[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]


[కుంతి స్కూల్ టీచర్. ఆ రోజు సెలవు. తన ప్రియుడు భాను కోసం ఎదురు చూస్తూంటుంది. అయితే భాను – ఎనిగ్మా అనే ఓ నర్స్‌ని పెళ్ళి చేసుకోబోతున్నాడని – కుంతికి తప్ప ఊరందరికీ తెలుసు. ఓ ఉత్తరాది వ్యాపారి తాలూకు సువిశాలమైన భవనంలోన్ అవుట్ హౌస్‌లో ఒక చిన్న పోర్షన్ అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది కుంతి. ఈ మధ్యన ఒంటరితనం ఆమెను ఏ మాత్రం వ్యాకులపరచడం లేదు. నిరంతరం భ్రమల్లో ఉంటోంది. ఇంతలో తనని ఎవరో పిలిచినట్టనిపించి బయటకు వచ్చి చూస్తుంది. అక్కడెవరూ ఉండరు. ఎగ్గూ సిగ్గూ లేని ఎండ, “మరో రోజు వృథా అయిపోతోందిగా, ఏం చెయ్యబోతున్నావు?” అని అడిగినట్లు భావించి, సమాధానంగా, మొండిగా – చేయడానికి బోలెడు పనులున్నాయనీ, గోవింద్ అంకుల్‌కి ఉత్తరం రాయాలనీ, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలనీ అంటుంది. తన స్టూడెంట్ టాండ్రా – తన అన్న పెళ్ళి శుభలేఖ పంపించించాని, ఆమెకు థాంక్స్ చెప్పాలని అంటుంది. అదే ఊపులో లోపలికి వంటింట్లోకి వెళ్ళి, గిన్నెలూ, గరిటలూ, ప్లేట్లూ, కంచాలూ, చెంబులూ, స్పూన్లతో సహా సమస్తం కడిగి తుడిచి పెడుతుంది. ఉతికిన బట్టలు రాక్ మీద నుండి లాగి మడతలుపెట్టి దొంతర్లుగా నీట్‌గా సర్దుతుంది. ఇలా ఏవేవో పనులు చేసినా ఇంకా సాయంకాలం నాలుగో వంతు మిగిలి పెద్ద భూతంలా పరచుకునే ఉన్నట్టనిపిస్తుందామెకు. మళ్ళీ కాసేపు కునుకు తీస్తుంది. ఆమెకో కల వస్తుంది. ‘అహా, నేను ఏదో పోగొట్టుకున్నాను, అవును, ఏదో పోగొట్టుకున్నాను. నేను ఏదో పోగొట్టుకున్నాను. అదేమిటో నాకు తెలీదు’ అనుకుంటుంది. భాను ఇంకా రానందుకు చిరాకు పడుతూ ఉంటుంది. ఎట్టకేలకు భాను వస్తాడు, వానలో తడిసి మరీ! అతను రావడం ఇంటి ఓనర్ చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడడు. లోపలికి వచ్చి కుంతిని పలకరిస్తాడు. అతడికి అన్నం వడ్దిస్తుంది. తిని అతను కాసేపు నిద్రపోదామనుకుంటాడు. కుంతి మాత్రం ఏవేవో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. మిగతా అన్ని రోజుల్లాగే తాను రోజంతా భాను ఆలోచనల్లోనే గడిపానని అతనంత నిర్లక్షంగా ఉండటం తగదనీ అంటుంది. అప్పుడే పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు ఏవో పాఠాలు తమకు అర్థం కాలేదనే వంకతో వస్తారు. అక్కడ ఉన్న భానుని కాస్త కోపంగా చూస్తారు. మరో గంట గడిచిపోతుంది. ఆకాశం మబ్బుపట్టి వాన కురిసేలా ఉంటుంది. కుంతి భానుతో తన పొత్తి కడుపులో నొప్పి గురించి, తన తలనొప్పి గురించి, వేరే కులం పిల్లను పెళ్ళాడబోయే టాండ్రా సోదరుడి గురించి, అది చక్కటి గాసిప్ అవుతుందిగా అని చెప్తూ నవ్వుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-1 – రెండవ భాగం
భయంకరమైన తన మరో అనుభవాన్ని కూడా ఆమె వివరించింది. ఆ రోజున స్కూల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుంటే ఆమె రిక్షా వెనకే చాలా దూరం ఎవరో రావడం, ఇంతలో ఆమెకు ఓ గుంపు కనబడటం, వారిలో స్కూల్ సెక్రెటరీ లోఫర్ కొడుకును చూసి ఆమె రిక్షా దిగింది. ఆమె ఆ లోఫర్ కొడుకు దగ్గరకు వెళ్ళి అతన్ని తనవెంట ఇంటి వరకూ రమ్మని అడిగింది. ఆ వెంటనే తన రెండో అన్న భార్య గుర్తుకు వచ్చింది. ఆమె ఏం అనుకుంటే అది మొహానే చెప్పేస్తుంది. ఏడాది క్రితం అలాగే కుంతితో కూడా చెప్పింది,- “పరిచయస్తుడిదో, మిత్రుడిదో ప్రేమ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒక్క భర్త, కొడుకు ప్రేమ తప్ప మిగతావన్నీ అశాశ్వతమైనవే. కొద్దిరోజులు కొనసాగేవే. భర్తను మించిన ప్రేమ ఏ స్నేహితుడూ ఇవ్వలేడు.” ఆ చెప్పిన మాట పెట్టే బాధ చాలదన్నట్టు దాన్నే ఒక ద్విపదలో స్పష్టం చేసింది. ఆమె ఈ మాట చెప్పి యేళ్ళు గడిచిపోయాయి అయినా కుంతి మర్చిపోలేదు.
