక అంగుళం స్థలం ఉన్నా ఎవరికి లేవు వివాదాలూ, వ్యాజ్యాలూ.

ఒక నైతిక సిద్ధాంతం వాడుకలో ఉన్నా ఇక్కడ సామాజిక స్థాయి గణనీయం అవడంతో పెద్దలు తీర్పు ఇస్తున్నారు. దాసియా బావురి ఆ బాల వితంతువును పెళ్ళాడబోతుంటే ఆ పంచాయితీ ఆపెయ్యలేదూ? అతను మళ్ళీ అలాటి తప్పు చెయ్యకుండా వాళ్ళు బలవంతాన అతని రెండు ఎడ్లను స్వాధీనం చేసుకుని వేలం వెయ్యలేదూ? ఊరిపెద్దల్లో అతి ముఖ్యమైన వాడైన పంచూ ప్రధాన్ దగ్గర భద్రంగా ఉన్నంత డబ్బు ఎప్పుడూ చూసి ఉండరు. ఇచ్చిన డబ్బుకు రసీదులు ఇచ్చాడు, అందులో అనుమానమేమీ లేదు. ఇంకా పంచు ప్రధాన్ నుండి సేకరించవలసిన ఈ డబ్బు ఒకవేళ సేకరించి ఉంటే ఇది బ్రిటీష్ పాలన అయిపోయేదా? అప్పుడు ఇదే పంచూ ప్రధాన్ ఆ బాల వితంతువుకు నీడనిచ్చి ఆమె గర్భవతి అయితే అది ఆమె తప్పువల్లేనని ఈ పంచాయితీ అదే శిక్ష ఎలా విధించేది? దాసియా బావురి ఈ గ్రామం మహోన్నత ఆత్మలకై విధించిన నియమాలు చూసి ఆనందించేవాడా?

ఆ రోజుల్లో ఒంటి మీదకు వచ్చి దేవతలు చెప్పే విషయాలకు విశేషమైన అర్థం సంపాదించుకుంది. కుంతి పుట్టినప్పుడు ఆమె జాతకం రాసిన జ్యోతిష్యుడు మిగతా చెత్త విషయాల మధ్య (తండ్రి ఇంటికి ఈ పిల్ల అదృష్టం తెస్తుందనీ ఆ జాతకం తాలూకు మనిషికి నిప్పు, నీరు వల్ల ఎలాటి ప్రమాదమూ లేదనీ కాదంటే గాలితోనే జాగర్తగా ఉండాలనీ) ఈ జాతకురాలు పెళ్ళంటూ చేసుకుంటే ఆమె మహారాణి అవుతుందనీ లేకపోతే ఆమె దేవకన్య అవుతుందనీ చెప్పాడు. ఆమె తలిదండ్రులు ఆమె మహారాణి అవుతుందనే గట్టిగా అనుకున్నారు, ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్ళి కాకుండా ఉండిపోతుందని ఎవరనుకున్నారు. ఒక ఆడపిల్ల ఆత్మహత్యైనా చేసుకోవాలి లేదా డెబ్బై యేళ్ళ ముసలి శవాన్నైనా పెళ్ళాడాలి కాని కన్యగా ఉండిపోడమా? లేదు అలాటిది జరిగి ఉండదు.

కుంతి గ్రామం అంకమారా పురాణాలలోని జానపదకథల్లా అతి పురాతనమైనది. ఆ గ్రామానికి ఒక చివర ఆలేఖ్ బాబా, (భీమా భోయ్ మతవిధానానికి అనుచరుడు) ఉండేవాడు, అతనికి గ్రామస్థులు, జమీందారు తాటాకుల మట్టి గుడిసె ఒకటి కాస్త భూమినీ దానంగా ఇచ్చారు (ఏ భూమైనా విరాళంగా ఇచ్చేముందు వాళ్ళు ఒక వందసార్లైనా ఆలోచించి ఉంటారు కాని ఏదో విధంగా వాళ్ళు గుర్తించినది మాత్రం గ్రామానికి వచ్చి పడే దుష్ప్రభావాలన్నీ బాబా కట్టుకున్న గుడిసె ముఖద్వారం వల్లనేనని). ఆలేఖ్ బాబాకు భజన చేసే శిష్యులు కొందరున్నారు. అతని చిన్న వరండాలో గడ్డీని పీల్చుకునే వారు. గ్రామానికి ఒకపక్క నున్న కొండ నుండి వచ్చి పడే ఎన్నో దుష్ట ఆత్మలనుండి, ఆపదలనుండి బాబా ఆ గ్రామాన్ని రక్షించాడు. ఆ గ్రామానికి మూడోవైపు, మరోపక్కనున్న మరోకొండను తన రంగురంగుల సంగీతభరితమైన వైభవం మధ్య వనదేవి, అడవి దేవత రక్షిస్తోంది. నది ప్రవహించే వైపున బాట దేవి, రహదారుల దేవత, రావిచెట్టూ ఒక పురాతన మర్రిచెట్టు కింద రక్షగా ఉన్నాయి. నాలుగో వైపున ఎంత బురద, చెత్త, చెదారం పెంటకుప్పలు ఉన్నాయంటే చివరికి దయ్యాలు కూడా అడుగుపెట్టలేవు. అంకమారా చుట్టూరా అడవి జంతువులతో, మామూలుగా దాటలేని కొండలతో, అడవులతో బురద ఊబి, నదితో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నవ్వుకునేవారు – అంకమారా ఎంత భయంకరమైన చెరసాల అంటే చివరికి మృత్యు దేవత, కలరా, మశూచకం లాటివి కూడా అక్కడికి రాలేవని. అది అతిశయోక్తే, ఎందుకంటే మృత్యు దేవత, కలరా, మశూచకం గ్రామాన్ని దర్శించి కుంతి తండ్రిని తీసుకు వెళ్ళిపోయాయి. తరువాత ఆ రహస్యం ఏమిటో తెలుసుకున్నారు, శరదృతువు జాతర సంబరాల సమయాన పూనకం వచ్చిన మనిషి పొడుగైన వెదురుబొంగు పైన బొడ్డు మీద గిరగిర తిరుగుతూ, పక్క ఊరి మనిషి ఒకడు చీకట్లో పొరబాటున అడవిదేవత విగ్రహం మీద మూత్రవిసర్జన చెయ్యడం వల్ల ఇలా జరిగిందని చెప్పాడు (ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఆ మనిషి కుష్టు వ్యాధికి బలయ్యాడనీ అన్నా, అది కుంతికి గాని ఆమె కుటుంబానికి గాని ఎలాటి ఓదార్పునూ ఇవ్వలేదు). అందువల్ల ఆ దేవత ఇదివరకులా ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తున్నా నిజానికి ఆమెకు శక్తినీ గొప్పదనాన్ని కోల్పోయింది. అది తెలిసిన కొన్నాళ్ళకే ఆ దేవతను మొత్తం విధివిధానం ప్రకారం ప్రతిష్ఠించినా కుంతి తండ్రి మాత్రం తిరిగి రాలేదు.

