Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరిచిత సూర్యాస్తమయం లోకి-1

[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]

అధ్యాయం-1 – మొదటి భాగం

భాను నర్స్ ఎనిగ్మా ను పెళ్ళిచేసుకుంటాడని ఒక్క భాను ప్రియురాలు కుంతికి తప్ప లూడో బోర్డ్ సైజ్‌లో ఉన్న టౌన్ షిప్‌లోఅందరికీ తెలుసు. కుంతి స్కూల్ టీచర్.

సెలవు రోజు. కుంతి వంట ఎప్పుడో చేసేసి, గిన్నెల్లో సర్ది మూతలు పెట్టింది. గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది. కాస్సేపు పడక మీద దొర్లింది. నిద్ర మెలుకువల్లో మునిగితేలి మళ్ళీ లేచి గదిలో ఆ మూలకూ ఈ మూలకూ నడిచింది. తలపైకెత్తి పైకప్పును చూసి కళ్ళరెప్పలు అల్లార్చింది.

అది ఉత్తరాది వ్యాపారి తాలూకు సువిశాలమైన భవనం. ఆ ఇంటి గేట్ పక్కన అవుట్ హౌస్, ఒక చిన్న పోర్షన్ అద్దెకు తీసుకుంది కుంతి. అందులో పడక గది, వంట గది, బాత్ రూం అన్నీ ఒకదాని వెనక ఒకటి ఇరుకిరుగ్గా ఉన్నాయి. ఆమె గది ముందు ఇరుకైన వరండా ఉంది. ముందున్న బావికి ఆ వైపున చిన్న పెరటి తలుపు ద్వారానే ఆమె ఇంటికి రాకపోకలు.

సాయంత్రపు ప్రశాంతత ఘనీభవించినట్టుంది, ఉండుండి దట్టంగా పెరిగిన రావి చెట్టు ఆకుల్లో గాలి గాఢమైన నిట్టూర్పులు. ఆ ఇంటికి కిటికీ ఉన్నా ఏ మాత్రం కనిపించని వీధి. శబ్దాలూ మాత్రం లీలగా వినిపిస్తాయి. వింతైన పూర్తి ఒంటరితనం, అయినా ఈ మధ్యన ఒంటరితనం ఆమెను ఏ మాత్రం వ్యాకులపరచడం లేదు. ఆ రోజు ఆషాఢ మాసపు ఉదయం లానే వాన ఉన్నట్టుండి ఆగిపోయి, ఆకాశం నుండి కిందకు జారి వీలాడుతున్న మబ్బులు క్రమంగా అదృశ్యమై, రోజంతా సూర్యుడు ఉజ్వలంగా రాజ్యమేలుతూ, ఆ మండుతున్న ఎండ ఒక ప్రశ్నతో, మొహం మొరటుగా విసిరినప్పుడు అది అవమానంతో కాల్చేస్తుంటే, కుంతి భయంతో లోపలికి వెళ్ళింది.

నిన్నంతా ఎంత ఆశగా ఎదురుచూసిందనీ, మరే పనీ చెయ్యకుండా ఆదివారం తనివి తీరా నిద్రపోవాలని. కాని, మంచం మీద వాలగానే అది తన చెమట వాసనతో జిడ్డుజిడ్డుగా అనిపించింది. కళ్ళరెప్పలు వాలగానే తను పెద్ద టౌన్‌లో బస్‌లో వెళ్తూ, ఇప్పుడు గుర్తురాడంలేదు కాని, ఎక్కడో కాస్సేపు బస్ ఆగగానే, ఏదో కొనాలని అక్కడ దిగింది. దాహంగా అనిపించి నీళ్ళ కోసం వెళ్ళి అప్పటికే చాంతాడంత  ఉన్న వరుసలో నిల్చుంది. అందులో ఉన్నవాళ్ళు తోసుకుంటూ ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో్, మోచేతుల తోపులాటలో ఆమె చేతిలో ఉన్న హరివిల్లు రంగుల కూజా ముక్కలు ముక్కలైపోయింది. ఆమె చుట్టూ ఉన్న పొగరుబోతు జనం, క్రూరమైన జనం మొహాల మీద ఏ మాత్రం బాధలేదు. అక్కడే నేలమీద పడి కుంతి నిద్రలోకి జారిపోయింది.