కుంతి వెక్కిళ్ళు పెడుతూ ప్రతి రాత్రీ ఎంత భయంకరమైన కలలు వస్తాయో చెప్పింది. ప్రతి కలా విలక్షణంగానే ఉంటుంది. కాని ముఖ్య ఘటన మాత్రం – ఎక్కడో కొత్త చోటుకు ట్రాన్స్ఫర్ పైనో, పిక్నిక్కో, లేదా చావుకో ఆమె వెళ్ళడం, లేదా ఒక రోజు బస్‌లో తన గ్రామానికి వెళ్తుంటే, ఆ బస్ ఊహకందని కారణాల వల్ల మరేదో తెలియని కొత్త స్థలానికి వెళ్తే, లేదా తెలియని కిరాయి మనుషులో, టెర్రరిస్ట్లో ఆమె బస్‌ను హజాక్ చేసి తెలియని టౌన్‌కి తీసుకు వెళ్ళడం లాటివి. ఈ కలల అన్నింటిలో ఆమె అపరిచిత ప్రదేశంలో ఏకాకిగా, దట్టమైన అడవి మధ్య ఆమె రెండు కాలి బొటన వేళ్ళు ఆనించగలంత చిన్న ద్వీపంలో, సముద్రమంత పెద్ద కొలను, విచిత్రం. ఇంకోసారి ఆమె చిన్న పిల్లగా ఒక ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. ఆ ఊయల పైకి పైపైకి వెళ్ళి ఆమె ఆకాశాన్ని చేరుతుంది. అక్కడ భయంకరమైన బూడిదరంగు, చల్లని మేఘం పైన ఒంటరిగా ఉండగా ఆ మేఘం కరిగిపోడం మొదలెడుతుంది. విస్తరిస్తున్న ఆ శూన్యంలో ఆమె ఒంటరి.
భయంతో తడిసి ముద్దవుతూ ఆమె నిద్రలేవగానే ఆప్యాయంగా చుట్టుకుని సేదదీర్చే చేతులు ఉంటే ఆమె అంతగా విచలిత అయ్యేది కాదు. అక్కడ ఎవరూ లేరు, దోమ తెరలో దోమల జంట ఒక భ్రమలా హమ్ చేస్తూ లేదా ఎక్కడో ఒక నిశాచర పక్షి తన రహస్య ఉనికిని చాటుతున్నట్టు అరుస్తోంది. ఈ మధ్యన కుంతికి ఏ పక్షి అరుపు విన్నా గుడ్లగూబల కూతల్లానే వినిపిస్తున్నాయి.
పగలు చాలా వరకు ఆమెను ఇబ్బంది పెట్టదు, తన స్కూల్ ఉండనే ఉంది. విచారం పొంగిపొర్లే ఉదయాలు, అలసిపోయిన సాయంత్రాలు, హింసించే రాత్రులు, మరీ ఒంతరితనం, ఆకాశాన్ని చూస్తూనే ఉండటం, ఎవరో ఒక మనిషి గురించో, అమ్మాయి గురించో ఆలోచన, బోలెడన్ని ఆరోపణలు చేస్తూ, తరచూ ఉన్నాడని అంటున్నా నమ్మని దేవుడి గురించి ఆలోచన, ఇలాటి సమయాలు భారంగా ఆమె నెత్తిన పడేవి.
