Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరిచిత సూర్యాస్తమయం లోకి-3

[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]

[భానూతో మాట్లాడూంటుంది కుంతీ. అతనికి తనకెదురైన అనుభావాలు చెప్తూ ఉంటుంది. తనకొచ్చే వింత, భయం కలిగించే కలల గురించి చెప్తుంది. అతనికి ఇవేవీ పట్టవు. అక్కడ ఎనిగ్మా ఏం చేస్తూ ఉంటుందో అని ఆమె గురించి ఆలోచిస్తాడు. తరువత ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి. తన సబ్-డిస్ట్రిక్ట్ సాకర్ టీమ్‌కి నాయకుడైనట్టు ఊహించుకుంటాడు. అతను తన మాటలు వినడం లేదని గ్రహించిన కుంతి అతని మీద అరుస్తుంది. భాను చిరాకు పడతాడు. తన పెళ్ళి విషయం ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాదు అతనికి. కోపంతో వెళ్ళిపోదామని లేస్తాడు. కుంతి బతిమాలి అతన్ని కూర్చోబెడుతుంది. ఫుట్‍బాల్ గురించి చెప్పమంటుంది. అతను పెద్దగా ఆసక్తి చూపడు. కాసేపు కన్నీళ్ళూ. ఆత్మీయ కౌగిళ్ళు, ఘనమైన ప్రేమ మెత్తదనం! ఇంతలో ఇంటి యజమాని, అతని కుటుంబ సభ్యుల శబ్దాలు వినబడతాయి. తానిక్కడ ఎందుకు ఉన్నానని ఆయన కుంతిని అడిగితే, ఏం సమాధానం చెబుతుందో అతనికి అర్థం కాదు. అయిన, తానెక్కడ ఉంటే ఆయనకెందుకు అనుకుంటాడు. గబగబా తల దువ్వుకుకుని, చెప్పులు వేసుకుని బయటకు నడుస్తాడు. ఇంటి యజమాని కుటుంబమంతా అతన్ని చూసి వంకరగా నవ్వుకుంటుంది. ఇది వరకు కొన్నాళ్ళు భాను అసలు కనబడకపోయేసరికి, ఓ జ్యోతిష్యుడిని కనుక్కుంటుంది కుంతి. కొన్నాళ్ళకి తిరిగి వస్తాడనీ, నీ చుట్టూ తిరిగి నిన్ను వదిలి వెళ్ళిపోతాడని చెప్తాడతను. వెళ్తూ వెళ్తూ, అసలు తానిక్కడికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తాడు భాను. కుంతి జీవితంలోంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎనిగ్మా ఇంటికి వెళ్తాడు. తరువాత కొన్నాళ్ళకి కుంతికి పూర్తిగా దూరమైపోతాడు. ప్రతి బాధా అనుభవమే అని తనను తాను ఓదార్చుకుంటుంది. అయిదేళ్ళ తరువాత ఆమెకు కోరాపు‍ట్‌కి బదిలీ అవుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-2 – మొదటి భాగం

కోరాపుట్‌కి కుంతి బదిలీ ఆర్డర్ అందుకున్నప్పుడు ఆమె కొలీగ్ సుజాతా దీదీ ఆమెతో అంది, “నీకు తెలుసా? ఫలానా ఫలానా ఆవిడ నీ గురించి ఏమందో? కుంతి దీదీ బదిలీ గురించి ఎందుకంత అతలాకుతలం అయిపోతోంది? ఏ పిల్లలు ఆమె మాతృ ప్రేమకు దూరమవుతారు గనక? ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెల్ళిపోవచ్చును. నాకు పిచ్చెక్కి గట్టిగా అరుద్దామనుకున్నాను. కాని లోలోపల ఎంత ఉడికిపోయానంటే నోట్లోంచి ఒక్క మాటా రాలేదు. నా నాలుక కదల్లేదనుకో.”

ముక్కు మీదకు జారుతున్న కళ్ళద్దాలతో సవాలు విసిరే జుట్టు స్టైల్‌తో సుజాత దీదీ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఓ నిముషం ఆమె వైపు చూసిన వ్వారెవరూ నవ్వకుండా ఆగలేరు. కుంతి నవ్వేసింది. సుజాతా దీదీ పూర్తిగా ఇబ్బందిపడుతూ చెవులపక్కన ఉన్న పౌడర్ చెరిగిపోకుండా జాగర్త పడుతూ చెవులు గీరుకుంది. వెళ్ళి చెవిటి కుట్టు టీచర్‌తో గుసగుసలాడింది, “నీకు తెలుసా, కుంతి దీదీకి మతిపోయింది.”