తండ్రి మరణించినప్పుడు కుంతి ఇంకా చిన్నపిల్ల, ముగ్గురు అన్నలు ఒక అక్కతో పాటు ఎలుక పిల్లంత తమ్ముడు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలు గ్రామ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే వాళ్ళు (చదువు ఆడపిల్లల నడతను రూఢిగా నాశనం చేస్తుందనే అపఖ్యాతి తరువాతెప్పుడో వచ్చింది). అమ్మాయి మూడో క్లాస్ చదివితే చాలు గాంధీ గారి కల సాకారమైందనీ అమ్మాయి కావలసినంత చదువుకుందనీ అనుకునేవారు. కుంతి తనంతట తనే ఏదో ఒక రోజున గొప్ప స్త్రీగా మారాలని నిర్ణయించుకుని చదువుకోడం మొదలుపెట్టింది. ఆమె పెద్ద తెలివైనదేమీ కాదనేది సత్యం, కాని ఆమెకంటే తెలివైన గోవిందా లాటి అబ్బాయిలు స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళి ఎగుపళ్ళు తెంపుకోడం, మామిది చెట్ల మీద అమాయకపు పిట్టగూళ్ళను కిందకుపడగొట్టడం చేసేవారు. ఆమెతో అదే క్లాస్‌లో చదివే సారంగా కూడా చదువులు వదిలేసి తన ఇంటి వారికోసం రైతు కూలీగా మారింది.

4, 5 క్లాస్ లలో రెగ్యులర్‌గా క్లాస్ లకు వెళ్ళేది ఆమె ఒక్కతే అమ్మాయి. మొదట్లో వింత వింత లెఖ్కలు కష్టంగా ఉండేవి. కాని టీచర్లు, కారణం తెలియదు గాని ఆమె పట్ల పుష్కలంగా సహనం కనబరిచారు. ఇలాటి చనువు వల్ల తప్పకుండా పుకార్లు పుట్టించి గబగబా చెవులు కొరుక్కునేలా చేస్తుంది. ముఖ్యంగా ఒక అపవాదు చక్కర్లు కొట్టడం మొదలెట్టింది – ఆ నల్లటి లెఖ్కల టీచర్ తొందరలో ఆమెను పెళ్ళి చేసుకుంటాడని, అదీ కుంతి పెళ్ళి వయసుకు చేరుకుందుకన్నా చాలా ముందుగానే ఆ టీచర్ ప్రైవేట్‌గా డిగ్రీ పరీక్ష పాసై, స్కూల్ వదిలి స్టేట్ గవర్నమెంట్‌లో డెప్యూటీ కలెక్టర్‌గా చేరాడు. కుంతికి ఆ పుకారు గురించి తెలిసినా ఆ టీచర్ వెళ్ళిపోయేటప్పుడు ఆమెకు ఏమీ అనిపించలేదు, కాస్త హృదయంలో ఒక జలదిరింపు తప్ప. దీని తరువాత అతను ఆమె విస్మృతిలోకి మాయమైపోయాడు. లేదా కనీసం అతన్ని ఆమె గుర్తుంచుకున్న విషయం కూడా ఆమెకు తెలీదు.

