Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరిచిత సూర్యాస్తమయం లోకి-4

[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]

[కుంతికి కోరాపుట్‌కి బదిలీ అవుతుంది. అలా బదిలీ అయినందుకు కుంతి ఎందుకు అంతలా అతలాకుతలం అయిపోతోందని ఎవరో అన్నమాటను కుంతి కోలీగ్ సుజాత ఆమె చెవిలో వేస్తుంది. స్కూల్లు కుట్టు టీచర్ కుంతి గురించి రకరకాల పుకార్లు రేపుతుంది. తన బదిలీ ఆర్డరును రద్దు చేయించుకోడానికి స్కూల్ మానేజ్‌మెంట్ కమిటీ ప్రెసిడెంట్‌ను, ఆ తరువాత ఓ ఎం.ఎల్.ఎ. ను కూడా కలుస్తుంది. కుంతి డబ్బు ఇచ్చినా, పని అవదు. చివరకు కోరాపుట్ వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుని, అక్కడి వాతావరణం గురించి తెలుసుకుంటుంది. తన చిన్ననాటి మిత్రుడు గోవింద్ మంత్రి అయ్యాడని తెలుసుకుంటుంది. తమ బాల్యాన్ని, అతనితో స్నేహాన్ని గుర్తుచేసుకుంటుంది. ఓ రోజు ఊరు నుంచి పారిపోయిన గోవింద్, కుంతికి 13 ఏళ్ళు నిండిన నెలలో సొంతూరుకి తిరిగొస్తాడు. కౌలుదార్ల ఉద్యమంలో పాలుపంచుకుంటాడు. జనాలు గోవిందని కొట్టబోతే, కుంతి తల్లి కాపాడి తన ధాన్యం కొట్టులో బస ఏర్పాటు చేస్తుంది. ఆ రాత్రి గోవిందని చూడ్డానికి ధాన్యం కొట్టుకు వెళ్తుంది. అతనితో కలిసి పారిపోదామనుకుంటుంది. అతను వెళ్ళిపోతాడు. విచిత్రమైన కలలు రావడంతో, కుంతి మిగిలిపోతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-2 – రెండవ భాగం

కుంతి మేలుకునేసరికి ఇంకా తెల్లవారలేదు. ఆకాశం ఒక విద్యుత్ నీలాన్ని సంతరించుకుంది. ఆమె సుందరి ఇంటికి పరుగెత్తింది. సుందరి ఎక్కిళ్ళు పెడుతోంది. గోవిందాను ఆ ముందు రాత్రి పోలీసులు అరెస్ట్ చేసారు. పాపం కుంతికి ఈ విషయమె తెలియదు. ఆమె జీవితంలో చివరిరోజువరకూ ఆమెకు తెలియదు కూడా, క్రితం రాత్రి గోవిందా నిర్లక్ష్యం అవమానం భరించి ఇంటికి వచ్చాకా సుందరి అతనితో పడుకుందని. ఆమెకు ఇది కూదా తెలీదు, దామి తండ్రి (దామి, ఆమె స్కూల్ రోజుల్లో ప్రియమైన మిత్రురాలు, ఒకరాత్రి దామి వాళ్ళ కుటుంబం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పడుకున్నారు. బట్టలు లేకుండా, చీకట్లో ఎక్కడ గుచ్చుకుంటాయోనని భయపడి ప్లాస్టిక్ హెయిర్ పిన్‌లు కూడా తీసేసి మరీ. అప్పటినుండీ వాళ్ళు అబ్బాయిలనూ, మగవారిని చివరికి తండ్రులను కూడా ద్వేషిస్తున్నారు), గవర్నమెంట్‌లో లాండ్ రెవిన్యూ డిపార్ట్మెంట్‌లో తాసిల్దారు, ఒక స్కూల్‌కి ముఖ్య అతిథిగా వెళ్ళి రాత్రి తిరిగ్గి వస్తుంటే దెబ్బలకు బలైపోయాడు. ఎవరు అతన్ని ఎందుకు హత్య చేశారో ఎవరూ పట్టించుకోలేదు. కుంతికి ఎప్పటికీ తెలియనిది గోవిందానే ఆ దాడి చేసినదని.