కాని ఏ విధమైన మాయో మంత్రమో కాని భానూతో కలిసి ఉన్న సమయంలా ఆమెను బిజీగా ఉంచేది. సమయం ఎంత త్వరగా గడచిపోయేదనీ, కాని ఆమె హృదయంలో సుదీర్ఘమైన సశేషంలా మిగిలిపోయేది.. కాని గడవని క్షణాలు రంగూ రుచీ వాసనా లేని విసుగు ఆమె రక్తం లోకి, రక్తకణాల్లోకి, నరాల్లోకి, అణువుల్లోకి, పరమాణువుల్లోకి, మూలకణాల్లోకి జొరబడి పోయేవి. అయినా అలాటి క్షణాలు చచ్చిపోయాయి. అవి అలాటి ముద్రలనూ వదలలేదు. గుర్తు చేసుకోగలదేన్నీ వదలలేదు.
అంతలో భానూ, ‘ఎనిగ్మా ఏం చేస్తూ ఉంటుందో?’ తన సమస్య గురించి ఆలోచనకు స్వస్తి చెప్పి, ఫుట్‌బాల్ మ్యాచ్ వైపు మనసు మళ్ళించాడు.
ఈసారి జరగబోయే లీగ్ మాచ్‌కి తప్పకుండా తమ సబ్ జిల్లా సాకర్ టీమ్ నాయకత్వం వహిస్తాడు, ఆ ఊహ అతని మొహంలో వెలుగులు నింపింది.
“నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలియదా? నువ్వేమిటో నాకు తెలుసు, నాపట్ల నీకెలాటి అభిప్రాయమూ లేదు. నువ్వు నన్ను ప్రేమించలేదు. అందుకే నువ్వు వచ్చావు. కాని, నాకు ఏదైనా జరిగిందనుకో జీవితాంతం నామొహం నలుగురికీ ఎలా చూపించగలను? ఒకవేళ పెళ్ళికాని తల్లినై నా ఉద్యోగం ఊడిందనుకో, నన్నెప్పటికీ నువ్వు ఉంచుకోగలవా? నాకు తెలుసు నీ వల్లకాదు..”
భాను చిరాకుపడ్డాడు. తన పెళ్ళి విషయం ఎలా చెప్పాలా అని తికమకపడ్డాడు. కుంతి అతని కింది పెదవిని మెలిపెట్టింది.
ఎక్కడో ఒక ఆవు ఏదో లాక్కు వెళ్తున్నట్టుంది. కుంతి దిగ్గున దూకి చూడటానికి వెళ్ళింది.
భాను ఆగ్రహపడి వెళ్ళడానికి లేచాడు. మరో విడత బుజ్జగింపులూ, విన్నపాలూ. కొంచం కన్నీళ్ళు. కాస్త ప్రేమ కువకువలు. ముద్దూ మురిపాలు. భాను మళ్ళీ మంచం మీద వాలాడు.
స్కూల్ సెక్రెటరీ ఒప్పుకుంటే ఈసారి సబ్ డిస్ట్రిక్ట్ సాకర్ టీమ్‌కి తను లీడర్ అవగలని అన్నాడు భాను. కుంతి దాన్ని పలక మీద రాసినట్టు తన హృదయం మీద వ్రాసుకుంది. “ఏదేమైనా భాను కాప్టెన్ అవ్వాల్సిందే.”
“ఫుట్‌బాల్ గురించి నువ్వు నాకు ఏమీ చెప్పవు?” అంది కుంతి.
“ఏం చెప్పను? ఈ లీగ్ మ్యాచ్‌లు నన్ను ఒలింపిక్స్‌కు తీసుకు వెడతాయా?”
మూడో విడత. కన్నీళ్ళూ. ఆత్మీయ కౌగిళ్ళు, ఘనమైన ప్రేమ మెత్తదనం.
ఇంటి యజమాని అతని కుటుంబం శబ్ద వలయాల్లో ఒదిగి వచ్చారు. భయగ్రస్థమైన భయంకరమైన రాత్రి, తొమ్మిదో తొమ్మిదిన్నరో అయినట్టుంది. ఈ సమయంలో భాను అక్కడ ఎందుకున్నాడంటే కుంతి ఏం చెప్పగలదు? అందులోనూ ఎవరూ ఆమెను సూటిగా ఆ విషయం అడగనప్పుడు?
భానూను ఆ క్షణం ఒక భయంకరమైన తిరుగుబాటు ధోరణి ముంచెత్తింది. “నేనిక్కడ ఉన్నానని ప్రపంచంలో ఎవరికైన నేనేందుకు ఎందుకు సంజాయిషీ ఇవ్వాలి?”
ఈ తిరుగుబాటు ఆలోచనల మధ్య హడావిడిగా దువ్వెన తీసి తల దువ్వుకుని చెప్పులు వేసుకుంటూనే గది బయటకు నడిచాడు. అతని షర్ట్ వెనక నల్లని మరక చూసి యజమాని కుటుంబం మొత్తం, పెంపుడు పిల్లితో సహా వంకర నవ్వులు నవ్వారు.