కుట్టు టీచర్ వెంటనే చాలా నిజాయితీగా ఆ వార్తను అందరికీ చేరవేసింది, “కుంతి దీదీ పెళ్ళి చేసుకుంటోంది.” (తరువాత, కుంతి తన ఉద్యోగానికి రాజీనామా చేసాక ప్రతివాళ్ళూ గట్టిగా నమ్మేసారు రహస్యంగా పెళ్ళి చేసుకుని కుంతి తన గ్రామానికి వెళ్ళిపోయిందని.)

తన బదిలీ ఆర్డర్ కాన్సిల్ చేసేందుకు కుంతి స్కూల్ మానేజ్‌మెంట్ కమిటీ ప్రెసిడెంట్‌ను, అతనితో వెళ్ళి ఒక ఎమ్.ఎల్.ఎ.ను కలిసినప్పుడు ఆ గుంపు, జనాలు ఆమెకు దుర్భరంగా అనిపించారు. ఆమె తన తండ్రి గురించి తల్లి గురించి, సోదరుల గురించి ఆలోచించింది. భాను గురించి ఆలోచించి దాదాపు కన్నీటి పర్యంతమైంది. దీనంతటికీ ఎప్పటిలా తన తల్లినే నిందించింది. ఆ గౌరవనీయులైన మెంబర్ మొదటి సారిగా ఈ మధ్యనే ఎన్నికయ్యాడు. కుంతి తన వద్దకు రాడంతో పొంగిపోయి, అతని మొహం మీద చిన్ననవ్వు తారట్లాడింది. ఈ మధ్యే వచ్చి చేరిన కొవ్వు ముఖ్యంగా అతని బుగ్గల మీద చేరి అసలే చిన్న కళ్ళు మరింత చిన్నవయాయి. ఆ విధమైన మానసిక స్థితిలో ఉన్నా కుంతి నవ్వును ఆపుకోలేక వెంటనే చీర కొంగుతో నోరు కప్పుకుంది. గౌరవనీయులైన మెంబర్ కళ్ళు మూసుకుని కుంతి చెప్పిందంతా విని, ఒక సిగార్ వెలిగించి, తన ఆదుర్దా కనబరుస్తూ ఒక చిన్న పేపర్ మీద కుంతి పేరు వ్రాసుకున్నాడు అదీ తప్పు స్పెల్లింగ్‌తో.

‘ప్రభుత్వం ఎప్పుడూ తప్పులు చేస్తుంది’ అనుకుంది కుంతి. ముందుకు వంగి పొరబాటును సరిచేసి మళ్ళీ నిటారుగా మారుతుంటే ఆమెకు మూల స్థానంలో నొప్పి అనిపించింది. ఒక ఏడాది తరువాత కూడా కుంతి తన అస్తవ్యస్తపు నెలసరి గురించి కాస్త ఆశ్చర్యపోయిందేగాని రక్తస్రావం హీమరాయిడ్స్ వల్ల అనేది ఆమెకు తెలియలేదు.

కుంతి, ప్రెసిడెంట్ గది బయటకు వచ్చారు. కుంతి కమీషన్ గురించి అడిగినప్పుడు ప్రెసిడెంట్ చెప్పినది ఒకటే, “తరువాత చూద్దాం.”

కొంచం దూరం వెళ్ళాక అతను చెప్పాడు, “ఇవ్వాల్సిన దాని గురించి తెలుసుకుని నీకు కబురు చేస్తాను.”

ఆ సాయంత్రమే డబ్బు కోసం పంపించాడు. ఆ మర్నాడు కుంతి తన పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బు తీసి ప్రెసిడెంట్‌కు అందజేసింది. ఆ రోజు మొదలు కుంతి వింటూనే ఉంది.

లేదు, ఆమె బదిలీ కాన్సెల్ కాలేదు, అవును, కాన్సెల్ అయింది. ఓహ్ లేదు అది నిజం కాదు. ఎందుకు, కాన్సెల్ అయిందిగా ఆమె ఆ అనిశ్చయ నరకంలో వేళ్ళాడి వేళ్ళాడి చివరకు కోరాపుట్ వెళ్ళాలని నిర్ణయించుకుని అక్కడి భౌతిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక జీవనం గురించి సమాచార సేకరణ మొదలు పెట్టింది.