ఆమెకు మెళుకువ వచ్చేసరికి శరీరంలో అపనమ్మకపు ఉత్సుకత కనిపించింది. జనం ఎటుచూసినా ఆమె చుట్టూ గుమిగూడి ఉన్నారు. అయినా ఒక్కళ్ళకీ మొహమే లేదు. అక్కడంతా విపరీతమైన రణగొణ ధ్వని, అదేదో ఊహాలోకపు అడవి జంతువులు, పక్షుల భాషలోలా. భ్రమ అనిపించే నిద్రనుండి కుంతి హఠాత్తుగా లేచింది. ఎవరో తనను పేరు పెట్టి పిలవడం వినబడింది. ఎన్నో సార్లు అలాగే అనిపించినా ఎవరూ చుట్టుపక్కల ఉండేవారు కాదు. అయినా ఆమె బయటకు వచ్చింది.

బయట ఎగ్గూ, సిగ్గూ లేని ఎండ, అడవి పులిలా, మొహం మీదే గట్టిగా అడిగేసింది,

“ఇంకోరోజు వృథా అయిపోతోందిగా. ఏం చెయ్యబోతున్నావు? “

ఆమె తనకున్న సహజమైన మొండితనంతో జవాబిచ్చింది – (అదే లేకపోతే ఆమె ఉనికే లేనట్టు దాన్ని జాగర్తగా కాపాడుకుంటూ వస్తోంది). “అదేం, చెయ్యడానికి బోలెడు పనులున్నాయి. బట్టలు ఉతుక్కోవాలి, గోవింద్ అంకుల్ ఉత్తరానికి జవాబు రాయాలి. అంకుల్ తన కొడుక్కు ఎన్ని మార్కులు వచ్చాయో కనుక్కుని ఎలాగైనా అన్ని పేపర్లు క్లియర్ అయేలా చూడమన్నాడు. నేనది చెయ్యలేకపోయాను. అయినా సరే, అలాగని జవాబు ఇవ్వకూడదని కాదుగా. ఆయన అనారోగ్యం గురించి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కోకూడదని కాదుగా?” తనలో తనే వాదన కొనసాగించింది.

“ఆయనకు నా గురించి బెంగ ఉంటుంది కదా, ఆయన బిజీగా ఉంటాడు, సమయం ఉండదు. అయినా నేనే ఆయన బాగోగుల గురించి చూసుకుంటాను. ఆ పైన టాండ్రా నాకో కార్డ్ పంపింది. కలల్లో మునిగి తేలే నా విద్యార్థిని. తన అన్నయ్య పెళ్ళికి నన్ను ఆహ్వానించే పెళ్ళి పత్రిక. థాంక్స్ చెప్పొద్దూ?

తరువాత, రేపు ఏడో క్లాస్ టీచర్ని బయటకు లాగాలి. దాని పేరేమిటీ? వింతగా నాతో పనిచేస్తున్న ఆవిడ పేరు కూడా గుర్తు రావడం లేదు. రోజూ ఆలస్యంగానే వస్తుంది. ఆవిడ పిల్లలు ఎప్పుడూ బయట వరండాల్లో తిరుగుతూనే ఉంటారు. ఒకరిద్దరు తలిదండ్రులు ఫిర్యాదులు కూడా మొదలెట్టారు. అయినా తలిదండ్రులు తలిదండ్రులే కదా . వాళ్ళెప్పుడయినా, ఎక్కడయినా ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. నిజానికి వాళ్ళు ఫిర్యాదులు చెయ్యాలి కూడా.”

కుంతి అదే జగడపు మూడ్ లోనే చీర కొంగు బొడ్లో దోపి కోపంగా వంటింటి వైపు వెళ్ళింది. గిన్నెలూ, గరిటలూ, ప్లేట్లూ, కంచాలూ, చెంబులూ, స్పూన్లతో సహా సమస్తం కడిగి తుడిచి పెట్టింది. ఉతికిన బట్టలు రాక్ మీదనుండి లాగి మడతలుపెట్టి దొంతర్లుగా నీట్‌గా సర్దుకుంది. వాటిలో కొన్ని ఇస్త్రీ చేసేందుకు తీసిపెట్టింది. అప్పుడే తెలిసింది కరెంట్ లేదని. చాలా కాలంగా వాడని కాసెట్ ప్లేయర్ తీసింది పాటలు విందామని, అప్పుడు తెలిసింది కరెంట్ లేదని. దాని దుమ్ము తుడిచి మళ్ళీ అల్మెరాలో పెట్టి దాని మీద ఎంబ్రాయిడరీ చేసిన గుడ్డ కప్పింది.ఇదంతా చేసాక కూడా ఇంకా సాయంకాలం నాలుగో వంతు మిగిలి పెద్ద భూతంలా పరచుకునే ఉన్నట్టనిపించింది. ఉన్నట్టుండి ఎంతో అలసట కమ్మేసి, చిరుతిళ్ళ ప్లాస్టిక్ డబ్బాలోంచి జంతికలు, చుడువా తీసుకుని చప్పుడు చేస్తూ నమలడం మొదలెట్టింది. కాస్సేపటికే విసుగనిపించినా, ఆ రుచి నచ్చకపోయినా తినడం ఆపలేదు. ఆ కారానికి పెదవుల మంట మొదలైంది. చిగుళ్ళు పుళ్ళుపడినట్టుగా అనిపించి త్రేన్పులు గొంతు వరకూ రాడం మొదలయింది. ఒక డైజీన్ పిల్ వేసుకుని నిద్రలోకి జారుకుంది.