చాలా కాలం తరువాత భాను ఆమె కోసం రాడం మానేసాక, ఒక బకెట్ నిండా ఆ నల్ల మాథ్స్ టీచర్ అండర్‌వేర్‌లు ఉతుకుతున్నట్టు ఒకసారి ఆమెకు కల వచ్చింది. కాని ఆమె వాటిని జాడించడానికి వెళ్ళినప్పుడు నల్లాలో నీళ్ళు రాడం లేదు. గోవిందా స్కూల్ వదిలేసి వెళ్ళక ముందు వాళ్ళు స్కూల్‌కి కనీసం ఒక మైలు దూరం కలిసి నడిచే వాళ్ళు. వర్షాకాలం వానల్లోనో, లేదా వరి పొడుగ్గా పెరిగినప్పుడో, వాళ్ళు చుట్టూ తిరిగివెళ్ళాల్సివచ్చేది- కనీసం రెండు మైళ్ళకు పైగా. కుంతికి ఆమెదైన అసమానమైన తన సొంత సొగసు. ఆమె మిత్రులు చాలా మంది పెద్దపెద్ద పడవల్లాటి తాటాకు లేదా వెదురు తడకల టోపీలతో సరిపెట్టుకుంటే, వాళ్ల నాన్న చాలా కాలం క్రితం ఎక్కడో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తెచ్చిన రంగురంగుల గొడుగు పట్టుకుని వచ్చేది. ఆ పైన గోవిందాతో పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునేది, వాటితో పాటు ప్రేమలేఖలు కూడా. ఇది నేర్చుకుందుకు వాళ్ళకు నిజంగా స్వంత బుర్రలు కావాలా? వాళ్ళ గ్రామ గ్రంథాలయంలో ఉన్న నవలలు చదివి, ఊళ్ళో ఆడవాళ్ళు వాళ్ళ డబ్బాలలో రహస్యంగా దాచుకునే వాటిని చూసి ఈ కళలు అప్పటికే నేర్చుకుని ఉంటారు. ఆమె గోవిందాకు రాసిన ప్రేమ లేఖల్లో, ద్విపదలు, చాటుపద్యాలు, హాస్య పూరితమైన వ్యాఖ్యలు, సాంప్రదాయిక గ్రంధాలలోవీ, తెలియని రచయితల పుస్తకాల్లో మాటలూ ఉండేవి. ఆమె అతణ్ణి నా రాజా అనీ, నా కన్నా అనీ, నాకంటి యాపిల్ అనీ పిలిచేది. ప్రతి విశేషణమూ, వ్యక్తీకరణా, ఏదో ఒక నవలలోంచి నమ్మకంగా కాపీ కొట్టినవే. గోవిందా లాటి మామూలు పేరున్న వాడికి ఎవరైనా ఇలా శృంగార లేఖ రాయగలరు? ఆమె ఉత్తరం చివర, “అదృష్టానికి నోచుకోని నీ” అనీ, నీకు సరితూగని అర్పితను” అనీ “నీ చరణ కమలాల వద్ద ఒకే ఒక్క బానిసను” అనీ “ఈ జీవితంలో ఇంకా మరెన్నో జీవితాల్లో నీ నీడను” అనీ రకరకాలుగా సంతకాలు చేసేది. ఆమె పల్లెకు వెళ్ళడానికి గోవిందా చిన్న స్వల్పమైన అవకాశాన్ని కూడా వదులుకోలేదు, దానికోసం ఎందుకూ పనికిరాని, బద్ధకస్తుడు, మురికి మొహం వాడూ నాథూ మహాలిక్‌తో అతను స్నేహం కూడా చేసుకోవలసి వచ్చింది. కుంతి ఇల్లు చేరడానికి ఒక నది దాటవలసి వచ్చేది, వేసవిలో నదీ తీరాన రాళ్ళు వేడెక్కిపోయేవి. వర్షాకాలంలో పడవ నడిపే స్థంభాలు నదీ గర్భాన్ని కూడా చేరేవి కాదు. దానికి తెడ్లు అవసరపడేవి. అంకమారా గ్రామస్థులు వర్షాకాలంలో వాళ్ళ కాల కృత్యాలు బోట్ లలోంచే చేస్తారని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నవ్వుకునేవారు.

గోవిందా మొత్తానికి స్కూల్ వదిలేసినప్పుడూ కారణాలు అడిగితే స్వాతంత్ర్యోద్యమంలో చేరి విప్లవకారుడిని అవుతాననేవాడు. కాని అతను పాలుపంచుకుందుకు అప్పటికే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ప్రశాంతమైన ఒరిస్సా ఒక మూలన ఎలాటి హిందూ ముస్లిం మతకల్లోలాలు లేవు. అందుకని కౌలుదార్ల హక్కులపై ఉద్యమం ఒకటి లేవదీసాడు. ఇక్కడ గొప్ప తమాషా ఏమిటంటే ఇక్కడ మరివరికో హక్కున్న భూమ్మీద నిలబడి ఓ డజను మంది అక్కడే తారట్లాడుతుంటే అతన అధికారాన్ని ఆజ్ఞలను ప్రదర్శించడం. వారి రహస్య ప్రేమ కలాపం పుకార్లు మరింత పశుప్రాయమైన కామ దాహంగల వివరాలుగా సేకరిస్తున్నా సమయం గడిచే కొద్దీ అతను కుంతిని కలవడం తగ్గిపోయింది. ఎవరైనా ఆ పుకార్లు ఎంత వరకూ నిజమని పరిశీలిస్తే మరీంత అనుమానాన్ని పెంచే నిగూఢమైన చిరునవ్వు అతనో మారు విసిరేవాడు.

చాలా రోజుల తరువాత, కుంతి తన గ్రామానికి తిరిగి వస్తూ దారిలో కచ్చా రోడ్డు దగ్గర ఒక సైన్ బోర్డ్ కనబడింది, దాని మీద ‘అంకమారా 3 సాగునీటి ప్రాజెక్ట్’ అని కనబడింది. ఆమె మనసులోకి గోవిందా రాలేదు. అలాగని ఆమె పెళ్ళికి తొలిసారిగా వచ్చిన సంబంధమూ గుర్తు రాలేదు. తన తల్లిని మొదటిసారి ఎప్పుడు చూసిందో, లేదూ బాట దేవత, ఆ గ్రామానికి దారి దేవతను, రావి చెట్టును ఎప్పుడు చూసిందో జ్ఞాపకం లేనట్టే. కాని ఒకరోజున మిఠాయిలు అమ్మే అతను రావడం బాగా గుర్తుంది, అతని మొహంమ్మీద ఎప్పుడూ పాతిక వంతు నవ్వు అతుక్కుని ఉండేది, తనేదో చిన్న కుర్రాడైనట్టు ఎవరో తనకో స్వీట్ ఇవ్వబోతున్నట్టూ. ఆమె తల్లి కుంతి కోసం బియ్యం ఇచ్చి బదులుగా జిలేబీలు తీసుకుని, రహస్యంగా “వెళ్ళు, వెళ్ళి త్వరగా తినెయ్. లేకపోతే మనవాళ్ళంతా శనిగ్రహాల్లా నా వెంట పడతారు.” అనేది.