ఆమె సేకరించిన సమాచారం – కోరాపుట్‌లో వర్షాలు విస్తృతంగా కురుస్తాయి. అలాగని అన్ని చోట్లా కాదు. శీతాకాలం మంచు కురుస్తుంది, కాని నిజంగా కాదు, శీతాకాలం మంచు కురిసిందా అన్నంత చల్లగా ఉంటుంది. ఏ స్కూల్లో చూసినా విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్యే ఎక్కువ. ఆడవాళ్ళు రొమ్ములను ఏ ఆచ్చాదనంతోనూ కప్పుకోరు, ప్రతి స్త్రీకి నలుగురు లేదా అయిదుగురు భర్తలు ఉంటారు. వాళ్ళ భర్తల పేర్లు, పడక హక్కులు వారంలో రోజుల పేర్ల ప్రకారం ఉంటాయి. ఎలుగుబంటి వంటి పట్టపగలు నడివీధుల్లో నడుస్తాయి. చిరుతపులులు అర్ధరాత్రిళ్ళు గంజి కోసం పెరటి తలుపు తడతాయి. మరో మాటలో చెప్పాలంటే కోరాపుట్ ఒరిస్సాకు మరో అందమాన్ నికోబార్ ద్వీపం. అక్కడికి వెళ్ళిన వారెవరూ మరణ శిక్ష పడిన ఖైదీలా తిరిగి రాలేదు.

ఆపైన కుంతి అడక్కుండా సాయపడాలని వచ్చేవారితో వారి వారి అహంకారాలతో స్కూల్ వారితోనూ బయటవారితోనూ నెట్టుకు రావలసివచ్చింది. దానితో మరింత కుంచించుకు పోయింది. స్కూల్ సెక్రటరీ పనికిమాలిన రౌడీ కొడుకును గౌరవిస్తున్నట్టు నటించింది. అది కూడా కుంతి గురించి మరో పుకారుగా మారి అల్లుకోడం ఎప్పటికీ సమసిపోకపోడంతో మరో సారి ఇదివరకులా ప్రతి చిన్న విషయానికీ ఏడ్చెయ్యడం మొదలెట్టింది, ఆ పాత అలవాటు చాలాకాలం కిందటే వదిలేసింది. భానూ ఈ మధ్య కాలంలో రావడమే లేదు. కుంతి కలిసిన ఒక జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం, అతను మళ్ళీ తిరిగి రాడు. మళ్ళీ, ఏదో ఒకరోజున అతను తిరిగి వచి ఆమె ముందు మోకాళ్ళ మీద సాగిలపడి క్షమించమని అడుగుతాడని ఆమె ఆశ.

మాయాధర్, (మాయాధర్ అక్కడికి కోర్టులలో సాక్షిగా హాజరయేందుకు అదో వృత్తిగా వస్తూ ఉండేవాడు. కుంతి ఇంట్లో మంచ్ తిని తనకు క్లయింట్లు ఇచ్చిన డబ్బు, ఖర్చులు మిగుల్చుకునేవాడు.) ఆమె తో ఒక భావోద్వేగ అనుబంధం పెంచుకోసాగాడు. ఊరికి వెళ్ళే చివరి బస్ సమయం వరకూ అతన్ని ఆపేసేది కుంతి. వెళ్ళేప్పుడు ఏడ్చేసేది కూడా.

స్కూల్లో నోటికొచ్చిన చెత్తంతా వాగే ఉమా దీదీ అహంభావపు ఆత్మీయత కుంతికి భరించడం దుర్భరంగానే ఉండేది.

ఆమె ఊరిలో ఇరిగేషన్ డామ్ నిర్మాణానికి భూసేకరణకు నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బు చాలా కాలం క్రితమే వచ్చింది. ఆమె సోదరుల క్షేమ సమాచారాలు తెలిసి చాలా రోజులే అయింది. ఎప్పుడో అస్సాం వెళ్ళిపోయిన చిన్న తమ్ముడు గొబారా చాలాఅరుదుగా ఉత్తరాలు వ్రాసినా వాటిల్లో ఏ సమాచారమూ ఉండేది కాదు.