కళ్ళు మూసీ ముయ్యగానే ఏదో ఒక స్థలం, పరిచయం ఉన్నదానిగానే అనిపించింది. కొంచం మథనపడ్డాక గుర్తుకొచ్చింది. ఒకసారి తను బస్ ప్రయాణంలో ఒక చిన్న టౌన్ లోకి వెళ్ళబోతుండగా వెనకాల సీట్లలో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు, అది ఆ టౌన్ శ్మశాన వాటిక అని చూపిస్తూ. కుంతి బయటకు తొంగి చూసింది కాని అది శ్మశాన వాటిక అనడానికి ఒక్క గుర్తూ కనబడలేదు. పక్కనే ఒక మురిక్కాలవ పారుతోంది. విరిగిన కుండముక్కలు కాని, ఎలాటి చితి చిహ్నాలు గాని, ఎక్కడా నక్క ఊళలు గాని వినబడలేదు. అయినా ఆమె చూస్తూండగానే ఉన్నట్టుండి పజిల్‌లా ఆ స్థలమంతా చిన్నగా గడ్డి మొలిచి అలుముకుని సన్నగా చిటపట శబ్దాలతో, కుక్క గొడుగుల్లా. ఓహ్, ఏమిటది, అయోమయంలో పడిపోయిన కుంతి అతలాకుతలమయింది. కడుపులో ఏదో గిర్రున తిరుగుతోంది. హఠాత్తుగా ఏదో చిన్నప్పటి సంఘటన మనసులో తళుక్కున మెరిసింది. ఆమె బాల్యం అది. ఊరి పెద్దలు మాప్ చూస్తూ ఏదో చర్చిస్తుంటే ఆమె తొంగి చూసింది. అవును ఇలాటి చిహ్నమే అక్కడ చూసింది. మాప్ కింద ఈ రకమైన చిహ్నం ఉంది. ‘గ్రామ శ్మశాన వాటిక’ అని.

మాప్ కింద చిహ్నాలు వాటి వివరాలు ఉన్నాయి. ఆ చిహ్నం పక్కన గ్రామ శ్మశాన వాటిక అనే వివరణ ఉంది.

కుంతి కళ్ళు తెరిచింది. మిట్ట మధ్యాన్నపు ఆకాశం నాలుగైదు మతి మరుపు మేఘపు తునకలు తేలుతూ. గాలిలో తనతో పాటు అదే గతం తాలూకు భావన, ‘అహా, నేను ఏదో పోగొట్టుకున్నాను, అవును, ఏదో పోగొట్టుకున్నాను. నేను ఏదో పోగొట్టుకున్నాను. అదేమిటో నాకు తెలీదు’.

అక్కడ రేకుల పైకప్పుఆధారంగా వరండాలోఉన్న చెక్క స్తంభాలలో ఇక దానికి ఆనుకుని నించుని కుంతి ఎవరికోసమో ఎదురు చూస్తోంది. కాని అది అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మొహం ఎర్రబారింది, గుండె మొండిగా రెపరెపలాడింది. పెద్దన్నయ్య బాగానే ఉన్నాడా? ఏడాదిగా అతని గురించి ఎలాటి సమాచారమూ లేదు. నిజానికి ఏడాది కాదు కొంచం తక్కువే. ఆమె రాఖీ పంపిన ఒక నెలకి యాబై రూపాయలు మనీ ఆర్డర్ పంపించాడు. ఆ కింద ఫాం లో వదిన, అతని భార్య, ఆరోగ్యం బాగాలేదనీ, మైగ్రేన్‌తో బాధపడుతోందనీ రాసాడు. మైగ్రేనే కదా ఏమవుతుందోనని పెద్ద వర్రీ అవసరం లేదు, తనను తాను ఓదార్చుకుంది కుంతి. ఎవరో బయట తలుపుకొడుతున్నారు. పోస్ట్‌మాన్ ఏదైనా టెలిగ్రాం తెచ్చాడా? వదిన పోయింది అనో లేకపోతే అన్న సీరియుస్ అనో. కుంతి హడావిడిగా చీరకుచ్చెళ్ళు సర్దుకున్నా హడావిడిలో బ్లౌజ్ హుక్స్ ఎంతకూ సరిగా కుదరలేదు. హడావిడిగా ఖాకీ డ్రెస్ పోస్ట్‌మాన్ కోసం చూస్తూ తలుపు తెరిచింది. కాని ఎదురుగా ఉన్నది ఒక నల్లటి ఆడమనిషి, జుట్టుఈ పక్కన ముడివేసుకుని, ముక్కుకు పెద్ద ముక్కెరలు తగిలించుకుని, “అటుకులు కొంటావా అమ్మా?” అని అడుగుతూ.