కుంతి అప్పుడు కుప్పకూలిపోలేదు. ప్రతి రోజూ, రాని ఉత్తరాల కోసం ఎదురు చూసేది. నాథూ ఆమెను ఓదార్చాడు, నిజానికి గోవిందా ఆమెను కలవాలనే వచ్చాడనీ లేకపోతే అంకమారా ఎంత చిన్నది, అక్కడ కౌలుదార్ల ఉద్యమం ఏమిటీ? దాని కోసం పేరున్న లీడర్ పరుగెత్తుకుంటూ వస్తాడా? అని. కాని ఆమెకే తెలీదు లోలోపల ఏమేం ముక్కలయాయో – ఆ రోజుల్లో ఆమె చీరమీద ఉన్న పూలకు మహువా పూల సుగంధాలు అబ్బేవి, ఆమె నుంది ఒక ఓరచూపు ఝుంకారం చేసే తుమ్మెదను కూడా శాంతపరచేది. కుంతి వంటి రంగు పాలూ పసుపూ కలిపినట్టుండేది అప్పట్లో. ఆమె శరీరం సన్నగా మంచి షేప్‌లో ఉండేది. కాని గోవిందా వదిలి వెళ్ళిపోయాక ఆమె పెరగడం మానేసింది. అతని పరోక్షంలో ఆమె మరుగుజ్జులా మిగిలిపోయింది. అతను వదిలి వెళ్ళినప్పుడు దుఃఖమనే ప్రవాహం ఆమెను చుట్టుముట్టింది. బెడ్ మీద, బయట వసారాలో, వంట గదిలో, గ్రామ చెరువు దగ్గర, ఇంటి నీటి కుంటలో, తేలుతున్న నీటి కలుపు మొక్కలు, చెట్టు మీద లేత కొబ్బరికాయలు చంకన నీటి బిందెలతో ఉన్న గ్రామీణ యువతులు, పచ్చిక బయళ్ళూ, ప్రతి రాత్రీ ఏదో చెత్త పాట వల్లించే మార్కండ మూడీ తండ్రి గార్దభ స్వరం, జమీందార్ కోపంలో, అరుదుగా కనబడని పిల్లిలో, ఎవరికీ తెలియని అనామకుడు చెరువు మట్టి మెట్లమీద కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోడంలో విచారం పురాతనమైనది, కృష్ణుడి వేణువు రాధ కోసం తపించినట్టూ, లేదా తాపాయ్ వెక్కిళ్ళు చాలా కాలం క్రితం సముద్రం మీదకు పోయిన ఆమె సోదరుల కోసం మథన పడినట్టూ, ఆ దుఃఖం ఎంత సుదూరం అంటే అది ఒక చిన్న కన్నీటి చుక్క కూడా ఆమెకు రానివ్వలేదు.

గోవిందా వెళ్ళిపోయాడు. అతనొక దళారి, పంచాయత్ సమితి అధ్యక్షుడు, లేదా ఒకటి రెండు విడతలు సర్పంచ్, ఒకటి రెండు కమిటీలలో మెంబర్, ఆడవాళ్ళ పట్ల దౌర్జన్యం చేసిన కేసులలో ఒకటి రెండింటికి వృత్తిపరంగా సాక్షి, అందుకే అతను లీడర్, కొన్నేళ్ళ తరువాత గ్రామం వదిలేసాడు, బహుశా ఎప్పటికీ. కుంతి మళ్ళీ అతన్ని చాలా రోజులు చూడలేదు. అతని వెనకాల ఏవో రూమర్లు మాత్రం చక్కర్లు కొట్తాయి, ఏదో ఒక సమాచారం అతని గురించి చెప్పాలన్నట్టు. ఒక పబ్లిక్ మీటింగ్‌లో పడిపోయాడనీ, అతను అదృశ్యమైపోయాడనీ, పట్టపగలు ఒక భూస్వామి పైనో, లేదా పిసినారి వ్యాపారి పైనో దాడి చేసి పారిపోయాడనీ, అతను ఆ లొకాలిటీలో సింహస్వప్నమనీ, కటక్‌లో అతని పెద్ద భవనం వేశ్యలకు అద్దెకిచ్చాడనీ, గోవిందా కొందరు స్కూల్ దొరసానులను ఉంపుడుగత్తెలుగా ఉంచుకున్నాడు. అతని భార్య ఆరుగురు పిల్లలకు జన్మ నిచ్చి సర్వైకల్ కాన్సర్‌తో బాధపడుతోందనీ, గోవిందాకే బ్లడ్ ప్రెషర్, హృదయ సమస్యలు, లేదా రెండూ ఉన్నాయని. లేదూ అతను తండ్రిని ఇంట్లోంచి బయటకు గెంటేసాడనీ, పదిహేడేళ్ళ క్రితం మూడేళ్ళ వయసులో చనిపోయిన అతని కూతురి పేరిట భువనేశ్వర్‌లో ఒక హోటల్ పెట్టాడనీ, ఇలా ఎన్నో.