ఈలోగా న్యూస్ పేపర్ వార్తల వల్ల గోవింద్ గౌరవనీయుడైన మంత్రి అయ్యాడని కుంతి తెలుసుకుంది.. ముందు అతను తన గోవింద్ అని ఆమె నమ్మలేకపోయింది. అయితే గోవింద్ పై కురుస్తున్న ప్రశంసలు ఆమె చూసినప్పుడు, అవి అతిశయోక్తులే అయినా, అతని జీవిత చరిత్ర ప్రదర్శన, అదంతా ఒట్టి కల్పితమే అయినా, ఫొటో అది అతని చిన్నప్పటిదే అయినా ఆమె అనుమానాలు అదృశ్యమై, ఆమె అయోమయం తేటతెల్లమైంది. కుంతి అనుకుంది, అవును. అతను రాజకీయాల్లో ఉన్నాడు. డబ్బుకు, సౌకర్యాలకు అతనికి ఏ లోటూ ఉండకపోవచ్చు, అయితే మరిక ఎందుకు దుమ్ముకొట్టుకు పోయి దరిద్రపు ప్రవర్తనతో కరువుగొట్టు చూపులతో వయసులోనే ముసలి అవతారంతో ఎందుకుండాలి? చివరికి ఆమె అనుకుంది ఏదో విధంగా గోవిందా తన బాధలు, బదిలీ విషయం తెలుసుకుని ఆమెకు సాయపడతాడేమోనని. మినిస్టర్లకు అన్ని విషయాలూ తెలుస్తాయిగా మరి. అయినా ఆమెకు నమ్మకం లేదు.

ఆమె అభిమానం – సిగ్గు, సంకోచాల మిశ్రమం, ఆత్మ గౌరవం, లజ్జ – అన్నీ కలిసి చెప్పాయి, తన బదిలీ సమస్యతో గోవిందా దగ్గరకు వెళ్ళడం అవమానం కాదూ, అసహ్యంగా కనబడదూ? అయినా ఆమెకు గర్వంగానే ఉంది. తన గోవిందా ఒక గౌరవనీయుడైన మినిస్టర్ కాడం. ఆ వెంటనే భయం, గొప్పగా ఎదిగిన పెద్దవాళ్ళు అసలు అందుబాటులో ఉండరు. ఆమె లాటి సామాన్యులకు అసలు అందరు. ఆమె అనుకుంది కూడా-ఒక గౌరవనీయుడైన మంత్రి కడుపు ఖాళీ చేస్తాడా? ఈ ప్రశ్న అశ్లీలతకు గట్టిగా నవ్వుకుంది.

చాలా కాలం క్రితం, కుంతికి పదమూడేళ్ళ వయసులో గోవిందా హఠాత్తుగా అదృశ్యమైపోయాడు. ఎప్పటిలాగే అతనికి ఉత్తరం వ్రాసింది కాని ఆమెకు ఎలాటి జవాబూ రాలేదు. నాథూ చెప్పాడు దేశమంతటా ఏదో ఒక ఆటవిక తిరుగుబాటు జరుగుతోందనీ, (అతను తిరుగుబాటు అని చెప్పాడు, పాపం పిచ్చివాడు, అతనికి విప్లవానికీ, తిరుగుబాటుకూ తేడా తెలియదు. పాపం అతను స్వాతంత్ర్యానంతరం వ్రాసిన కొత్త చరిత్ర ఏ స్కూల్ లోనూ , కాలేజీ లోనూ చదువు కోలేదు మరి). తిరుగుబాటుదార్లు పోస్టాఫీస్ తగలబెట్టేసారనీ. కాని కుంతి స్కూల్‌కి వెళ్తూ దారిలో బాగానే ఎప్పటిలా ఉన్న పోస్టాఫీస్ చూసింది.

తరువాత నాథూ వివరించాడు. “తెలివితక్కువతనం. ఇక్కడ కాదు. కాల్చి తగలెట్టడానికి మన పోస్టాఫీస్ ఏమన్నా అంత ముఖ్యమైనదా?”

తరువాత వరదల్లో ఒక ట్రెయిన్ కొట్టుకుపోయింది. కాని ఒక గౌరవపూరిత పుకారు అంతటా సోకింది, రైల్వేట్రాక్ నుండి ఫిష్‌ప్లేట్స్ ఎవరో తిరుగుబాటుదారులు తొలగించారనీ, వారికి గోవిందా లీడర్ అనీ.