కుంతి ఆమెను తరిమికొట్టి వెనక్కు తిరిగింది. ఇంటి ఓనర్ మనవరాలు తెల్లని సీతాకోక చిలుకలాటి హెయిర్ క్లిప్స్ పెట్టుకుని, గ్రౌండ్ అంతా పూలతో అలంకరించింది. ఆ పిల్ల కుంతిని చూస్తూనే అడిగింది, “ఈ రోజు నా నానమ్మగా ఉంటావా? నా రాకుమారుడు వస్తాడనుకుంటున్నాను?”

ఎన్నో చురకత్తులు ఒకేసారి ఆమె మెదడులోకి మెరుపుల్లా సర్రున దూసుకు పోయినట్టనిపించింది. చుట్టూ ఒకసారి చూసి ఆపిల్ల దగ్గరకు వెళ్ళి గుసగుసగా, “నీకో నానమ్మ ఉందిగా? లేదా?” అని అడిగింది.

“ఉంది. కాని అస్సలు పనికొచ్చే రకం కాదు. ఆవిడ నన్నెప్పుడూ అర్థం చేసుకోదు.”

కుంతి ఆ పిల్ల చెవిలో గుసగుసలాడింది, “కానీ, నేన్నీకు నానమ్మలా కనిపిస్తున్నానా? నన్నెందుకలా నటించమని అడిగావు?”

“మరింకేం చెయ్యగలను?” ఆ మనవరాలు సాగదీసింది. “ఆ కథ అలా నడుస్తుంది మరి, నేను పూల అలంకరణలతో కూచుని ఉంటాను, చిన్ని రాకుమారుడు వచ్చి నన్ను అడుగుతాడు,

‘చిన్నారి రాకుమారీ, రాకుమారీ, నీపూల అలంకరణ ఎంత బాగుంది! చిన్నారి రాకుమారీ త్వరగా చెప్పు, నువ్వు నా రాణివి అవుతావా?’ అని”

కుంతి తన ఇంటివైపు జారుకుని గది తలుపు తెరవగానే పోస్ట్‌మాన్, ఎవరి రాకకోసం ఎదురు చూస్తున్నారో వారు ఎప్పటికీ రారనే వార్త మోసుకు వస్తాడనుకున్న అతని చెప్పుల మట్టి ముద్రలను గదంతా, గోడలమీద, అల్మెరా మీద, సీలింగ్ పైన, ట్యూబ్ లైట్ మీద, సూట్ కేస్ మీద, బెడ్ మీద, ఫాన్ పైన, బెడ్ మీద బోర్లాపడి ఉన్న రిస్ట్ వాచ్ మీద పరచి వెళ్ళాడు.

ఆమె కబ్బోర్డ్ తెరవగానే నిండి పొర్లుతున్న విషాదం బయటకు దూసుకు వచ్చింది. ఎవరో రావాలి, కాని అతను రానే లేదు. బోర్లించి ఉన్న అన్నం గిన్నె నీళ్ళు ఒడిసిపోడంతో సరిగా తిప్పింది. ఏదో మహా అద్భుతం, విశేషమైన రహస్యపు వింత జరగాలి, కాని ఏమీ జరగలేదు. అదీ ఆమె మీద ఆమెకు ఏ మాత్రం విశ్వాసం లేకపోడం వల్లే.

కుంతి వెళ్ళి తలుపులు చప్పుడయేలా మూసింది. ఇంటి ఓనర్‌కు తను తలుపులు మూసుకున్న సంగతి తెలియాలి మరి. తలుపు పీట కర్ర కదిలించి వదిలింది, ఓనర్ అనుకోవాలిగా తలుపు బిగించుకుందని. భాను కోసం ఎదురుచూస్తూ మంచం మీద వాలింది.