కౌలుకు సంబంధించిన కోర్ట్ కేసులు చాలా రోజులు సాగుతాయి. లాయర్లు, తాసీల్దారులు టన్నులకొద్దీ డబ్బు చేసుకుంటారు. భూస్వాములు, కౌలుదార్లు తెలివితెచ్చుకుంటారు.

ఆలస్యంగా తెచ్చుకున్న తెలివి అటు భూస్వాములను గానీ ఇటు కౌలుదార్లను గానీ రక్షించలేకపోతుంది. ఉద్యమం భంగపడిపోతుంది. త్వరలోనే భూమి అంతా నీళ్ళకింద మాయం అయిపోతుంది.

కుంతికిప్పుడు అయోమయంగా ఉంది. గోవిందా తననెందుకు చూసుకోడం లేదు? రాజులు, మంత్రులు, గొప్పవాళ్ళూ జరిగేవన్నీ తెలుసుకుంటారుగా? ఇప్పుడు గొప్పవాడు గోవిందా ఆ పని చెయ్యలేడా? ఆమె బదిలీ గురించి తెలుసుకోలేదా? పరుగెత్తుకు వచ్చి ఆమెను స్వాగతించలేడా? టార్జాన్ కింగ్ తన ఏనుగు మీదనుండి దిగి తన అమ్మాయిని రక్షించి ఉద్ధరించినట్టు. లేదా తన సింహాసనపు అహంభావంతో ఆమెను గుర్తించేందుకు కూడా నిరాకరిస్తాడా? ఆ ప్రశ్న ఆమె ఇప్పుడతన్ని అడగవచ్చు – ఇన్ని రోజులూ ఎందుకు రాలేదని, అన్ని రోజుల తరువాత తిరిగి వచ్చినా ఎందుకంత లెక్కలేనట్టు,ఏ స్పందనా లేకుండా , ఆమెను వదిలేసి, అవసరం లేనట్టూ, ఒక ఆగంతకురాలిని అనుకునేలా చేస్తున్నావని.

గోవిందాను కలవాలని ఆమె నిర్ణయించుకుంది. అప్పుడు బదిలీ అనే చిన్న సమస్య ఆమెను బాధించడం మానేసింది. ఆమె స్వర్గంలో ఉన్నట్టు భ్రమపడుతూ అతన్ని ఈ అర్థం లేని ప్రశ్న అడగగలనని అనుకుంది. సాయంత్రానికి తిరిగిరావచ్చనే ఊహతో భువనేశ్వర్‌కి ఎక్స్‌ప్రెస్ బస్ ఎక్కింది. తబలా వాయిస్తున్నట్టుగా లయబద్ధంగా హార్న్ మోగిస్తూ, బస్ డ్రైవర్ వీలైనంత రాష్‌గా నడిపించాడు. మాటిమాటికీ వెనక్కు తిరిగి ప్రయాణీకులను చూస్తూ వాళ్ళతో నవ్వించే జోకులు వేస్తూ దారిపక్కన కాలవలో స్నానం చేస్తున్న స్త్రీని తేరపార చూస్తూ, సిగరెట్ వెలిగించడానికి స్టీరింగ్ వీల్ మీద రెండు చేతులూ వదిలేసి, అతని సీట్ పైనున్న ‘పొగ తాగరాదు’ బోర్డ్‌ను బుల్స్ ఐ లా దానికి తగిలేలా పొగ ఊదాడు. కుంతిలో స్కూల్ టీచర్. ఆ డ్రైవర్ని ఈ క్రమశిక్షణారాహిత్యానికి మందలించాలని అనుకుంది కాని అదే స్కూల్ టీచర్ మైండ్ తనేమీ చెయ్యలేనని మరుక్షణమే గుర్తించాక నిద్రలోకి జారుకుంది.