తరువాత కుంతి జాతకం ప్రకారం శని దశ నడుస్తున్నప్పుడు ఆమె హామరాయిడ్స్‌తో బాధపడి, ఎవరో పిల్లలు ఆమె బొమ్మ గీసినట్టూ ఆమె శరీరం ఉబ్బిపోయి, ఆమె మొహం ఆకారం కోల్పోయి స్కూల్ సెక్రటరీ ఒక్కడే పుకార్లు అమ్ముకునే ఆ చిన్న టౌన్‌లో అవమానించాడు. స్కూల్లో ఆమె కొలీగ్ కుంజా దీదీ ఆమె మొహమ్మీదే సవాలు విసిరింది. “ఎందుకా పిల్లడు భానుకు వల విసిరావు? నేను వినొచ్చా?”

ఆమె రోజులు మాంత్రికుడి అద్దంలో సాగినట్టు విపరీతంగా సుదీర్ఘమై అశ్లీలపు ఆకారరహితంగా మారి, రాత్రులు భయంకరమైన చీకటిలా ఉప్పొంగుతూ, తన పెదవుల మీద నిరంతరం అరకొర నవ్వుతో ఆ మిఠాయిల వ్యాపారి, కాలెండర్ మీద కృష్ణ భగవానుడిలా ఉండే అతను ఈ బాధలన్నింటికీ కారణమో ఆమెకేం అర్థం కాలేదు.

ఆ రోజు కుంతి కళ్ళు తన తల్లి కోసం చెమ్మగిల్లాయి. కాని వాళ్ళ ధాన్యాగారం దగ్గర ఆ చీకటి మూలన తనొక్కతే ఆ జిలేబీలు తినలేకపోయింది. దాన్ని కర్ర దుంగల మధ్య దాచి బాలియా కోసం వెతుకుతూ వెళ్ళింది. పాపం పిచ్చి బాలియా చీకటి మూలకు దగ్గరలో ఏదో పుస్తకం చదువుతూ ఆమె సైగలు అర్థం చేసుకుందుకు కాస్త టైమ్ తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమె జిలేబీలు దాచిన చోటుకు వెళ్ళారు, కాని అవక్కడలేవు. మనిషో , ఎలకలో, లేదా పిల్లో గంగమ్మ తల్లో ఎవరు పందిలా కొరికారో మరో ఎనిమిదేళ్ళు గడిచే వరకు, బాలియా గాస్ట్రో ఎంటిరైటిస్‌తో మరణించే వరకూ ఎవరికీ తెలియలేదు.

ఆరోజు బాలియా వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తూ “నువ్వు నన్ను మోసం చేసావు.” అని ఎంత గట్టిగా అన్నాడంటే పెద్దన్నయ్యకు తెలిసిపోయింది, అతను తల్లిని నానా రకల పేర్లతో పిలిచాడు, అతని భార్య రాత్రంతా ఏడుస్తూ ఇల్లు దోచుకు తింటూన్నారనీ, అంతా దోచేసుకున్నారనీ, వృథా చేస్తున్నారనీ గొడవ పెట్టి కొన్నాళ్ళలోనే వాళ్ళ ఆస్తి వాటా ఇల్లూ భూమీ, స్థిర చరాస్థులను పంచుకుని వేరుపడి వెళ్ళిపోయారు.

విడిపోకముందు పంచాయతీని పిలిచారు. కుంతిది బాగా ఉన్న కుటుంబమే గనక పంచాయితీ తీర్పు పెద్ద ఇబ్బందేం పెట్టలేదు. అయితే కుంతి పెళ్ళితో సహా సమస్యలు చర్చించి, చాలా రోజులు కుంతి వారి తీర్పును స్పష్టంగానే గుర్తుంచుకుంది, ఆమె పెళ్ళి బాలియా పెళ్ళి కన్నా ముందు జరగాలనీ ఖర్చులలో సగం ఇద్దరన్నలూ, మిగతా సగం మిగతా కుటుంబం భరించాలనీ చెప్పారు.

కుంతికి ఏదైనా సంబంధం వచ్చినప్పుడల్లా ఆమె మూగ, తెలివితక్కువ తల్లి హడావిడి పడి ముక్కోణాకారపు ఆ గ్రామానికి రెండు మూలా ఉన్న దేవతలకు మొక్కులు మొక్కేసుకునేది. ప్రతినెలా రెండు సార్లు పూజ ఏర్పాటు చేసి, దేవత పూనకం వచ్చిన మనిషిని కుంతి వివాహం గురించి అడిగేది. తల్లి ఒకళ్ళ తరువాత ఒకళ్ళను, ప్రతివాళ్ళనూ, చివరికి మర్త్యులైన మనుషుల లౌకిక వ్యవహారాలు పట్టని ఆలేఖ్ బాబాను కూడా అడిగేది. జనం ఆవిడ వెనకాల నవ్వుకునే వారు. లెక్కలేనంత మంది సోదిచెప్పేవాళ్ళు ఒక తారీఖు, ఒక చివరి గడువును ఫాల్గుణ మాసం పదోరోజు, లేదా అదే నెల ఇరవై ఏడున అనీ కాదంటే వైశాఖ మాసం అయిదో రోజున అనో, తాజాగా జ్యేష్ఠ మాసం పన్నెండున అనో చెప్పేవారు. పెళ్ళికొడుకు గురించి అన్ని వివరాలూ చెప్పేవారు. అతను ఉత్తరాది వాడనీ, నైరుతి నుండి వస్తాడనీ, దక్షిణం, లేదా ఈశాన్యం అనీ ధనవంతుడనీ కాదు అంత డబ్బున్న వాడు కాదనీ తెల్లగా ఉంటాడనీ, అంత తెలుపు కాదనీ, అంతపొడుగు కాదనీ, మామూలు ఆరోగ్యం అనీ, పెళ్ళి కొడుకు కుటుంబం గుడికి దగ్గరలో సున్నం వేసిన ఇల్లు ఉన్నవాళ్ళనీ, ఇంటి ముందు మధుమాలతీ తీగ ఉంటుందనీ ఆ ఇంటికి ఈశాన్యంలో ఒక చెరువు ఉంటుందనీ, లేదా పెళ్ళికొడుకు పెద్దన్నయ్య సముద్రాలకవతల ఆర్మీలో పనిచేస్తూ ఉండొచ్చనీ, ఇలా రంగు రంగుల పనికి రాని సమాచారం ఇచ్చేవారు. ఆమె వాళ్ళు చెప్పేది వినగానే కుంతి తల్లి రకరకాల రంగుల్లో ఆకారాల్లో ఆకాశం మూలమూలలా సౌధాలు నిర్మించుకుని, కనిపించని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయేది. ఎక్కడ ఎవరేం బట్టలు పెట్టినా కాబోయే పెళ్ళి కోసం దాచి ఉంచేది. ఆమె మరిది మాటిమాటికీ ఇంటి ముందు మట్టి తవ్వడం గురించి దిగులు పడేది, ఇంటి ముందు ఇలా గుంత చేస్తే పెళ్ళి పందిరి ఎలా వెయ్యాలని.