బయట పెద్దపెద్ద వాన చినుకులు పడుతున్న అలికిడి. ఎక్కడో రేకుల మీద పడుతున్న శబ్దం వల్లే అమెకు స్పష్టంగా అర్థమయింది చినుకులు ఎలా ఉన్నాయో. ఏ దిక్కు నుండి ఆ శబ్దం వస్తోంది? భాను ఈ రోజు రాడేమో, సాయంత్రాలు భాను వచ్చినప్పుడు దొంగచాటుగా, నిశ్శబ్దంగా ఒక దొంగలా వస్తాడు. అదే పగటి వేళ అయితే బాట్మింటన్ రాకెట్ ఊపుకుంటూ, సాల్ ఆకుల్లో చుట్టిన కాటేజ్ చీజ్‌తో చేసిన మిఠాయిల పొట్లం ఆడిస్తూ, పెద్దగా మాట్లాడుతూ, అరుస్తూ తన ఉనికిని మొత్తం ప్రపంచానికి ప్రకటిస్తూ రావడం ఫుట్బాల్ ఆటగాడిగా అతని వ్యక్తిత్వానికి అద్దినట్టు సరిపోతుంది.

చివరికి భానూ వచ్చాడు ఎంత సేపటి తరువాతో. అతని కోసం ఎదురుచూస్తూన్న కుంతి గమనించనే లేదు. సన్నని వానలో తడిసిపోయాడు. తగ్గిపోతున్న తడి జుట్టులోంచి మాడు బయటకు కనిపిస్తోంది. నిశ్శబ్దంగా ఇంట్లోకి వచ్చి ముందు గది బోల్ట్ చేసి కుంతి గదిలోకి వెళ్ళాడు, అదే కుంతి ఇల్లు. ఇంటి ఓనర్ పైన తన గది లోంచి గమనిస్తూనే ఉన్నాడు. పైన కూచుని తెరిచి పెట్టిన కిటికీల్లోంచి బయటకు చూస్తున్నాడు. అయినా ఏమీ చూడనట్టే నటించాడు. నేలమీద పడుకుని చెవులు రిక్కించాడు. తన మనవడి పైనో మనవరాలిపైనో గట్టిగా అరిచాడు, సాయంత్రం ఫిల్మ్ షోకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నప్పుడే నేల పాడు చేసారు, అసలే లేట్ అవుతోంది. ఆ సినిమాకు వినోదపు పన్ను లేదు, చాలా తక్కువ రేటు పడుతుంది. ఇప్పుడు కనక వెళ్ళలేకపోతే తరువాత వచ్చే బాక్స్ ఆఫీస్ హిట్‌కి డబ్బులు కట్టాలి. అతనికి ఎలాటి పన్ను కట్టడం ఇష్టం లేదు. మరి కుటుంబంతో కలిసి ఆ మూవీ చూడటం కుదరదు.

కుంతి కళ్ళు తెరిచి లేచి బెడ్ మీద కూచుని “ప్చ్” అంది.

భాను వచ్చి ఆమె పక్కన బెడ్ మీద కూచోగానే, పలచబారిన అతని జుట్టునోసారి చూసి, షాఖ్ అయి, “ఉండు, నన్నో సారి చెక్ చెయ్యనీ” అంది.

కుంతి అతనికి హడావిడిగా భోజనం వడ్డించింది. భానుకి పెద్ద ఆకలిగా లేదు, నువ్వు ఏదైనా తిన్నావా అని కుంతిని అడిగాడు. ఎప్పటిలానే తిన్నానని అబద్ధం చెప్పింది. ఆదివారాలు కుంతి అన్నం మెతుకు కూడా ముట్టదు భాను కోసం ఎదురుచూస్తూ. అదేదో ఉపవాసం లాగా, లేదు వాళ్ళ పాపపు బంధానికి ఒక నిష్కృతిలాగా.

‘పది రూపాయలు మిగిల్చాను, ఈ పూట తిండి ఖర్చు’ అనుకున్నాడు భాను ముద్ద నోట్లో పెట్టుకుంటూ. చిన్నప్పటినుండీ అతనిలో హోటల్ తిండి అంటేనే కల్తీ అనే ఒక భావం పాతుకుపోయింది. బియ్యంలో రాళ్ళూ, సోడియం బైకార్బొనేట్ కలిపేస్తారు. ఇహ కూరలు వండేందుకు ఆవ నూనె బదులు మురిగిపోయిన కూరలు అదేదో హాని కారకపు మొక్క నుండి తీసిన నూనె ఉపయోగిస్తారు. ఎక్కువ తినకుండా నీళ్ళలో సల్ఫేట్‌లు కలిపి అన్నం వండుతారు. ఈ లవణాలు అన్నీ లివర్‌ను పాడు చేస్తాయి. అందుకే హోటళ్ళలోనే తినాలని అతని మొహాన రాసి ఉన్నా అక్కడ తిన్నప్పుడల్లా అలా వికారపు ఆలోచనలే వెన్నాడతాయి. కుంతి అతని కోసం ఆగలేదని బాధనిపించింది. అయినా ఏం అనకుండా గబగబా ముద్దలు మింగడం సాగించాడు.