భువనేశ్వర్ ప్రవేశించే ముందు రోడ్డు మధ్యన పశువుల మంద విశ్రమించి ఉండటంతో మధ్యలో బస్ ఆగింది, కొంతమంది పాసెంజర్లు బస్ దిగి వాటిని తమ చేతులతో పక్కకు తోసారు. కుంతి నిద్రలేల్కొని చూస్తే ఆ పశువుల మంద మధ్య రెండు కుక్కలు కూడా సుకరంగా పడుకుని ఉన్నాయి.

తన ఎడం వైపున్న స్త్రీతో అంది, “చూడు అటు చూడు. తెలివిగా ఆ కుక్కలు ఎంత చాకచక్యంగా వాటి మధ్యన దాక్కున్నాయో.”

ఆ స్త్రీ కుంతిని ఒక ఉదాసీనమైన చూపుతో నోరు మూయించి కాళ్ళ కింద తన సూట్‌కేస్ భద్రంగా ఉన్నట్టు నిర్దారించుకుంది.

చివరికి బస్ భువనేశ్వర్ చేరింది, వింతగా దారిలో ఎలాటి ప్రమాదాలు చెయ్యకుండా. కుంతి బస్ దిగగానే ఒక అంబాసిడర్ కారును దాటుకు వెళ్ళిందో మేక, ఆ కార్ మరో కారును దాటబోతూ ఒక స్కూటర్‌ను గుద్దబోయింది. చాలా విచిత్రంగా ఈ గుద్దుకోటాలనుండి తప్పించుకుని, ఆ మేక గాయపడకుండా, ఏమీ పట్టనట్టు రోడ్డు కావలున్న గడ్డి మేస్తోంది. కొంతమంది ఇంతకు ముందు బస్ దిగి రోడ్డు మీద విశ్రమించిన పశువులను తరిమేసిన వాళ్ళు చర్చ మొదలుపెట్టారు. ఆ మేకకు కారుకు రోడ్డు మీద విశ్రమించిన పశువుల్లా ఏ మాత్రం అపరాధభావన ఉన్నా కాని ఆమేక ఏ మాత్రం ప్రభావితం కాలేదు. కాని కుంతి మాత్రం ప్రభావితమైంది, ఆశ్చర్యపోయింది. యోగిలా ప్రవర్తిస్తూ ప్రశాంతంగా ఉన్న మేక తన గ్రామంలో కూడా, మేకను వదిలెయ్యి చివరికి ఆ చిన్న మేకల మంద అమ్మాయి కూడా ఎంత చిన్నగా నిస్సహాయంగా నడుంకి చుట్టుకున్న రెండు అడుగుల పొడవు గుడ్దతో మేకపిల్లలానే అనిపించేది.

వాళ్ళ చెమట వాసన ఆమెకు ఎప్పుడో మరచిపోయిన గ్రామం జ్ఞాపకాలను వెనక్కు తెచ్చింది. ఈ వాసన ఇక్కడేం చేస్తోంది? అది ఇక్కడికి సంబంధించినది కాదే?

“నేను గౌరవనీయులైన మంత్రిగారిని కలవడానికి వచ్చాను. అతను నా బాల్య మిత్రుడు” తన మీసం కొసలను నములుతున్న అతనితో చెప్పింది కుంతి.

“నేను అతని పీఏ. ఇక్కడ కూచోండి” మీసాలు నమిలే వాడు చెప్పాడు.

“లేదు, లేదు. అతను పీఏ కాదు, పాడు కాదు. అతనో దలారి” నున్నగా షేవ్ చేసుకున్న మరొకతను అన్నాడు.

“అదిగో ఆ గదిలోకి వెళ్ళి కూచోండి, మినిస్టర్ సాబ్ ఇంట్లో ఉన్నారు.”

స్టీల్ రేకులా గంజి పెట్టిన పోలీస్ యూనిఫాంలో ఒకడు తలుపు దగ్గర నిల్చున్నాడు.