ఈ లోగా పోస్ట్ మాస్టర్‌కు కళ్ళకలక వచ్చి అంకమారా, చుట్టు పక్కల గ్రామాలకు వచ్చే ఉత్తరాలు వింత వింత చిరునామాలకు చేరాయి. కుంతికి గోవిందా నుండి ఎలాటి ఉత్తరం రాలేదు. ఊళ్ళో అల్లరి అబ్బాయిలు కొందరు కుంతిని లాలించే విధంగా శృంగార గీతాలు అల్లి అనామకులుగా ఉత్తరాలు రాసారు. స్కూల్ నుండి తిరిగి వస్తూ కుంతి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకుని నదీ తీరానికి వెళ్ళి సాయంత్రమంతా అక్కడ ఏడుస్తూ కూచుండిపోయింది. కాని చీకటిపడుతుంటే రాక్షసుల భయం పట్టుకుని వెనక్కు తిరిగి వచ్చింది. మరో రోజున ఒక గుంపు అమ్మాయిలతో ఒక ఆడంగి పిల్లాడితో కుంతి తిరుగుతూ ఇంటర్వెల్ సమయంలో పాన్ షాప్ ఎదురుగా కొబ్బరికాయలు తింటూన్న ఏనుగును చూడాలన్న వంకతో పోస్టాఫీస్‌కు వెళ్ళి ఒక లెటర్ పోస్ట్ మాస్టర్‌కు ఇచ్చింది. ఎవరి అడ్రస్‌కో ఆమెకే సరిగా తెలియదు, పోస్టేజి స్టాంపులకు డబ్బులతో పాటు నమ్మలేని విధంగా రెండు అణాలు టిప్‌గా కూడా పోస్ట్ మాస్టర్‌కు ఇచ్చింది. ఆ ఉత్తరానికీ జవాబు రాలేదు. మరోరోజు కోతి డాన్స్ చూడటానికి వెళ్తున్నట్టుగా వెళ్ళి పోస్ట్‌మాన్‌ను గోవిందా గురించి అడిగింది. మొహం చాలా విచారకరంగా పెట్టి పోస్ట్‌మాన్ బరువుగా నిట్టూర్చాడు, కాని గోవింద గురించి ఎలాటి సమాచారమూ ఇవ్వలేకపోయాడు.

కుంతికి పదమూడేళ్ళు నిండిన నెలలోనే గోవిందా ఊరికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే భూమి కౌలుదార్ల ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భగవంతుడికే తెలియాలి ఎలా అంతపొడుగయాడో కాని గోవిందా చాలా పొడుగు. అతను అద్దాలు పెట్టుకున్నాడు, బుగ్గలమీద మెత్తని జుట్టు పెరుగుతోంది, దానిమీద చెమటా ముత్యాలు దొర్లుతూ ఉన్నాయి. గ్రామం నది మధ్యన, నాటకాలు డాన్సులూ వేసే రచ్చబండ దగ్గర నిల్చుని, జాకెట్ జేబుల్లో చేతులు పెట్టుకుని, కోపంతో మరిగిపోతూ పెద్ద స్వరంతో మాట్లాడాడు.

అతనేం మాట్లాడుతున్నాడో కాస్సేపు విని తరువాత తన వరండా నుండి లేచి మహాదేవ్ మహాలింగా వరండాలోకి వెళ్ళి అతనికి ఎదురుగా కూచుంది. అతన్ని సూటిగా చూస్తూ నిశ్శబ్దంగానే, “నన్నిక్కడ నా మానాన నన్ను వదిలేసి ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోయావు? నేను చేసిన పాపం ఏమిటి? నేను నీకంత కానిదాన్నయానా? నీకు అంత అందవికారంగా కనిపించానా? నేను నీకు భారం అనిపించానా? నిజాయితీగా చెప్పుఈ రోజున ఎందుకు తిరిగి వచ్చావు? సూటిగా చెప్పు, అది కౌలుదారుల ఉద్యమం లాటి గొప్ప పనుల కోసమా లేక నాకోసం తిరిగి వచ్చావా?”