ఫాల్గుణ మాసం దొర్లిపోయేది, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం అనుసరించేవి. సూచించిన తేదీ ఆషాఢానికి, ఆ తరువాత శ్రావణానికి మారిపోయేది. పంచాంగంలో పెళ్ళి ముహూర్తాలన్నీ అయిపోయేవి. అప్పుడు జ్యోతిష్యుడు మళ్ళీ వసంతం మాసంలో కొత్త తేదీలను నిర్ణయించేవాడు.

కుంతి మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసే సమయానికి ఆమె పెద్దన్నయ్య కూతురుకు పెళ్ళీడు వచ్చింది. ఆమె పెద్దన్నయ మరో గ్రామంలో తాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ తాంత్రికుడి మేధా ప్రవచనాల వల్ల గ్రామ జ్యోతిష్యుడి జ్ఞాన వలయం విశాలమైంది. కొత్తగా బలపడిన గుప్త విజ్ఞానం నిరుపించుకుంటూ గ్రామ జ్యోతిష్యుడు, “నిజానికి పెళ్ళికి వ్యతిరేకంగా చాలానే అడ్డంకులు కనబడుతున్నాయి, సందేహం లేదు. కుజుడూ, గురువూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. అయినా సమస్య అసాధ్యమైనదేమీ కాదు. జాతకంలో చంద్రుడు, పెళ్ళి ఇల్లయిన ఏడో ఇంటిని సజావుగానే చూస్తున్నాడు. తంత్రంలో భాగంగా కోపంగా ఉన్న గ్రహాల శాంతికోసం చెయ్యవలసిన విధివిధానాలు శ్రద్ధగా, ఓపికగా నిర్వహిస్తే , శాంతపడిన గ్రహాలు ఉచ్చస్థితికి వస్తాయి. వాయువ్యమూల కు ఎదురుగా కూచుని కుంతి జపించేది, ఓం ఇమామ్ బేదసా..” అన్నాడు. అదేమిటో ఆమెకు అర్థం అయ్యేది కాదు. అందువల్ల అనుకూలంగా ఉన్న చంద్రుడు మరింత అనుగ్రహిస్తాడు. ఆమె ఈ మంత్రాలు పఠించేప్పుడు మెట్రిక్యులేషన్ పాసయింది. బృహస్పతి మహా గ్రహ మంత్రం వ్రాసిన పేపర్ ముక్క రాగి పెట్టిన తాయెత్తు నల్లతాడుతో ఎడమ చేతికి గురువారం నాడు కట్టుకుంది. ఆమె గ్రామానికి అరవై కిలో మీటర్ల దూరాన ఉన్న కొత్తగా మొదలుపెట్టిన అమ్మాయిల ఉన్నత పాఠశాలలో టీచర్‌గా అపాయింట్ అయింది. ఆమె వంశానికి కృతజ్ఞతలు చెప్పాలి, పూర్తిగా గంభీరంగా అక్కడ ఎప్పుడూ తను అనుసరించని, తనకు అర్ధం కాని పాఠాలను తన విద్యార్ధులకు చెప్పడానికి వెళ్ళింది. అక్కడ ఒంటరిగా, పెద్ద వానలో తాడు మీద ఆరేసిన జాకెట్లు దానికే అతుక్కు పోయినట్టు ఏకాకిగా ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చి, భద్రంగా రక్షణనిచ్చారు. కాని అది ఎలాటి ఆశ్రయం, ఎలాగో జీవితంలో అసంబద్ధమైన సంఘటనల నుండి రక్షించడానికే ఏర్పాటు చేసినది, అయితే అతి ముఖ్యమైన, బాధించే అవస్థలు నిస్సహాయంగా నగ్నంగా పడి ఉన్నాయి.