అతను తన అధికారం, దర్పం ప్రదర్శించాలని చూస్తున్నాడు. కాని కుదరక నిర్ణయించుకున్నాడు, “నేనిప్పుడు ఏమీ పట్టనట్టుగానే ఉండాలి, ఇవ్వాళ నీకు సలాం కొట్టినా ఏమో రేపు నిన్ను అరెస్ట్ చేస్తానేమో,”

గోవిందా ఒక డబుల్ సోఫా నిండా ఉన్నాడు. సౌఖ్యం అతని శరీరం నుండి విపరీతంగా ఉబికి వస్తోంది చెమటలా. అతనికి ఇరువైపులా ఇద్దరు మనుషులు – తామెంత తెలివైనవారో నిరూపించుకుందుకు అన్నట్టు. ఒకడు మాటి మాటికీ టెలిఫోన్ అందిస్తున్నాడు, రెండో వాడు నిరంతరం సంక్షిప్తంగా చెప్తున్నాడు. టీ ట్రాలీ మీద ఒక మందపాటి నోట్ బుక్ పడి ఉంది, హార్డ్ బౌండ్ నోట్ బుక్ క్లాస్‌కి తేనందుకు తన క్లాస్ నుండి బయటకు విసిరేసిన సంగతి కుంతికి గుర్తుకు వచ్చింది, పాపం తిక్కరేగిన ఆమె తండ్రి ఆ పిల్లను స్కూల్ లోంచే తీసేసాడు.

ఇంట్లోనే ఉన్న గోవిందా ఆఫీస్ జనాలతో కిక్కిరిసిపోయింది. వాళ్ళు గోడలకు అతుక్కుపోయి, మొహాలు కూడా తిప్పలేనంతగా ఒకరినొకరు తాకుతూ కూర్చున్నారు. ఎక్కడ చూసినా మొహాలే. ఒకప్పటి లాన్‌లో, కారిడార్‌లో, వంట గదిలో టాయిలెట్ చివరికి పూజ గదిలో కూడా ప్రతిచోటా వెచ్చగా ఉక్కపెట్టే వారి చెమట వాసన, వాళ్ళ సొల్లు కబుర్ల లొడలొడ, వాళ్ళు ఉమ్మటం, వారి బీడీల వాసన పుకార్లు, తిట్టుకోడాలు, ఎవరిని వారు పొగుడుకోడం.

గోవిందా మొహం ఇప్పుడు బాగా పండిన గుమ్మడికాయలా కనిపిస్తున్నా, అతనికి బట్టతల వచ్చినా వింతగా కనిపించే అద్దాలు పెట్టుకున్నా, విపరీతమైన పొట్ట అతని ఒళ్ళో పడుతున్నా కుంతి అతని దగ్గరకు పరుగున వెళ్దామనుకుంది. ఎందుకు అతను తనకు చెందినవాడని అనిపిస్తుంది? అతని వికృతమైన మొహం ఎందుకంత తెలిసినదిగా అనిపిస్తోంది?

ఇంతాకాలం గడిచాక కూడా, ఈ క్రూరత్వం, మోసం, నిర్లక్ష్యం, ఘర్షణ, విడిపోడం, పట్టించుకోకున్నా, స్వార్థం కనిపిస్తున్నా ఎందుకంత ఆత్మీయ భావన? ఏముందా మనిషి మొహంలో?

గోవింద ఒక సమర్థుడైన రాజకీయవేత్తలా ప్రతి సందర్శకుడినీ పలకరిస్తూ ఆమె లోనికి రాడమే గుర్తించలేదు. ఆమె ఉత్సుకతను కూడా చాలా సమయం గడిచాక, కుంతి ఎన్నడూ జరగని ఊహలు, ఘటనలు జరిగినా జరగకపోయినా అవన్నీ ప్రతి అర్థంలో తమను తాము ఒంపేసుకున్నాక మైమరచిపోయి ఉన్నప్పుడు ఆమె వంతు వచ్చింది. మిగతా వారికి ఇచ్చినట్టే ఆ గౌరవనీయ మంత్రి వర్యుడు ఆమెకూ ఒక చిరునవ్వు ఇచ్చుకున్నాడు. కుంతి తన పేరు, తన గ్రామం పేరు చెప్పింది.

చిరునవ్వును మరి కాస్త విస్తరించు తన అనుచరులతో “ఆ గ్రామంలోనే నేను కౌలుదార్ల హక్కుల విప్లవం మొదలుపెట్టాను” అంటూ కుంతిని కూర్చోమన్నాడు. కాని అతనామెను గుండెకు హత్తుకోలేదు, ముద్దూ పెట్టుకోలేదు, లేదూ నా దేవతా రాజ్ఞీ అని సంబోదించలేదు.