భాను తినడం అయేసరికి కుంతి అప్పటికే మంచం మీద బద్దకంగా సాగిలపడింది. భానూ కంచం లోనే చెయ్యి కడుక్కుని, నేలమీద కూచుని డోర్ మాట్ నుండి దారాలు లాగి ఉండ చేస్తూ అన్యమనస్కంగా వాటిని నములుతున్నాడు.

కుంతి టీచర్ ఖాళీ కడుపు నకనకలాడింది. కడుపులో ఊరుతున్న ఆమ్లాలు అతలాకుతలం చేస్తున్నాయి. “కడుపు నొప్పి” అని చెప్తూ పక్క మీద దొర్లింది. మరో పక్క బెడ్ మీద ఎదురుచూస్తోంది. భానూ వచ్చి అత్తపత్తి ఆకులను తడిమినట్టు సుతారంగా కడుపును నిమురుతాడా? అని.

భానూ అక్కడే కూచుని కుంతికి తన నిశ్చితార్థపు వార్త ఎలా చెప్పాలో అర్థం కాలేదు. డోర్ మాట్ కొత్తదిలా ఉంది, ఎక్కువ పోగులు బయటకు రాలేదు. కుంతి ఆపాటికే ఎరుపెక్కిన మొహం పైకెత్తి మోచేతి మీద ఆనుకుని “అక్కడ డోర్ మాట్ మీద కూచుందుకే వచ్చావా?” అని అడిగింది.

భానూకు ఊసరవెల్లి గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా దాని గడ్డం. ఒకప్పుడు తళతళలాడే అతని పలువరస పాన్, తంబాకు తిని, గారపట్టి రంగు మారిపోయి, సన్నని ఆ బ్రహ్మచారి మొహంలో అసహ్యంగా కనిపిస్తున్నాయి. కుంతి లేచి మంచం దిగి అతని చెయ్యిపట్టి లాగి,

“అరే, కోప్పడకు డియర్” అంది కాని అతన్ని కదిలించలేకపోయింది.

“సరే, నీఎంత కోపం తెచ్చుకుంటావో తెచ్చుకో, తెచ్చుకుని సంతోషపడు.” అంది.

కుంతి మరీ సన్నగా పుల్లలా నరాలు తేలి కనిపిస్తోంది.

ఎక్కడో ఎవరో ఇత్తడి గిన్నె కిందపారేసినట్టున్నారు.

భాను వ్యాకులపడుతూ కదలిపోయి, “నీ నోరు వాసన వస్తోంది” అన్నాడు.

‘నేను మాంసము, చేపలూ, గుడ్లూ తినను, కనీసం పచ్చి ఉల్లి కూడా తినలేదు. అయినా అతనెందుకలా అంటున్నాడు?’ కుంతి తనను తనే ప్రశ్నించుకుని హడావిడిగా తన టూత్ బ్రష్ కోసం వెతుక్కుంది. అది దొరక్కపోయేసరికి మరింత కంగారుపడింది. ఒక బొగ్గుముక్క, కాస్త ఉప్పు నూరి దానికి ఆవనూనె కలిపి చుపుడు వేలితో పళ్ళు తోముకుంది. ఆ తరువాత మంచం మీద కూచుని భాను చేతులు నిమరడం మొదలెట్టింది. ఆమెలో ఏదో తెలియని అశాంతి, ఊహాజనితమైన భయం, కిటికీ వైపు చూపు తిప్పి బయటకు చూసింది. ఏదో తెలియని హెచ్చరిక. మంచం దిగి, భాను తిన్న కంచం వంట గదిలోకి తీసుకు వెళ్ళి, గిన్నెలు సర్ది మళ్ళీ వచ్చి తలుపు ఓరవాకిలిగా మూసి వచ్చి భానుకు ముద్దుపెట్టింది. అంతలోనే మళ్ళీ బయటకు వెళ్ళింది.

బయట చాలా హడావిడిగా ఉంది. ఇంటి ఓనర్ భార్యా, పిల్లలు, మనవలు, పనివాడు, పెంపుడు పిల్లి అతనివెంట నడుస్తుంటే సాయంత్రం సినిమాకు బయలు దేరాడు. “ఏం సినిమా ఏమిటీ?” వచ్చీ రాని హిందీలో అడిగింది కుంతి.

“ఇల్లు చూస్తూ ఉండు” ఇంటి యజమాని జవాబు.

భాను ఆ సంభాషణ వింటున్నవాడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అతని నుదుటి మీద మెరుస్తూన్న చెమట చుక్కలు.

“తలుపు వెయ్యి, ముఖ్యంగా మెయిన్ గేట్.”

