[శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారు అనువదించిన ‘ఆపాత మధురాలు’ అనే కథల పుస్తకానికి అవధానుల మణిబాబు గారు రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]
పాలవెల్లి:
ఇంట్లో పిండివంటలు చేస్తున్నపుడు, బయటెక్కడో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి, వేడివేడిగా వాళ్ళ చేతికిచ్చి, ఎలా ఉంది తిని చెప్పు? అని అడుగుతారు. ఊదుకుంటూ ఊదుకుంటూ తింటూ వాళ్ళు “చాలా బావుంది” అంటారు. ఇక్కడ ఆ పసివాళ్ళకు వంట గురించి తెలుసనో, సూచనలిస్తారనో కాదు. చిన్నపిల్లలకు పెట్టకుండా ముందు తాము రుచి చూడడానికి మనసురాక. ఈ ‘ఆపాత మధురాల’గురించి నన్నో నాలుగు మాటలు వ్రాయమనడం అలాంటిదే.
ఐనా, త్వరలో తన కథలను సంపుటిగా తెస్తూన్న శేషమ్మగారు ముందుగా ఈ అనువాద కథలను పుస్తకంగా తేవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తుంటే ఆ మధ్య చదివిన సంగతొకటి గుర్తుకొచ్చింది. “to connect with the past and to learn about the present”. ఇందుకోసం ఏ భాషలోనివైనా పాత కథలను చదువుకోవాలి. పురాతన విలువలు, నమ్మకాలు, జీవన విధానాలు వీటి గురించిన ఎరుక కలగడానికి; అపరిచిత వ్యక్తులు, సమాజం, ప్రదేశాలతో పరిచయం ఏర్పడటానికి గతకాలపు సాహిత్యం ఉపకరిస్తుంది. ఆ స్థితిగతులతో నేటికి ఎంతో అంతరం ఉన్నా, ఆశ్చర్యంగా ఆయా పాత్రల ఉద్వేగాలతో మనకు సహానుభూతి కలుగుతుంది. ఇదంతా వస్తువు, సందేశం గురించి. ఇక రచనాసామగ్రి సంగతికొస్తే కథను చెప్పడంలో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులన్నీ స్పష్టమవుతాయ్. పాత కొత్తల సంవిధానానికి ఈ అధ్యయనం ఉపకరిస్తుంది. ఈ పని మనమంతా చెయ్యాలని ఈ వయసులో శేషమ్మగారు ఇంత పని పెట్టుకున్నారు.
శేషమ్మగారి పుస్తకాలన్నీ గమనిస్తే ఒక ప్రణాళికేదో ఉందనిపిస్తుంది. మొదటి పుస్తకంలో తన కథ చెప్పుకున్నారు (ఆత్మకథ). తర్వాత ఇన్ని కథలు చెప్పడానికి ప్రేరణనిచ్చినవాడి కథ (షేక్‌స్పియర్) చెప్పారు. ఆ తర్వాత అందరికీ తెలుసనుకుంటున్న కథలో తెలియని భాగాలూ ఉన్నాయని తెలియజెప్పారు (గలివర్ సాహస ప్రయాణాలు). ఇపుడు సార్వకాలికమూ, సార్వజనీనము అయిన కథలను ఎంపిక చేసి, తెలుగు చేసి మన చేతనుంచారు. ఇవన్నీ గమనిస్తే అంతస్సూత్రమైన లక్ష్యం ఒక్కటే – దశాబ్దాల అన్వేషణలో తాను తెలుసుకున్నదానిలో మనకు అవసరమైనదాన్ని కొంత కొంతగా చెప్పడం.
ఇక ఈ కథల విషయానికి వస్తే – ప్రారంభంలో కథా రచయితల పరిచయంలోనూ, కథలయ్యాక ‘చివరిగా నా మాట’ అనే శీర్షికతోనూ కథల సారాంశాన్ని చెప్పారు. పాఠకుడికి చదవడం సులువుగా ఉండాలని స్వేచ్ఛానువాదానికి సిద్ధపడకుండా, యథాతథ సంభాషణలతో మూల విధేయంగానే కథ చెప్పారు.