వారి పునః సమాగమనానికి స్వర్గం నుండి పూల వర్షం కురవలేదు. లేదూ వన పక్షులు ఆ ఉత్సవానికి పాటలూ పాడలేదు.

కుంతికి దక్కిన విపరీతమైన వేదన, తీవ్రమైన నిస్సహాయతతో లోలోపల దుఃఖపడింది.

“నాయనా, అమ్మా నేనేం చేసాననీ చివరికి నాకీ అవమానం?”

ఆమె గుర్తుచేసుకుందుకు తండ్రి మొహం కూడా గుర్తు లేదు. గోవింద నవ్వుతున్న బుద్దుడిలా నవ్వాడు, అతని పళ్ళను పట్టి ఉంచిన వెండి తీగ కనిపించేలా. తన మోహ దృష్టితో కుంతి స్వచ్చమైన స్పటికంలాటి కుచద్వయాన్ని ఓరచూపులతో తడిమాడు.

ఎన్నో దృశ్యాలు ఆమె కళ్ళముందు తారట్లాడాయి.

వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే, అడవిలో హరివిల్లు రంగుల గులకరాళ్ళు ఏరుకుంటున్నారు. ఆ గులక రాళ్ళ బరువుకు ఆమె చీర చిరిగింది కూడా. దానికి వాళ్ళమ్మ చావబాదింది.

పిల్ల కాలువ పక్కన ఇద్దరూ తూనీగలను వేటాడుతున్నారు. గోవింద చెప్పిన పాఠాలు నేర్చుకోలేదని టీచర్ బెత్తం పట్టుకుని కొట్టినప్పుడల్లా అతని ఎర్రని పెదవులు రెపరెపలాడటం, పవిత్రమైన అతని పెదవులు అన్ని పాపాలనూ వదిలి గాలి వాటిని ముద్దాడినట్టు వణికాయి. టీచర్ మీద కోపంతో గోవిందా వైపు జాలిగా ప్రేమగా చూసినప్పుడు, ఆమెను ఓదార్చడానికన్నట్టూ బాధను ఎలా భరించేవాడో ఎలా నవ్వేవాడో. ఎలాటి హృదయం అతనిది, మంచుముక్కలా ఎంత పారదర్శకంగా ఉండే హృదయం. ఎంత ఉల్లాసంగా కరిగిపోయేది.

కుంతి బదిలీ సమస్యను సానుభూతితో తలఊపుతూ గోవింద విన్నప్పుడు అతని కళ్ళద్దాల నుండి ప్రతిబింబం ఒకప్పటి అందమైన కార్పెట్ దాటి గోడమీద కు ఈదుతూ వెళ్ళింది జంట ఈగల్లా. ఇతర జనాల అసహనం, వారి అసహనం కుంతిని బయటకు నెట్టింది. గోవింద ఉదాసీనత నామమాత్రపు ఏకైక న్యాయకర్తలా ఆమెను నిరాశపరిచింది.

కుంతి వెళ్ళడానికి లేవగానే గోవింద అడిగాడు, “ఎలా వచ్చావు? ఏదైనా తిన్నావా లేదా?”

ఆమెకు తెలుసు ఆ రెండూ నోటి చివరి మాటలని. ప్రతివారినీ ఆ రెండు మాటలూ అడిగే ఉంటాడు. అయినా ఆమె పుర్తిగా కదిలిపోయింది. ఆ గదిలోంచి బయటకు వస్తుంటే ఒక వింతైన నిష్కపటంతో ఆమె పూర్తిగా భావోత్కృష్టతకు లొంగిపోయింది. ఆమె కాళ్ళు మరిహ నేలమీద ఆనలేదు. బాల్యం లోని ఒక సంఘటన గుర్తుచేసుకుంది. గ్రామం దగ్గరలో అడవిలో ఓ కొండ ఎక్కుతుంటే ఆమె కాలిలో ఓ ముల్లు గుచ్చుకుంది, గోవింద మరో ముల్లుతో దాన్ని తీసినప్పుడు ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది. కాని ఇప్పుడా దృశ్యం ఆమె జ్ఞాపకాల్లో అతిశయించి గోవిందా ఆమె పాదాన్ని ముద్దుపెట్టుకున్నట్టుగా అనుకుంది. బయట ఉన్న చాలా మంది గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. చాలా మంది వారి వారి బదిలీలో లేకపోతే మరొకరి బదిలీ కోసమో లేద బదిలీ రద్దు కోసమో వచ్చిన వాళ్ళే. గోవింద బస్ స్టాప్ వరకు తన కారులో కుంతికి లిఫ్ట్ ఇద్దామనుకున్నాడు కాని డ్రైవర్ ఎవరినో దింపిరాడానికి వెళ్ళాడు. బయట మురికి బట్టల్లో ఉన్న ఒక స్వీపర్ మందమైన అతని కళ్ళద్దాల నుండి తెల్లని మచ్చలేని సఫారి సూట్‌లో ఉన్న రోడ్ రోలర్ లాటి మనిషితో “హే, మీ షర్ట్ వెనకాల నల్లటి మరకలున్నాయి.” అన్నాడు.