ఆమె గొప్ప బ్రహ్మాండమైన అందగత్తె కాదు, అలాగని కురూపి కూడా కాదు. కాని ఆరోజులో పెళ్ళిళ్ళు చూపులకోసం ఎక్కడ ఎదురుచూసేవి? కుంతి సోదరులు డబ్బున్న వాళ్ళూ కాదు, వారికి పెద్ద హృదయమూ లేదు. అయినా ఖర్చులు పంచుకుని ఉండేవారే. ఆమె పెళ్ళికి అన్నివిధాలా తగినదే, ఏవో కొన్ని పుకార్లు తప్పించి. అయినా ఏవో పుకార్లు లేని కన్నెపిల్లలు ఎక్కడున్నారనీ? అయినా మూడు ముళ్ళుపడే ఆ పవిత్ర ఘడియలు ఆమె మూసిన గుప్పిళ్ళ నుండి జారిపోతున్నాయి, ఎందుకో ఆమెకే తెలియదు. ఆమెకు ఉద్యోగం వచ్చాక తల్లిని తనతో ఉండేందుకు తెచ్చుకుంది, ఆమెను న్యాయంగా ఉండవలసిన ముగ్గురు సోదరులు, ఒక సోదరి చేతుల నుండి దూరం చేస్తూ. ఆ రోజుల్లో ఈ మొత్తం ప్రపంచపు ఏకాకితనం ఆమెను, ఆమె ఇంటి మొత్తాన్నీ, ముఖ ద్వారాన్నీ, పెరటి తలుపునూ స్కూలునూ, టీచర్స్ కామన్ రూమ్‌నూ కూడా మింగేసింది.

ఆమె తల్లి అంటూ ఉండేది, “ఎవరికోసమైనా చూస్తున్నావా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ పెళ్ళికి, కట్నానికి డబ్బు దాస్తున్నావా? అతను రెండో పెళ్ళివాడైనా సరే చూడు, వీలైతే చక్కగా ఉండు. శ్రద్ధ తీసుకో, అలా కృశించి పోకు. అస్థిపంజరంలా అవుతున్నావు. పండిపోయి పసుపురంగు తిరిగి, ఈనెలు తేలిన ఆకును ఎవరూ గమనించరు.”

ఆ దురదృష్టపు తల్లి ఎన్నేళ్ళుగానో ఎదురుచూసినట్టుగా కూతురి పెళ్ళి చూడలేకపోయింది. అది జరగదని ఆమె గ్రహించాక, ఇహ చూడవలసినదేమీ లేదని నిర్ణయించుకుని కళ్ళు మూసుకోవాలనుకుంది. తల్లి ఆలోచన గ్రహించిన కుంతి కోపంతో, “నీ కోసం నువ్వు ఎవరినైనా చూసుకున్నావా? ఎగ్గూ సిగ్గూ లేనిదానిలా నా కోసం నేనెందుకు చూసుకోవాలి?” అని అరిచింది.

కాని ఆమె ముక్తసరి జవాబు ఇచ్చింది, “ఇలా ఉండటం నాకు బాగుంది.”

ఆ తర్వాత దాదాపు చాలా కాలానికి కుంతి ఉద్యోగానికి రాజీనామా చేసి తన గ్రామానికి తిరిగి వెళ్తూ ‘అంకమారా సాగు నీటీ పధకానికి దారి’ అనే బోర్డ్ చూసింది. శని లాగ నవ్వే మిఠాయి అమ్మకందారును ఆమె గుర్తుంచుకోలేదు, గోవిందా గురించి అసలు ఆలోచించలేదు. ఊరించే అపవాదులను వేటినీ గుర్తుపెట్టుకోలేదు. ఒకానొక సమయంలో, గ్రామస్థులు చాలా మంది ఆమెను గుర్తుపట్టి ఆమె గురించి అడుగుతారనీ, ఆమెను కౌగిలించుకుంటారనీ అనుకుంది, ఆ వెంటనే ఒక సందేహం ఆమెలో పెరిగి ఊడలు వేసుకుంది – ఎవరూ తనను గుర్తుపట్టరేమో, ఎవరూ ఆ గ్రామంలో ఆమె మూలాలను సమ్మతించరేమో అనిపించి నిరాశపడిపోయింది. దేశ స్వాతంత్ర్యం గురించి ప్రశామ్తమైన, నిజం కాని, పనికిరాని వార్త ఎప్పుడు విందో ఆమెకు గుర్తులేదు, అదేదో తన దేశమే కాదన్నట్టు, అది మరో ఖండంలో పరాయి దేశం అయినట్టు, బహుశా మరో విశ్వం లోనిది అయినట్టు. కాని ఆలేఖ్ బాబా సాయంత్రాలు తన చిన్న డ్రమ్ ను గలగలలాడిస్తూ చేసే భజనలు నచ్చుతాయని అనుకుంది. అయినా ఆమె గోవిందాను గుర్తుపెట్టు కోలేదు, అక్కడికీ గోవిందా ఒకసారి ఆలేఖ్ బాబా వరండాలో ఎంత పేట్రేగి పోయాడో.

తమ గ్రామానికి కచ్చా రోడ్ మొదలయే జంక్షన్ లో సైన్ బోర్డ్ ఉన్న చోటకుంతి బస్ దిగింది. నల్లగా తారులా ఉన్న చెక్క కాబిన్‌లు ఒకటిరెండు ఉన్నాయక్కడ. వాటిల్లో, నల్లటి కాబిన్ లోపల అద్దాలతో మెరుస్తున్న మంగలి షాప్ ఒకటి.

సైన్ బోర్డ్ చదివి నవ్వుకుంది, ప్రతిదీ గవర్నమెంటే చేస్తుంది, అది తప్పు చేస్తుంది, గ్రామం అని ఉండాల్సిన చోట సాగునీటి పథకం అని వ్రాసింది. ఉతికిన చొక్కా మాసిన పంచెలో స్థానిక పూజారి ఆమె నవ్వు చూసి ముహం చిట్లించాడు. అవి కుంతి సమాజానికి, దేశానికి ఉపయోగించేవో లేనివో కాని లెఖ్కలేనన్ని ప్లాన్లలో, కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమై మునిగితేలుతున్న రోజులు. నిస్సందేహంగా ఆమెకూ ఉపకరించనివే. ఆ ప్లాన్లలో -ప్రభుత్వయంత్రాంగం వాళ్ళ వైపు ఎలాటి బాధ్యతా వహించకుండా మోసగిస్తూ చేసే చాలా తప్పులను దౌర్జన్యం నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్ ఎండగట్టడం, దొంగనిల్వలను అరికట్టడం, ప్రతి బదిలీకి, ప్రతి పే బిల్ కూ లంచాలు అడిగే అవినీతి స్కూల్ ఇన్‌స్పెక్టర్ లని, అలాటివి చేసి తప్పించుకు తిరిగే వాళ్ళను ఏరివెయ్యడం ఎన్నో ఉన్నాయి. తన గ్రామానికి తిరిగి వస్తూ ఆమె తన కోపపు పదునును ఏ మాత్రం ఫీలవలేదు.