ఐతే, అనువాదకురాలి అసలు శ్రమ అంతా కథల ఎంపికలోనే ఉంది. వారు పాఠంగా చదువుకున్నవి, పాఠం చెప్పడానికి చదువుకున్నవి, పాఠకురాలిగా చదివినవి – ఇలా వందలాది రచయితల వేల కథలలోంచి ఈ పది కథలను ఎంపిక చేసుకోవడం ఎంత పరిశ్రమో! మేలురకం పళ్ళను ఏరుకుని అందంగా పాలవెల్లికి కట్టినట్టు విభిన్న దేశాలు, సంస్కృతులకు చెందిన కథలను శ్రద్ధగా ఎంచుకోవాలి. మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు ‘Approach Approach Conflict’ (ఉపగమ-ఉపగమ సంఘర్షణ) గురించి చెబుతారు. అంటే రెండు ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి ఎంపిక చేసుకోవడం ఒత్తిడికి గురిచేసే ఒకానొక Intrapersonal Conflict. ఇదిగో అలాంటి ఒత్తిడికిలోనై ఉంటారు. ఒక అదృష్టం ఏమిటంటే విదేశీ రచయితలెవ్వరూ సమకాలీకులు, వ్యక్తిగత పరిచయం ఉన్నవారు కాదు కాబట్టి “నా కథ ఎందుకు తీసుకోలేదు” అనో “ఆ కథ అయితే బాగుండును కదా!” అనో అడగరు. నిజంగా వీరు ఎంపిక చేసిన తెలుగు కథలు ఇంగ్లీషులోకి మార్చే ప్రయత్నం చేసి ఉంటే ఈ పాటికి మా సంగతేమిటని? చాలా అర్జీలు వచ్చి ఉండేవి.
***
ఏదైతేనేం, గొప్ప కథలను మనకు చేరువ చేశారు. ఏమిటవి?
- ‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును’ అని గురజాడ అన్నట్టు తన నిరపేక్షమైన దయ, కరుణతో ఒక వ్యక్తిలో నిద్రాణమైన మంచిని వెలికితీసిన సందర్భం. అంతర్లీనంగా వ్యక్తమయ్యే తాత్వికత, ఎరలకు ఆశపడవద్దనే హెచ్చరిక చేసే కథ.
- “చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కినేని గీడు సేయరాదు/పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ” – అచ్చంగా ఇలాగే క్షమ, కరుణ చూపిన వైద్యుని కథ;
- నీ దేశంపై అజమాయిషీ మారడం అంటే అది భౌగోళిక, ఆర్ధిక వ్యవహారం మాత్రమే కాదు అది నీ అస్తిత్వం, భాష ఒక్క మాటలో నీ మూలాలనూ కోల్పోవడం అని చెప్పే కథ;
- సింగిల్ పేరెంట్ కుటుంబాలలో పిల్లలు ఎదుర్కొనే సమస్యతో ఒక కథ;
- బ్రతకలేక, చావలేక అలా అని రాజీ పడలేని ఒక తల్లి కథ;
- పిల్లలకు అందించవలసినది మనం అనుకుంటున్న మంచినా? వాళ్ళు కోరుకుంటున్న మంచినా? అనే విషయాన్ని పరోక్షంగా చర్చించిన కథ.
- మన ప్రశ్నలకు సమాధానం మనకే లభిస్తుందని చెప్పే గురు శిష్య సంభాషణ లాంటి కథ;
- ప్రలోభాలకు ఎంతటివారైనా ఎలా లొంగిపోతారో, పర్యవసానంగా అమాయక బాలికలు ఎలా బలైపోతారో చెప్పే కథ;
- ఒక యువకునికి మధురానుభూతిని కలిగించిన సన్నివేశంతో కలలా సాగిపోయిన కథ ఒకటి;
- ఏళ్ళ తరబడి ఎదురుచూపు తర్వాత సుఖంతమైన ప్రేమ కథ;
ఇలా వస్తువు, శిల్పం, సందేశం.. అన్నిటా విభిన్నత కలిగిన పది కథల సమాహారమిది.
***
చివరిగా ఒక మాట. ఒక్కో కథా చదివాక అసలు కథ కూడా ఓసారి చదువుదామనిపిస్తుంది. ఆ మూలకథ చదివాక అదే రచయిత వ్రాసిన మరికొన్ని కథలూ చదవాలనిపిస్తుంది. ఆ క్రమంలో కొన్ని కోట్స్, కొన్ని పదాలు ఓ నోట్స్‌లో వ్రాసుకుంటాం. ఇలా ఈ పుస్తకం పూర్తయ్యేసరికి మన చేత ఒక నోట్స్, ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తిచేయించి చివరిలో ముఖ్యాంశాలు చెప్పి; వారి దగ్గర పాఠం వినని లోటు ఇక లేకుండా చేశారు శేషమ్మగారు. అందుకు వారికి నమస్కారాలు, ధన్యవాదాలు.
***
స్వేచ్ఛానువాదం: కాళ్ళకూరి శేషమ్మ
ముద్రణ: కలిమిశ్రీ గ్రాఫిక్స్, విజయవాడ
పేజీలు: 116
వెల: ₹ 120/-
ప్రతులకు:
1-9-23, శ్రీరామ్‍నగర్
కాకినాడ. ఫోన్: 9885401882
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.