ఆమె స్కూల్‌కి వెళ్ళి వస్తూనే ఉంది. తల్లి ఒకసారి పిలిచింది. కుంతి జవాబివ్వలేదు. స్కూల్ వదిలే సమయమూ గడిచిపోయింది. గోవిందా ఆమె తనకు తెలుసన్న ఏ చిన్న సూచనా ఇవ్వకుండానే గొడవల్లో ఉన్న స్థలానికి వెళ్ళాడు. పోలీసులు వస్తున్నారని వినగానే ఊళ్ళో కొంతమంది పక్క ఊరికో చుట్టాల ఇళ్ళకో వెళ్ళారు లేదా తమతమ భూగృహాల్లో దాక్కున్నారు.

స్కూల్‌కు వెళ్ళకుండా కుంతి ఆ గొడవలున్న స్థలం వద్దకు వెళ్ళింది. తల్లి పట్టపగలు జరిగేదంతా చూస్తూనే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. ఏమీ లేదు. గుంపులో ఉండి కుంతి చూస్తోంది, రెండు గుద్దులు గుద్దగానే గోవిందా నేలమీద పడిపోయాడు. ఆమె అతని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి అతన్ని ఒళ్ళోకి తీసుకుని అరుద్దామనుకుంది, “ఓ నా ప్రభువా, నా జీవితమా, నా వర్తమానమూ భవిష్యత్తూ, రా, లే మేలుకో, అతనికి సేవ అందించనివ్వు” అని. కాని, అలాటిదేమీ జరగలేదు. అంకమారా గ్రామానికి చెందిన నలుగురు భూతాల్లా కనిపించే మనుషులు అతని కాళ్ళు చేతులూ పట్టుకుని (తీసుకు వెళ్తుంటే అతనో చచ్చిన పక్షిలా అనిపించాడు) గ్రామం ముఖ్య రహదారి మీద పడేసారు. చౌకీదార్ ఈ విషయం పోలీసులకు చెప్పడానికి పోలీస్ స్టేషన్‌కి పరుగెత్తాడు.

కుంతి తండ్రి జమీందార్ కాకపోయినా, ఆమె తల్లి తండ్రి జమీందారే. చిన్న జమీందారీ ఎస్టేట్ ఉండేది. ఆమె తల్లికి జమీందారిణి గర్వం ఉండేది. ఆమె వెంటనే గుంపులోకి హడావిడిగా వెళ్ళి గోవిందాకు రాతి ఉప్పు వాసన చూపించి జనాల గుంపును చూస్తూ అరిచింది, “హే మీరు ఈ మనిషిని చంపాలని చూస్తున్నారా ఏమిటి? ఇతను మన గ్రామపు పిల్లవాడే కదా? మర్చిపోయారా?”

గుంపు సవాలు చేసింది, “చూడు, దీనికి దూరంగా ఉండు. పోలీసులు ఇది చూసుకుంటారు. దీనిలో తలదూర్చవద్దు తరువాత మమ్మల్ని అనవద్దు.”

“నాముందు ఏ పోలీసుల మాట చెప్పి భయపెడుతున్నారు? కుర్రకుంకల్లారా, ఇంకా అమ్మ పాల వాసన వేస్తున్నారు, మలమూత్రాల వాసన కొడుతున్నారు, జరగండి జరగండి, వినబడిందా?”