కుంతి పారాపెట్ వాల్ దగ్గర నించుంది, చేతిలో కొబ్బరితాడు, దాని చివర ముడివేసిన ఇనుప బకెట్, ఆమె నాలుక చివర ఒక పదునైన, ఉత్సుకత ఉట్తిపడే ప్రశ్న బయటకు దూకేందుకు సిద్ధంగా, ఆ ప్రశ్న సర్కస్‌లో ఎంత అవమానించినా సీరియస్ మొహంతో నేలకు అతుక్కుపోయి ఉండే హాస్యగాడిలా, నిల్చునే ఉంది.

“భానూకి ఏం కావాలి? అది నేను కాకపోవచ్చు?” బకెట్ బావి గోడలకు తగిలి గిడింగ్-గిడింగ్ మని చప్పుడు చేస్తూ జారింది.

వెనక్కు వచ్చి గదిలో భాను కుంతి కోసం ఎదురు చూస్తున్నాడు. మార్కెట్ లో ఎవరో ఇద్దరు గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

రోడ్డు మీద, రహదారి మీద, మార్కెట్ లో మిగిలిపోయిన ఎవరో, రాత్రి ఒంతరితనాన్ని, నిశ్శబ్దాన్ని చీలుస్తూ గట్టిగా గొంతు విప్పి అరుస్తున్నారు, “ దీనాభాయీ, దీనా భాయిలూ.. చీకటిపడుతోంది, డియర్.”

ఆ ధ్వని ప్రతిధ్వనిగా మారి జవాబు లేకుండా తిరిగి వచ్చింది.

భయం భయంగా ఆ కేక మరింత తీవ్రం అయింది.

“దీనాభాయి, చీకటి పడుతోంది. దీనాభాయి, ఓ దీనాభాయీ..”

ఎదురుచూడని సహానుభూతితో విసుగెత్తిన భాను అనుకున్నాడు, ‘నేనే దీనాభాయి అయితేనా?’

ఆమె మంచం మీదే పడుకున్నా భాను మాత్రం కుంతిని పూర్తిగా మరచిపోయాడు. బకెట్ గోడకు తగిలిచ్చే ధ్వని గిడింగ్ గిడింగ్ నిశ్శబ్దాన్ని చెదరగొడుతోంది. బావిలో నుండి వస్తున్న పాట ఒకటి నాట్యాన్ని ప్రేమించే చిన్నఆడ దయ్యం పిల్లలా ఇత్తడి బిందెలోకి జారుతోంది. అడుగుల శబ్దం అనుసరించింది. కుంతి అడుగుల ధ్వని, ఆపైన కరెంట్ పోయింది.

“ఆమె ఇప్పుడు రావచ్చుగా?” భాను కోరిక.

కుంతి బిందెలన్నీ నింపి బయటే ఎదురుచూస్తోంది, ఆ మసక చీకటిలో ఆమె గదిలోకి వెళ్ళి ఏమాత్రం భానూను తాకినా దయలేని దేవుడు దయ జూపకుండా గోప్యమైన వార్షిక నివేదిక రాస్తాడేమోనన్నట్టు.

లైట్లు వచ్చాయి, కిటికీ పక్కన ఉన్న నోటి మడుగులో వికసించిన నీలి ఊదారంగు పూరెక్కలమీద ఆ వెలుగులు ప్రతిఫలించాయి. కుంతి గదికి తిరిగి వచ్చింది. పీలగా పాలిపోయినట్టున్న కుంతి. కిటికీలోంచి పాకతుతున్న సంధ్య వెలుగులో, భాను ఆవేశం నిండిన బిగి కౌగిలి నుండి కుంతి తప్పుకుంది. ఎందుకో కలవరపడుతూ వెళ్ళి తలుపు తీసింది. ఆమె హృదయం ఏదో తెలియని భయంతో గడ్డకట్టింది. ఆ భయం చిన్నప్పటినుండి చిరపరిచితమే.

వర్షాకాలంలో అపశకునంలా భయపెట్టే చీకట్లో నీళ్ళోడుతూ కప్పలు బెకబెకలాడుతున్నాయి. గ్రామానికి ఒక పక్కన గర్భవతి అయిన నది ఆక్రమించుకోబడి వరదలుగా, విధ్వంసానికి గురవుతుంది, మరో పక్క ఆమె గ్రామం, అంకమారా తాలూకు కొండలూ, అడవుల్లోంచి భయంకరమైన జంతువులు దాడి చేయడం- అంతా ఆమె భ్రమల్లోనే.

భానూ అలసిపోయి తనలోని ఏకాంతం లోకి జారుకున్నాడు. కుంతి అతని వెంటపడి జాలిచూపిస్తూ,

“నా వల్ల కలవరపడుతున్నావా? నా ప్రభూ, కృష్ణా, నా ప్రియమైన భానూ?” అడిగింది.