“ఉండు, మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పు” కుంతి గుస గుసలను, ఇంటి యజమాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ భాను వెళ్ళిపోయాడు.
కుంతి లోలోపల ఎగసిపడుతున్న కోపాన్నీ, విసుగునీ అణుచుకుంటూ నిశ్శబ్దం గానే అతన్ని లోలోపల దీవించింది.
ఆమెకు గుర్తొచ్చింది, చాలా కాలం క్రితం ప్రైవేట్ స్కూల్ వదిలేసాక, భానూ చాలా కాలం కనబడక, కనీసం ఒక ఉత్తరమైనా రాయకపోయే సరికి అతని వివరాలు తెలుసుకుందుకు ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళింది.
ఆ జ్యోతిష్యుడు “తిరిగి వస్తాడు. కాని ఇంకో ఆకారంలో, ఆ పాటికి అతని మొహమంతా అసభ్యంగా అనిపించే మొటిమలతో, శరీరం కంపు కొడుతున్నప్పుడు – అదీ శీలం లేని చెత్త స్త్రీలను అనుభవించాలనే కోరికతో, తిరిగి వస్తాడు. అతను కాస్సేపు నీ చుట్టూ తిరిగి నిన్ను వదిలేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. అది ఎవరూ తెలుసుకోలేరు, చివరికి నువ్వు కూడా.” అని చెప్పాడు.
వెళ్తూ వెళ్తూ “నేనెందుకు ఇక్కడికి వచ్చాను?” భానూ ఆలోచనలో పడ్డాడు.
“పూర్వకాలపు పరాధీనత, ఇంటి మాజీ యజమానిలానో ఇదివరకటి కాషియర్ గానో అలవాటుగా తమ రాజు కోసం ఫీలయినట్టు వచ్చానా? కాకపోతే టీచర్ కుంతితో నాకున్న అనుబంధమేమిటి? ఇతరులెవరికీ ప్రవేశం లేదంటూ హృదయం మూసేసుకున్న నేను అందమైన ధూర్తుడినా? ఇప్పుడు నేను గనక వెనక్కు కుంతి వద్దకు వెళ్ళి, స్పష్టంగా నిన్ను ప్రేమించటం లేదు, నీకు ఎనిగ్మా గుర్తుందా మనం తనను ఆటపట్టించే వాళ్ళం, జడల నిండా పూలు, పౌడర్ బూడిదలా వేసుకున్న మొహం. నేను ఎనిగ్మాను పెళ్ళాడబోతున్నానని చెప్పేస్తే. తరువాత కుంతి ఏం చేస్తుంది? నావైపు కత్తి, లేదా స్కూల్ రెజిస్టర్ విసురుతుందా? లేదా పిచ్చిదైపోయి స్కూల్ రెజిస్టర్లో నా పేరు కొట్టేస్తుందా? లేదా అక్కడే కాస్సేపు కూచుని సడెన్ స్ట్రోక్‌తో పడిపోతుందా?”
భాను నిర్ణయించుకున్నాడు నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితం నుండి జారుకోవాలని. తెలియకుండా, చల్లగా తనకే తెలియనింత నెమ్మదిగా.
అలా నిర్ణయించుకున్నాక ఆ నిర్ణయం వెంటనే అనుసరించడం అంత సులభం కాదని అతనికి తెలుసు.
తలుపు కొట్టాడు, ఎనిగ్మా నైట్ గౌన్‌లో తలుపును తీసింది.
కొంచం కొంచంగా భాను కుంతి జీవితం నుండి దూరమై పోయాడు. భాను రావడం మానేసాక ఆమె ఒకటి రెండు సార్లు అతని ఇంటికి వెళ్ళింది. ఒకసారి ఇంట్లో లేనని చెప్పించాడు. మరోసారి ఆమె డ్రాయింగ్ రూమ్‌లో ఎదురుచూస్తుంటే వెనక తలుపునుండి నెమ్మదిగా జారుకున్నాడు. సీదా కలకత్తా వెళ్ళిపోయాడు. కుంతికి అర్థమయింది అతను మరిక రాడని. అయినా ఆమె పిచ్చిది కాలేదు, అలాగని ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకోలేదు. “ప్రతి బాధా ఒక అనుభవమే” అని తనను తాను ఓదార్చుకుంది. “నేను ఆ అనుభవం నుండి నేర్చుకోవాలి.”
అయిదేళ్ళ తరువాత ఆమెకు, రాష్ట్రానికి దక్షణాదిన ఉన్న కోరాపుట్‌కు బదిలీ అయింది.
(సశేషం)

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.