గోవిందా ఆ రాత్రి వారి ధాన్యం కొట్టులో గడిపాడు. ఆ రాత్రి కుంతి అతని వద్దకు వెళ్ళింది కాని ఆమెను వెనక్కు పంపేసాడు. ఆ అవమానం చాలా కాలం అమెను పట్టుకు వేళ్ళాడింది. ఆ అవమానమే ఆమెలో ఒక అపరాధ భావన, ఒక ఒక అల్పత్వాన్ని కలిగించి అది ఎల్లకాలమూ ఉండిపోయేలా చేసింది. బహుశా గోవింద మరణించే వరకూ ఉంటుందేమో. అర్ధరాత్రి పొలీసులు అతన్ని తీసుకుపోడానికి వచ్చినప్పుడు కుంతి కలగంటోంది. మసకమసగ్గా ఉన్న సంధ్యా సమయం. పెద్దపెద్ద చెట్లున్న తోటలో గోళంలా చిటారు కొమ్మలున్న మీద సాధారణంగా దయ్యాలుండేవి, ఆమె మసకమసగ్గా అనిపించే గోవింద మొహం ఆ అస్పష్టపు వెలుగునీడల్లో చూడలేకపోయింది. అమ్మాయిల గుంపు ఒకటి తోట నుండి తిరిగివస్తున్నారు. తోటకు ఆవలివైపున ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది అంచున నించుని ఉంది కుంతి. అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. కుంతి నదీ తీరాన దాక్కుని ఆగిపోయింది. ఆ నదీ తీరాన గోవిందా నవ్వుతూ నిల్చున్నాడు. లేదు, లేదు, లేదు అంటూ కుంతి ఎండి మెత్తగా నగ్నంగా ఉన్న ఇసుక మీదకు అడుగులు వేసింది ఆమె అసమ్మతిని స్పష్టంగా గట్టిగా చెప్పాలని. ఇసుక మీద జారిపోతున్న శరీరం చీర, పెటీకోట్ బ్రాలతో పాటూ ఆమె శరీరం లజ్జను కూడా వదిలేసింది. ఇసుక రేణువుల నుండి ఏదో అగ్ని పాకుతూ సన్నగా పారుతున్న నదీ పాయలో గాయపడిన కొంగ ఒకటి మూలుగుతున్నట్టూ ఉన్న ధ్వనిని సుతిమెత్తని గాలి కూడా ఎక్కడికీ మోసుకెళ్ళడానికి సుతరామూ ఒప్పుకోట్లేదు. గుండెలో తియ్యని చిరునవ్వేదో ఆ వెన్నెట్లో వెలుగుతుంటే కుంతి నీళ్ళలో, మంచులో, ఇసుక లో తడిసి గడ్డం మోకాళ్ళ మీద పెట్టుకుని కూచుంది.

కుంతి తనను తనే ప్రశ్నించుకుంది, “నేనిక్కడ ఇలాగే కూచుని ఉండిపోనా?”

“ఎటైనా పారిపోదాం మనం నా చిన్నారి మహారాణీ” అన్నాడు గోవిందా.

ఇద్దరూ నది అంచున నడుస్తూ చిత్రవిచిత్రమైన రంగుల ప్రపంచం, ఆల్చిప్పలు, శంబూకాలు, వింతగా చక్కని రంగుల్లో ఉన్న పూలు మంచ్లా తెల్లని చేపలను దాటారు. ఉన్నట్టుండి కుంతి ఒక తల్లిగా, ఒక అమ్మమ్మలా మారింది. తనకొడుకు చేసిన చిన్న చిన్న తప్పులకు ప్రతివాళ్ళతో దెబ్బలాడింది, ఆమె తన భర్తను ప్రేమించింది, అతని గోళ్ళకు, అతని నుండి వచ్చే కంపుకు, అతని జుట్టు వేసే వాసనకు, అతని అతి తక్కువ సంపాదనకు, అతనిచ్చిన, లేదా ఇవ్వని నగలకూ, బట్టలకూ ద్వేషించింది కూడా. ఆమె వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. అది ఆమెలో మనసులో బంధీ అయిపోయి చివరకు ఓడిపోయి గాయపడిన మనసుతో తన కుటుంబం వద్దకే తిరిగివచ్చింది, తన చివరి ఆశలూ నమ్మకాలూ పిల్లల మీదే పెట్టుకుని. మనవలను బాగా గారాబం చేసింది. అందులోనూ మనవళ్ళను కాస్త ఎక్కువగా. మనవరాళ్ళను కొంచం తక్కువగా. ఆమె తప్పుడు ఆశలను, నమ్మలేని నమ్మకాలను గట్టిగా పట్టుకుని ఆమె ఎత్తుపళ్ళతో, ఆమె రొమ్ములు జారిపోయి, దవడ ఎముకలు పొడుచుకు వచ్చి, తెల్లవాళ్ళలా అందంగా కాదు, కురుపి స్త్రీలలో కురూపిలా. ఆమె కొడుకు ఉత్తరం వ్రాసాడు, “అమ్మా మూడు మూడు కుటుంబాలు నడపలేను నువ్వు వచ్చి మాతో ఉండటం మంచిది.” ( ఒకసారి నువ్వు వచ్చి మాతో ఉంటే పనిమనిషి రోజుకు ఒకసారే వచ్చినా సరిపెట్టు కోగలం).

(సశేషం)

Exit mobile version