కుంతి గ్రామానికి వెళ్ళడానికి ఒక సైకిల్ రిక్షా పిలిచింది. ఆ రిక్షా వాడు ఆమె చెప్పింది విననే లేదు, బహుశా ఎక్కువ కిరాయి డబ్బు కావాలేమో. నేనిక్కడిదాన్నేనని వాడికి తెలియదులా ఉంది అనుకుంది నిజమే వాస్తవానికి చాలా కాలం తరువాతే తిరిగివస్తున్నాను, అయితే అతను నన్ను మోసం చెయ్యాలా? నీ పేరేమిటి, మీ నాన్న పేరేమిటి, ఎక్కడ ఉంటారు అంటూ అతని వివరాలు అడిగింది కుంతి. ఆపైన తనను తాను అతనికి పరిచయం చేసుకుంటూ, తన తండ్రి పేరు చెప్తూ, ఆ గ్రామం పేరు చిన్న చిన్న వివరాలు ఎన్నో చెప్పినా వాడు ససేమిరా ఆమెను గుర్తించడానికి మొండికేసాడు. రిక్షా ఎక్కిన మరుక్షణం ఆమె హృదయం మొత్తం వెయ్యిరంగులతో, వెయ్యి ఆకారాలతో ఉన్న ప్రకృతి చిత్రంలా మారిపోయి, ప్రైమరీ పుస్తకంలోని పాఠాల్లా, శీతాకాలపు ఉదయం గ్రామంలో మంచు కురిసిన రోడ్, ఎండు గడ్డిమేటలు, ఉదయమే ఎడ్ల గిట్టల కింద కుప్పనూర్చిన వరికంకులు, ఉత్తేజితులై పిచ్చి కూతలు కూసే రకరకాల మనుషులు మురికిపట్టిన బ్లాంకెట్లలో ముడుచుకుని వరిపొలాలకు వెళ్ళేందుకు సిద్ధపడుతూ, వరిగింజలు కాస్త ఉడుకు చేసే పొయ్యి ముందు చలికాచుకుంటూ గుంపులు, సిగ్గుపడుతున్న జిత్తులమారి సూరీడి దాగుడుమూతలు, నాథూ మహాలిక్ ఇంటిపక్కన బురద బురదగా ఉన్న నడక దారి, అక్కడ బ్లాకీ, నానమ్మ అదుపు తప్పిన ఆవును అక్కడ కట్టేసేవారు. ఒకానొక పున్నమిరాత్రి వనదేవి ఎదురుగా చేసే హోమం పూర్ణ చంద్రుడిని అందుకుంటున్నట్టు పైకి ఎత్తుకు ఎగిసేది. నిప్పుల మీద నడుస్తున్నా కాళ్ళకు కొంచం వెచ్చదనమే తెలిసేది. అచేతన స్థితిలో ఉన్న మనిషి మట్టి గుర్రాలని తింటూఉంటాడు, అతని కాళ్ళు ఫైలేరియాతో వాచిపోయినా.

ఉన్నట్టుండి రిక్షా ఆగిపోయింది. ఎదురుగా ఒక ఎత్తైన కట్ట డామ్‌కి ఆ వైపున నదిపైనుండి కొండ భుజం వరకూ పరచుకున్న నీరు, మిగతా నది మసకగా, అస్పష్టంగా కనిపిస్తూ. కుంతి వాళ్ళ ఊరు, తన గొప్ప పుర్వ సంస్కృతిని, లెక్కకు రానన్ని వీరగాథలనూ, ఇతిహాసాలనూ వెంత తీసుకుని కరిగి, అదృశ్యమై, మాయమైపోయింది. అప్పటినుండి, ఆమెకు గుర్తున్నది, ఎప్పుడూ ఎరుకలో ఉండేది, అంకమారా అనేది లేదని, అది మునిగిపోయిందని ఆమె ఆ సంగతే మరచిపోయింది. పిల్ల తెమ్మెర ఒకటి వచ్చి సన్నని నడుమున్న అలలు నీటి మీద ఈదులాడాయి. ఒకప్పుడు పచ్చదనం మేట వేసిన కొండ బట్టతలగా మారి ఖాళీగాఉండే శిఖరాలు తప్ప గ్రామం ఆనవాలు కూడా చూసేందుకు మిగల్లేదు. ఆమె ఎలాగ ఈ ఖాళీ శిఖరాలు అంకమారావి అనుకుందో ఆమెకే తెలీదు, వివరించనూ లేదు.