ఈలోగా భాను తనను తనే ప్రశ్నించుకున్నాడు, ‘ఎక్కడికి వచ్చాను? ఎందుకు వచ్చాను? ఏ ఆశతో వచ్చాను? నాకు తెలీదా కుంతి లెఖ్కలేనన్ని ఊహాజనిత రతి సుఖ ప్రాప్తి దాడులతో అలసిపోయి సాగిలపడి ఉంటుందని?’

కుంతి మాత్రం ఎడతెరిపిలేకుండా పనికిరాని చెత్తంతా వాగుతూనే ఉంది, ఎక్కడ తాను ఆపితే భాను మాయం అయిపోతాడో అన్నట్టు. భాను కిటికీలోంచి బయట వీధిలోకి చూసాడు. అక్కడ ఆ నీటి పూల వెనక ట్యూబ్ లైట్ కింద ఒక బస్ ఆగింది. ఆ బస్ టాప్ పైన నీలం షర్ట్, తెల్లపంచెలో ఒక మనిషి అరటి గెలలను అమరుస్తున్నాడు. ఆ బస్ వెనకాల ఉన్న కాబిన్ సగం రోడ్ లోని చీకటిలో మునిగి ఉంది. దూరాన రైలు శబ్దం చుక్.. చుక్ మంటూ.

‘నా జీవితం వ్యర్థమైపోయింది. ఇక్కడ నేను ఒలకబోసిన ప్రేమంతా ఎడారిలో తేమలా లుప్తం అయిపోయింది ఇహ ఏ రహస్యం మిగిలింది ఇక్కడ?’ అనుకున్నాడు భాను. అతని మనసును ఒక కోపంతో కూడిన నిరాశ కమ్మేసింది.

ఈలోగా కుంతి మాటి మాటికీ బయటకు ఎవరైనా ఉన్నారా అని చూస్తూనే ఉంది, ఎవరూ లేకపోతే భాను జుట్టు నిమిరడమో, చేతులు పట్టుకోడమో, లేదంటే అరచేతులు ముద్దుపెట్టుకోడమో చెయ్యవచ్చని. ఆమె అతని అరచేతులు మృదువుగా నొక్కి, నవ్వు, నవ్వు అంటూ భానును బలవంతపెట్టింది. మళ్ళీ, మళ్ళీ బయటకు వెళ్ళి ఎవరైనా లోపలకు వచ్చారా అని చూస్తూనే ఉంది. ఎవరైనా రహస్యంగా తమను చూస్తున్నారేమో, తమ మాటలు వింటున్నారేమోనని.

మిగతా అన్ని రోజుల్లాగే తాను రోజంతా భాను ఆలోచనల్లోనే గడిపానని అతనంత నిర్లక్షంగా ఉండటం తగదనీ అంది. అప్పుడే పదో తరగతి విద్యార్థులు ముగ్గురు ఏవో పాఠాలు తమకు అర్థం కాలేదనే వంకతో వచ్చారు. భాను వంక కాస్త కోపంగా చూసారు. అతను మరింత కోపంగా ఓ మూలకు వెళ్ళి కూచున్నాడు.

వారిలో ఒకమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తిరిగి వెళ్తుంటే దారిలో కనబడి మాటల్లోపడి ఆలస్యం అయింది. కుంతి ఇంట్లో ఉన్న అపరిచితుడి మీద ఆలస్యానికి అభియోగం రుద్దాలని అనుకున్నారు అమ్మాయిలు.

మరో గంట గడిచిపోయింది. అతని జీవితంలో మరో గంట నిజంగా కుంతితో, ఆమెలో లీనమై గడపగలిగే సమయం అనుకున్నాడు భాను.

ఉత్సాహాన్నిచ్చే పలచని గాలి తెమ్మెర సాగిపోతోంది. బహుశా మరెక్కడో, మరీ దూరాన కాకుండా, ఎక్కడైతే దుఃఖం లేదో, ఎక్కడైతే ఏ ఘటనా లేని రోజో లేదా ఏ ఘటనా ఉండని మంచు కప్పిన పర్వత శిఖరం పైన రాయి లాటి వస్తువు ఊహకు కూడా అందని చోట పురాతనమైన వాన వచ్చేసింది దాని తీవ్రమైన ఉద్రిక్తతతో.

ఆ క్షణమే గాలి తెమ్మెర వీయడం మొదలవగానే, కుంతి భానుతో తన పొత్తి కడుపులో నొప్పి గురించి, తన తలనొప్పి గురించి, వేరే కులం పిల్లను పెళ్ళాడబోయే టాండ్రా సోదరుడి గురించి, అది చక్కటి గాసిప్ అవుతుందిగా అని చెప్తూ నవ్వును ఆపుకోలేకపోయింది.

(సశేషం)

Exit mobile version