తిరిగి వస్తూ, ఆమె ఇల్లు చేరుకుంటుండంగా ఆమెలో అవమానం చిలికి చిలికి భగ్గుమంది. బస్ మర్రిచెట్టు దగ్గర ఆగింది. అక్కడో ఉడుత ఆశగా ఎదురుచూస్తోంది, ఏదైనా పాలపిట్టో, కాకో లేదా మరో పక్షి తినగా మిగిలిన పండో విత్తనమో జారవిడవకపోతుందా అని.

“మూర్ఖుడా, రామాయణంలో సముద్రం మీద లంకకు వంతెన కట్టిన నీ పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళో నీకు గుర్తులేదా? మరి నువ్వో ఇక్కడ, సగం తిన్న పండు కోసం పడిగాపులు పడ్డావు. నీ సిగ్గూ శరం ఏమయ్యాయి?” కుంతి మౌనంగానే దాన్ని తిట్టింది.

కుంతి వెళ్ళిన రెండు రోజుల తరువాత అతని కిడ్నీ వల్లనో లేదా బ్లాడర్ వల్లనో సమస్య వచ్చి సరిగ్గా మూత్ర విసర్జన చెయ్యలేక బాత్ రూమ్ చుట్టూ తిరుగుతున్నాడు. (ఇద్దరు స్పెషలిస్ట్‌లు అతన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏ కారణం అనే దానికి, విధానాలకు, లక్షణాలకు, వారిద్దరూ ఏకాభిప్రాయానికి రాలేక అదేమిటో ఇంకా నిర్ధారించ వల్సి ఉంది. రోగ నిర్ణయం సగం దారిలోనే ఉంది)

ఒక కాంటాక్ట్ లో తన కమీషన్ వాటా పెంచుకుని పార్టీ వాటా కట్ చెయ్యడానికి అంతకు ముందే సఫారీ సూట్ వాడితో గోవింద చర్చలు జరిపాడు, ఆ చర్చలు, బేరాలూ పూర్తి కాకమునుపే దామి తండ్రి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు సవాలు విసురుతూ, “నువ్వు నా పిల్లలనెప్పుడూ చూడలేదు. నువ్విప్పుడు కమీషన్లు లోటు పాట్లతో నరకానికి పోడానికి సిద్ధంగా ఉన్నావుగా.”

గోవింద రక్తమాంసాలు భయంతో పాకడం మొదలెట్టాయి. వెనక్కు చూసే లోగా ఎవరో టాయిలెట్ తలుపు మూసారు.

అతను గబగబా అస్పష్టంగా అన్నాడు- “అవును సర్, నేను వారి మంచీ చెడు చూస్తాను. అంతే కాదు నాకు నిజంగా నువ్వు పోతావని తెలియదు. ఒకే ఒక్క గుద్దుతో, ఒకటే. నిన్ను కాస్త భయపెట్టడానికి అపకారం చెయ్యని ప్రయత్నం..”

ఆ క్షణంలో ఒక చతురస్రాకారపు టైల్ టాయిలెట్ ఆకాశ నీలపు రూఫ్ నుండి విడివడి అతని బట్టతల మీద పడి కమోడ్ లోకి జారింది.

ఇరవై నాలుగు గంటల తరువాత, దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రిలో అతని హృదయమూ, మెదడూ జీవరహితాలైనాయి. ఒక వారం తరువాత కుంతి తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన గ్రామానికి వెళ్ళిపోయింది. అక్కడికి చేరడానికి ఆమెకు కొన్ని రోజులు పట్టిన మాట నిజమే.

(సశేషం)

Exit mobile version