చాలా కాలం క్రితం కుంతికి నానమ్మ చెప్పిన రాకుమారుడు, దేవకన్య జానపద కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో దేవకన్య, ఒక శాపంతో బాధపడుతూ ఒంటరిగా తేటతెల్లంగా క్రిస్టల్‌లా ఉన్న నీటిపైన శంఖాలతో, పాలరాతితో కట్టిన మంచెమీద ఏడుస్తూ కూచుని ఉంటుంది. కథ చివరన, ఆ దేవకన్య రాకుమారుడి సాహసం వల్ల శాపవిముక్తురాలై దేవలోకానికి తిరిగి వెళ్ళింది. ఆమె తన స్వర్గలోకానికి వెళ్ళి మాయం అయిపోతూ ఆ రాకుమారుడికి మాట ఇచ్చింది, “మనం వచ్చే జన్మలో తప్పకుండా కలుసుకుంటాం” అని (ఇహ మిగిలినదంతా మరో కథ). కాని ఈ విషాదాంతపు కథ ఎవరికీ నచ్చలేదు. అందుకని నానమ్మ ఆ రాకుమారుడికీ, దేవకన్యకూ పెళ్ళి చెయ్యవలసి వచ్చింది. కుంతికి తెలుసు, తనే గనక కావాలనుకుంటే తనో మత్స్యకన్యగా మారవచ్చునని, గతం వెనక్కు తెచ్చుకుని నీటి గర్భాన దాగి ఉన్న రేగు పొదలను పగడాల సామ్రాజ్యం, ముత్యాల అడవులను రక్షించగలదనీ. ఇంకా స్వప్నాల నధిరోహించి నీటి అడవిలో సంచరిస్తున్న జానపద గాథలోని రాకుమారుడిని చేరి ఉండేది. చిన్నపిల్లగా నీలి ప్లాస్టిక్ పేపర్‌తో కప్పిన కళ్ళద్దాల నుండి ఆమె ఈ ప్రపంచాన్ని చూసేది. ఆమె చిన్నతమ్ముడు గొబారా నగ్న శరీరం నగ్నంగా ఉండే కుందేలు లానే అనిపించేది. ఆమె స్కూల్ దగ్గరలోని ప్లమ్ చెట్టు, గ్రామ పౌరాణిక నాటకాలలో యుద్ద దృశ్యాలు, వీరత్వం నిండిన సంగీతం, చివరిలో విలన్ పాత్ర మొదలైనవి. తండ్రి చేతిలో కలకత్తానుండి తిరిగి వస్తూ తెచ్చిన పూలపూల గౌను, రంగురంగుల పూసల స్కార్ఫ్, పెద్దన్నయ్యకు ఒక జత పైజమాలు. వగైరాలు.

ఆలేఖ్ బాబా కుటీరం నిమ్మపళ్ళ సువాసనలు, మందార మెరుపు రంగులు వ్యాపించి ఉండేది. ఆమె కుదిరితే, ఆమె వల్ల అయితే కాలం చేతులనుండి మిలమిలలాడే మంచు ఉదయాలను, ఉదయపు ముత్యాల చుక్కలను దోచేసుకునేది. యౌవనారంభపు వసంతకాలపు రంగునూ సిగ్గూ -లజ్జా కలగలిసిన క్షణాలనూ, అన్ని వాస్తవాలనూ తుంచుకుని, పూర్తిగా తీసుకెళ్ళిపోయిన దక్షీణపు గాలినీ, ఏదో పోగొట్టుకున్నట్టున్నా ఏమిటో తెలియనితనాన్నీ, అంతవరకూ గుర్తించలేని ఏకాకితనం గడ్డకట్టి నిన్ను దిక్కులేనిదాన్ని చేస్తుంది. ఏదో పోగొట్టుకున్నానని అనుకుంటూనే ఉంటావు గాని అదేమిటో ఎప్పటికీ తెలియదు. పక్కఊళ్ళో అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఆమె పల్లకీ మీ ఊరినుండి వెళ్ళేప్పుడు ఊరేగింపు సాగిపోతుంటే, నీలోకి దూరి తినేసే శున్యంలా.

కుంతి దేన్నీ పోగేసుకోవాలనుకోలేదు. ఆమె మొద్దుబారిపోయింది, ఇంతకు ముందు ఆమెను వేధించి ముక్కలు ముక్కలు చేసిన ఎన్నో విషయాలు ఇహ ఏ ప్రభావమూ చూపించటం లేదు అది తెలుసుకుని ఆమె షాక్ అయింది. ‘ఇహ ఏం మిగిలింది గనక? అన్ని బంధాలూ తెగిపోయాక’ తనలో తనే అనుకుంది. కాని దేనికి జవాబు ఏ భాషలో, ఏ తెలివితేటలతో ఇవ్వగలదో ఆమెకే తెలియలేదు.

ఆమె ఆ కట్టనెక్కింది. కిందకు దిగుతుంటే, ఆమెకు తెలుసు తను కావాలనుకుంటే తను ఎగిరిపోయి దేవకన్య కాగలదనీ,కాని ఆమె ఎగరనూ లేదు, దేవకన్య కానూ లేదు. ఆమె ఆగి, నెమ్మదిగా అడుగులు లెక్కెడుతూ నేల మీద పాదాలు గట్టిగా ఆనించి స్లోప్ దిగివచ్చి, సురక్షితంగా రిక్షా ఎక్కింది.

రిక్షా వాడు నీళ్ళలోంచి పైకి వచ్చి కనిపిస్తున్న ఆలయ శిఖరం చూపిస్తూ ఆలేఖ్ బాబా ప్రతిరోజూ ఆ నీళ్ళ మీద నడిచి డామ్‌కి అవతలివైపు ఎలా వచ్చేవాడో చెప్తున్నాడు. బహుశా బాబా తాటాకుల ఇల్లు ఆలయంగా మార్చి ఉంటారు. ప్రతి రాత్రీ, భజన చెయ్యడం, డ్రమ్ గలగల ధ్వనులు -వాటి మధ్య ఒక ముసలాయన ఏడుస్తున్న శబ్దం.

కొన్నాళ్ళయాక కుంతి ఆ ఊరు వదిలేసి సెటిల్మెంట్‌లో ఉండేందుకు వచ్చింది.

(సశేషం)

Exit mobile version